గాజాలో ఇజ్రాయెల్ చేసిన తప్పులివే... బీబీసీ పరిశోధనలో తేలిన వాస్తవాలు

గాజాలో తరలింపుపై ఇజ్రాయెల్ హెచ్చరిక కర పత్రాలు

ఫొటో సోర్స్, Getty Images/Anadolu

ఫొటో క్యాప్షన్, గాజాను వదిలి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ సైన్యం పంచిన పత్రాలను ఓ వీధిలో నిల్చుని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు, చిన్నారులు.
    • రచయిత, స్టెఫానీ హెగార్తి, అహ్మద్ నౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

గాజా మీద దాడి చేయడానికి ముందు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ సైన్యం స్థానిక ప్రజల్ని హెచ్చరించడంలో అనేక తప్పిదాలు చేసినట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

ఇజ్రాయెల్ సైన్యం చేసిన హెచ్చరికల్లో పరస్పర విరుద్దమైన సమాచారం ఉంది. అది కొన్ని సందర్భాల్లో జిల్లాల పేర్లను తప్పుగా ప్రకటించింది.

ఇలాంటి తప్పిదాలకు పాల్పడటం వల్ల ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు.

అయితే యుద్ధానికి ముందు హెచ్చరికల విషయంలో పరస్పర విరుద్ధమైన, అయోమయాన్ని సృష్టించే ప్రకటనలను జారీ చేశారనే ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం తిరస్కరించింది.

“స్థానిక ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాం” అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

దాడి చేస్తున్న దేశాలు, పౌర ఆవాసాల సమీపంలో దాడులు జరపడానికి ముందు దాడుల గురించి వారికి తెలిసేలా స్పష్టమైన హెచ్చరికలు చేయాలని, సమాచారం అందించాలని అంతర్జాతీయ మానవీయ చట్టాలు చెబుతున్నాయి.

అయితే, గాజా మీద పోరాటంలో తాము అనుసరిస్తున్న ‘వార్నింగ్ సిస్టమ్’ సామాన్య పౌరులు దాడులు జరుగుతున్న ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోవడానికి అనుగుణంగా రూపొందించామని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఈ విధానంలో గాజాను ఇజ్రాయెల్ వందల కొద్దీ బ్లాకులుగా విభజించింది. అయితే గాజాలో ప్రజలు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విధానాన్ని అనుసరించలేదు.

గాజాను వివిధ బ్లాకులుగా విభజిస్తూ ఇజ్రాయెల్ రూపొందించిన మ్యాప్‌లో తాము ఏ బ్లాకులో ఉన్నాం, దేన్ని వదిలేస్తున్నాం, ఏ బ్లాకుపైన ఎప్పుడు దాడి చేస్తాం అనే అంశాల గురించిన సమాచారం ఆన్‌లైన్‌లో ఉంచింది.

ఈ మ్యాప్‌ను సోషల్ మీడియా “ఎక్స్”లో ఒక లింక్ ద్వారా పోస్టు చేసింది. ఈ లింక్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ మ్యాప్ కనిపిస్తుంది.

అయితే బీబీసీ కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు తాము ఆన్‌లైన్ సదుపాయాన్ని పొందేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని, ఆ మ్యాప్‌లో ఉన్న తప్పుల వల్ల దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామని చెప్పారు.

ఇజ్రాయెల్ హెచ్ఛరిక పోస్టులు
ఫొటో క్యాప్షన్, గాజాలో తరలింపు, దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం సామాజిక మాధ్యమాల్లో అరబిక్ భాషలో కొన్ని పోస్టులు పెట్టింది.

బీబీసీ విశ్లేషణలో తేలిందిదే...

ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అరబిక్ భాషలో పోస్ట్ చేసిన వందల కొద్దీ సందేశాలను బీబీసీ విశ్లేషించింది. ఇందులో ఒకే సందేశాన్ని అనేక సార్లు పోస్టు చేశారు. కొన్ని సార్లు అదే సందేశంలో చిన్న చిన్న మార్పులు చేశారు. ఈ మెసేజ్‌లను కూడా ప్రతీ రోజూ వేర్వేరు ఛానల్స్‌లో పోస్ట్ చేశారు.

