గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలోకి తిరిగిరావడం వల్ల ఎవరికి లాభం?

ఫొటో సోర్స్, ARIJIT SEN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం, బెంగళూరు
లోక్‌సభ ఎన్నికల్లో 400 మార్కును అధిగమించేందుకు తన ముందున్న ఏ ప్రయత్నాన్ని వదలడం లేదు భారతీయ జనతా పార్టీ. కర్ణాటకకు చెందిన నేత, మైనింగ్ కింగ్‌గా పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది బీజేపీ.
మైనింగ్ ప్రపంచంలో అతిపెద్ద ప్లేయర్‌గా జనార్దన్ రెడ్డికి పేరుంది. భారత్‌లో ఐరన్ ఓర్‌కు చెందిన అతిపెద్ద అక్రమ మైనింగ్ స్కామ్‌లో ఆయనకు ప్రమేయం ఉంది.
హైదరాబాద్‌లో ‘క్యాష్ ఫర్ బెయిల్’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, ఎంతో కాలంగా పక్కన పెట్టిన జనార్దన్ రెడ్డిని బీజేపీ తిరిగి పార్టీలోకి తీసుకోవడంపై పొలిటికల్ సర్కిళ్లలో మిశ్రమ స్పందన వస్తోంది.
జనార్దన్ రెడ్డి తన చిన్న రాజకీయ పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’(కేఆర్‌పీపీ)ని బీజేపీలో విలీనం చేశారు. 2023 ఎన్నికల్లో కేఆర్‌పీపీ ప్రతినిధిగా కర్ణాటక అసెంబ్లీకి పోటీ చేశారు జనార్దన్ రెడ్డి .

ఫొటో సోర్స్, ANI
అమిత్‌షాతో సమావేశం
‘‘మేం ఎవర్ని జడ్జి చేయం, తక్కువ చేయం. లేకపోతే, కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా లాంటి నేత జనార్దన్ రెడ్డిని ఎందుకు కలుస్తారు?’’ అని బీబీసీ హిందీకి పేరు చెప్పడానికి ఇష్టపడని కర్ణాటక బీజేపీ నేత అన్నారు.
బీజేపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమిత్‌షా ఆ రాష్ట్ర బీజేపీ నేతలను జనార్దన్ రెడ్డికి దూరంగా ఉండాలని సూచించారు.
జనార్దన్ రెడ్డితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్‌షా మైసూరులోని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అప్పట్లో సమాధానమిచ్చారు.
2018తో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి ఎంత భిన్నంగా ఉందో, జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు వింటే అర్థమవుతుంది.
బీజేపీలో చేరిన తర్వాత, గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బయట నుంచి సపోర్టు ఇచ్చే ప్రసక్తి లేదని అమిత్ షా నాతో చెప్పారు. బీజేపీలో నా రాజకీయ పుట్టుకను ఆయన గుర్తు చేశారు. పార్టీలో చేరమని నాకు చెప్పారు. బీజేపీ నాకు తల్లి లాంటిది. నేను తిరిగి పార్టీలో చేరుతున్నా’’ అని జనార్దన్ రెడ్డి చెప్పారు.
జనార్దన్ రెడ్డి, బీజేపీ అకస్మాత్తుగా ఇంత సన్నిహితంగా మారడం వెనుక పలు కారణాలున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీకి ఈ విషయం అర్థమైంది.
గంగావతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనార్దన్ రెడ్డికి 67,791 ఓట్లు వచ్చాయి. గంగావతి అసెంబ్లీ సీటు కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం కిందకు వస్తుంది.

