గాజా - ఈద్: ‘మా నుంచి పండుగ సంతోషాన్ని లాగేసుకున్నారు’.. అనాథలైన చిన్నారుల ఆవేదన

‘‘రంజాన్ ముగింపును సూచించే ఈద్ ఉల్ ఫితర్ పండుగను యుద్ధం కారణంగా మిగతా పండుగల్లా జరుపుకోలేకపోతున్నాం. మా కుటుంబాన్నంతా కోల్పోయాం’’ అని రఫాలోని 11 ఏళ్ళ లయన్ చెప్పింది.
ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకొనేందుకు ముస్లింలందరూ సన్నాహాలు చేసుకుంటుంటే గాజాలోని చిన్నారులు మాత్రం, తమ నుంచి పండుగ సంతోషాన్ని లాగేసుకున్నారంటూ బాధపడుతున్నారు.
గాజా స్ట్రిప్‌లో నిరాశ్రయులైన జనాభాలో అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఒక శాతం మంది ఉన్నారు. తల్లినో, తండ్రినో లేదంటే ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు తలదాచుకోని నిరాశ్రయుల శిబిరాలు లేవని యూనిసెఫ్ తెలిపింది.
లయన్, ఆమె కంటే 18 నెలల చిన్నదైన సివార్ మాత్రమే వారి కుటుంబంలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ పిల్లల కుటుంబం నిరుడు అక్టోబర్‌లో బాంబు దాడుల నుంచి తప్పించుకునేందుకు గాజా నగరంలోని అల్ అహిల్ ఆస్పత్రిలో తలదాచుకుకుంటే, అక్కడా దాడి జరగడంతో లయన్, సివార్ మాత్రమే బతికి బయటపడగా, మిగతా అందరూ చనిపోయారు.
ఆ రోజు రాత్రి జరిగిన దాడిలో లయన్ తన తల్లిదండ్రులతోపాటు ఐదుగురు సోదరులు సహా మొత్తం 35 మంది కుటుంబసభ్యులను కోల్పోయింది.
‘‘మేం ఆ ఆస్ప్రతికి వచ్చి కేవలం అరగంట అయి ఉంటుంది. కానీ అంతలోనే రెండు క్షిపణులు మమ్మల్ని తాకాయి. నా కుటుంబ సభ్యులందరూ వాటి ధాటికి తునాతునకలైపోయారు’’ అని లయన్ తెలిపింది.
గాజాలో రద్దీగా ఉన్న ఈ ఆస్పత్రిపై దాడుల కారణంగా వందల మంది చనిపోయారు.
ఇందుకు కారణం మీరంటే మీరని పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపు, ఇజ్రాయెల్ పరస్పరం నిందించుకున్నాయి.

‘మా కోసం ఎవరూ రారు’
లయన్, ఆమె సోదరి వారి కజిన్ అలీతో కలిసి దక్షిణ గాజాలోని రఫాలో ఉన్న ఓ శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు.
యుద్ధం వీరి నుంచి అన్నీ లాగేసుకోకముందు లయన్, ఈద్ ఉల్ ఫితర్ పండుగ రోజు తల్లిదండ్రుడలతో కలిసి కొత్తబట్టలు కొనుక్కునేది. స్థానికంగా ‘మామల్’ అని పిలిచే ఈద్ బిస్కెట్లను తయారుచేసేవారు, చుట్టాలతో కలిసి పండుగను ఘనంగా జరుపుకునేవారు.
కానీ ఈ ఏడాది కుటుంబాలు కలవడమనేది లేదు. ‘‘ఈద్ రోజున మమ్నల్ని చూడటానికి ఎవరూ రారు’’ అని లయన్ చెప్పింది.
యుద్ధం కారణంగా వందల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
లయన్, ఆమె సోదరిని చూసుకుంటున్న 24 ఏళ్ళ అలీ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయారు.
కానీ ఇప్పుడాయన పిల్లలకు తన స్తోమత మేరకు బట్టలు, బొమ్మలు కొనాలని నిర్ణయించుకున్నారు.
లయన్, ఇతర కజిన్స్ మొత్తం 43 మంది ఉండేవారు.
వీరందరూ గాజా నగరం పొరుగు ప్రాంతమైన జైటన్‌లో ఒకే భవనంలో నివసిస్తుండేవారు.
కానీ ఇప్పుడు యుద్ధంలో బతికి బయటపడ్డవారు దక్షిణ గాజాలోని ఓ గుడారంలో తలదాచుకుంటున్నారు.
లయన్ లానే ఆమె కజిన్ 14 ఏళ్ల మహ్మౌద్ కూడా అనాథే.
అతని తల్లిదండ్రులతోపాటు, కజిన్స్‌లో చాలా మంది అల్ అహిల్ ఆస్ప్రత్రి పై జరిగిన దాడిలో చనిపోయారు.
తన కుటుంబం కోసం మంచినీటిని తేవడానికి బయటకు వెళ్లిన సమయంలో ఆస్పత్రిపై దాడి జరగడంతో అతను తప్పించుకోగలిగాడు.
‘‘నేను తిరిగి వచ్చేసరికి అందరూ చనిపోయి కనిపించేసరికి, ఒక్కసారిగా షాక్ అయ్యాను’’ అని చెప్పారు.
యుద్దానికి ముందు బాడీ బిల్డింగ్ చాంపియన్ అవ్వాలని మహ్మౌద్ కలగంటూ ఉండేవాడు.
ఈజిప్ట్‌లో జరిగే అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండేవాడు.
కానీ ఇప్పుడు తిరిగి ఉత్తర గాజాలోని ఇంటికి తిరిగి వెళ్లాలి, చనిపోయిన తన తల్లిదండ్రుల స్మృత్యర్థం ఏదైనా చేయాలన్నదే అతని తపనగా మారింది.
‘‘ఈ పండుగ వేళ మాలో కించిత్తు సంతోషం కూడా లేదు. అప్పట్లో మా వీధులన్నీ దీపాలతో అలంకరించేవారం. కానీ ఇప్పుడీ గుడారంలో ఒక తాడును మాత్రమే వేలాడదీయగలం’’ అని మహ్మౌద్ చెప్పారు.