యుద్ధానికి ముందు హెచ్చరికల గురించి ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ప్రచార పత్రాల గురించి కూడా మేము వెతికాం. గాజాలో అలాంటి పత్రాలు కోటి 60 లక్షలను పంచి పెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.

డిసెంబర్ 1 నుంచి ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన హెచ్చరికలపై బీబీసీ దృష్టి సారించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో గాజా ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేందుకు డిసెంబర్ నుంచి ఇజ్రాయెల్ బ్లాక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఇజ్రాయెల్ సైన్యం చేసిన పోస్టింగులు, ప్రచార పత్రాలను బీబీసీ సేకరించింది. డిసెంబర్‌ 1 తర్వాత ఐడీఎఫ్ 26 అలాంటి వేర్వేరు హెచ్చరికలు చేసింది. ఇందులో ఎక్కువ భాగం బ్లాక్ సిస్టమ్ ఆధారంగానే చేసింది.

ఆన్‌లైన్‌లో జారీ చేసిన హెచ్చరికలతో పాటు పాంప్లేట్ల ద్వారా దాడుల గురించి తాము విస్తృతంగా ప్రచారం చేశామని, ముందుగానే రికార్డు చేసిన వాయిస్ సందేశాలను ప్రజల ఫోన్లకు పంపించడంతో పాటు వ్యక్తిగతంగానూ ఫోన్లు చేసి చెప్పినట్లు ఇజ్రాయెల్ సైన్యం బీబీసీతో చెప్పింది.

అలాంటి వాటిలో ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పే నిర్థిష్టమైన 26 హెచ్చరికలను బీబీసీ గుర్తించింది. అయితే అందులోని 17 హెచ్చరికల్లో లోపాలున్నాయి.

ఆ లోపాలు ఏంటంటే:

12 హెచ్చరికలలో దాడులు జరగనున్న బ్లాకులకు సంబంధించి రాత పూర్వకంగా పేర్కొన్నారు కానీ, మ్యాపులో ఆ బ్లాకులను హైలైట్ చేస్తూ ప్రత్యేకంగా గుర్తించలేదు.

9 హెచ్చరికలలో మ్యాపులోని ప్రాంతాలను హైలైట్ చేసినా దానికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని పొందు పరచలేదు. పది హెచ్చరికలలో ఖాళీ చేయాల్సిన ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించినా మ్యాపులో అవి రెండు బ్లాకులుగా చూపించారు. మ్యాపులో చూపించిన బ్లాకుల సరిహద్దులు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అనేది స్పష్టంగా ప్రకటించలేదు.

ఏడు హెచ్చరికలలో మ్యాపులో కొన్ని ప్రాంతాలపై బాణం గుర్తులు వేసి అవి సురక్షితమైనవిగా ప్రకటించారు. అయితే విచిత్రం ఏంటంటే అవే ప్రాంతాలను ఖాళీ చేయాల్సినవిగా అందులో పేర్కొన్నారు.

దీనికి తోడు ఒక వార్నింగ్‌లో రెండు పక్కపక్కన ఉన్న ప్రాంతాలను ఒకే జిల్లాగా పేర్కొన్నారు. అయితే మరో దాంట్లో వాటిని వేర్వేరుగా చూపించారు. మరో దానిలో రెండు ప్రాంతాలను కలిపి ఒకే బ్లాక్ కింద నంబర్లు వేశారు. మరో వార్నింగ్‌లో మ్యాపులో గుర్తించిన కొన్ని బ్లాకులు గాజాకు మరో వైపు ఉన్నాయి.

తప్పులపై ఇజ్రాయెల్ ఏమంటోంది?

ఈ తప్పులన్నింటినీ బీబీసీ ఇజ్రాయెల్ సైన్యం ముందుంచింది. అయితే మ్యాపులలోని అంశాలపై ఐడీఎఫ్ స్పందించలేదు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సందేశాలలోని సమాచారం స్పష్టంగా ఉందని చెప్పింది.

