వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ ఎవరు... ఆర్ఎస్ఎస్-బీజేపీ చరిత్ర ఉన్న ఈ నాయకుడినే కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది?

అజయ్ రాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజయ్ రాయ్
    • రచయిత, విక్రాంత్ దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ రెండు పాత్రల్లో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో ఎన్నికల ఫలితాలే తేల్చాలి.

అజయ్ రాయ్‌ను యూపీ కాంగ్రెస్ ప్రెసిండెంట్‌గా చేసి పార్టీ ఆయన రాజకీయ స్థాయిని పెంచింది. ఇండియా కూటమికి ఏర్పడటానికి కొన్ని నెలల ముందు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అజయ్‌రాయ్‌ను అధ్యక్షుడిగా చేయడం అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో అసంతృప్తికీ కారణమైంది.

కాంగ్రెస్ నిర్ణయంపై సీనియర్ జర్నలిస్ట్ జ్ఞానేంద్ర శుక్లా మాట్లాడుతూ.. ''యూపీలో కోల్పోయిన రాజకీయ ప్రాబల్యాన్ని తిరిగి పొందేందుకు కాంగ్రెస్ నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంది. యూపీలో పోరాట ప‌టిమ‌తో, ప్ర‌జ‌ల‌తో కాంగ్రెస్‌ను అనుసంధానం చేయగల రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఒక లీడర్ అవసరం'' అని అన్నారు.

అజయ్ రాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అజయ్ రాయ్ సంఘ్, ఏబీవీపీ, బీజేపీ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఆ విషయాన్ని పట్టించుకోలేదని శుక్లా చెబుతున్నారు.

మోదీకి ప్రత్యర్థి..

"అజయ్ రాయ్‌కి భిన్నమైన హోదా, వ్యక్తిత్వం ఉంది. శక్తిమంతమైన, దూకుడుగా ఉండే నాయకుడు. రాహుల్ గాంధీ శైలికి ఇది బాగా సరిపోతుంది. దీంతో యూపీకి అజయ్ రాయ్ సరైన వ్యక్తిగా కాంగ్రెస్ వ్యూహకర్తలు భావించారు'' అని జ్ఞానేంద్ర శుక్లా తెలిపారు.

అజయ్ రాయ్‌పై 16 కేసులు నమోదయ్యాయి. సంఘ్, ఏబీవీపీ, బీజేపీ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఆ విషయాన్ని పట్టించుకోలేదని శుక్లా చెబుతున్నారు.

"ప్రధాని మోదీపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు అజయ్ రాయ్ రెండు సార్లు ముందుకొచ్చారు, అందుకే యూపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడానికి కాంగ్రెస్ కోరుకున్న లక్షణాలు అజయ్ రాయ్‌లో కనిపించి ఉండొచ్చు" అని శుక్లా అభిప్రాయపడ్డారు.

ఈసారి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ 17 ఎంపీ సీట్లలో పోటీ చేయబోతోంది.

కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రస్తుత బలం చాలా తక్కువ. మరి యూపీలో కాంగ్రెస్‌ ఆ 17 సీట్లు ఎలా గెలుస్తుంది?

పొత్తులో కాంగ్రెస్ 17 సీట్లు సాధించినందుకు కొందరు రాజకీయ విశ్లేషకులు యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌కి ఈ ఘనత ఇస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎవరి పాత్ర ఉందో స్పష్టంగా చెప్పడం కష్టం.

జ్ఞానేంద్ర శుక్లా మాట్లాడుతూ 'కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత, అజయ్ రాయ్ చాలా సందర్భాలలో అఖిలేష్ యాదవ్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఇది కాంగ్రెస్ పాత ప్రెజర్ బిల్డప్ టెక్నిక్. రాష్ట్ర స్థాయిలో నాయకులు పక్క పార్టీల వారిని విమర్శించే స్వతంత్రం ఇచ్చి, తర్వాత శాంతింపజేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది'' అని అన్నారు.

