ఎలాంటి లక్షణాలు లేకుండానే అంధులు అవుతున్నారు, ఎందుకిలా?

గ్లకోమా పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరీక్షల ద్వారా గ్లకోమాను గుర్తించవచ్చు

ఎలాంటి లక్షణాలు లేకుండా, మరే ఇతర సమస్య లేకుండా ఒక వ్యాధి వల్ల కొందరు అకస్మాత్తుగా అంధులైపోతున్నారు. ఈ కంటి వ్యాధి పేరు గ్లకోమా.

గ్లకోమా వల్ల కంటిలో ఉండే ఒక నరం బలహీన పడి, దెబ్బతింటుంది. ఇలా దెబ్బతినే ప్రక్రియ నిదానంగా కొనసాగుతుంది. దీంతో, చాలా మంది కనీసం దీన్ని గుర్తించలేరు కూడా.

గ్లకోమా అంటే ఏమిటి?

గ్లకోమా అనేది కంటి వ్యాధి. కంటికి వెనుకాల ఉండే నేత్రనాడి దెబ్బతింటుంది. ఈ నరం కళ్లను మెదడుకు అనుసంధానిస్తుంది.

కంటికి ముందు భాగంలో అసాధారణ ద్రవాలు పేరుకుపోవడం వల్ల, కంటిపై ఒత్తిడి పెరిగి ఈ నరం దెబ్బతింటుందని బ్రిటీష్ పబ్లిక్ హెల్త్ సర్వీసు (ఎన్‌హెచ్ఎస్) తెలిపింది.

గ్లకోమాను ప్రాథమిక దశలోనే గుర్తించి, చికిత్స అందివ్వకపోతే చూపు కోల్పోయి, అంధత్వం ఏర్పడే ముప్పు ఉంటుంది.

అన్ని వయసుల వారికీ గ్లకోమా వస్తుంది. 70 నుంచి 80 ఏళ్ల వారు గ్లకోమా వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.

గ్లకోమా

ఫొటో సోర్స్, Getty Images

గ్లకోమా లక్షణాలేంటి?

గ్లకోమా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కేవలం పరీక్షల ద్వారా మాత్రమే దీన్ని గుర్తించవచ్చు.

క్రమంగా ఎన్నో ఏళ్లు ఈ వ్యాధి పెరుగుతూ వస్తుంది. కంటి చూపుపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఇది నిదానంగా ప్రభావం చూపుతుండటంతో చాలా మంది తమ చూపు మారుతున్నట్లు గుర్తించలేరు.

పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పుడు, వారి చుట్టుపక్కల ఉన్న వేటినీ తాము చూడలేకపోతున్నామని గుర్తిస్తారు. ఒకవేళ దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే, శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది.

గ్లకోమా లక్షణాల్లో చూపు మసక మసకగా కనిపించడం, ప్రకాశవంతమైన వెలుతురు చుట్టూ ఇంద్రధనస్సు లాంటి వలయాలు కనిపించడం మొదలవుతుంది.

గ్లకోమా వల్ల రెండు కళ్లు దెబ్బతింటాయి. ఒక కన్ను బాగా ప్రభావితం కావొచ్చు.

గ్లకోమా లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. వాటిలో..

  • కళ్లలో తీవ్ర నొప్పి
  • వికారం, వాంతి వచ్చేలా ఉండటం
  • కళ్లు ఎర్రగా మారిపోవడం
  • తలనొప్పి
  • కళ్ల చుట్టూ మెత్తబడటం
  • వెలుతురు చుట్టూ సర్కిల్స్ కనబడటం
  • మసక మసకగా కనిపించడం వంటివి ఉండొచ్చు.
కంటి చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చూపులో ఏదైనా లోపం అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఎప్పుడు చికిత్స తీసుకోవాలి?

మీ చూపులో ఏదైనా లోపం ఉన్నట్లు అనుమానాలుంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గ్లకోమా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే నయం అవుతుంది. ఒకవేళ చికిత్స తీసుకోకుండా వదిలిపెడితే, క్రమంగా చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

గ్లకోమా లక్షణాలు అకస్మాత్తుగా కనిపించడం మొదలైతే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఇది ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి.

గ్లకోమా రకాలు?

గ్లకోమాలో కొన్ని రకాలున్నాయి. కానీ, వీటిలో అత్యంత సాధారణ రకం ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా. నిదానంగా ఏళ్ల తరబడి ఇది అభివృద్ధి చెందుతుంది.

ఇతర గ్లకోమాలు..

అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లకోమా – ఇది చాలా అరుదు. కంట్లో ద్రవాలు ప్రవాహించే చానల్ అకస్మాత్తుగా మూతపడినా లేదా దెబ్బతినా, కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గ్లకోమాకు దారితీస్తుంది.