హెచ్చరికల్లో భాగంగా పంపిన సందేశాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బాణాల ద్వారా సూచించడాన్ని గురించి ప్రస్తావించినప్పుడు “బాణం గుర్తుని ఆ వైపు వెళ్లాలని సూచించడం కోసమే ఉపయోగిస్తాం కదా” అని ఒక సైనికాధికారి చెప్పారు.

కీలకమైన సమచారాన్ని తాము స్పష్టంగానే అందించామని పునరుద్ఘాటించింది ఇజ్రాయెల్ సైన్యం.

యుద్ధ క్షేత్రాలలో “ప్రభావవంతంగా ఉండే ముందస్తు హెచ్చరికలు” అందించాలనే అంతర్జాతీయ చట్టాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించినట్లు ఈ తప్పులు, తప్పుడు సమాచారం సూచిస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ ఎథిక్స్, లా అండ్ ఆర్మ్‌డ్ కాన్ఫ్లిక్ట్ కో- డైరెక్టర్ జనినా డిల్ తెలిపారు.

ఈ హెచ్చరికలు అంతర్జాతీయ మానవీయ చట్టంలో ప్రమాణాలకు అనుగుణంగా లేవని, మెజార్టీ వార్నింగ్స్‌లో తప్పులు ఉంటే లేదా అస్పష్టంగా ఉంటే, అక్కడ ఉన్న ప్రజలు వాటిని ఆర్థం చేసుకోలేక పోతే అది చట్ట విరుద్దమనని జనినా చెప్పారు.

ఇది పౌరులకు తమను తాము రక్షించుకునే అవకాశాలను బలహీనపరుస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌లో అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ కుబో మకాక్ జోడించారు.

హెచ్చరికల్లో గందరగోళం

గాజా సిటీకి చెందిన టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ సలేహ్, తన పిల్లలు, అత్తమామలతో సెంట్రల్ గాజాలోని నుసీరాట్‌లో డిసెంబరులో ఆశ్రయం పొందారు.

అక్కడ కరెంటు, ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ అంతరాయం ఎక్కువగా ఉండేదని ఆయన చెప్పారు. సమీపంలోని పాఠశాలలపై కూడా దాడులు జరగడంతో అక్కడ ప్రజలు చనిపోవడమో, పారిపోవడమో జరుగుతుండటం చూశానని సలేహ్ తెలిపారు. తనకు ఐడీఎఫ్ తరలింపు వివరాలేవీ అందలేదని ఆయన తెలిపారు.

చివరికి సలేహ్ ఈజిప్ట్, ఇజ్రాయెల్‌ డేటా నెట్‌వర్క్‌ యాక్సెస్ గల సిమ్ కార్డు ఉన్న ఒక వ్యక్తిని కలిశారు, ఆ వ్యక్తి ద్వారానే ఇజ్రాయెల్ ప్రభుత్వ ఫేస్‌బుక్ పేజీలో తరలింపు హెచ్చరికను చూశారు.

"అనేక రెసిడెన్షియల్ బ్లాక్‌లకు తరలింపు ఆదేశాలున్నాయి. కానీ, మేం ఏ బ్లాక్‌లో ఉన్నామో మాకే తెలియదు. ఇది పెద్ద గందరగోళంగా ఉంది" అని సలేహ్ చెప్పారు.

సలేహ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలిగారు, అనంతరం తన భార్య అమానీకి మెసేజ్ పంపారు. ఆమె యుద్ధానికి ముందు నుంచి యూకేలోనే ఉన్నారు.

భర్త పరిస్థితిని తెలుసుకున్న ఆమె వెంటనే ఆన్‌లైన్‌లో ఐడీఎఫ్ మాస్టర్ బ్లాక్ మ్యాప్‌ను పరిశీలించారు. తన భర్త ఎక్కడున్నారో ఆమె గుర్తించగలిగారు.