పూర్వాంచల్‌లో మంచి ఇమేజ్ ఉన్న అజయ్‌రాయ్‌ను గతంలో మాదిరిగానే నరేంద్ర మోదీపై అభ్యర్థిగా ప్రకటించింది.

గత కొన్ని నెలలుగా అజయ్ రాయ్ బలం పెరిగింది, కానీ వారణాసిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించుకోవడం అంత సులభం కాదు.

వారణాసి బరిలో అజయ్ రాయ్

ఫొటో సోర్స్, ANI

గత రెండు ఎన్నికల్లో మూడో స్థానం

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన అజయ్‌రాయ్ ఫలితాల్లో రెండో స్థానానికి కూడా చేరుకోలేకపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు.

ఆ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి వారణాసి నుంచి పోటీ చేశారు. ఆయనకు 5 లక్షల 81 వేలకు పైగా ఓట్లు పోలవ్వగా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్‌కు 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.

అజయ్‌రాయ్‌కు దాదాపు 75 వేల ఓట్లు వచ్చాయి.

అయితే, 2019లో అజయ్ తన ఓట్ల శాతాన్ని పెంచుకున్నారు, కానీ మూడో స్థానానికి మించి వెళ్లలేకపోయారు. ఆయనకు లక్షా 52 వేల 548 ఓట్లు వచ్చాయి. నరేంద్ర మోదీ దాదాపు 6 లక్షల 75 వేల ఓట్లను సాధించి, విజయం సాధించారు.

2019 ఓట్లను పరిశీలిస్తే బనారస్‌లో అజయ్ రాయ్‌కి తన భూమిహార్ కమ్యూనిటీ ఓటర్లు మద్దతుగా నిలిచారని రాజకీయ విశ్లేషకుల అంచనా.

గతంలో వచ్చిన ఓట్ల సమీకరణాలను పరిశీలిస్తే ఈసారి పరిస్థితి కాస్త మారవచ్చు. ఈ దఫా యూపీలో ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తులో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు సాధించిన ఓట్ల శాతం కలిపితే 32.8 శాతంగా ఉంది.

ఒక్క బీజేపీకే 63.6 శాతం ఓట్లు వచ్చాయి. గతసారి ఎస్పీ, బీఎస్పీలు కలసి పోటీ చేయగా, ఈసారి ఈ కూటమికి బీఎస్పీ దూరంగా ఉంది.

కాంగ్రెస్‌కు మరో సమస్య ఏమిటంటే, అజయ్‌రాయ్‌ను ఉత్తరప్రదేశ్‌కు అధ్యక్షుడిగా చేయడంతో సీనియర్ కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు వారణాసి మాజీ ఎంపీ రాజేష్ మిశ్రా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

అజయ్ రాయ్

ఫొటో సోర్స్, VIKRANT DUBEY

వారణాసిలోనే ఎప్పటికీ.. - అజయ్ రాయ్

అజయ్ రాయ్ గత 30 ఏళ్లలో 10కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు.

వారణాసి పార్లమెంటరీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, అజయ్ రాయ్ బీబీసీతో మాట్లాడుతూ "నేను బనారస్‌లో, గంగామాత ఒడిలో పుట్టాను, ఇక్కడే చివరి వరకు ఉంటాను. కాంగ్రెస్‌లో ఎవరి పని వారికి అప్పగించారు. ఎవరి బాధ్యత వాళ్లు నిర్వర్తించాలి'' అని అన్నారు.

అజయ్ రాయ్

ఫొటో సోర్స్, VIKRANT DUBEY

సోదరుడి మరణంతో రాజకీయాల్లోకి...

తొంభైలలో ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ గ్యాంగ్ వార్‌ ఎక్కువగా ఉండేది. బనారస్ కేంద్రంగా దందా నడిపేవారు.

1991లో వారణాసిలోని చెట్‌గంజ్‌లో అజయ్ రాయ్ సోదరుడైన అవధేష్ రాయ్‌ను పట్టపగలు హత్య చేశారు. దీనిపై ముక్తార్ అన్సారీ గ్యాంగ్‌పై ఆరోపణలు వచ్చాయి.

