హైదరాబాద్‌: ‘యువకుడిని చంపి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్’.. మనుషులు ఎందుకింత క్రూరంగా మారతారు?

తేజస్
ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన తేజస్ ఓ హత్య కేసులో నిందితుడు
    • రచయిత, అమరేంద్ర యార్గగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గమనిక: ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి.

ఇంచుమించు పాతికేళ్ల వయసున్న పలువురు యువకులు కలిసి ఒక యువకుడిని హత్య చేసి, హత్యకు వాడిన కత్తిని, చేతులకైన ‘రక్తాన్ని’చూపిస్తూ వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రాంలో పెట్టారని తెలంగాణ పోలీసులు తెలిపారు. అది వైరల్ అయిందని వారు చెప్పారు.

హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో ఈ ఘటన జరిగింది.

పాతకక్షలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు.

ఇన్‌స్టాగ్రాం, హత్య కేసు, ప్రగతినగర్, బాచుపల్లి, హైదరాబాద్
ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలంలో పోలీసులు

అసలేం జరిగింది?

ఎస్ఆర్‌నగర్ దాసారం బస్తీలో ఉండే తేజస్ సాయి అలియాస్ డీల్(21) కూలీ పనులు చేస్తుంటారు. నిరుడు అక్టోబరులో జరిగిన తరుణ్ రాయ్ అనే వ్యక్తి హత్య కేసులో ఆయన జైలుకు వెళ్లారు. రెండు నెలల కిందట బెయిల్‌పై విడుదలయ్యారు.

తర్వాత ఆయన ఎస్ఆర్ నగర్ నుంచి ప్రగతినగర్‌కు మకాం మార్చి, తల్లితో కలిసి ఉంటున్నట్లుగా కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాస్‌రావు బీబీసీకి చెప్పారు.

‘‘తేజస్ హత్య సోమవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య జరిగినట్లు భావిస్తున్నాం. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉంటే ప్రాణహాని ఉందన్న భయంతో ప్రగతినగర్ చెరువు కట్టకు దగ్గర్లోని ఓ భవనంలో మూడో అంతస్తులో తేజస్, అతని తల్లితో కలిసి ఉంటున్నాడు.

రెండు రోజుల కిందట తేజస్ తల్లి వేములవాడ వెళ్లారు. రెండు రోజులుగా అతనితో శివప్ప అనే వ్యక్తి మద్యం తాగుతున్నాడు. సోమవారం తెల్లవారుజాము వరకు మద్యం తాగిన తర్వాత తేజస్‌ను శివప్ప కిందకు తీసుకువచ్చారు.

అదే సమయంలో తరుణ్ రాయ్ స్నేహితులుగా చెప్పుకొంటున్న సమీర్, మహేశ్ సహా కొంత మంది యువకులు వచ్చి తేజస్‌పై కత్తులతో దాడి చేశారు.

బతుకమ్మ ఘాట్ వద్ద ఉండగా, వెంటాడి ఇంటికి సమీపంలోనే హత్య చేశారు’’ అని శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు.

నిరుడు దసరా రోజున ఎస్ఆర్ నగర్‌లో తరుణ్ రాయ్ అనే యువకుడి హత్య జరిగింది.

అతన్ని కొంత మంది యువకులు బండరాళ్లతో కొట్టి చంపారు.

దీనిపై ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్‌లో 852/2023 ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఈ కేసులో తేజస్ మూడో నిందితుడిగా ‌ఉన్నాడు.

తరుణ్ హత్యకు ప్రతీకారంగానే తేజస్ హత్య జరిగినట్లుగా ఏసీపీ చెబుతున్నారు.

హైదరాబాద్, ప్రగతి నగర్
ఫొటో క్యాప్షన్, వీడియోలో చూపించిన కత్తి హత్యకు వినియోగించినదేనా, కాదా అనేది తేలాల్సి ఉందని ఏసీపీ శ్రీనివాసరావు చెప్పారు.

హత్యలో ఎంత మంది పాల్గొన్నారు?

తేజస్ హత్య జరిగిన చోటును పోలీసులు ఎవిడెన్స్ జోన్‌గా మార్క్ చేశారు.

ప్రస్తుతం అటు వైపు ఎవర్నీ వెళ్లనివ్వడం లేదు.

తేజస్ మృతదేహం పడి ఉన్న ప్రదేశం చుట్టూ పోలీసులు రిబ్బన్ కట్టి ఉంచారు. రక్తపు మరకలు రోడ్డుపై పడి ఉన్నాయి.

ఈ హత్యలో ఎంత మంది పాల్గొన్నారనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏసీపీ చెప్పారు.

‘‘ప్రాథమికంగా 10-15 మంది అని చెబుతున్నప్పటికీ, ఎంత మంది హత్యలో పాల్గొన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన వీడియోల్లో ఒక దాంట్లో ఇద్దరు బైకుపై వెళుతూ కనిపిస్తున్నారు. మరో వీడియోలో ముగ్గురు యువకులు ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన బీబీసీకి వివరించారు.