సెకండరీ గ్లకోమా – ఏదైనా కంటి వ్యాధి వల్ల ఇది తలెత్తవచ్చు. ఇన్‌ఫ్లమేటరీ ఐ డిసీజ్ లేదా యువెటీస్ వంటివన్నమాట.

కంజెనిటల్ గ్లకోమా – కళ్ల నిర్మాణంలో అసాధారణత వల్ల చాలా చిన్న వయసులోనే వచ్చే అరుదైన రకం ఇది.

కంటి డ్రాప్స్

ఫొటో సోర్స్, Getty Images

గ్లకోమా ఎందుకు వస్తుంది?

పలు కారణాల వల్ల గ్లకోమా వస్తుంది. కంటిలోని ద్రవం సరిగ్గా ప్రవహించనప్పుడు గ్లకోమా వస్తుంది. ఇది కంటిపై ప్రతికూల ఒత్తిడిని ఏర్పరుస్తుంది. ఈ ఒత్తిడి మెదడుతో కళ్లను అనుసంధానించే నేత్రనాడిని దెబ్బతీస్తుంది.

అనేక కారకలు గ్లకోమా వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అవేంటంటే..

వయసు – వయసు పెరిగే కొద్ది, గ్లకోమా ప్రమాదం పెరుగుతుంది.

జాతి – ఆఫ్రికన్లు, కరీబియన్లు, ఆసియన్లు గ్లకోమా బారిన పడే ప్రమాదం ఎక్కువ. 40 ఏళ్ల తర్వాత, ఈ ప్రమాదం సంభవిస్తుంది.

కుటుంబం – ఒకవేళ మీ తల్లిదండ్రుల్లో లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా గ్లకోమా ఉంటే, అది మీకు వచ్చే అవకాశం ఎక్కువ.

ఆరోగ్య సమస్యలు – కంటి చూపు లోపాలున్న వారికి లేదా మధుమేహం ఉన్నవారికి గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంటుంది.

గ్లకోమాను నిరోధించే అవకాశం ఉందా అంటే ఇంకా స్పష్టత లేదు. కానీ, క్రమం తప్పకుండా కళ్లకు పరీక్షలు జరిపించుకోవడంతో, ప్రాథమిక దశలోనే గ్లకోమాను గుర్తించవచ్చు. చికిత్స ద్వారా దీన్ని నయం చేసుకోవచ్చు.

గ్లకోమా పరీక్ష

క్రమం తప్పకుండా కళ్ల పరీక్షలు చేయించుకోవడంతో, ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ దీన్ని గుర్తించవచ్చు. రెండేళ్లకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి.

గ్లకోమాను చాలా వేగంగా, ఎలాంటి పెయిన్ లేని పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఒకవేళ పరీక్షలో గ్లకోమా ఉన్నట్లు తేలితే, ఆలస్యం చేయకుండా నేత్ర వైద్యులను సంప్రదించాలి.

ఆప్టిక్ నరంపై గ్లకోమా ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేత్రనాడిపై గ్లకోమా ప్రభావం చూపుతుంది

గ్లకోమాకు చికిత్స ఏంటి?

గ్లకోమా వల్ల ఎవరికైనా చూపు పోతే, వారి చూపును తిరిగి తీసుకురాలేరు. ఒకవేళ కంటి చూపు కాస్త తగ్గితే, చికిత్స ద్వారా మరింత తగ్గకుండా నిరోధించవచ్చు.

రోగికి ఎలాంటి రకం గ్లకోమా ఉందో దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. గ్లకోమాకు వాడే చికిత్సలు ఏంటి?

చుక్కల మందు – కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

లేజర్ ట్రీట్‌మెంట్ – కళ్లలో ద్రవాల ప్రవాహంలో ఉన్న అంతరాయాలను ఈ చికిత్స ద్వారా తొలగించవచ్చు. కంటిలో తక్కువ ద్రవాల ఉత్పత్తి నియంత్రణకు లేజర్ ట్రీట్‌మెంట్‌ను వాడతారు.

సర్జరీ – కంటిలోని ద్రవాల పారుదలను పెంచేందుకు దీన్ని చేస్తారు.

గ్లకోమా వల్ల కోల్పోయిన కంటి చూపును తిరిగి తీసుకురాలేం. దీనికి బదులుగా, చికిత్స ద్వారా చూపు పోకుండా చూస్తారు. చికిత్స సమయంలో వైద్యులు ఇచ్చే మెడిసిన్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఏదైనా దుష్ఫ్రభావాలు ఉంటే, వైద్యునికి తెలియజేయాలి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గ్లకోమా ఉన్నట్లు తేలితే, వెంటనే ఇతర కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే, వారికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)