ఈద్ బిస్కట్లే ముఖ్యం
గాజాలో తల్లినో, తండ్రినో పోగొట్టుకొని, లేదంటే ఇద్దరినీ పోగొట్టుకుని 43 వేల మంది పిల్లలు జీవిస్తున్నారని పాలస్తీనా సెంట్రల్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి.
దీనిపై కచ్చితమైన లెక్కలు సేకరించడం కష్టం.
కానీ గాజా స్ట్రిప్‌లో యుద్ధం కారణంగా కనీసం 17 వేల మంది పిల్లలు, తల్లిదండ్రులు లేకుండానో, లేదంటే వారి నుంచి దూరమై జీవిస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది.
సహజంగా ఈద్ పండుగను చుట్టాలు, స్నేహితులతో కలిసి, ప్రత్యేక ఆహార పదార్థాలను తయారుచేసుకుని ఆనందంగా జరుపుకుంటారు.
కానీ ఇప్పుడు యుద్దం కొనసాగుతుండటంతో పండుగ చేసుకోవడం సాధ్యపడక, పిల్లలు కేవలం గత పండుగ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.
ఈద్ వేళ గాజాలో భోజనాల బల్లపై అనేక వంటకాలు కనిపిస్తుండేవి.
వాటిల్లో మాంసం పులుసు, ఉప్పుచేప ఉండేవి.
అయితే ఎన్ని వంటకాలు ఉన్నా ఈద్ బిస్కట్లే ఈ సందర్భంలో ప్రధానమైన తీపి వంటకంగా ఉండేది.
శిబిరాలలో తలదాచుకుంటున్న నిరాశ్రయుల కోసం తీపి వంటకాలు చేయడానికి పాలస్తీనీయుడైన మజ్ద్ నాజర్, ఆయన కుటుంబం నివసించే టెంట్‌లో 10 మంది మహిళలు గుమికూడారు.
ఈ శిబిరంలోని పిల్లలకు, వారి కుటుంబాలకు ఈద్ రుచిని మళ్ళీ చూపించాలనే ఉద్దేశంతో మజ్ద్ ఈ కార్యక్రమానికి నడుం బిగించారు.
ఆయన వయసు 20 ఏళ్ళు. గాజా ఉత్తర ప్రాంతం నుంచి ఆయన నిరాశ్రయుడయ్యారు.
‘‘ కిందటేడాది ధరలతో పోల్చుకుంటే మామౌల్ (ఒక రకమైన బిస్కట్లు ) తయారీ వస్తువుల ధరలు మూడు నాలుగింతలు పెరిగాయి’’ అని ఆయన చెప్పారు.
ఈ యువకుడు శిబిరంలోని 60 కుటుంబాలకు కేకులు పంచారు.

పిల్లల కోసం సర్కస్
గాజాలో దుర్భరమైన పరిస్థితుల నడుమ 17 లక్షల మంది ప్రజలు నివపిస్తున్నారు.
ఆహారం, నీటి కొరత పీడిస్తుంటే వారు బయటి నుంచి అందే సాయంపైనే ఆధారపడుతున్నారు.
ఈద్ సందర్భంగా ఉత్తర గాజాలోని నిరాశ్రయుల శిబిరాల వద్ద సర్కస్ నిర్వహించి అక్కడ వీలైనంతమంది అనాథ పిల్లల మొహాల్లో ఆనందం చూడాలని అహ్మద్ ముస్తాహా, ఆయన బృందం నిర్ణయించుకుంది.
ఈ ప్రాంతంలో మూడు లక్షల మంది ప్రజలు కరువు ముప్పును ఎదుర్కొంటారనే అంచనా ఉంది.
‘‘మేం పిల్లల మొహాల్లో ఆనందం తీసుకురావడం ద్వారా వారు ఈద్ పండుగను జరుపుకొనేలా చేయాలనుకుంటున్నాం’’అని సర్కస్ వ్యవస్థాపకుడు ముస్తాహా చెప్పారు.
ఈ సర్కస్‌ను 2011లో ప్రారంభించారు.
ఇది పనిచేసే భవనం బాంబుదాడికి గురవ్వడానికి ముందు అక్కడ పిల్లలకు సర్కస్ కళలో శిక్షణ ఇస్తుండేవారు.
యుద్ధానికి ముందు ముస్తాహా, పది మంది సభ్యులున్న ఆయన బృందం, పిల్లలు, అనాథల కోసం పార్కుల్లో ప్రదర్శనలు ఇస్తుండేవారు.
‘‘మేం బయటకు వచ్చిన ప్రతిసారి పెద్ద పెద్ద ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. అనేకసార్లు ఆశ్చర్యకరంగా బతికి బయటపడ్డాం. కానీ చాలా సార్లు గాయపడ్డాం. మేం పిల్లలకు మానసికంగా అండగా ఉండటం ద్వారా వారు యుద్ధ గాయాలను మర్చిపోయేలా చేయడంపైనే మా దృష్టంతా కేంద్రీకరించాం’’ అని ముస్తాహా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?
- దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ?
- జకాత్: ముస్లింల దగ్గర ఉండే డబ్బు, బంగారంలో ఎంత దానం చేయాలని ఇస్లాం చెబుతోంది?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆస్తమా: ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఇబ్బందికి కొత్త కారణాన్ని గుర్తించిన పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















