‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్: 239 ఎన్నికల్లో పోటీ, ఓటమే ఈయన స్పెషాలిటీ..

పద్మరాజన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్షన్ కింగ్ పద్మరాజన్
    • రచయిత, సుభాష్ చంద్రబోస్
    • హోదా, బీబీసీ తమిళ్

భారత్‌లో ఎన్నికల సీజన్ అంటే చాలామందికి ఒక పండుగలా ఉంటుంది. ఇప్పుడే రాజకీయాల్లో స్టార్ అభ్యర్థుల నుంచి అనామకుల వరకు అందరూ క్షేత్ర స్థాయిలో కనిపిస్తుంటారు.

రాజకీయ అభ్యర్థుల ప్రచారాలు, ప్రసంగాలు, ర్యాలీలు, కరపత్రాలు, వాదోపవాదాలు ఇలా రకరకాల అంశాలను మనం ఎన్నికల సందర్భంలో చూడొచ్చు. ఎవరెలా ప్రచారం చేసినా పోటీదారులందరి ఏకైక లక్ష్యం ఎన్నికల్లో గెలుపొందడం.

కానీ, తమిళనాడు రాష్ట్రం సేలం మెట్టూర్‌కు చెందిన కె. పద్మరాజన్ లక్ష్యం మాత్రం ఓడిపోవడమే. అందుకే, ఆయన 1988 నుంచి ఇప్పటివరకు 239 ఎన్నికల్లో పోటీచేసి, భారత్‌లో అత్యధిక ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.

12 రాష్ట్రాల్లోని వివిధ నియోజకవర్గాల్లో పద్మరాజన్ పోటీ చేశారు. పంచాయతీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీపడ్డ ఆయన ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.

పద్మరాజన్

ఫొటో సోర్స్, PADMARAJAN

ఫొటో క్యాప్షన్, పాఠశాల విద్యలో ఉత్తీర్ణులు కాలేకపోయిన పద్మరాజన్ సైకిల్ దుకాణంలో పనికి చేరారు

మరిన్ని ఎన్నికల్లో ఓడిపోవడమే తన లక్ష్యమని పద్మరాజన్ నవ్వుతూ చెబుతారు. ఇలాంటి విచిత్రమైన కోరిక ఎవరికైనా ఉంటుందా? మీరు నమ్మలేకపోయినా ఇదే నిజం.

‘‘ఎలక్షన్ కింగ్ పద్మరాజన్’’ అని పేరున్న ఆయన ఎన్నికల్లోకి ఎలా వచ్చారు? ఆయన అనుభవాల గురించి మేం అడిగి తెలుసుకున్నాం.

పద్మరాజన్, పాఠశాల విద్యలో ఉత్తీర్ణత సాధించలేదు. అప్పుడే సైకిల్ దుకాణంలో పనికి చేరారు. అదే ఆయనకు ఉపాధిగా మారింది. అయితే, నేడు ఆయన దూరవిద్యా విధానంలో చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. నేటికీ ఆయన ప్రధాన వృత్తి సైకిల్ దుకాణం నిర్వహణే.

ఇప్పటివరకు ఆయన పోటీచేసిన 239 ఎన్నికల్లో ఈ దుకాణం నుంచి వచ్చిన ఆదాయాన్నే ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. ఆదాయంలో కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ, మొత్తంగా ఎన్నికల కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ఇదంతా సరే. కానీ, ఇలా ఎన్నికల్లో పోటీచేయాలనే కోరిక ఆయనకు ఎప్పుడు కలిగింది? ఇదే సైకిల్ దుకాణం వల్ల 1988లో తన జీవితం మలుపు తిరిగిందని పద్మరాజన్ గుర్తు చేసుకున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని మొదట తాను చెప్పినప్పుడు, ‘‘నువ్వు సైకిల్ దుకాణం నడుపుతుంటావు. ఎన్నికల్లో నిలబడగలవా’’ అంటూ స్నేహితులు జోక్ చేయడంతో తాను 239 ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.

పద్మరాజన్

ఫొటో సోర్స్, PADMARAJAN

‘‘ఎన్నికల్లో కచ్చితంగా గెలవను అనే విషయం నాకు తెలుసు. కానీ, ఏదైనా ప్రత్యేక ఘనతను సాధించాలని అనుకున్నా. అత్యధిక ఎన్నికల్లో ఓడిన వ్యక్తిగా నిలవడమే ఆ ఘనత. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా నేను పోటీ చేస్తుంటా’’ అని పద్మరాజన్ వివరించారు.

మీ ఇంట్లో ఎవరూ మిమ్మల్ని మందలించలేదా అని అడిగితే, అందరి ఇళ్లలానే మొదట్లో అభ్యంతరం తెలిపిన కుటుంబసభ్యులు తర్వాత తనను అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు.

