సూర్యగ్రహణం సమయంలో కొన్ని జంతువులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తాయి?

సూర్యగ్రహణం రోజు జంతువుల ప్రవర్తన

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్రాంకీ అడ్కిన్స్
    • హోదా, ఫీచర్స్ కరస్పాండెంట్

సూర్య గ్రహణాన్ని మనుషులు విస్మయంగా చూస్తారు, కానీ పగలు అకస్మాత్తుగా రాత్రిలా మారితే జంతువులు ఎలా ప్రతిస్పందిస్తాయి?

చాలా ప్రత్యేక సందర్భాలలో సూర్యుడిని చంద్రుడు కప్పివేస్తాడు, దీంతో ఆకాశాన్ని నలుపు రంగు ఆవహిస్తుంది.

సంపూర్ణ సూర్య గ్రహణాలు కొన్ని క్షణాలే ఉంటున్నప్పటికీ అవి మనుషులలో విస్మయం, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

కానీ, జంతువులు పగటిపూట చీకటిలోకి వెళితే ఎలా స్పందిస్తాయో ఊహించడం కష్టం.

జంతువులు నిద్ర, ఆహారం, వేట కోసం 24-గంటల బయోలాజికల్ క్లాక్‌పై ఆధారపడతాయి.

విశ్వంలో జరిగే సంఘటనలు అరుదైన దృగ్విషయాలు. దాదాపు ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ప్రదేశంలో సంభవిస్తాయి. అయితే, వాటికి అన్ని జంతువులు ఒకే విధంగా స్పందించవు.

"కాంతి అనేది మొక్కల నుంచి జంతువుల వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తుంది. జీవశాస్త్రజ్ఞులుగా మనం సూర్యుడిని ఆపలేం, కానీ ప్రకృతి దానిని నియంత్రిస్తుంది" అని స్వీడన్‌లోని లండ్‌ వర్సిటీలో బిహేవియరల్ ఎకాలజిస్ట్ సిసిలియా నిల్సన్ చెప్పారు.

సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, PATRICK POITEVIN

ఫొటో క్యాప్షన్, 2016 మార్చిలో ఇండోనేషియాలో సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా నాసా రిటైర్డ్ మెటీరియల్ సైంటిస్ట్ పాట్రిక్ పోయిటెవిన్ తీసిన ఫోటో.

తొమ్మిది దశాబ్ధాల క్రితం న్యూ ఇంగ్లండ్‌కు చెందిన విలియం వీలర్ అనే ఒక కీటక శాస్త్రవేత్త సూర్యుని అదృశ్యాన్ని పరీక్షించారు.

1932లో సూర్యగ్రహణం సమయంలో జంతువుల ప్రవర్తనలో మార్పులను రికార్డ్ చేయడానికి మనుషులు కావాలంటూ స్థానిక వార్తాపత్రికలలో ప్రకటనలు వేయించారు. దీని ద్వారా 500కు పైగా రికార్డులను సేకరించారు. వీటిలో పక్షులు, క్షీరదాలు, కీటకాలు, మొక్కలలో మార్పులు కనిపించాయి, గుడ్లగూబలు అరవడం, తేనెటీగలు తమ ఆవాసాలకు తిరిగి వెళ్లడం ఉన్నాయి.

2017 ఆగస్టులో 2 నిమిషాల 42 సెకన్ల పాటు సూర్య గ్రహణం ఉంది, దీంతో జంతువులపై శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని పునరావృతం చేశారు. ఈసారి మరింత ఆశ్చర్యకరమైన ఫలితాలొచ్చాయి.

గ్రహణ చీకటి పెరుగుతున్న కొద్దీ, జిరాఫీలు భయాందోళనలతో పరుగులు పెట్టాయి, దక్షిణ కరోలినా జంతుప్రదర్శన శాలలో తాబేళ్లు సంభోగంలో పాల్గొన్నాయి. ఒరెగాన్, ఇడాహో, మిస్సౌరీ రాష్ట్రాల్లో తుమ్మెదలు మౌనంలోకి వెళ్ళాయి.

ఇక 2024లో సూర్యగ్రహణం సోమవారం (ఏప్రిల్ 8) చోటుచేసుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా పరిశోధకుల్లో మరోసారి ఉత్సుకత నెలకొంది.

మెక్సికో నుంచి మైనే వరకు శాస్త్రవేత్తలు గ్రహణాన్ని నిశితంగా గమనించబోతున్నారు, ఏదైనా మర్మమైన ప్రవర్తనను గుర్తించాలంటూ ప్రజలకూ పిలుపునిచ్చారు.

సూర్య గ్రహణం రోజు జంతువుల ప్రవర్తన

ఫొటో సోర్స్, Getty Images

ఆ రోజు జూ అస్తవ్యస్తం...

ఆడమ్ హార్ట్‌స్టోన్-రోజ్ ఒక శాస్త్రవేత్త. ఆయన దక్షిణ కరోలినాలోని రివర్‌బ్యాంక్స్ జూ, గార్డెన్‌‌లో పరిశోధన నిమిత్తం పనిచేశారు.

