మొరార్జీ దేశాయ్: జీవితమంతా కాంగ్రెస్‌లో ఉండి, ఆ పార్టీని వీడిన తర్వాత ప్రధానమంత్రి అయిన నేత

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నామ్‌దేవ్ కాట్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మొదటి ఘటన: నెహ్రూ సెక్రటరీ ఎం.ఓ. మథాయ్ ఒకసారి తన స్నేహితుడొకరితో కలిసి కుతుబ్ మినార్ చూసేందుకు వెళ్లారు.
అప్పుడు అతని స్నేహితుడు ఆయనను ఒక విషయం అడిగారు. మొరార్జీ దేశాయ్ ఎలాంటి వారు అని.
అందుకు మథాయ్, "మీ ముందున్నది ఇనుప స్తంభం కదా. దానికి ఒక గాంధీ టోపీ పెట్టండి. అప్పుడు మీకు మొరార్జీ దేశాయ్ కనిపిస్తారు. శారీరకంగా, మానసికంగా రెండు రకాలుగానూ నిరాడంబరమైన, బలమైన వ్యక్తి ఆయన'' అన్నారు.
రెండో ఘటన: నెహ్రూ కూడా ఒకసారి మథాయ్‌తో మాట్లాడుతూ, భారత రాజకీయాల్లో మనకు కనిపించే ఇద్దరు అత్యంత నిజాయతీపరులు పురుషోత్తమదాస్ టాండన్, మొరార్జీ దేశాయ్ అన్నారు.
నిజానికి నెహ్రూ చివరి రోజుల్లో మొరార్జీతో అంతగా కలిసింది లేదు. అయినా, నెహ్రూకు ఇదే అభిప్రాయం ఉండేది.
ఈ రెండు ఘటనలు మొరార్జీ దేశాయ్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి.
మొరార్జీ దేశాయ్ భారతదేశ ఆరో ప్రధానమంత్రి. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రజా జీవితంలో ఎక్కువ కాలం కొనసాగిన రాజకీయ నాయకుడు, 'కామరాజ్ ప్లాన్' బాధితుడు, ఇందిరా గాంధీతో విభేదాలు, 82 ఏళ్ల వయసులో భారత ప్రధాని, స్వమూత్రపాన ప్రయోగాలు, ఆయన రాజకీయ ప్రయాణం, వ్యక్తిగత జీవితం.. ఇలా చాలా విషయాల గురించి భారతీయులు ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు.
నెహ్రూ-గాంధీ కుటుంబంతో ఆయన ఎప్పుడూ గొడవ పడేవారు. ఇందిరా గాంధీ తన మొదటి క్యాబినెట్ నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ను తొలగించడంతో అది తీవ్రతరమైంది. ఎమర్జెన్సీ తర్వాత ఆయన ప్రధాన మంత్రి అయ్యారు.
మొరార్జీ దేశాయ్ ఆసక్తికర జీవిత ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉద్యోగం వదిలి స్వాతంత్య్రోద్యమంలోకి...
మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న పుట్టారు. అంటే, లీపు సంవత్సరం, నాలుగేళ్లకోసారి పుట్టినరోజు. దీని కారణంగా, యూనియన్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యమంలో ఆయన పుట్టిన తేదీ గురించి ఆచార్య ఆత్రే విమర్శించారు.
మొరార్జీ దేశాయ్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముంబయిలోని (అప్పుడు బొంబాయి) వ్యాపారవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ విషయం ఆచార్య ఆత్రే దృష్టికి వచ్చింది. యునైటెడ్ మహారాష్ట్రకు మొరార్జీ వ్యతిరేకి. అందుకే దేశాయ్‌పై ఆత్రే వ్యతిరేకత పెంచుకున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ దేశాయ్‌పై విమర్శలు చేసేవారు.
గుజరాత్‌లోని భదేలీ గ్రామంలో మొరార్జీ దేశాయ్ జన్మించారు. అప్పట్లో ఈ గ్రామం బొంబాయి ప్రావిన్స్ పరిధిలో ఉండేది. మొరార్జీ 15 ఏళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయారు. గుజరాత్‌లో మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత, ముంబయిలోని విల్సన్ కాలేజీలో చేరారు. భావ్‌నగర్ సంస్థానం అందించే స్కాలర్‌షిప్‌తో చదువు కొనసాగించారు.