సోదరుడి హత్య తర్వాత కుటుంబ బాధ్యతలు అజయ్‌రాయ్‌పై పడ్డాయి. గ్యాంగ్ వార్ కూడా తారాస్థాయికి చేరడంతో రాజకీయ రక్షణ కోసం అజయ్ రాయ్ ఏబీవీపీ నుంచి బీజేపీలో చేరారు.

32 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఈ కేసులో ముఖ్తార్ అన్సారీకి 2023 జూన్‌లో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ సుదీర్ఘ పోరాటంతో అజయ్ రాయ్ వార్తల్లో నిలిచారు.

బనారస్ నుంచి లక్నో వరకు వివిధ పోలీస్ స్టేషన్లలో అజయ్ రాయ్‌పై 16 కేసులు నమోదయ్యాయి.

9 సార్లు గెలిచిన నేతను ఓడించి...

1996లో అజయ్ రాయ్ రాజకీయ ప్రయాణం మొదలైంది.

కొలస్లా నుంచి బీజేపీ తరఫున తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కామ్రేడ్ ఉదల్‌పై విజయం సాధించారు.

ఉదల్‌కు పట్టున్న ప్రాంతం కొలస్లా. కానీ అజయ్ రాయ్ ఆయనను ఓడించారు. ఆ విజయం అజయ్‌ను పాపులర్ చేసింది.

1996 నుంచి 2007 వరకు మూడుసార్లు ఆయన ఇక్కడి నుంచే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2003లో బీజేపీ, బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

అజయ్ రాయ్

ఫొటో సోర్స్, VIKRANT DUBEY

బీజేపీని ఎందుకు వీడారు?

2007 విజయం తర్వాత అజయ్ రాయ్ దిల్లీ వైపు చూడటం మొదలుపెట్టారు.

ఎందుకంటే వరుసగా మూడు పర్యాయాలు వారణాసి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శంకర్ ప్రసాద్ జైస్వాల్ 2004 ఎన్నికల్లో ఓడిపోయారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేష్‌ మిశ్రా విజయం సాధించారు. దీంతో 2009లో వారణాసి పార్లమెంటు స్థానం నుంచి పోటీకి అజయ్ రాయ్ ఆసక్తి కనబరిచారు.

అయితే బీజేపీ మురళీ మనోహర్ జోషికి వారణాసి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.

బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని ఎదిరించిన అజయ్ రాయ్, సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన ముఖ్తార్ అన్సారీ కూడా బరిలోకి దిగడంతో పోటీ ముక్కోణంగా మారింది.

వారణాసి నుంచి మురళీ మనోహర్ జోషి గెలుపొందగా ముఖ్తార్ అన్సారీ గట్టి పోటీ ఇచ్చారు. అజయ్ రాయ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడంతో అజయ్ రాయ్ బీజేపీ సభ్యత్వాన్ని కోల్పోయారు, దీంతో 2009లో కోలాస్లా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.

2012లో కాంగ్రెస్‌ టికెట్‌తో కోలాస్లా నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత కోలాస్లా అసెంబ్లీ పేరు పింద్రాగా మారింది.

ఆ తర్వాత ఐదు అసెంబ్లీ విజయాలకు బ్రేక్ పడింది.

మోదీని ఆపగలరా?

2014లో మోదీపై కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు అజయ్‌రాయ్‌. 2017లో పింద్రా అసెంబ్లీ నుంచీ ఓడిపోయారు.

ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వారణాసిలో మోదీ చేతిలో ఓడిపోయారు.

2022 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అవధేష్ సింగ్ చేతిలో రెండోసారి పింద్రాలో ఓడారు.

2024లో వారణాసి నుంచి మోదీ ప్రత్యర్థిగా పోటీకి దిగబోతున్న అజయ్ రాయ్, కాంగ్రెస్ ఓట్లను ఏ వ్యూహంతో పెంచుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)