వరల్డ్ హెల్త్ డే: స్ట్రెస్, డిప్రెషన్‌లను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకవేళ ఎవరైనా ‘‘నాకు ఒంట్లో బాలేదు, జ్వరంగా ఉంది. జలుబు, దగ్గు ఉన్నాయి’’ అని చెబితే మనం వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఇంజెక్షన్ లేదా మందులు తీసుకోండని చెబుతుంటాం.
అదే ఒకవేళ ఎవరైనా, తన మూడ్ సరిగా ఉండట్లేదని చెబితే ఈ సమాజం వారిని ఎలా చూస్తుంది?
మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు, చర్చించరు.
మానసిక ఆరోగ్య సమస్యల గురించి ప్రజలు ఏమి ఆలోచిస్తారనే అంశంపై ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రి ఒక అధ్యయనం చేసింది. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు హింసాత్మకంగా ఉంటారని 47 శాతం మంది నమ్ముతున్నారు. 60 శాతం మంది ఈ మానసిక అనారోగ్యాన్ని వ్యక్తిగత బలహీనతగా చూస్తున్నట్లు అధ్యయనంలో తెలిసింది.
ఒత్తిడి (స్ట్రెస్), డిప్రెషన్ అనే పదాలు ఇప్పుడు సాధారణం అయ్యాయి. కానీ, ఎవరూ వీటిని తీవ్రమైన మానసిక సమస్యలుగా పరిగణించరు. స్కూలు పిల్లల నుంచి రిటైర్ అయిన పెద్దవారి వరకు అందరూ ఈ పదాలను వాడుతారు.
ట్రిప్‌కు వెళ్లడం, మంచి సినిమా చూడటం, నచ్చిన బిర్యానీ తినడం, జిమ్‌లో చేరడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చాలామంది అంటుంటారు.
ఇది నిజమేనా? అసలు ఒత్తిడి, డిప్రెషన్ అంటే ఏంటి? మానసిక వైద్యుడి (సైక్రియాట్రిస్ట్)ని ఎప్పుడు సంప్రదించాలి?

ఫొటో సోర్స్, Getty Images
ఒత్తిడి వర్సెస్ డిప్రెషన్
భారత్‌లోని యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. భారత్‌లో 13-17 ఏళ్లు ఉన్నవారిలో 7.3 శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెంటల్ హెల్త్ సిస్టమ్స్ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
‘‘దీనికి ప్రధాన కారణం ఒత్తిడి. క్రమంగా ఒత్తిడి అనేది డిప్రెషన్‌గా మారుతుంది. పరిస్థితులను బట్టి మనం ఒత్తిడికి గురవుతుంటాం. ఉదాహరణకు పరీక్షలో తక్కువ మార్కులు వస్తే, ఆఫీసులో ఇచ్చిన గడువులోగా పని పూర్తిచేయడంలో ఇబ్బందులు ఎదురవుతే, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఒత్తిడికి లోనవుతాం. ఒత్తిడి తాత్కాలికం. కానీ, డిప్రెషన్ దీర్ఘకాలం ఉంటుంది’’ అని మానసిక వైద్యురాలు రాజలక్ష్మీ చెప్పారు.
‘‘నిద్రలేమి, ఎప్పుడూ విచారంగా ఉండటం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, అపరాధభావం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆలోచనలను వ్యక్తం చేయలేకపోవడ వంటివి డిప్రెషన్ లక్షణాలు. ఎవరికైనా ఈ లక్షణాలు చాలాకాలం పాటు ఉంటే వారు తప్పకుండా మానసిక వైద్యుడిని సంప్రదించాలి.
కొన్ని పరీక్షల ద్వారా ఆ వ్యక్తిలో డిప్రెషన్ ఏ దశలో ఉందో గుర్తించి అవసరమైన మందులను వైద్యులు సిఫార్సు చేస్తారు’’ అని రాజలక్ష్మీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
డిప్రెషన్‌ను ఆల్కహాల్, స్మోకింగ్, టూర్లు తగ్గిస్తాయా?
చాలా మంది ఒత్తిడి, డిప్రెషన్‌ల మధ్య తేడా లేదని, అవి రెండూ ఒకటేనని అనుకుంటారు. కానీ, క్రానిక్ డిప్రెషన్ అనేది ఒక తీవ్రమైన సమస్య అని, దీనికి కచ్చితంగా వైద్య సహాయం పొందాలని సైకాలజిస్ట్ రాజలక్ష్మీ సూచించారు.
‘‘కొన్నేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యల గురించి అర్థం చేసుకుంటున్నారు. వాటిపై అవగాహన పెంచుకుంటున్నారు. చాలామంది ప్రజలు ఇప్పుడు డిప్రెషన్ అనే పదాన్ని వాడుతున్నారు. కొంతమంది తమ సన్నిహితులతో దీని గురించి మాట్లాడుతున్నారు.
కానీ, ఇప్పటికీ చాలామంది ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లడానికి సంకోచిస్తారు. ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటేనే డాక్టర్ వద్దకు వెళ్లడం, మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే బయటకు చెప్పకపోవడం వంటివి చాలామందికి అలవాటుగా మారాయి.
కొంతమంది బిర్యానీ తింటే, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చని అనుకుంటారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొంతమంది ఒంటరిగా లేదా స్నేహితులతో కలిసి టూర్లకు వెళుతుంటారు. కానీ, ఇవన్నీ తాత్కాలిక పరిష్కారాలు.
ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగితే డిప్రెషన్‌గా మారుతుంది. ఈ తాత్కాలిక పరిష్కారాలు సమస్యను మరింత పెంచుతాయి. వైద్య సహాయం తీసుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అనారోగ్యం బారిన పడితే వైద్యుని వద్దకు వెళ్లినట్లే, క్రానిక్ డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా సైకియాట్రిస్టును సంప్రదించాలి’’ అని ఆమె హెచ్చరించారు.

ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పే డిప్రెషన్
‘‘ఒత్తిడికి గురవ్వడం మామూలేనని అనుకుంటారు. కానీ దీర్ఘకాల ఒత్తిడి చాలా మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. జీర్ణసంబంధిత వ్యాధుల నుంచి గుండె జబ్బుల వరకు కారణం అవుతుంది’’ అని కిల్‌పాక్‌లోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణ చంద్రిక అన్నారు.
‘‘డిప్రెషన్ నేరుగా అనారోగ్యాన్ని కలిగించదు. కానీ, డిప్రెషన్‌తో ఉండేవారు ఎప్పుడూ విచారంగా కనిపిస్తారు. ఏ పని మీద ఆసక్తి ఉండదు. ఆహారాన్ని కూడా అంతగా ఇష్టపడరు. తమ భావాలన్నింటినీ బంధించి ఉంచుతారు.
ఇది అపరాధభావానికి దారి తీస్తుంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వారు ఆత్మన్యూనతకు గురవుతారు. ఇవి క్రమంగా ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతాయి.
ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు రాత్రికి రాత్రే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. చాలా రోజులు వారు డిప్రెషన్‌తో బాధపడుతుంటారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా, ఒక్కోసారి చెప్పడానికి ఎవరూ లేకపోతే వారు ఈ కఠిన నిర్ణయానికి వస్తారు. కాబట్టి ఒత్తిడి, డిప్రెషన్ రెండూ వేర్వేరని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వైద్య సహాయం తీసుకోవడం అత్యంత ముఖ్యం’’ అని డాక్టర్ పూర్ణ చంద్రిక తెలిపారు.

సైకియాట్రిస్ట్‌ను కలిసేందుకు అయిష్టత
‘‘ఈరోజుల్లో సెలెబ్రిటీలు కూడా తమ మానసిక ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా చెబుతున్నారు. డబ్బు ఉంటే ఒత్తిడి, డిప్రెషన్ దగ్గరకు రావు అనడంలో నిజం లేదు. అందర్నీ ఇవి వేధిస్తాయి.
కాబట్టి, సమాజం ఎలా చూస్తుందో అని సంకోచించకుండా మానసిక ఆరోగ్య చికిత్సలు తీసుకోవడం చాలా సాధారణ విషయంగా చూడాలి’’ అని డాక్టర్ పూర్ణ చంద్రిక చెప్పారు.
మత విశ్వాసాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అన్నారు.
‘‘ఎవరికైనా మానసిక సమస్యలు వారిని గుడికి లేదా దర్గాకు తీసుకెళ్తుంటారు. అవగాహన, జ్ఞానం ద్వారా మాత్రమే ఈ పరిస్థితిని మార్చవచ్చు’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
యోగా, ధ్యానంతో ఉపయోగం ఉంటుందా?
మానసిక ఆరోగ్య సమస్యలకు చాలామంది యోగా లేదా ధ్యానం చేయమని సిఫార్సు చేస్తుంటారు. దీని గురించి సైకాలజిస్ట్ రాజలక్మీని అడిగినప్పుడు, ‘‘యోగా, ధ్యానం అనేవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయి. కానీ, డిప్రెషన్‌ను కచ్చితంగా నయం చేయలేవు.
ముందు చెప్పినట్లుగా ఇవన్నీ కేవలం తాత్కాలిక పరిష్కారాలే. వైద్య సహాయం పొందకుండా, ఇలాంటి వాటి మీద ఆధారపడితే డిప్రెషన్ మరింత అధ్వాన్నంగా మారుతుంది. ఒక దశ దాటాక ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి’’ అని ఆమె హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక ఆరోగ్య చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుందా?
మానసిక సంబంధిత చికిత్సలు చాలా ఖరీదైనవి, లేదా ఉన్నత వర్గాలకు చెందినవి అనే భావన చాలామందిలో ఉంటుంది.
కానీ, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య విభాగం ఉంటుందని, ప్రజలు దీన్ని ఉపయోగించుకోవచ్చని డాక్టర్ రాజలక్ష్మీ చెప్పారు.
మనం అనుకున్నదానికంటే మానసిక ఆరోగ్య సమస్యలు చాలా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు లేదా మీ సన్నిహితులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుందటే వైద్యుడి వద్దకు వెళ్లేందుకు సంకోచించవద్దు. ఈ సమస్యల నుంచి బయటకు వచ్చాక, జీవితం ఎంత అందంగా ఉంటుందో మీరు గుర్తిస్తారు’’ అని డాక్టర్ పూర్ణ చంద్రిక అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ?
- జర్మనీకి 20 వేల ఏనుగులను పంపిస్తామని బోట్స్వానా ఎందుకు హెచ్చరించింది?
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- మనిషికి పంది కిడ్నీ: ఈ సర్జరీ చేయించుకున్న రిక్ ఇప్పుడు ఎలా ఉన్నారు?
- ఐపీఎల్: హార్దిక్ పాండ్యాపై అభిమానుల హేళనలు ప్రశంసలుగా మారుతాయా? ఈ పరిస్థితిని ఆయనే కొనితెచ్చుకున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














