క్యాన్సర్: వైద్యుల కంటికి కనిపించని ట్యూమర్లను గుర్తించిన ఏఐ పరికరం ‘మియా’

బార్బరా
ఫొటో క్యాప్షన్, ఏఐ ద్వారా బార్బరాలో ముందస్తుగానే క్యాన్సర్ ట్యూమర్ గుర్తించారు.
    • రచయిత, జోయ్ క్లైన్‌మన్
    • హోదా, టెక్నాలజీ ఎడిటర్, బీబీసీ న్యూస్

వైద్యులు గుర్తించలేని, వారి కంటికి కనిపించని చిన్న చిన్న క్యాన్సర్ ట్యూమర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరికరం గుర్తించింది.

బ్రిటన్‌లోని ఆస్పత్రుల్లో చేపట్టిన పరీక్షల్లో 11 మంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలను నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్‌)కు చెందిన ఏఐ పరికరం విజయవంతంగా గుర్తించింది.

ఈ ఏఐ పరికరం పేరు ‘మియా(ఎంఐఏ)’.

బ్రిటన్‌లో పలు వైద్య కేంద్రాల్లో ఈ పరికరం ద్వారా క్యాన్సర్ లక్షణాలను పరీక్షిస్తున్నారు.

10 వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్‌లను మియా పరీక్షించింది. మామోగ్రామ్‌ అనేది రొమ్ము క్యాన్సర్ లక్షణాలు లేదా సంకేతాలు లేని మహిళల్లో ఈ వ్యాధి ఉందో లేదో గుర్తించేందుకు ఉపయోగించే ఎక్స్‌-రే పిక్చర్.

వీరిలో చాలా మందికి ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేవని వైద్యులు గుర్తించారు. కానీ, వైద్యులు గుర్తించలేని క్యాన్సర్ లక్షణాలను 11 మంది రోగుల్లో మియా విజయవంతంగా గుర్తించింది.

ప్రాథమిక దశల్లో క్యాన్సర్ ట్యూమర్లు చాలా చిన్నగా ఉండి, వాటిని గుర్తించడం కష్టంగా ఉంటుంది.

మనిషి కంటికి కనిపించని ఇలాంటి ట్యూమర్లను సింథటిక్ టెక్నాలజీ టూల్ ‘మియా’ కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ ట్యూమర్లు వాటి రకాన్ని బట్టి వేగంగా వృద్ధి చెంది, విస్తరిస్తాయి.

మియా పరికరం క్యాన్సర్ ట్యూమర్లను గుర్తించిన రోగుల్లో బార్బరా ఒకరు. కానీ, హాస్పిటల్ రేడియాలజిస్ట్‌లు చేపట్టిన పరీక్షల్లో ఎలాంటి క్యాన్సర్ కణితి ఆమెలో బయటపడలేదు.

క్యాన్సర్ కణితి ఉన్న ప్రదేశం
ఫొటో క్యాప్షన్, మమోగ్రామ్ స్కాన్‌లో క్యాన్సర్ ట్యూమర్లు ఉన్నట్లు సర్కిల్ చేసిన మియా పరికరం

ఎందుకంటే బార్బరా ట్యూమర్ పరిమాణం 6 ఎంఎంగా ఉంది. మియా టూల్ ద్వారా చాలా త్వరగా ఈ ట్యూమర్‌ను గుర్తించడంతో ఆమెకు ఆపరేషన్, ఐదు రోజుల రేడియోథెరపీ చికిత్సతో సరిపోయింది.

15ఎంఎం కంటే చిన్నగా ఉన్నప్పుడే ట్యూమర్లను గుర్తిస్తే వచ్చే ఐదేళ్లలో సర్వైవల్ రేటు(బతికే అవకాశం) 90 శాతంగా ఉంటుంది.

తన తల్లి, సోదరితో పోలిస్తే తక్కువ రోజులు చికిత్స తీసుకోవడం సంతోషంగా ఉందని బార్బరా చెప్పారు. వీరు కూడా క్యాన్సర్ బారిన పడ్డారు.

ఏఐ పరికరం లేకపోతే, మూడేళ్ల తర్వాత తాను సాధారణంగా చేయించుకునే మమోగ్రామ్ పరీక్ష వరకు కూడా ఈ క్యాన్సర్ ట్యూమర్ బయటపడకపోయేదని బార్బరా చెప్పారు.

గుర్తించదగ్గ ఎలాంటి లక్షణాలు తనకు లేవని ఆమె తెలిపారు. మియా టూల్ చాలా వేగంగా గుర్తించిందన్నారు.

మియా లాంటి పరికరాలు ఫలితాల కోసం వేచిచూసే సమయాన్ని14 రోజుల నుంచి 3 రోజులకు తగ్గిస్తాయని దీని డెవలపర్ ఖైరన్ మెడికల్ చెప్పింది.

ఈ ట్రయల్స్‌లో కేవలం మియా మాత్రమే కేసులను పరిశీలించడం లేదు. ప్రతి కేసును వైద్యులు కూడా పరీక్షిస్తారు.

ప్రతి వ్యక్తి స్కాన్‌ను ఇద్దరు రేడియాలజిస్టులు చూస్తారు. అయితే, వీరిలో ఒకరి పర్యవేక్షణను భవిష్యత్తులో ఈ టూల్ భర్తీ చేయనుంది. దీని వల్ల పరీక్ష సమయంలో వైద్యులపై పడే పని భారం కాస్త తగ్గనుంది.

ఈ ట్రయల్‌లో పాల్గొన్న 10,889 మంది మహిళల్లో 81 మంది మాత్రమే ఏఐ టూల్ ద్వారా తమ స్కాన్ చేపట్టొద్దన్నారని ఈశాన్య స్కాట్లాండ్‌లోని బ్రెస్ట్ స్క్రీనింగ్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ గెరాల్డ్ లిప్ చెప్పారు.

