సిరియాలో ఇరాన్ జనరల్స్‌ను హత్య చేసిందంటూ ఇజ్రాయెల్‌పై ఆరోపణలు.. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది?

సిరియా, డమాస్కస్, ఇరాన్, ఇజ్రాయెల్
ఫొటో క్యాప్షన్, కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
    • రచయిత, జెరెమీ బోవెన్, డేవిడ్ గ్రిట్టన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు అధికారులు మరణించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది.

మృతుల్లో సైనిక ఉన్నతాధికారులైన క్వుడ్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ రెజా జహేది, డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ హది హజి రహిమి ఉన్నారు.

ఈ దాడిని ఇరాన్, సిరియా ప్రభుత్వాలు ఖండించాయి. డమాస్కస్‌లో ఇరానియన్ కాన్సులేట్ పక్కనే ఇరాన్ రాయబార కార్యాలయ భవనం ఉంది.

దాడులపై స్పందిస్తూ విదేశీ మీడియా కథనాలపై తాము మాట్లాడబోమని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

సిరియాలోని లక్ష్యాలపై ఇటీవల కొన్నేళ్లుగా తాము వందల కొద్దీ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంగీకరించింది. ఆ దాడులను కూడా ఇరాన్, దాని సాయుధ మిత్ర బృందాల మీదనే చేసినట్లు చెబుతోంది. ఈ బృందాలకు రెవల్యూషనరీ గార్డ్స్ శిక్షణ, నిధులు ఇస్తోందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది.

2023 అక్టోబర్‌లో గాజా మీద ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత, ఉత్తర ఇజ్రాయెల్ మీద సరిహద్దుల ఆవల నుంచి లెబనాన్, సిరియాలలో ఇరాన్ మద్దతున్న గ్రూపులు, హెజ్బొల్లా దాడులు చేయడం మొదలైంది. దీనికి ప్రతిగా సిరియాలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను పెంచింది.

అయితే సోమవారం జరిగిన దాడి తీవ్ర పరిస్థితులకు దారి తీయవచ్చు.

ఇరాన్ దాని మిత్ర పక్షాల సహనాన్ని ఇజ్రాయెల్ పరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, శత్రువుల విషయంలో తాము చాలా సీరియస్‌గా ఉన్నామనే సంకేతాలు పంపిస్తోంది.

ఇరాన్, హెజ్బొల్లా కొంత మంది ఊహించినంత తీవ్రంగా దాడి చెయ్యడం లేదనే వాస్తవాన్ని ఇజ్రాయెల్ గుర్తించింది. అందుకే ఇరాన్, హెజ్బొల్లాను తిప్పి కొట్టే అంశాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ పరిశీలిస్తూ ఉండవచ్చు.

సోమవారం జరిగిన దాడికి ప్రతిస్పందన ఉండవచ్చు. అయితే అది అందరూ ఊహించినట్లుగా క్షిపణులతో దాడులు చెయ్యడం కాకుండా, ఒక రకమైన సైబర్ దాడులు జరగవచ్చు.

డమాస్కస్‌లోని పశ్చిమ మెజ్జే జిల్లాలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానం దాడి చేసిందని సిరియా రక్షణ శాఖ తెలిపింది. ఆక్రమిత గోలన్ హైట్స్ వైపు నుంచి ఈ దాడి జరిగిందని ప్రకటించింది.

ఇజ్రాయెల్ క్షిపణి దాడులను సిరియా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందని, అయితే కొన్ని క్షిపణులు భవనంపై పడటంతో కాన్సులేట్ భవనం మొత్తం ధ్వంసం అయిందని, భవనంలో ఉన్న వారంతా చనిపోవడం లేదా గాయపడినట్లు సిరియా రక్షణ శాఖ వెల్లడించింది.

సిరియా, డమాస్కస్, ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా
ఫొటో క్యాప్షన్, శిథిలాల దిబ్బగా మారిన ఇరాన్ కాన్సులేట్

ఎఫ్- 35 ఫైటర్ జెట్‌తో దాడి చేశారన్న ఇరాన్

మృతదేహాలను వెలికి తీయడం, భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని సిరియా రక్షణ శాఖ తెలిపింది. అయితే దాడిలో గాయపడినవారి వివరాలను ఇంతవరకు ప్రకటించలేదు.

కాన్సులేట్ కూలిపోయిన ప్రాంతంలో భవన శిథిలాల్లోంచి పొగ, దుమ్ము ఎగసిపడటం కొన్ని వీడియోలు, ఫోటోల్లో కనిపిస్తోంది. దీని పక్కనే ఉన్న ఇరాన్ ఎంబసీకి పెద్దగా నష్టం జరిగినట్లు కనిపించలేదు.

“ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్ -35 ఫైటర్ జెట్ విమానం, నా అధికారిక నివాసం, ఎంబసీలోని కాన్సులర్ సెక్షన్‌, ఇరాన్ సైనికుల్ని లక్ష్యంగా చేసుకుంది” అని సిరియాలో ఇరాన్ రాయబారి హొస్సేన్ అక్బారి ఇరాన్ ప్రభుత్వ చానల్‌తో చెప్పారు. కొంత మంది రాయబారులతోపాటు ఐదు నుంచి ఏడుగురు చనిపోయారని తెలిపారు.

ఆ తర్వాత తమ అధికారులు ఏడుగురు మరణించినట్లు రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఇద్దరి పేర్లు వెల్లడించింది. వీళ్లిద్దరూ కమాండర్లే కాకుండా “సైన్యానికి సీనియర్ సలహాదారులు” అని తెలిపింది.

రెవల్యూషనరీ గార్డ్స్‌లో ఓవర్సీస్ ఆపరేషన్స్‌ విభాగం కుడ్స్ ఫోర్స్‌లో జహేది చాలా సీనియర్. ఆయన 2008-2016 మధ్య లెబనాన్, సిరియాలలో కమాండర్‌గా విధులు నిర్వహించారని ఇరాన్ మీడియా తెలిపింది.

హజి రహిమి ఆయనకు డిప్యూటీగా ఉన్నారు.

ఇజ్రాయెల్ చాలా కాలంగా నిర్వహిస్తున్న లక్షిత దాడులలో చనిపోయిన వారిలో జహేది ఉన్నతస్థాయి ఇరానియన్ అని భావిస్తున్నారు.

ఈ దాడిలో ఎనిమిది మంది చనిపోయారని అందులో కుడ్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఉన్నతాధికారులు, ఇద్దరు ఇరాన్ సలహాదారులు, ఐదుగురు రెవల్యూషనరీ గార్డులు ఉన్నారని సిరియాలో మానవ హక్కుల అమలును పరిశీలిస్తున్న బ్రిటన్ సంస్థ తెలిపింది.

సిరియా, ఇరాన్, హెజ్బొల్లా, ఇజ్రాయెల్
ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి మెక్టాడ్ (బ్లూ కోటు ధరించిన వ్యక్తి)

డమాస్కస్ ఘటనను “అమాయకుల్ని బలి తీసుకున్న నీచమైన టెర్రరిస్టు దాడి” అంటూ సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్ మెక్డాడ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

మెక్టాడ్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సైన్ అమిర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఇది అంతర్జాతీయ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఈ చర్యకు పాల్పడిన యూదుల ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.

ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి.

డమాస్కస్ దాడి గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం ఉందని వైట్‌హౌస్ ప్రతినిధి చెప్పారు.

దక్షిణ ఇజ్రాయెల్‌లో ఇలియట్ నగరంలోని నౌకాదళ స్థావరం మీద డ్రోన్ దాడి జరిగిందని, ఆ డ్రోన్ ఇరాన్‌లోనే తయారైందని, ఇరాన్ బలగాలే దీన్ని ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి సోమవారం చెప్పారు.

గత శుక్రవారం సిరియా రాజధాని నగరం డమాస్కస్, ఉత్తర సిరియాలోని అలెప్పో మీద ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగానే డ్రోన్ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ఈ దాడుల్లో 53 మంది చనిపోయినట్లు బ్రిటన్ కేంద్రంగా నడుస్తున్న మానవ హక్కుల సంస్థ తెలిపింది.

ఇందులో 38 మంది సిరియా సైనికులు సహా ఏడుగురు హెజ్బొల్లా సభ్యులు ఉన్నారు.

జనవరిలో మెజ్జేహ్ మీద ఇజ్రాయెల్ చేసిన మరో దాడిలో రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు, మరి కొంత మంది సిరియా సైనికులు మరణించారు.

సిరియా మీద గతంలోనూ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ అంగీకరిస్తోంది. సిరియా ఇరాన్ సైనిక ఆవాసంగా మారిందని ఐడీఎఫ్ చెబుతోంది.

సిరియా అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు సలహాలు, సూచనలు అందించేదుకు రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కొంత మంది సీనియర్లను సిరియా పంపించినట్లు ఇరాన్ గతంలో చెప్పింది. అయితే సిరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడం లేదా సైనిక కేంద్రాల ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టలేదని అంటోంది.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన తెహ్రాన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)