సీ ఆఫ్ స్టార్స్: ఈ నీలమణుల సముద్రం రహస్యం ఏమిటో తెలుసా?

మాల్దీవుల్లో సీ ఆఫ్ స్టార్స్ బీచ్

ఫొటో సోర్స్, Petr Horalek

ఫొటో క్యాప్షన్, మాల్దీవుల ద్వీపాల్లో సీ ఆఫ్ స్టార్స్
    • రచయిత, సారా హార్వే
    • హోదా, ఫీచర్స్ కరెస్పాండెంట్

సీ ఆఫ్ స్టార్స్... మాల్దీవుల్లోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఇది చాలా మందికి ఓ మిస్టరీ.

నింగి నుంచి నేలకు దిగి వచ్చిన నక్షత్రాలు సముద్రపు నీటిలో తేలుతున్నట్లు, చీకట్లో హిందూ మహాసముద్రం ఇక్కడ నీలి రంగులో మెరుస్తూ ఉంటుంది.

తీర ప్రాంతం గుండా చిన్న చిన్న నక్షత్రాల మాదిరి బిందువులు అలలతో ఒడ్డుకు కొట్టుకొస్తూ.. బీచ్‌లో గంతులు వేస్తున్నట్లు అనిపించింది.

రాత్రిపూట ఆకాశాన్ని ఈ తడి ఇసుక ప్రతిబింబిస్తోంది. కొన్ని క్షణాల్లోనే అవన్నీ కనుమరుగవుతున్నాయి. బీచ్ అంతా తిరుగుతూ, ఆ వెలుతురులో నా పాదముద్రలను చూసుకున్నాను. నీలి నీటిలో నా బొటనవేలును ముంచినప్పుడు, ఆ ప్రకాశవంతమైన వెలుతురు నన్ను అల్లుకున్నట్లు అనిపించింది.

కన్నుల పండువగా ఉండే ఈ ప్రాంతాన్ని ‘సీ ఆఫ్ స్టార్స్’గా అంటారు. మాల్దీవుల్లో అత్యంత ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో ఇది ఒకటి.

ఇంటర్నెట్లో ఈ సుందర దృశ్యాలను చూసిన పర్యాటకులు, ఆ ప్రాంతానికి వెళ్లాలని, ఆ సుందర దృశ్యాన్ని కనులారా చూడాలని ఆశపడతారు. కానీ, ఈ ‘సీ ఆఫ్ స్టార్స్’ కచ్చితంగా ఎక్కడ ఉందన్నది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే, సీ ఆఫ్ స్టార్స్ అన్నది నిజానికి లేదు.

బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ వల్ల సముద్రంపై ఈ మ్యాజికల్ లైట్స్ ఏర్పడుతున్నాయి. అదే సీ ఆఫ్ స్టార్స్. బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ కారణంగా అలల పొంగులో మెరిసే వెలుగు జిలుగులు పర్యాటకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

‘‘మాల్దీవుల్లో సీ ఆఫ్ స్టార్స్‌ను చూడాలనుకుని కోరుకుంటున్నామని ప్రజలు చెప్పినప్పుడు, వారు బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ వల్ల ఏర్పడే కెమికల్ రియాక్షన్‌ను చూడాలని కోరుకుంటున్నారని అర్థం’’ అని మెరైన్ బయోలజిస్ట్, వైల్డ్‌లైఫ్ ప్రజెంటర్ లూరెన్ ఆర్థూర్ చెప్పారు.

లూరెన్ ఆర్థూర్ మాల్దీవుల్లో ఎనిమిదేళ్లుగా పనిచేశారు.

బయోలుమినిసెంటర్ అనేది రసాయనిక ప్రతిచర్య. దీని ద్వారా కాంతి తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ప్లాంక్టన్ అనేది సూక్ష్మ జీవుల సమూహ పదం. వాటి కదలికలను అవి నియంత్రించుకోలేవు. ప్రవాహాలలో అవి తేలియాడుతూ ఉంటాయి. అన్ని సూక్ష్మజీవులు కాంతిని వెదజల్లేవి కావు.

