ఆస్తమా: ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఇబ్బందికి కొత్త కారణాన్ని గుర్తించిన పరిశోధకులు

ఆస్తమా ఉన్న పాప

ఫొటో సోర్స్, Science Photo Library

    • రచయిత, మిచెల్ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్

ఆస్తమా వల్ల ఇబ్బంది పడే రోగులకు ఊపిరితిత్తులు, శ్వాసనాళాలలో ఎందుకు ఇబ్బంది కలుగుతుందో సరికొత్త కారణాన్ని కనుగొన్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పారు.

ఆస్తమా దాడి సమయంలో శ్వాసనాళాలను కప్పి ఉంచే కణాలు నాశనమవుతాయని ఈ పరిశోధన సూచించింది. ఇప్పటివరకు ఈ శ్వాసనాళాలకు కలిగే ఇబ్బందులను పట్టించుకోలేదని తెలిపింది.

ఔషధాల ద్వారా ఈ పరిణామాలకు చికిత్స అందించడం కంటే, దీన్ని అరికట్టగలిగితే ప్రమాదాన్ని అధిగమించవచ్చని కింగ్స్ కాలేజీ లండన్ పరిశోధకులు సైన్స్ జర్నల్‌లో వివరించారు.

ఆస్తమా ఉన్న వ్యక్తుల శ్వాసనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. వివిధ కారణాల వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది.

గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా ఆయాసం వచ్చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా ప్రజలు ఆస్తమా వల్ల ఇబ్బంది పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.

ఊపిరితిత్తులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఈ సమస్యను ప్రస్తుతమున్న ఔషధాలు లేదా ఇన్‌హేలర్స్ కాస్త తగ్గించగలవు. అవి శ్వాసనాళాలు తెరుచుకునేలా చేస్తాయి. కానీ, పదేపదే వచ్చే ఆస్తమా దాడుల ద్వారా శాశ్వాతంగా శ్వాసనాళాలు కుంచించుకుపోవడం జరుగుతుంటుంది.

ఆస్తమా దాడి చేసినప్పుడు, వాయునాళాల చుట్టూ ఉన్న సున్నితమైన కండరాలు బిగుసుకుపోతుంటాయి. దీన్నే శ్వాసకోశ సంకోచం (బ్రాన్‌కోకన్‌స్ట్రిక్షన్) అంటారు.

ఎలుక, మనిషి ఊపిరితిత్తులలోని కణజాలాల నమూనాలను తీసుకుని కింగ్స్ కాలేజీ బృందం పరిశోధన జరిపింది.

శ్వాసకోశ సంకోచంలో వాయు గొట్టాలు దెబ్బతింటాయని, దీర్ఘకాలిక అనారోగ్యానికి దారి తీస్తాయని ఈ పరిశోధన లీడర్ ప్రొఫెసర్ జూడీ రోజెన్‌బ్లాట్ చెప్పారు.

ఇన్‌ఫెక్షన్లు మరిన్ని ఆస్తమా అటాక్స్‌కు దారి తీస్తాయని తెలిపారు.

‘‘ఈ ఎపిథీలియల్ కణాలు ఇన్‌ఫెక్షన్ల వంటి వాటిపై పోరాడేందుకు శరీరానికి తొలి రక్షణ కవచాలు. ఆస్తమా అటాక్స్ సమయంలో ఇవి నాశనమవుతూ ఉంటాయి’’ అని రోజెన్‌బ్లాట్ అన్నారు.

పదేపదే ఇలా జరగడం వల్ల, అది విష వలయంగా మారుతుందన్నారు. డ్యామేజ్ కావడాన్ని మనం ఆపగలిగితే, ఈ దాడులను మనం ఆపవచ్చని చెప్పారు.

మరిన్ని పరిశోధనలు అవసరం

ప్రస్తుతం శాస్త్రవేత్తలు జరుపుతున్న అధ్యయనంలో సాధ్యమయ్యే ఒక నివారణ చికిత్స ఏంటంటే.. గాడోలినియం. ఎలుకల్లో దీన్ని పరీక్షించారు.

అయితే, దీనిపై ఇంకా పరిశోధన చేపట్టాల్సి ఉందని, మనుషుల్లో పరీక్ష చేసేందుకు ఇది సురక్షితమైనదేనా, సమర్థవంతమైనదేనా అనేది చూడాల్సి ఉందని, దీనికి మరికొన్నేళ్ల సమయం పడుతుందని చెప్పారు.

ఆస్తమా రోగులకు ఎంతో అవసరమైన సరికొత్త చికిత్స విధానాలను అన్వేషించేందుకు ఈ పరిశోధన సాయపడుతుందని బ్రిటన్‌లోని ఆస్తమా, లంగ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ సమంతా వాకర్ అన్నారు.

‘‘ప్రస్తుతమున్న చికిత్సలను తీసుకుంటున్న చాలా మందికి ఇవి సరిపోవడం లేదని మనకు తెలుసు. సరికొత్త చికిత్సలు కనుగొనేందుకు మరింత పరిశోధన కొనసాగించాల్సి ఉంది. అప్పుడే ఆస్తమా కారణాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలం’’ అని చెప్పారు.

సరికొత్త చికిత్స విధానం కనుగొనేంత వరకు, ఆస్తమా ఉన్న ప్రజలు ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్సను, వైద్యాన్ని కొనసాగించాలని సమంతా వాకర్ సూచించారు.

ఆస్తమా లక్షణాలున్న ప్రజలు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)