చదువుకుంటున్న సమయంలోనే 1911లో ఆయనకు గజ్రాబెన్‌తో వివాహమైంది. 1917లో తన కాలేజీ చదువు పూర్తి చేసిన అనంతరం బొంబాయి ప్రావిన్స్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చేరారు.
ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడుతున్న ఆ సమయంలో, మహాత్మాగాంధీ నాయకత్వంలో దేశంలో స్వాతంత్య్రోద్యమం ఊపందుకుంటోంది. అప్పటి పరిణామాల ప్రభావం మొరార్జీ దేశాయ్‌పై పడింది. ఉద్యోగం వదిలేసి స్వాతంత్య్రోద్యమంలో చేరాలని 1930లో ఆయన నిర్ణయించుకున్నారు.
1931లో గుజరాత్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత ప్రజా జీవితంలో వెనుదిరిగి చూసుకోలేదు.
1952 నుంచి 1956 వరకూ బాంబే ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెవెన్యూ, వ్యవసాయ, అటవీ శాఖల మంత్రిగా వ్యవహరించారు.
1957 నుంచి 1977లో ఆయన ప్రధాని అయ్యే వరకూ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
1950 నుంచి 60ల మధ్య మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. ముంబయితో పాటు యునైటెడ్ మహారాష్ట్రను వ్యతిరేకించడమే అందుకు కారణం.
ముంబయితో కలిపి మహారాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం తీవ్రతరమైంది. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ ముంబయిని గుజరాత్‌లో కలిపేందుకు సానుకూలంగా ఉండేవారు. దీంతో ఆయనపై మహారాష్ట్రీయులలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
1958 నుంచి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. టి.టి.కృష్ణమాచారి రాజీనామా అనంతరం మొరార్జీ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1963 వరకూ ఆ పదవిలో కొనసాగారు.
1963లో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాల్సి వచ్చింది, 'కామరాజ్ ప్లాన్' అందుకు కారణమైంది.

ఫొటో సోర్స్, Getty Images
కామరాజ్ ప్లాన్ బాధితులు
1963లో తమిళనాడు ముఖ్యమంత్రి కె.కామరాజ్ ఒక కొత్త ప్రణాళికతో ముందుకొచ్చారు. కాంగ్రెస్‌కి చెందిన సీనియర్ మంత్రులు రాజీనామా చేసి, పార్టీ కోసం పనిచేయాలి. దానినే కామరాజ్ ప్లాన్‌గా చెబుతారు.
ఈ ప్లాన్ ప్రకారం, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్.పాటిల్ వంటి కేంద్రమంత్రులతో పాటు అప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాజీనామా చేశారు.
అయితే, కామరాజ్ ప్లాన్‌తో మొరార్జీ దేశాయ్ విభేదించడం వివాదాస్పదమైంది. ఈ ప్లాన్‌ను ఆయన 'నెహ్రూ కుట్ర'గా చూశారు.
కామరాజ్ ప్లాన్ పేరుతో నెహ్రూ కూతురు.. అంటే, ఇందిరా గాంధీకి అడ్డుతగిలే సీనియర్ నాయకులను తొలగించారని ఆయన ఆరోపించారు.
మొరార్జీ దేశాయ్ తన ఆత్మకథ 'ది స్టోరీ ఆఫ్ మై లైఫ్' రెండవ భాగంలో కామరాజ్ ప్లాన్‌పై తన అభిప్రాయాలను ఇలా రాశారు.
'1963 మే-జూన్ సమయంలో బిజూ పట్నాయక్‌తో కలిసి జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీర్‌కు వెళ్లినప్పుడు, బిజూ పట్నాయక్ తొలుత ఈ ప్లాన్ ప్రతిపాదించారు. ఆ తర్వాత 1963 జూన్‌లో కామరాజ్ తన ప్లాన్ చెప్పారు.'
అంతేకాకుండా, కామరాజ్ ప్రతిపాదనల్లో కొన్ని విషయాలు పార్టీలో మీపై అనుమానాలను రేకెత్తిస్తాయని నేరుగా నెహ్రూతోనే చెప్పారు.
కామరాజ్ ప్లాన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ మొరార్జీ దేశాయ్ తన ఆత్మకథలో ప్రత్యేకంగా ఓ అధ్యాయం రాశారు.

ఇందిరా గాంధీతో శత్రుత్వం, చేజారిన ఉప ప్రధాని పదవి
పండిట్ నెహ్రూ తర్వాత ప్రధాని ఎవరనే చర్చ జరిగినప్పుడు మొరార్జీ దేశాయ్ పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే, ఆ అవకాశం లాల్ బహదూర్ శాస్త్రికి దక్కింది.
లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కూడా ప్రధాన మంత్రి పదవికి మొరార్జీ దేశాయ్ పేరు మరోసారి చర్చకు వచ్చింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంలోని సీనియర్ నేతల్లో మొరార్జీ కూడా ఒకరు. మొరార్జీ కూడా ప్రధాని పదవి కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం సఫలం కాలేదు.
మొరార్జీకి పార్టీలో సరిపడినంత మద్దతు లభించలేదు. ప్రధాని పదవి రేసులో ఇందిరా గాంధీ విజయం సాధించారు.
ప్రధాన పదవి దక్కకపోయినా, పార్టీ సీనియర్ నేత కావడంతో మరో కీలక పదవి చేపట్టారు. మొరార్జీ దేశాయ్‌ను ఇందిరా గాంధీ ఉప ప్రధానిని చేసి, ఆయనకు ఆర్థిక శాఖను అప్పగించారు.
అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకే ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్ మధ్య విభేదాలు పొడచూపాయి.
జాతీయ అభివృద్ధి మండలి(నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) సమావేశంలో ఈ తేడా స్పష్టంగా కనిపించింది. ప్రముఖ జర్నలిస్ట్ ఇందర్ మల్హోత్రా అప్పటి సంఘటన గురించి ప్రస్తావించారు.
జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఒక ముఖ్యమంత్రి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు ఇందిరా గాంధీ సమాధానం చెబుతున్న సమయంలో, మొరార్జీ దేశాయ్ ఆమెను ఆపి, ఈ ప్రశ్నకు మంచి సమాధానం నేను చెప్పగలను అన్నారు.
ఈ సంఘటనతో మొరార్జీ దేశాయ్‌కు తన క్యాబినెట్‌లో చోటులేకుండా చేయాలని ఇందిరా గాంధీ నిర్ణయించుకున్నారని పీఎన్ హక్సర్ ఒకసారి బీబీసీ జర్నలిస్ట్ రేహాన్ ఫజల్‌తో చెప్పారు.
ఆ తర్వాత రాష్ట్రపతి అభ్యర్థులు, బ్యాంకుల జాతీయం, రాజభరణాల వంటి విషయాల్లో ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విభేదాలు ఎంత తీవ్రస్థాయికి వెళ్లాయంటే మొరార్జీ దేశాయ్‌ను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించాలని ఇందిరా గాంధీ నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయం తర్వాత మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీకి లేఖ రాశారు. ఉప ప్రధానిగా కొనసాగడం తనకు ఇష్టం లేదని తెలియజేస్తూ, ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.

ఎమర్జెన్సీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు
ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి అయ్యారు.
మాజీ ప్రధాన మంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఐకే గుజ్రాల్) 2004లో బీబీసీ హిందీకి ఒక ఆర్టికల్ రాశారు. అందులో మొరార్జీ ప్రధానిగా ఎన్నిక కావడం గురించి ప్రస్తావించారు.
'జనతా పార్టీ ఏర్పాటు కోసం అనేక సిద్ధాంతాల కలబోతతో పాటు చిన్నాపెద్ద పార్టీలు ఏకమయ్యాయి. అందరూ తమ అభిప్రాయాలను పక్కనబెట్టి ఏకతాటిపైకి వచ్చారు. ప్రధాని పదవి గురించి చర్చ మొదలైనప్పుడు జగ్జీవన్ రామ్, చౌధరి చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ పేర్లు తెరపైకి వచ్చాయి. జనతా పార్టీలో జయప్రకాష్ నారాయణ్ మాటకే ప్రాధాన్యం. మొరార్జీ పేరువైపే ఆయన మొగ్గుచూపారు. అలా ఆయన ప్రధాని అయ్యారు.' అని గుజ్రాల్ రాశారు.
గతంలో జర్నలిస్ట్ కుల్దీన్ నయ్యర్‌ను బీబీసీ జర్నలిస్ట్ రేహాన్ ఫజల్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆయన్ను ఇదే విషయంపై ప్రశ్నించగా, జనతా పార్టీలో జగ్జీవన్ రామ్‌కే ఎక్కువ మద్దతు ఉందని నయీం చెప్పారు. అయితే, జగ్జీవన్ రామ్ ఎమర్జెన్సీ ప్రతిపాదనను పార్లమెంట్‌లో సమర్పించారని, అందువల్ల ఆయన్ను ప్రధాని చేయడం సాధ్యం కాదని జయప్రకాష్ అభిప్రాయపడ్డారు.