‘‘బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌ను కనుగొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రాంతం లేదు. ప్లాంక్టన్‌లను మాల్దీవుల్లో లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కనుగొనవచ్చు’’ అని ఆర్థూర్ చెప్పారు.

‘‘మాల్దీవుల్లోని పలు దీవుల్లో ఎన్నో బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌ను చూడగలగడం నా అదృష్టంగా భావిస్తాను’’ అని ఆర్థూర్ అన్నారు.

వారం రోజులు లేదా ఏవో కొన్ని రోజుల కోసమే మాల్దీవుల్లో సేద తీరేందుకు వచ్చే చాలా మంది ప్రయాణికుల మాదిరిగా కాకుండా తాను ఎక్కువ కాలం పాటు ఆ ప్రాంతానికి వెళ్లేదాన్ని అని, ఐదేళ్ల పాటు ఆ పగడాల దీవిలో నివసించినట్లు ఆర్థూర్ చెప్పారు.

సీ ఆఫ్ స్టార్స్

ఫొటో సోర్స్, Petr Horalek

ఫొటో క్యాప్షన్, మాల్దీవుల్లో పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించే సీ ఆఫ్ స్టార్స్

తక్కువ సమయం గడిపేందుకు మాల్దీవులకు వచ్చే ప్రయాణికులు ఈ పగడాల దీవిలో ‘సీ ఆఫ్ స్టార్స్’ను చూసేందుకు ఏం చేయాలని ఆర్థూర్‌ను అడిగినప్పుడు, ఏప్రిల్ ప్రారంభం నుంచి అక్టోబర్ మధ్యలో ఉండే నైరుతి రుతుపవనాల కాలంలో అక్కడికి వెళ్లాలని సూచించారు.

ఆ సమయంలో నీటి ప్రవాహాలు నైరుతి నుంచి ఈశాన్య దిశగా ప్లాంక్టన్‌లను తీసుకెళ్లినప్పుడు, పెద్ద సంఖ్యలో వీటిని గుర్తించవచ్చు.

భూమిపై కంటే నీటి గర్భంలో వీటిని చూసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్థూర్ చెప్పారు.

‘‘బీచ్‌లో కూర్చుని వీటిని చూస్తే, మీరు చాలా అదృష్టవంతులు. కానీ, ఇక్కడ అదృష్టమనేది కీ వర్డ్ మాత్రమే’’ అని ఆర్థూర్ అన్నారు.

అమావాస్య సమయంలో చాలా సార్లు ఈ బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌లను చూసినట్లు ఆర్థూర్ చెప్పారు.

ఆ సమయంలో ఆకాశంలో చంద్రకాంతి లేక, మొత్తం చీకటి కమ్ముకుని ఉంటుంది. ఈ సమయంలో పర్యాటకులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను ఆర్థూర్ సూచిస్తున్నారు.

‘‘తొలుత, మీ గ్రూప్ అంతా కలిసి నీటిలో దిగి, మీదగ్గరున్న వాటర్‌ప్రూఫ్ టార్చీలను ఆపివేయాలి. అవి ఆపేసిన తర్వాత, కాస్త భయానకంగా అనిపించవచ్చు. కానీ, మీ చేతులను, కాళ్లను కదపడం ప్రారంభించినప్పుడు, నీటిలో కదలికలను ఇది సృష్టిస్తుంది. కాంతిని వెదజల్లే ప్లాంక్టన్‌లకు ఇబ్బంది కలుగతుండొచ్చు. మీరు వాటికి ఆటంకం కలిగించిన వెంటనే, కాంతి కెరటాల మధ్యలో నుంచి మీరు ప్రయాణిస్తారు’’ అని ఆర్థూర్ చెప్పారు.