ఫొటో సోర్స్, ANI
జనార్దన్ రెడ్డి భార్య గాలి లక్ష్మి అరుణ బళ్లారి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి 48,577 ఓట్లను పొందారు. బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర రెడ్డి తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
గాలి జనార్దన్ రెడ్డి చిన్న తమ్ముడే సోమశేఖర రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి 86,440 ఓట్లతో ఈ అసెంబ్లీ సీటులో గెలుపొందారు. బళ్లారి అసెంబ్లీ సీటు బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం కిందనే ఉంది.
జనార్దన్ రెడ్డి పార్టీకి చెందిన మరో అభ్యర్థి కేఎస్ దివాకర్‌కు సండూర్ అసెంబ్లీ సీటులో 31,299 ఓట్లు వచ్చాయి. కానీ, ఆయన పార్టీకి చెందిన మిగిలిన 44 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
ఓట్లు చీలిపోవడాన్ని ఆపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చిన ప్రధాన ఉద్దేశ్యం ఇదేనని బీజేపీకి చెందిన మరో నేత అన్నారు.
బళ్లారి, కొప్పల్, రాయ్‌చూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇంకా జనార్దన్ రెడ్డికి ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని కొందరు బీజేపీ నేతలు ప్రైవేట్ సంభాషణలో చెప్పారు. దీన్ని కాంగ్రెస్ నేతలు కూడా కొట్టివేయలేదు.
అయితే, 2008 నుంచి 2013 మధ్య కాలంలో ఆయనకున్న ఇన్‌ఫ్లుయెన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చని ఇరు పార్టీలకు చెందిన మరికొందరు నేతలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
జనార్దన్ రెడ్డి ఎవరు?
గాలి జనార్దన్ రెడ్డి ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. 1999లో సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేయగా, ఆమె విదేశీ వనిత అంటూ సుష్మా స్వరాజ్ ఆమెపై పోటీ చేశారు. ఆ సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది.
జనార్దన్ రెడ్డి, ఆయన సన్నిహితుడు బి. శ్రీరాములు సుష్మా స్వరాజ్ అభిమానం సంపాదించారు.
సుష్మా స్వరాజ్ బళ్లారికి వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి ఇంట్లో జరిగే వరమహాలక్ష్మి పూజకి కచ్చితంగా హాజరయ్యేవారు.
కర్ణాటకలో ఈ పూజను పెళ్లయిన మహిళలు తమ కుటుంబ క్షేమం కోసం చేస్తుంటారు.
రెడ్డి సోదరులు సుష్మా స్వరాజ్‌ను తాయీ అని పిలిచేవారు. అప్పట్లో సుష్మా స్వరాజ్ నుంచి రెడ్డి సోదరులు ఆశీర్వాదం తీసుకున్న ఫోటో బళ్లారిలో ప్రతి దగ్గర కనిపించేది.
1999 నుంచి 2012 మధ్య కాలంలో రెడ్డి సోదరులు – జనార్దన్ , సోమశేఖర్, వారి పెద్దన్న కరుణాకర్ రెడ్డి మైనింగ్‌లో బడా వ్యాపారులుగా ఎదిగారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న ఒబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో మైనింగ్ వ్యాపారం ప్రారంభించకముందు, కోల్‌కతాలోని ఓ కంపెనీ కోసం ఆయన ఇన్సూరెన్స్‌లు విక్రయించే వారు.
ఆ తర్వాత చిట్‌ఫండ్ సంస్థను ప్రారంభించారు. కానీ, మార్గదర్శకాల ఉల్లంఘన ఆరోపణలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చర్యలతో దీన్ని మూసేశారు.
వ్యాపారాల్లో, రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి సరికొత్త మార్గాలను అన్వేషించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సాయంతో తన ఓఎంసీ కంపెనీకి మైనింగ్ లైసెన్సులు పొందారు.
అయితే, వీరి బిజినెస్ స్టైల్ స్థానికంగా అలజడి రేపడమే కాక, స్థానికులు, అధికారుల్లో భయాందోళనలు సృష్టించిందని ఒక అధికారి బీబీసీతో అన్నారు.
వీరి వ్యాపారాల మీద కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన రోశయ్య ఓఎంసీ స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పజెప్పారు.
గాలి జనార్దన్ రెడ్డిని 2011 సెప్టెంబర్ 5న సీబీఐ అరెస్ట్ చేసింది. 2015 జనవరి 21న సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బళ్లారి జిల్లాలో ప్రవేశించడానికి ఆయనకు అనుమతి లేదు.
ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆయనపై 20 క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీనిలో 9 కేసులు అక్రమ మైనింగ్‌పై ఆయనకు వ్యతిరేకంగా నమోదైనవే. వీటిని సీబీఐ విచారిస్తోంది.
అక్రమ మైనింగ్ వల్ల కర్ణాటక రాష్ట్రం రూ.16,500 కోట్లను నష్టపోయిందని లోకాయుక్త తన నివేదికలో పేర్కొంది.
రాజకీయ పార్టీలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరని, జనార్దన్ రెడ్డి తిరిగి పార్టీలో చేరడం తమ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చినట్లయిందని బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI
అసలు దీని అర్థమేంటి?
‘‘ఇక్కడ రెండు ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ ట్రెండ్. దీనిలో కొందరు బీజేపీలో చేరుతూ, తమపై ఉన్న మరకలను పోగొట్టుకుంటున్నారు. రెండోది కర్ణాటక ట్రెండ్. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు కర్ణాటకలో బీజేపీకి నమ్మకమైన నేతలు లేరు. తొలుత బీజేపీ జగదీశ్ షెట్టర్‌తో మాట్లాడింది. ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని చూసింది. ఆ తర్వాత జనతా దళ్ సెక్యులర్‌తో చేతులు కలిపింది’’ అని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ నారాయణ్ అన్నారు.
‘‘సీట్ల పంపకం తర్వాత బీజేపీలో మరింత ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే చాలా సీట్లలో అభ్యర్థుల ఎంపికపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనార్దన్ రెడ్డిని తిరిగి పార్టీలోకి పిలవడం కూడా దీనికి సంకేతమే. పార్టీలో విశ్వాసం సన్నగిల్లుతోందన్న వాస్తవాన్ని ఇది బయటపెడుతోంది.’’ అని అన్నారు నారాయణ్.

ఫొటో సోర్స్, ANI
‘‘1996లో బీజేపీకి కాంగ్రెస్ కంటే 9 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పట్లో కాంగ్రెస్ కంటే ఎల్లప్పుడూ ముందంజలోనే ఉండేది. 2019లో ఈ ఓట్లు 14 శాతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఓట్లను కాపాడుకునే పరిస్థితుల్లో పార్టీ లేనట్లు కనిపిస్తుంది’’ అని 1996 నుంచి 2019 మధ్యలో బీజేపీ పొందిన ఓట్ల పర్సంటేజ్‌ను పోలుస్తూ నారాయణ్ ఈ విషయాన్ని వివరించారు.
‘‘జనార్దన్ రెడ్డికి అంతకుముందున్న ఇన్‌ఫ్లుయెన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు. బళ్లారి నుంచి పోటీ చేస్తున్న శ్రీరాములుకు మంచి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. దళితుల్లో, ముస్లింలలో ఆయనకు మంచి పేరుంది. జనార్దన్ రెడ్డి తిరిగి పార్టీలోకి రావడం బీజేపీ ఇమేజ్‌కు పెద్దగా సాయం చేయకపోవచ్చు’’ అని మైసూర్ యూనివర్సిటీకి చెందిన ఆర్ట్స్ విభాగపు డీన్, రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ ముజఫర్ అస్సాదీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- దక్షిణ కొరియా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదు, వారి సమస్యేంటి?
- హిజాబ్: ‘కొరడా దెబ్బలు తింటాం, జైలుకైనా వెళతాం’ అంటున్న ఇరానీ మహిళలు
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