అయితే, జనతా పార్టీ ఆవిర్భావం నుంచే అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. చౌధరి చరణ్ సింగ్ కూడా ప్రధాని కావాలనుకున్నారు. 1979లో చౌధరి చరణ్ సింగ్, హేమవతి నందన్ బహుగుణలను కూడా ఆ దిశగా కాంగ్రెస్ ప్రేరేపించిందని ఇందర్ కుమార్ గుజ్రాల్ రాశారు.
ఆ తర్వాత, మధు లిమాయ్ ద్వంద్వ సభ్యత్వాన్ని (జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) లేవనెత్తారు.
ఇలాంటి అనేక కారణాలతో మొరార్జీ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్సేతర ప్రభుత్వం కోసం జనతా పార్టీ చేసిన మొదటి ప్రయత్నం విఫలమైంది.
ఈ పరిణామాల వల్ల మొరార్జీ దేశాయ్ కేవలం రెండేళ్లు మాత్రమే ప్రధాని పదవిలో కొనసాగారు. అయినప్పటికీ, ఆయన నిర్ణయాలు నేటికీ ప్రశంసలు పొందుతున్నాయి. వాటిలో ఆయన అనుసరించిన విదేశాంగ విధానం ఒకటి.

ఫొటో సోర్స్, RAJKAMAL PRAKASH
భారతరత్న, నిషాన్ - ఎ - పాకిస్తాన్
భారత్, పాకిస్తాన్ దేశాల్లోని అత్యున్నత పౌర పురస్కారం పొందిన తొలి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్. భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను అందజేయగా, పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ - ఎ - పాకిస్తాన్‌ను ప్రదానం చేసింది.
పాకిస్తాన్ మొరార్జీ దేశాయ్‌ను కీర్తించడానికి ఆయన విదేశాంగ విధానమే కారణం.
మొరార్జీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో భారత్ - పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేశారు.
కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయిని విదేశాంగ మంత్రిగా నియమించారు మొరార్జీ దేశాయ్. వాజ్‌పేయి ఇండో-పాక్ స్నేహానికి మార్గం సుగమం చేశారు. అది 17 ఏళ్ల తర్వాత రెండు దేశాల మధ్య క్రికెట్ పోటీల వరకూ తీసుకొచ్చింది.
మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కశ్మీర్ సమస్య పరిష్కారానికి కూడా ప్రణాళికను రూపొందించినట్లు సీనియర్ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ రాసిన 'భారత్ కే ప్రధాన మంత్రి' పుస్తకంలో రాశారు. 'పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు జనరల్ జియావుల్ హక్‌తో మొరార్జీ కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా ఒప్పందం చేసుకోబోతున్నారు. జియావుల్ హక్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో దానికి సంబంధించిన ప్రకటన చేయాలని భావించారు. కానీ, అవన్నీ జరగకముందే మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది.'
'కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్‌తో కీలక ఒప్పందం చేసుకునేందుకు ఇదే చివరి అవకాశమని పలువురు విదేశాంగ వ్యవహారాల నిపుణులు కూడా భావిస్తున్నారు.' అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1979లో కూలిపోయింది. సుమారు ఒక దశాబ్ద కాలం తర్వాత ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్ - ఎ - పాకిస్తాన్' ప్రకటించారు.
మొరార్జీ దేశాయ్ తన ఆత్మకథలో ''రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడంలో నెహ్రూ ఆశించినంత సాయం చేయలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి నాతో చెప్పారు'' అని రాశారు.
పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన టీసీఏ రాఘవన్ తన పుస్తకం 'ది పీపుల్ నెక్స్ట్ డోర్'లో, పాకిస్తాన్ ఎందుకు మొరార్జీ దేశాయ్‌ను గౌరవించాలనే విషయాలను రాశారు. ''1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు భారతరత్న ప్రదానం చేశారు. అందుకు బదులుగా పాకిస్తాన్ ఈ అవార్డును ప్రదానం చేయాల్సి వచ్చింది. కానీ, దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని కొట్టిపారేయలేం'' అని అందులో పేర్కొన్నారు.
ఆ అవార్డును ప్రకటించిన తర్వాతి రెండేళ్లలో పాకిస్తాన్‌లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు, 1990లో మొరార్జీ దేశాయ్‌కు 95 ఏళ్ల వయసులో ఈ అవార్డును అందజేశారు.