కానీ, ఇజ్రాయెల్ ఫేస్‌బుక్‌లో 'తరలింపు హెచ్చరిక'ను పరిశీలిస్తే, సలేహ్ బస చేసిన ఇంటి నంబర్ బ్లాక్‌ను రెండుగా విభజిస్తూ చూపారు. దీంతో వారిలో గందరగోళం నెలకొంది.

అయినా కూడా పిల్లలతో వెళ్లిపోవాలని సలేహ్ నిర్ణయించుకున్నారు. అయితే, కుటుంబంలోని కొందరు అక్కడే ఉండిపోయారు.

ఫేస్‌బుక్ తరలింపు హెచ్చరిక అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని సలేహ్ చెప్పినపుడు వాటిని బీబీసీ విశ్లేషించింది, మేం ఆ గందరగోళాన్ని కనుగొన్నాం.

ఐడీఎఫ్ ఆన్‌లైన్ మాస్టర్ మ్యాప్‌లో కనిపించే 2220, 2221, 2222, 2223, 2224, 2225 బ్లాక్‌లను వదిలి వెళ్లాలని ప్రజలను కోరింది. కానీ మ్యాప్‌లో ఈ ఆరు బ్లాక్‌లు అన్నీ కలిపి ఒకే బ్లాక్ (2220)గా తప్పుగా లేబుల్ చేసి చూపించారు.

గాజా మ్యాప్

ఫొటో సోర్స్, IDF

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 22న ఐడీఎఫ్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు.

కోర్టులో సమర్పించిన వివరాలూ అవే..

ఇలాంటి అసమానతలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ తన బ్లాక్ వార్నింగ్ సిస్టమ్‌ను జనవరిలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో సమర్పించింది.

పౌరులను రక్షించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని కోర్టులో ఇజ్రాయెల్ న్యాయవాదులు వాదించారు.

మొత్తం ప్రాంతాలను ఖాళీ చేయడానికి బదులుగా నిర్దిష్ట ప్రాంతాలను తాత్కాలికంగా ఖాళీ చేయడానికి ఒక వివరణాత్మక మ్యాప్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు.

సాక్ష్యంగా వారు ఒక సోషల్ మీడియా హెచ్చరిక పోస్టును సైతం కోర్టులో సమర్పించారు, అయితే అందులో బీబీసీ రెండు తప్పులను కనుగొంది.

డిసెంబర్ 13న పెట్టిన ఈ హెచ్చరిక పోస్టులో 55, 99 బ్లాకుల నంబర్లు ఇచ్చారు, కానీ ఇచ్చిన మ్యాప్‌లో వాటి సంగతే లేదు.

టెక్స్ట్‌లో బ్లాక్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొన్నప్పుడు, హెచ్చరిక కూడా ఉంటుందని బీబీసీకి ఐడీఎఫ్ తెలిపింది.

ఖాళీ చేసిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న షెల్టర్ల లొకేషన్లపై కూడా ఐడీఎఫ్ దాని అరబిక్ ట్విటర్ (ఎక్స్) అకౌంట్ ద్వారా సమాచారాన్ని అందజేస్తోందని ఇజ్రాయెల్ న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు.

కానీ బీబీసీ విశ్లేషించిన దాని పోస్టులు, కరపత్రాలలో పేర్లు లేదా షెల్టర్‌ల గురించి ఖచ్చితమైన స్థానాల వివరాలు కనిపించలేదు.

బ్లాకుల సిస్టం మొత్తం ఐడీఎఫ్ గందరగోళంగా ఉపయోగించిందని బీబీసీ విశ్లేషణలో తేలింది.

26 హెచ్చరికలలో పేర్కొన్న తొమ్మిది బ్లాక్ నంబర్లలో పక్కనున్న బ్లాకులను చేర్చారు.

మరో తొమ్మిది బ్లాక్ నంబర్లను అస్సలు పేర్కొనలేదు. దీంతో పరిసర ప్రాంతాల ఖచ్చితమైన బ్లాక్‌లను గుర్తించడానికి బీబీసీ మార్గాన్ని కనుగొనలేకపోయింది.