హైదరాబాద్, ఇన్‌స్టాగ్రాం, హత్య కేసు
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లో హత్య జరిగిన ప్రాంతం

పాతికేళ్ల వయసు వారే: ఏసీపీ

నిందితులంతా హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందినవారని ఏసీపీ శ్రీనివాసరావు చెప్పారు.

‘‘హత్యలో పాల్గొన్న వారి వయసు 25 ఏళ్లకు అటూ ఇటూగా ఉంటుంది. వీరంతా ఫాల్స్ సీలింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నారని మా విచారణలో తేలింది’’ అని చెప్పారు.

తేజస్‌ను కత్తులతో అత్యంత కిరాతకంగా పొడిచి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. తేజస్ శరీరంపై 12 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.

‘‘పాతకక్షల కోణంలో హత్య జరిగినట్లు భావిస్తున్నాం. విచారణ జరుగుతోంది. హత్యలో ప్రమేయం ఉన్న అందర్నీ పట్టుకుని జైలుకు పంపిస్తాం’’ అని శ్రీనివాసరావు చెప్పారు.

నాలుగు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇన్‌స్టాగ్రాంలో వైరల్

తేజస్‌ను చంపేందుకు వాడినట్లుగా చెబుతున్న రెండు కత్తులతోపాటు ‘రక్తాన్ని’ చూపిస్తూ నిందితులు రీల్స్ చేశారు.

దీనికి రక్తచరిత్ర పాట డైలాగులు పెట్టి సిద్ధూ అనే వ్యక్తి అప్‌లోడ్ చేశాడు.

ఈ వీడియోకు మరికొందర్ని ట్యాగ్ చేశాడు.

వికృత చేష్టలు చేస్తూ- తరుణ్ రాయ్47టీం పేరుతో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.

సిద్దూ-డీవోపీఈ పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్లోనూ వీడియోను పోస్టు చేశారు.

ప్రస్తుతం పోలీసులు ఆ వీడియోలను తొలగించడంతో పాటు అకౌంట్లను బ్లాక్ చేయించారు.

వీడియోల్లో, ‘‘తరుణ్ అన్న ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుంది’’ అంటూ రాసుకొచ్చారు.

‘‘ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన వీడియోలు మేం చూశాం. దీనిపై విచారణ జరుగుతోంది. అందులో చూపించిన కత్తి హత్యకు వినియోగించినదేనా, కాదా అనేది తేలాల్సి ఉంది. వీడియోలో వ్యక్తుల చేతికి ఉన్నది రక్తమా, లేక టమాటా సాస్ పూసుకుని అలా చేశారా అన్న విషయంపైనా దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఏసీపీ శ్రీనివాసరావు వివరించారు.

ఇన్‌స్టాగ్రాం, బాచుపల్లి పోలీస్ స్టేషన్
ఫొటో క్యాప్షన్, హత్య కేసులో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు

వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది?

హత్య చేయడం, దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం.. ఇలాంటి వ్యక్తిత్వాన్ని యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్దర్‌గా ‌భావించాలని కౌన్సిలింగ్ సైకాలజిస్టు డాక్టర్ అనిత ఆరె బీబీసీతో చెప్పారు.

హత్యలో పాల్గొన్న వ్యక్తుల మానసిక స్థితి గురించి ఆమె బీబీసీతో మాట్లాడారు.

‘‘ఇలాంటి వారికి ఎదుటివా‌‍ళ్లు ఏమనుకుంటారనే ఆలోచన ఉండదు. ఉద్వేగాలపై నమ్మకం ఉండదు. కనీసం చట్టం శిక్షిస్తుందనే భయం ఉండదు. మీడియా ప్రభావం కూడా వీరిపై బాగా పనిచేస్తుంది. ఆ తరహా ఘటనలు చూసి, వా‌ళ్లు కూడా సులువుగా చేయొచ్చన్న ఆలోచనల్లో ఉంటారు’’ అని చెప్పారు.

ఇలాంటి ప్రవర్తనను చిన్నప్పట్నుంచే కనిపెట్టి సరైన దారిలో పెడితే యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్దర్ వైపు వెళ్లకుండా అడ్డుకోగలమని అనిత అభిప్రాయపడ్డారు.

‘‘పిల్లలు మాట వినకపోతే తేలిగ్గా తీసుకోవద్దు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఉండి, పిల్లలను నడిపించాలి. చిన్నప్పుడు అపోజిషనల్ డిఫియంట్ డిజార్డర్ మొదలవుతుంది. తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పడం, చెప్పిన మాట వినకపోవడం జరుగుతుంది.

తర్వాత పాఠశాల స్థాయిలో కాండక్ట్ డిజార్డర్ జరుగుతుంది. ఇలాంటి దశలో ఎదుటి వ్యక్తులు షాక్‌లోకి వె‌‍ళితే వీళ్లు ఆనందం పొందుతారు.

యుక్త వయసులోకి వచ్చాక యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్ మొదలవుతుంది. సమాజానికి తమ వికృత చేష్టలు చూపించాలని అనుకుంటారు’’ అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)