ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 15 ఏళ్లలో రెట్టింపు అవుతాయన్న లాన్సెట్ నివేదిక, ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రోస్టేట్ క్యాన్సర్‌తో ఏటా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పురుషుల సంఖ్య 2040 నాటికి రెట్టింపు అవుతుందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తాజా అధ్యయనం అంచనా వేసింది.
2020లో కొత్తగా నిర్ధారణ అయిన ప్రోస్టేట్ క్యాన్సర్ రోగుల సంఖ్య 14 లక్షలు కాగా, 2040 నాటికి వీరి సంఖ్య ఏటా 29 లక్షలకు పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం, భారత్‌లో ఏటా 33,000 నుంచి 42,000 ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు కొత్తగా నిర్ధారణ అవుతున్నాయి. 2040 నాటికి ఇది 71,000 కేసులకు పెరుగుతుందని అంచనా.
లాన్సెట్ అధ్యయనం ప్రకారం తక్కువ, మధ్య- ఆదాయ దేశాల పురుషుల్లో వార్షిక మరణాలు 2040 నాటికి 85 శాతం పెరిగి దాదాపు 7,00,000 వరకు చేరుకుంటాయని అంచనా వేశారు.
పెరుగుతున్న జనాభా, దీర్ఘ ఆయుర్దాయం కారణంగా రాబోయే సంవత్సరాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని పరిశోధకుల అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
గత కొన్నేళ్లుగా ప్రోస్టేట్ క్యాన్సర్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది.
ప్రోస్టేట్ అనేది పురుషుల జననేంద్రియాల దగ్గర ఉండే ఒక గ్రంథి. ఈ గ్రంథి దగ్గర క్యాన్సర్ గడ్డలు ఏర్పడి, క్రమంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు పెద్దగా కనిపించవు.
శరీరంలో ఏవైనా మార్పుల్ని గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తగు చికిత్స తీసుకోవాలి.
ఈ క్యాన్సర్‌ను నిర్ధారించే పరీక్షల్లో రక్త పరీక్ష, బయాప్సీ, మాన్యువల్ పరీక్షించడం వంటివి ఉంటాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎన్‌హెచ్‌ఎస్, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించిన విస్తృత సమాచారాన్ని అందిస్తుంది.
ప్రోస్టేట్ అంటే ఏమిటి?
ప్రోస్టేట్ అనేది ఒక చిన్న గ్రంథి. ఇది పురుషుల జననేంద్రియాల దగ్గర ఉంటుంది.
ఈ గ్రంథి వాల్‌నట్ పరిమాణంలో ఉంటుంది. మూత్రాశయానికి, పురుషాంగానికి మధ్య అమరి ఉంటుంది.
ఒక తెల్లని ద్రవాన్ని ఉత్పత్తి చేయడం ఈ గ్రంథి ప్రధాన విధి. ఈ స్రావము, వృషణాల నుంచి వెలువడే శుక్రకణాలు కలిసిపోయి వీర్యాన్ని ఏర్పరుస్తాయి.
ప్రోస్టేట్ గ్రంథి ఎవరికి ఉంటుంది?
- పురుషులు
- లింగ మార్పిడితో మహిళలుగా మారిన వారు (ట్రాన్ఉమెన్)
- పుట్టుకతో మగవారిగా ఉండే నాన్-బైనరీ వ్యక్తులు
- కొందరు ఇంటర్‌సెక్స్ వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images
ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి?
ప్రోస్టేట్ గ్రంథిలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఏర్పడుతుంది.
కొంతమంది రోగుల్లో ఈ క్యాన్సర్ వృద్ధి చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ, కొందరిలో ఇది చాలా వేగంగా వృద్ధి చెంది వ్యాపించే అవకాశం ఉంటుంది. దీని వ్యాప్తిని నివారించడానికి తగు చికిత్స అవసరం.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం బాగా పెరిగిపోయి, మూత్రాశయాన్ని పురుషాంగానికి అనుసంధానించే నాళాన్ని ప్రభావితం చేసేంతవరకు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు సాధారణంగా కనిపించవు.