పద్మరాజన్ కుమారుడు శ్రీజేశ్, ఎంబీఏ చదివారు.

తన తండ్రి గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘నేను చదువుకునే రోజుల్లో మా నాన్నపై నాకు చాలా కోపం ఉండేది. కానీ, పెద్దయ్యాక మా నాన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. సాధారణ పౌరులు కూడా ఎన్నికల్లో పోటీచేయొచ్చని ఆయన అందరికీ చాటి చెప్పాలనుకున్నారు. ఇది అర్థమయ్యాక నేను కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నా’’ అని శ్రీజేశ్ వివరించారు.

ఎన్నికల్లో నిలబడటం వల్ల డబ్బు పోగొట్టుకోవడమే కాదు, కొన్నిసార్లు బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎలక్షన్ కింగ్ పద్మరాజన్ చెప్పారు.

పద్మరాజన్

ఫొటో సోర్స్, Getty Images

1991లో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీవీ నరసింహారావుకు పోటీగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అప్పుడు దుండగులు తనను కిడ్నాప్ చేసినట్లు ఆయన చెప్పారు.

ఎలాగోలా వారినుంచి తప్పించుకున్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం ఆయన మానుకోలేదు. ఆ ఘటన తర్వాత ఆయన 230కి పైగా ఎన్నికల్లో పోటీచేశారు. తమిళనాడుతో పాటు దేశంలోని అనేక మంది ప్రముఖ నేతలపై పోటీకి దిగారు.

భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ (వడోదర, 2014), మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (అస్సాం 2007, 2013), వాజ్‌పేయి (లక్నో, 2004), పీవీ నరసింహారావులపై ఆయన పోటీ చేశారు.

అదే విధంగా ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలామ్, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్‌లపై పద్మరాజన్ రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ వేశారు.

పద్మరాజన్

ఫొటో సోర్స్, Getty Images

వీరే కాకుండా తమిళనాడులో కరుణానిధి, జయలలిత, ఎంకే స్టాలిన్, పళనిస్వామి, సిద్ధరామయ్య, బసవరాజ్ టామీ, కుమారస్వామి, కర్ణాటకలో యడ్యూరప్ప, కేరళలో పినరయి విజయన్, తెలంగాణలో కేసీఆర్‌లకు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

‘‘పలు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అక్కడికి వెళ్లి ప్రచారం చేయనని, ఎవరినీ ఓట్లు అడగనని ఆయన చెబుతున్నారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసేందుకే ఆయా నియోజకవర్గాలకు వెళ్తానని ఆయన చెప్పారు. 2019లో వాయనాడ్‌లో రాహుల్ గాంధీపై పోటీ చేసినప్పుడు తనకు 1887 ఓట్లు దక్కాయని తెలిపారు.

అదే సమయంలో, తమ సొంత నియోజకవర్గం మెట్టూరులోని వార్డు ఎన్నికల్లో పోటీ చేయగా ఒక్క ఓటు కూడా రాలేదు. ఇప్పటివరకు ఆయనకు లభించిన గరిష్ట ఓట్ల సంఖ్య 6,273.

2011 మెట్టూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు గరిష్ట ఓట్లు వచ్చాయి.

పద్మరాజన్

ఫొటో సోర్స్, PADMARAJAN

ప్రజల నుంచి ఓట్లు పొందడానికి ఏ విధానాన్ని అనుసరించారని ఆయనను అడిగితే, ప్రజలకు ఏమీ అర్థం కాక నోటాకు బదులుగా ఈ ఓట్లు తనకు వేసి ఉంటారని చెప్పారు.

ఎన్నికల్లో ఓడిపోవడమే తన విధానమని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల్లో చాలా మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. అయినా సరే ఎన్నికల్లో ఒక్కరే గెలవగలరు. అందుకే నేను నా మైండ్ సెట్‌ మార్చుకున్నా. ఓడిపోవడమే శాశ్వత విజయం’’ అని ఆయన వివరించారు.

ఇన్నేళ్లుగా, ఎన్నో ఎన్నికల్లో పోటీచేస్తూ ఆయన కొన్ని ఘనతలు సాధించారు.

అత్యధిక ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిగా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మరికొన్ని రికార్డుల జాబితాలో కూడా ఆయన పేరు చేరింది.

అత్యధిక ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఈ ఎలక్షన్ కింగ్ ఓడిపోవడం ఖాయమే.

వీడియో క్యాప్షన్, పద్మరాజన్: 239 ఎన్నికల్లో పోటీ చేసిన ఎలక్షన్ కింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)