గాజా హెచ్చరిక మ్యాపులు

ఫొటో సోర్స్, IDF

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 13న పెట్టిన ఈ హెచ్చరిక పోస్టులో 55, 99 బ్లాకుల నంబర్లు ఇచ్చారు, కానీ ఇచ్చిన మ్యాప్‌లో వాటిని మార్కు చేయలేదు.

'ఎక్కడికి వెళ్లినా దాడులే'

32 మంది సభ్యులు గల అబ్దు కుటుంబం కూడా యుద్ధం ప్రారంభంలో గాజా సిటీ నుంచి సెంట్రల్ గాజాకు తరలివెళ్లింది.

ఆ తర్వాత డిసెంబరులో వారు ఒక విమానం నుంచి జారవిడిచిన హెచ్చరిక కరపత్రాన్ని అందుకున్నారు.

ఆ కరపత్రం ఏంటనే దానిపై వారి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో రెండు రోజులు వాదించుకున్నట్లు బీబీసీ తెలుసుకుంది.

అందులో ఖాళీ చేయవలసిన ప్రాంతాల జాబితా ఉంది, కానీ కుటుంబం ఈ ప్రాంతాలను చాలా వరకు గుర్తించలేకపోయింది.

"అల్-బురీజ్ క్యాంప్, వాడి గాజాకు దక్షిణంగా ఉన్న బద్ర్, నార్త్ కోస్ట్, అల్-నుజా, అల్-జహ్రా, అల్-బురాక్, అల్-రౌదా, అల్-సఫా పరిసర ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలి" అంటూ ఆ హెచ్చరిక ప్రజలను కోరింది.

మేము అల్-జహ్రా, బద్ర్‌ సమీపంలో ఉన్నాం, కానీ అవి వాడి గాజా నదీతీరానికి ఉత్తరాన ఉన్నాయి.

వాడీ గాజాకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలలో మేము అల్-రౌదా లేదా అల్-నుజా పరిసర ప్రాంతాలను కనుగొనలేకపోయాం. ఏం చేయాలో తెలియక అబ్దు కుటుంబం తంటాలు పడింది. వారు అక్కడే ఉండి భీకర యుద్ధంలో చిక్కుకుపోవాలా? లేదా దొరికిన ఒకే ఒక ఆశ్రయాన్ని విడిచిపెట్టాలా?.

కుటుంబంలోని కొందరు డెయిర్ అల్-బలాహ్‌లోని ఆశ్రయాలకు వెళ్లాలనే హెచ్చరికను అనుసరించారు. అయితే అక్కడికి చేరాక, అది సురక్షిత ప్రాంతం కాదని భావించి, తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ చనిపోతే కలిసి చనిపోతామని వారు బీబీసీతో చెప్పారు.

గాజాలో జరిగిన విధ్వంస్వాన్ని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన జామోన్ వాన్ డెన్ హోక్, సిటీ యూనివర్శిటీ న్యూయార్క్ గ్రాడ్యుయేట్ సెంటర్‌కు చెందిన కోరీ షెర్‌లు శాటిలైట్ డేటా ఆధారంగా విశ్లేషించారు. అబ్దు కుటుంబం ఇంతకుముందు ఉన్న ప్రాంతం కంటే డెయిర్ అల్-బలాహ్ ప్రాంతం తీవ్రమైన దాడికి గురైందని తెలిపారు.

హెచ్చరికలను గాజాలోని చాలామంది పౌరులు అనుసరించారని, డేటా కూడా క్రాస్ చెక్ చేసుకున్నామని ఐడీఎఫ్ తెలిపింది.

ఈ హెచ్చరికలు గాజాలో లెక్కలేనన్ని ప్రాణాలను రక్షించాయని పేర్కొంది.

వీడియో క్యాప్షన్, గాజాలోకి సాయం పంపించేందుకు ఎరేజ్ క్రాసింగ్ తెరిచిన ఇజ్రాయెల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)