2017లో గ్రహణం కారణంగా జూలోని జంతువులు ప్రభావితం కావని ఆయన అనుకున్నారు. మేఘాలు లేదా వర్షపు తుఫానుకు అదే విధంగా ప్రతిస్పందిస్తాయని భావించారు.

అయినప్పటికీ శిక్షణ పొందిన పరిశోధకులు, పౌర శాస్త్రవేత్తల సమూహాలు గ్రహణానికి ముందు, తరువాత 17 జాతులను పరిశీలించడానికి జూ వద్ద గుమిగూడారు.

"ఆ రోజు జంతుప్రదర్శనశాల అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది ప్రజలు ఉన్నారు, అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు" అని ఆయన గుర్తుచేసుకున్నారు.

గ్రిజ్లీ ఎలుగుబంటి వంటి కొన్ని జంతువులు గ్రహణ సమయంలో నిరాసక్తిగా కనిపించాయి.

గ్రహణాన్ని చూసిన మూడొంతుల కంటే ఎక్కువ జంతువులు అద్భుతంగా, జీవితాన్ని మార్చే ఘటనగా ప్రవర్తించాయని హార్ట్‌స్టోన్-రోజ్ చెప్పారు.

వాటి చర్యలను నాలుగు లక్షణాలుగా వర్గీకరించారు. సాధారణంగా వ్యవహరించడం, సాయంత్రం అయిందని అనుకోవడం, ఆందోళన పడటం, ఊహకు అందని ప్రవర్తనలు.

మరోవైపు గ్రిజ్లీ ఎలుగుబంట్లు నిద్రపోతున్నాయని, కూల్‌గా కనిపించాయని హార్ట్‌స్టోన్-రోజ్ అన్నారు . వాటిలో ఒకటి తలకిందులుగా వేలాడిందని, అసలు పట్టించుకోలేదని గుర్తుచేసుకున్నారు.

గ్రహణ సమయంలో 'రాత్రి పక్షులు' చాలా గందరగోళంగా కనిపించాయి. టౌనీ ఫ్రాగ్ మౌత్ పక్షులు చెట్టు మొద్దులా కనిపించడానికి ప్రయత్నించాయని రోజ్ చెప్పారు. ఈ పక్షులు ఆహారం కోసం రాత్రిపూట తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తాయి.

"గ్రహణ సమయంలో ఆ పక్షులు సరిగ్గా అదే చేశాయి. సూర్యుడు తిరిగి బయటకు రాగానే, తిరిగి చెట్టు కొమ్మల్లోకి వెళ్లాయి" అని హార్ట్‌స్టోన్-రోజ్ అన్నారు.

అంతేకాదు కొన్ని జంతువుల్లో ఆందోళన, బాధ కనిపించాయన్నారు. ఎల్లప్పుడూ రిలాక్స్‌గా కనిపించే జంతువులైన జిరాఫీలు, అడవిలో ఏదో ప్రెడేటర్‌ను చూసినట్లు పరుగెత్తాయని హార్ట్‌స్టోన్-రోజ్ గుర్తుచేసుకున్నారు.

అదేవిధంగా టేనస్సీలోని నాష్‌విల్లే జూలోని జిరాఫీలు కూడా ఆందోళన పడ్డాయి, పరుగెత్తడం ప్రారంభించాయి.

కాగా, గాలాపాగోస్ జెయింట్ తాబేళ్ల నుంచి విచిత్రమైన ప్రవర్తన వచ్చింది.

"సాధారణంగా, తాబేళ్లు చాలా నిశ్చలంగా ఉంటాయి, అంత వ్యక్తీకరణ జంతువులు కావు. గ్రహణ సమయంలో ఆ తాబేళ్లు సంభోగంలో పాల్గొన్నాయి" అని హార్ట్‌స్టోన్-రోజ్ చెప్పారు.

సూర్య గ్రహణం రోజు జంతువుల ప్రవర్తన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో సూర్యగ్రహణం రోజు జిరాఫీలు, అడవిలో ఏదో ప్రెడేటర్‌ను చూసినట్లు పరుగెత్తాయని హార్ట్‌స్టోన్-రోజ్ గుర్తుచేసుకున్నారు.

గ్రహణ సమయంలో పక్షుల కదలికల్లో మార్పు..

తూర్పు తీరం నుంచి అమెరికా పశ్చిమ తీరం వరకు విస్తరించి 143 వాతావరణ కేంద్రాలున్నాయి.

"మాకు నెట్‌వర్క్ ఉంది, అది ఆకాశాన్నే చూస్తుంది, అరుదైన సంఘటనలను పరిశోధించడానికి ఇది చాలా గొప్ప అవకాశం" అని అధ్యయనానికి నాయకత్వం వహించిన నిల్సన్ చెప్పారు.

కాంతిలో మార్పును తప్పుగా భావించి, పక్షులు, కీటకాలు వంటి ఎగిరే జాతులు ఆకాశంలోకి రావడం శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

గ్రహణం సంభవించినపుడు ఆ చీకటిలో పక్షులను గుర్తించడం చాలా కష్టం, దీంతో వాతావరణ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.

