ప్రపంచంలోనే అత్యధిక వయసున్న పురుషుడు ఈయన, ప్రతి శుక్రవారం ఏం తింటారంటే..

John Tinniswood
ఫొటో క్యాప్షన్, 111 ఏళ్ల తాత జాన్ టిన్నిస్‌వుడ్

ప్రస్తుతం ప్రపంచంలో బతికున్న పురుషుల్లో కురువృద్ధుడు ఈయనే.

ఇంగ్లండ్‌లోని మెర్సీసైడ్ ప్రాంతానికి చెందిన ఈయన పేరు జాన్ టిన్నిస్‌వుడ్. ఇప్పుడు ఈయన వయసు 111 ఏళ్ల 7 నెలలు.

తన దీర్ఘాయువు కోసం ప్రతి శుక్రవారం ఈయన చేపలు, చిప్స్‌ తింటున్నారు. వయసులో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా నడిచే వారు. ఇవన్నీ తన ఆయుష్షును పెంచాయని ఈ తాత చెబుతున్నారు.

టిన్నిస్‌వుడ్ ప్రస్తుతం సౌత్‌పోర్టులోని సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు.

మనసుకు ఎల్లప్పుడూ వ్యాయామం, ఏ విషయంలోనైనా సంయమంతో ఉండగలగడం నేర్చుకోవాలని టిన్నిస్‌వుడ్ సూచిస్తున్నారు.

అంతకుముందు, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడనే పేరు వెనెజ్వేలాలోని జువాన్ విసెంటే పెరెజ్ మోరాకు ఉండేది. ఆయన 2024 ఏప్రిల్ 2న 114 ఏళ్ల వయసులో చనిపోయారు.

1942లో బ్లాడ్వెన్‌ను పెళ్లి చేసుకున్న జాన్ టిన్నిస్‌వుడ్

ఫొటో సోర్స్, Family photo

టిన్నిస్‌వుడ్ 1912 ఆగస్ట్ 26న జన్మించారు. స్కాటిష్ ఫుట్‌బాల్ ప్లేయర్ బిల్లీ లిడెల్, ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ డిక్సీ డీన్‌లను అప్పట్లో మిద్దె పైకి ఎక్కి చూసేవాళ్లమని ఆయన గుర్తుకు చేసుకున్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో తన భార్య బ్లాడ్వెన్‌ను ఆయన కలుసుకున్నారు. 1942లో వారు పెళ్లి చేసుకున్నారు. 1986లో బ్లాడ్వెన్ మరణించారు.

బ్లాడ్వెన్ చనిపోయే నాటికి వారికి పెళ్లై 44 ఏళ్లు. వారికి 1943లో సుసాన్ అనే కూతురు పుట్టారు.

టిన్నిస్‌వుడ్ బ్రిటన్‌లోని రాయల్ మైల్, షెల్, బీపీ కంపెనీల్లో పనిచేశారు. 1972లో ఆయన ఉద్యోగవిరమణ పొందారు.

ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య పద్ధతులను తాను పాటించలేదని, కానీ నచ్చిన ఆహారాన్ని, చేపలను, చిప్స్‌ను ప్రతి శుక్రవారం తినేవాడినని ఆయన తెలిపారు.

ఆరోగ్యకరమైన జీవనం కోసం చేయాలనుకున్న, చేయగలిగే దానికంటే ఎక్కువగా ఎప్పుడూ చేయొద్దని ఆయన సూచిస్తున్నారు.

‘‘మనమంతా రకరకాల వ్యక్తులం. ఆ తేడాను మనం గ్రహించాలి. ఎవరికి తగ్గట్టు వారు నియమాలు పెట్టుకోవాలి. లేదంటే ఏదీ మనం అనుకున్నట్టు జరగదు’’ అని టిన్నిస్‌వుడ్ తెలిపారు.

టిన్నిస్‌వుడ్‌కు ఏప్రిల్ 4న గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసున్న పురుషుడు ఈయనేనని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన జెరోంటాలజీ (వృద్ధాప్యంలో మానసిక, శారీరక సమస్యలపై అధ్యయనం జరిపే శాస్త్రం)కి చెందిన రాబర్ట్ యంగ్ ప్రకటించారు.

ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా, వృద్ధ వ్యక్తిగా స్పెయిన్‌కు చెందిన మారియా బ్రాన్యాస్ మోరెరా ఉన్నారు. ఆమె ఇటీవలే తన 117వ పుట్టిన రోజును జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)