ఫొటో సోర్స్, AP
వాస్తవానికి, మొరార్జీ దేశాయ్ గాంధేయవాది. మహాత్మా గాంధీ స్పూర్తితో ఉద్యోగాన్ని వదిలి స్వాతంత్య్రోద్యమంలోకి వచ్చారు. అప్పటి నుంచే బాంబే కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు.
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మొరార్జీ దేశాయ్, పార్టీలో రైట్‌వింగ్ భావజాలంతో ఉండేవారు. భారత ప్రధాన మంత్రి అయినప్పుడు ఆ ప్రభావం ఆయన విధానాల్లో కూడా కనిపించింది.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల హయాంలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు భారత్ మొగ్గుచూపింది. అందులో నుంచే 'వేర్పాటువాద' విధానం అమల్లోకి వచ్చింది. అయితే, మొరార్జీ దేశాయ్ ఆ విధానాన్ని పెద్దగా అనుసరించలేదు. అప్పట్లో భారతీయ విధానాల్లో అంటరానిదిగా భావించే పెట్టుబడిదారీ అమెరికాతో స్నేహం దిశగా అడుగులు వేశారు.
అమెరికా పర్యటనకు వెళ్లిన మొరార్జీ దేశాయ్ వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు నిక్ కార్టర్‌ను కలిశారు. అలాగే, 1978లో కార్టర్‌ను భారత పర్యటనకు ఆహ్వానించారు.
అమెరికాతో స్నేహమే మొరార్జీ విధానం అయినప్పటికీ, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టలేదు. అణ్వాయుధాల చర్చ సందర్భంగా అమెరికా ఒత్తిడి చేసినా మొరార్జీ అంగీకరించలేదు.
ఆయన రైట్‌వింగ్ నాయకుడనే ఆరోపణలు ఉండేవి. ఇదే విషయంపై ఒకసారి ఆయనను ప్రశ్నించినప్పుడు మొరార్జీ ఇచ్చిన సమాధానం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. మొరార్జీ దేశాయ్ ''అవును, నేను రైటిస్ట్‌ని. ఎందుకంటే నేనెప్పుడూ సరైన(రైట్) పనులే చేయాలని భావిస్తాను'' అన్నారు.

ఫొటో సోర్స్, PHOTO DIVISION
మూత్రం తాగే అలవాటు
మొరార్జీ దేశాయ్ తన మూత్రం తానే తాగే అలవాటు కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన తన మూత్రాన్ని తాను తాగడమే కాదు, దానిని సమర్థించారు కూడా. మొరార్జీ చేసిన ఈ వాదనను చాలామంది భారతీయులు జీర్ణించుకోలేకపోయారు.
దీనికి సంబంధించిన ఒక ఉదంతాన్ని భారత గూఢచార సంస్థ 'రా' మాజీ అధికారి బి.రామన్ తన 'కౌ బాయ్స్ ఆఫ్ రా' పుస్తకంలో రాశారు.
1978లో మొరార్జీ దేశాయ్ ఫ్రెంచ్ ప్రభుత్వ అతిథిగా వెళ్లారు. అప్పుడు ఆర్‌డీ సాఠే ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా ఉన్నారు. మొరార్జీ సాఠే ఇంట్లోనే ఉన్నారు.
మొరార్జీ ఫ్రాన్స్ నుంచి భారత్ తిరిగి వచ్చేసిన తర్వాత, ఒకరోజు సాఠే ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తి ఆయనకు గ్లాసులో మద్యం తీసుకొచ్చారు. అప్పుడు సాఠే "కొత్త గ్లాసు వాడుతున్నావా?" అని తన భార్యను అడిగారు.
అప్పుడు సాఠే భార్య, "మొరార్జీ ఏ గ్లాసులో తన మూత్రం తాగేవాడో తెలియదు. అందుకే పాత గ్లాసులన్నీ పారేశాను" అన్నారని రాశారు.
మొరార్జీ జీవితంలో ఇలాంటివి ఎన్నో. ఆయన 1995 ఏప్రిల్ 10న తన వందో ఏట కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణ కొరియా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదు, వారి సమస్యేంటి?
- హిజాబ్: ‘కొరడా దెబ్బలు తింటాం, జైలుకైనా వెళతాం’ అంటున్న ఇరానీ మహిళలు
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
- కచ్చతీవు దీవిపై కాంగ్రెస్, డీఎంకేలను మోదీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలేంటీ వివాదం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