సూర్యాస్తమయం సమయంలో ఆకాశంలో కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి, ఎందుకంటే పక్షులు రాత్రి వలసలను ప్రారంభిస్తాయి.

"మేం గాలిలో తక్కువ పక్షులను చూశాం" అని నిల్సన్ గుర్తుచేసుకున్నారు. చాలా పక్షులు గ్రహణానికి ముందు దిగడం లేదా ఎగరడం మానేస్తాయని ఆయన తెలిపారు.

సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యగ్రహణం, విపత్తుల సమయంలో పక్షులు ఆవాసాలు వెతుకుతాయి.

సాలె పురుగుల వింత ప్రవర్తన

నెబ్రాస్కాలోని ప్లాట్ రివర్ వ్యాలీ, ఒక ఆవాస ప్రదేశం, వలస పక్షులు ఆగే స్థానం. 2017లో గ్రహణం సందర్భంగా శాస్త్రవేత్తల బృందం వన్యప్రాణులను పర్యవేక్షించడానికి ఆ ప్రాంతానికి వచ్చే మార్గాలలో టైమ్-లాప్స్ కెమెరాలు, సౌండ్ రికార్డర్‌లను ఏర్పాటు చేసింది.

ఆ సమయంలో పక్షులు రకరకాలుగా స్పందించాయని కెర్నీలోని నెబ్రాస్కా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు ఎమ్మా బ్రిన్లీ బక్లీ చెప్పారు.

వెస్ట్రన్ మెడోలార్క్‌ పక్షులు ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్ధమైపోయాయని, కొన్ని ప్రాంతాలలో పూర్తిగా ఆగిపోయాయన్నారు. మరోవైపు అమెరికన్ గోల్డ్‌ఫించ్, సాంగ్ స్పారోస్‌ పక్షులు అరుస్తూ వెళ్లాయని ఎమ్మా తెలిపారు.

మనుషుల్లాగే జంతువులు కూడా గ్రహణానికి పలు రకాలుగా ప్రతిస్పందిస్తాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం చేపలు వాటి నివాసాలకు చేరుకున్నాయి, సాలెపురుగులు గ్రహణం సంపూర్ణత సమీపిస్తున్న కొద్దీ వాటి గూడులను నాశనం చేశాయి.

పువ్వుల మధ్య శబ్ధాలు లేవు, చీకటి రావడంతో తుమ్మెదల సందడి ఆగిపోయింది. అయితే సంపూర్ణ గ్రహణ సమయంలో ఆ మార్పులను కేవలం కాంతికే ఆపాదించలేమని ఎమ్మా అంటున్నారు.

ఆ సమయంలో నెబ్రాస్కాలో ఉష్ణోగ్రత దాదాపు 6.7 డిగ్రీల సెల్సియస్ తగ్గింది, తేమ 12 శాతం పెరిగింది, స్వల్ప కాల వ్యవధిలో అది తీవ్రమైన మార్పు.

సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Getty Images

వింతగా అనిపిస్తే రికార్డు..

'సోలార్ ఎక్లిప్స్ సఫారి' ప్రాజెక్ట్ జంతువుల ప్రవర్తనను గమనించమని ప్రోత్సహిస్తోంది. దీంతో చాలామంది బయటి జంతువులే కాకుండా వారి పెంపుడు జంతువులు, వ్యవసాయానికి వినియోగించే జంతువులను పరిశీలించనున్నారు.

నాసా అమెరికా అంతటా దాదాపు 1,000 డేటా కలెక్టర్లతో ఎక్లిప్స్ సౌండ్‌స్కేప్స్ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేస్తోంది. ఆడియో మాత్స్ అనే చిన్న డేటా రికార్డర్‌లతో దీనిలో పాల్గొనొచ్చు, ఇవి మూడు ఏఏ బ్యాటరీల పరిమాణంలో ఉంటాయి. ఈ ఆడియో డేటా రికార్డర్లు గ్రహణం సమయంలో వన్యప్రాణుల నుంచి శబ్దాలను అందుకుంటాయి.

సోమవారం నాడు నార్త్ కరోలినాలోని రివర్‌బ్యాంక్ జూ వద్ద సైన్స్ స్టడీ పర్యవేక్షణ ఉంది.

"కొంతమంది దీన్ని చాలా నిశ్శబ్దంగా, సొంతంగా చేయాలనుకుంటున్నారు, కొందరు తమ స్నేహితులతో చేయాలనుకోవచ్చు" అని హార్ట్‌స్టోన్-రోజ్ చెప్పారు.

దీని తర్వాత అమెరికా నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం మళ్లీ 2044లోనే కనిపిస్తుంది, కాబట్టి చాలామంది ప్రజలు ఈ సోమవారం జంతువులపై దృష్టి పెడతారు.

వీడియో క్యాప్షన్, పాక్షికంగా లేదా పూర్తిగా చీకటిని చవిచూడనున్న మెక్సికో, అమెరికా, కెనడా దేశాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)