మాఫుషి డైవ్ అండ్ వాటర్‌స్పోర్ట్స్ వంటి కొన్ని డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ సెంటర్లు బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌లను చూసేందుకు పర్యాటకుల అభ్యర్థన మేరకు సముద్ర గర్భంలో ప్రయాణాలను (స్నార్కెలింగ్ ట్రిప్స్‌ను) అందిస్తున్నాయి.

గూగుల్‌లో ఒక నెలలో ప్రపంచవ్యాప్తంగా ‘సీ ఆఫ్ స్టార్స్’ గురించి వెతికే 3,20,000 మందిలో మీరు ఒకరైతే, వాధూ లేదా వాడూ ద్వీపానికి వెళ్లమని మీకు సూచనలు రావొచ్చు.

వాధూ అనేది 626 మంది జనాభాతో ఉన్న రా అటోల్‌లోని జనావాసాలు కలిగిన ద్వీపం. అదేవిధంగా అదారన్ ప్రెస్టేజ్ వాడూ అనేది ప్రైవేట్ రిసార్ట్ ద్వీపం. దక్షిణ మాలే అటోల్‌కు 120 మైళ్ల దూరంలో ఉంటుంది.

అద్భుతమైన బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌లతో ఉన్న ఈ రెండు ద్వీపాల బీచ్‌ల ఫోటోలు 2013లో నెట్టింట వైరల్‌గా మారాయి. నేటి వరకు కూడా వీటి సర్క్యూలేషన్ కొనసాగుతూనే ఉంది.

అయితే, వాడూ అనేది తప్పుగా సూచించారు. ఎందుకంటే, అక్కడ బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌లను అంతగా కనిపించవు. గతంలో బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌లు తక్కువ మొత్తంలో ఉన్న దాన్నే ఫోటోలుగా తీశారు. అవే వైరల్‌గా మారాయి.

వాధూ ద్వీపం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో, స్థానిక పర్యాటక పరిశ్రమ అభివృద్ధికి అది సహకరించింది. నాలుగు నెలల క్రితం ఇస్మాయిల్ ‘ఇస్సే’ నసీర్ తొలి వాధూ గెస్ట్‌హౌస్ వాధూ వ్యూ ఇన్‌ను తెరిచారు.

మాల్దీవుల్లో ఏ ప్రాంతంలైనా బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌లను చూడగలిగే అవకాశమున్నప్పటికీ, వాధూ వైరల్ ఫోటోలు ఎక్కువ మంది ఇక్కడకు వచ్చేలా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని నసీర్ చెప్పారు.

అంతకుముందు వారు కేవలం దగ్గర్లోని ప్రైవేట్ రిసార్ట్ ద్వీపాల్లో మాత్రమే ఉండగలిగేవారు. ఆ తర్వాత పడవలపై అక్కడకు వెళ్లేవారు. కానీ, తమ కమ్యూనిటీకి నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు వాధూలో క్షేత్రస్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని నసీర్ నిర్ణయించారు.

‘‘ప్రపంచం మొత్తానికి వాధూ అందుబాటులోకి రావడం అతిపెద్ద అవకాశమని మేం భావిస్తున్నాం’’ అని నసీర్ చెప్పారు.

బయోలుమినిసెంట్ ప్లాంక్టన్, డైవింగ్ హోల్స్ వంటి అద్భుతమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, వారికోసం తలుపులు తెరిచే వరకు ఎవరూ ఇక్కడ ఉండటానికి వీలుండేది కాదని అన్నారు.

స్నార్కెలింగ్ ట్రిప్స్

ఫొటో సోర్స్, Petr Horalek

ఫొటో క్యాప్షన్, బయోలుమినినిసెంట్ ప్లాంక్టన్‌లను దగ్గరగా చూసేందుకు సులువైన మార్గం నైట్ స్నార్కెలింగ్ ట్రిప్స్

‘‘నేను హామీ ఇవ్వలేను. కానీ, ఏడాదిలో 90 శాతం ఎంతో కొంత బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌ను ఇక్కడ చూసేందుకు సాధ్యమవుతుందని నేను చెప్పగలను’’ అని ఆయన చెప్పారు.

బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌ను పర్యాటకులు చూడగలిగేంత ఏకైక ద్వీపం వాధూ ఒక్కటే కానప్పటికీ, వీటిని చూడటానికి వచ్చే పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయం ద్వారా స్థానికంగా గ్రోసరీ షాపులు, కేఫ్‌లు వంటి పలు సేవలను స్వతంత్రంగా ప్రారంభించేందుకు సహకరిస్తుంది.

ద్వీప సమూహాల్లో గెస్ట్‌హౌస్‌లను చట్టబద్ధం చేసినప్పటి నుంచి అంటే 2009 నుంచే మాల్దీవుల్లో ఈ రకమైన పర్యాటకాన్ని అనుమతిస్తున్నారు.

అంతకుముందు పర్యాటకులు కచ్చితంగా పెద్ద పెద్ద హోటల్ సంస్థ నడిపే ప్రైవేట్ రిసార్ట్ ఐలాండ్‌లలో మాత్రమే నివసించేందుకు అనుమతి ఉండేది. అవి పూర్తిగా స్థానికులకు దూరంగా ఉండేవి.

వాధూ మాదిరి మాల్దీవుల్లో ఉన్న 188 జనావాసాల ద్వీపాలు చాలా చిన్నవి. బీచ్‌లలో తక్కువ కాలుష్యం ఉంటుంది. ఎందుకంటే, ఇతర బీచ్‌లలో విదేశీయులకు బీచ్ విల్లా సేవలను అందించేందుకు నిర్మించిన రిసార్ట్ ఐలాండ్‌ల మాదిరిగా, తీర ప్రాంతం గుండా మాల్దీవుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.

బీచ్‌

ఫొటో సోర్స్, Petr Horalek

ద్వీప గ్రామాల్లోని బీచ్‌లలో ఉండే కటిక చీకటి, తేలిగ్గా బయోలుమినిసెంట్ ప్లాంక్టన్‌ గుర్తించేలా చేస్తుంది. మాల్దీవుల్లో తక్కువ జనావాసాలు ఉన్న ద్వీపాలు వావు అటోల్‌లోని ఫులిధూ, సౌత్ అరి అటోల్‌లోని ధీగురా, ధంగేతి అత్యంత చీకటి బీచ్‌లు.

తక్కువ జనాభా కలిగిన ఓల్హాహలి దీవిలో నేను స్నేహితులతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్లినప్పుడు బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ చూడటం నా అదృష్టం. సూర్యాస్తమయం సమయంలో మేం బీచ్‌కు వెళ్లాం. కొన్ని బ్లూ బల్బులు సముద్రంలో నా తలపై నుంచి ఎగిరినట్లు నాకనిపించింది.

గాజు మడుగులో నీలి రంగులో ప్రకాశించే చిన్న చిన్న కొలనులను నేను చూశాను. నేను, నా స్నేహితులం వెంటనే తీరంలో దిగి, బీచ్‌ గుండా పరిగెత్తడం ప్రారంభించాం. అప్పుడు, సూర్యుడు కూడా కనుమరుగయ్యాడు. బీచ్ ప్రాంతమంతా చీకటిగా మారింది.

ఆ సమయంలో ప్లాంక్టన్‌లు అనుకున్న దానికంటే మరింత కాంతిని వెదజల్లాయి. మేం మా తలలను నీటిలో ముంచాం. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన తర్వాత సముద్రపు నీటిని కావాల్సినంత పీల్చుకున్నాను.

‘‘సముద్ర గర్భంలో చిన్న వజ్రాలను చూసినట్లు అనిపించింది. ఇప్పటి వరకు మీరు చూసిన దానిలో అదే అత్యంత సుందర దృశ్యం’’ అని ఆర్థూర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)