మూత్రనాళం ప్రభావితమయ్యాక కింది లక్షణాలు కనిపిస్తాయి.
- తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం
- మూత్ర విసర్జన సమయంలో నొప్పి
- మూత్రవిసర్జన పూర్తయిన భావన కలగకపోవడం
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కాదు. కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ విస్తరణ లక్షణాలు కూడా అయ్యే అవకాశం ఉంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ కారణాలు
ఎన్‌హెచ్‌ఎస్ హెల్త్‌కేర్ సంస్థ ప్రోస్టేట్ క్యాన్సర్ కారణాల గురించి వెల్లడిస్తుంది. ఈ క్యాన్సర్ కారణాలు చాలావరకు పెద్దగా ఎవరికీ తెలీదని ఎన్‌హెచ్‌ఎస్ చెబుతోంది. కానీ కొన్ని అంశాలు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయని వెల్లడించింది.
వయస్సు పెరిగిన కొద్ది ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
50 ఏళ్లు దాటిన పురుషుల్లో, వృద్ధుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఈ క్యాన్సర్ బాధిత తండ్రి లేదా సోదరుడు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం కాస్త ఎక్కువగా ఉంటుంది.
కొత్త పరిశోధన ప్రకారం, ఊబకాయం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.
ఈ క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని కారకాల గురించి ‘‘ప్రోస్టేట్ క్యాన్సర్ యూకే’’ అనే సంస్థ తెలిపింది.
50 ఏళ్లు పైబడిన పురుషులు, వృద్ధులకు ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 65-69 ఏళ్ల వారిలో ఎక్కువగా కనబడుతుందని చెప్పింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, భారత్‌లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 65 ఏళ్లు పైబడిన పురుషులలో ఎక్కువ.
ఈ సంస్థ క్యాన్సర్‌కు కుటుంబ చరిత్ర, జన్యు లోపాలను కూడా కారణంగా సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రోస్టేట్ క్యాన్సర్ వారసత్వంగా సంక్రమిస్తుందా?
మీ కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే మీకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రోస్టేట్ క్యాన్సర్ యూకే సంస్థ చెబుతోంది.
కొన్ని జన్యులోపాల వల్ల ఈ వ్యాధి వచ్చే ముప్పు ఉందని తెలిపింది.
ఒకవేళ మా నాన్నకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే, నాకు ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎంత?
ప్రోస్టేట్ క్యాన్సర్ యూకే సంస్థ చెప్పిన దాని ప్రకారం, మీ నాన్న లేదా మీ సోదరుడికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే, మిగతా పురుషులతో పోలిస్తే మీకు ఈ వ్యాధి వచ్చే అవకాశం రెండు లేదా రెండున్నర రెట్లు ఎక్కువ.
మీ సోదరుడు లేదా తండ్రికి 60 ఏళ్లలోపు ఈ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, లేదా మీ దగ్గరి బంధువుల్లో (మీ తండ్రి సోదరులు) ఒకరి కంటే ఎక్కువ మందికి ఈ క్యాన్సర్ ఉంటే మీకూ ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ మీ తల్లికి లేదా సోదరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కూడా మీకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికం.
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధాన పరీక్షలు
ఒకే పరీక్ష ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించలేమని ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది.
అన్ని పరీక్షల సానుకూల, ప్రతికూల ఫలితాలను డాక్టర్లు చర్చించాలి.
- రక్త పరీక్ష
- ప్రోస్టేట్ గ్రంథి మాన్యువల్ ఎగ్జామినేషన్
- ఎంఆర్‌ఐ స్కాన్
- బయాప్సీ

ఫొటో సోర్స్, Getty Images
పీఎస్ఏ పరీక్ష ఏమిటి?
ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్(పీఎస్ఏ) అనేది రక్త పరీక్ష. ఇది పీఎస్ఏ స్థాయిను కొలుస్తుంది. దీంతో, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను త్వరగా గుర్తించేందుకు సాయపడుతుంది.
ఒకవేళ మీ వయసు 50 ఏళ్ల పైన ఉంటే పీఎస్ఏ పరీక్ష చేయాలని వైద్యున్ని మీరు అడగవచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు పీఎస్ఏ పరీక్షను ఉపయోగించలేం. ఎందుకంటే, ఈ పరీక్ష అందించే సమాచారం నమ్మకమైనదిగా పరిగణించలేం.
క్యాన్సర్ లేనప్పటికీ పీఎస్ఏ స్థాయి అధికంగా చూపిస్తుంటుంది. పెరిగిన పీఎస్ఏ స్థాయిలు మీకు ప్రాణాలు తీసే క్యాన్సర్ ఉందా లేదా అనే విషయాన్ని వైద్యులకు తెలియజేసేందుకు కచ్చితంగా ఉపయోగపడవు.
ఒకవేళ పీఎస్ఏ స్థాయి అధికంగా ఉంటే, ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం, మరిన్ని పరీక్షలు, చికిత్సలు తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స ఏమిటి?
కొంతమంది రోగుల్లో ఈ క్యాన్సర్‌ను అది మరింత విస్తరించాక, చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అలాంటి రోగులకు వివిధ రకాల చికిత్సలు చేయాల్సి ఉంటుంది.
ఈ చికిత్స వల్ల అంగస్తంభన లోపం, మూత్రానికి వెళ్లడం కష్టం కావడం, తరచూ మూత్రానికి వెళ్లడం, అకస్మాత్తుగా మూత్ర విసర్జన కావడం వంటి కొన్ని దుష్ఫ్రభావాలు కలుగుతాయి.
అత్యధిక తీవ్రతతో కూడిన అల్ట్రాసౌండ్, క్రయోథెరపీ వంటి కొత్త చికిత్సలు ఈ దుష్ఫ్రభావాలను కాస్త తగ్గించగలవని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
మరింత సంరక్షణ అవసరం
ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న పురుషులు 40 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాది తమ ప్రోస్టేట్ గ్రంథిని పరీక్షించుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాంటి పురుషుల జన్యు కోడ్‌లో, డీఎన్ఏలో మార్పులు ప్రోస్టేట్ క్యాన్సర్ అభివృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకుల అంచనాల ప్రకారం, ప్రతి ఏడాది రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించి, చికిత్స చేయించుకునేందుకు వీలుంటుంది.
2019లో బ్రిటన్‌లో 300 మంది పురుషులకు పరీక్షలు నిర్వహిస్తే, బీఆర్‌సీఏ2 మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు తెలిపారు.
ఈ మ్యుటేషన్ జరుగుతున్నట్లు చాలా మంది మగవారికి తెలియదు. ఎందుకంటే, ఈ విధానాన్ని పరీక్షించరు.
బీఆర్‌సీఏ2 మ్యుటేషన్ వల్ల మహిళలలో రొమ్ము, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- జర్మనీకి 20 వేల ఏనుగులను పంపిస్తామని బోట్స్వానా ఎందుకు హెచ్చరించింది?
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- మనిషికి పంది కిడ్నీ: ఈ సర్జరీ చేయించుకున్న రిక్ ఇప్పుడు ఎలా ఉన్నారు?
- ఐపీఎల్: హార్దిక్ పాండ్యాపై అభిమానుల హేళనలు ప్రశంసలుగా మారుతాయా? ఈ పరిస్థితిని ఆయనే కొనితెచ్చుకున్నారా?
- వెల్లుల్లి జలుబును తగ్గిస్తుంది, క్యాన్సర్ నిరోధిస్తుందనే మాటల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