ఈ ప్రాజెక్ట్‌ గెరాల్డ్ ఆధ్వర్యంలో సాగుతోంది.

సరైన, అవసరమైన డేటాతో వీటిని మెరుగ్గా ట్రైన్ చేస్తే ఒక నిర్దిష్ట వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ఏఐ పరికరాలు ప్రభావవంతంగా ఉంటున్నాయన్నారు.

అంటే, సాధ్యమైనంత వరకు వివిధ రకాల ప్రజల నుంచి, లక్షణాలున్న పలు రకాల ఇమేజ్‌లను ప్రోగ్రామ్‌లో ఫీడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ డేటాను భద్రపరిచి ఉంచడం కాస్త కష్టంతో కూడుకున్నదే. ఎందుకంటే, రోగుల గోప్యతా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

సారా కెర్రూష్
ఫొటో క్యాప్షన్, ఖైరన్ మెడికల్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సారా కెర్రూష్

మియాను అభివృద్ధి చేయడానికి, దీనికి శిక్షణ ఇవ్వడానికి ఆరేళ్ల సమయం పట్టిందని ఖైరన్ మెడికల్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సారా కెర్రూష్ చెప్పారు. ఇది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ పవర్‌పై పనిచేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు చెందిన లక్షల మమోగ్రామ్‌లపై దీనికి శిక్షణ ఇచ్చారు.

‘‘నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. హెల్త్‌కేర్ కోసం ఏఐ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు, మొదటి రోజు నుంచే ఇంక్లూజివిటీ అలవరుచుకోవాలని నేను భావిస్తాను’’ అని చెప్పారు.

ఏడాదికి సగటున సుమారు 5 వేల స్కాన్లను బ్రెస్ట్ క్యాన్సర్ డాక్టర్లు చేపడుతున్నారు. సింగిల్ సెషన్‌లో 100 స్కాన్లను చేస్తారు.

ఇది వారిని చాలా అలసిపోయేలా చేస్తుందన్నారు డాక్టర్ గెరాల్డ్ లిప్.

ఏదో ఒక రోజు మియా లాంటి పరికరాలు మీ ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారా అని అడగ్గా, రోగులతో మరింత సమయం వెచ్చించేందుకు టెక్నాలజీ సాయం చేస్తుందని గెరాల్డ్ బదులిచ్చారు.

‘‘మియాను నేనొక ఫ్రెండ్‌గానే భావిస్తాను. నా పనికి ఇదొక ఆసరా, కొనసాగింపు’’ అని చెప్పారు.

డాక్టర్ గెరాల్డ్ లిప్

మియా పరికరంలో లోపాలేంటి?

మియా అన్ని వేళలా సరైన పరికరమని చెప్పలేం. ఎందుకంటే రోగుల వైద్య చరిత్ర ఈ పరికరానికి తెలిసి ఉండకపోవచ్చు. ముందటి స్కాన్లలో అప్పటికే గుర్తించిన కణతులను మళ్లీ గుర్తించవచ్చు. అవి ప్రమాదకరంగా చెప్పొచ్చు.

అంతేకాక, ప్రస్తుత ఆరోగ్య నియంత్రణల ప్రకారం, ఏఐ పరికరానికి చెందిన మెషీన్ లెర్నింగ్ విధానాలు పరీక్షల్లో వాడటానికి లేదు.

అంటే, పరీక్షలు చేపడుతూ ఇది సొంతంగా నేర్చుకోలేదు. కొత్తగా వైద్యపరీక్షలు వచ్చిన ప్రతీసారి, వాటితో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

మియా ట్రయల్ తొలుత కేవలం ఒకే ప్రాంతంలో చేశారు. అబెర్డీన్ యూనివర్సిటీ ఈ పరిశోధనను స్వతంత్రంగా ధ్రువీకరించింది. కానీ, ఎవాల్యుయేషన్ ఫలితాలను మాత్రం ఇది సమీక్షించలేదు.

‘‘అయితే, ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. క్యాన్సర్ లక్షణాలను ఏఐ గుర్తించగలదని తెలియజేసేందుకు ఇవి సాయపడుతున్నాయి. అయితే క్లినికల్ రేడియాలజిస్ట్‌లు తప్పనిసరి. వీరిని ఎవరూ భర్తీ చేయలేరు. ఇందులో సందేహం లేదు. కానీ, ఏఐ పరికరాలను ఉపయోగించే క్లినికల్ రేడియోలజిస్ట్‌లు రోగుల సంరక్షణలో దీన్ని శక్తిమంతమైన టూల్‌గా చూస్తారు’’ అని రాయల్ కాలేజీ ఆఫ్ రేడియాలజిస్ట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ క్యాథరిన్ హాలిడే చెప్పారు.

ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతుండటంతో, ఎన్‌హెచ్ఎస్ సేవలను మెరుగుపరచడంలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని బ్రిటన్‌లోని క్యాన్సర్ రీసర్చ్‌కు చెందిన హెల్త్ ఇన్‌ఫర్మేషన్ హెడ్ డాక్టర్ జూలీ షార్ప్ చెప్పారు. దీని వల్ల వైద్య సిబ్బందిపై ఒత్తిడి కూడా తగ్గుతుందన్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమన్నారు.

బ్రిటన్‌లో ఇతర వైద్య సంరక్షణకు అవసరమైన ఏఐ పరికరాలను కూడా పరీక్షిస్తున్నారు. లక్షణాలు కనిపించడాని కంటే ముందే సెప్సిస్‌ను గుర్తించే పరీక్షలకు ప్రీసింప్టమ్ హెల్త్ అనే సంస్థ ఏఐ టూల్‌‌ను పరీక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)