మోదీ హయాంలో పౌర హక్కులు ఎలా ఉన్నాయి... కొన్ని చట్టాల్లో వచ్చిన కీలకమైన మార్పులేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మోదీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో తాము అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర స్థాయిలో చట్టాల్లో అనేక మార్పుల్ని తీసుకొచ్చింది.
వలస పాలన కాలం నాటి కొన్ని చట్టాల స్థానంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కొన్ని కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చింది.
ఇందులో చాలా చట్టాలు ప్రజల హక్కులను హరిస్తున్నాయని, మరికొన్ని చట్టాలు ప్రభుత్వానికి మరింత అధికారం కట్టబెడుతున్నాయని ప్రతిపక్షాలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.
కొత్తగా రూపొందించిన లేదా మార్పునకు గురైన కొన్ని కీలక చట్టాలు రోజువారీ ప్రజల జీవితంలో ఎలాంటి ప్రభావం చూపగలవో ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, SPL
1. కొత్త క్రిమినల్ చట్టాలు
దేశంలో దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న మూడు పాత క్రిమినల్ చట్టాలలో 2023 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ, 1860), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ, 1973), ది ఎవిడెన్స్ యాక్ట్ (1872)లలో చట్టసవరణలు చేసింది.
ఈ చట్టాలు బ్రిటిష్ కాలం నాటివని, భారతీయులే కేంద్రంగా బ్రిటీషర్లు వీటిని రూపొందించారంటూ పేర్కొంటూ కేంద్రం ఈ చట్టాల్లో మార్పుల్ని ప్రవేశపెట్టింది. అయితే, కొత్తగా చేసిన మార్పుల్లోని లోపాలను నిపుణులు ఎత్తిచూపుతున్నారు.
మెజారిటీ చట్టాలు ఇంతకుముందున్నట్లే ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.
దుర్వినియోగం చేయగలిగే అవకాశం ఉన్న కొన్ని నేర నిర్వచనాలను జోడించారని నిపుణులు పేర్కొన్నారు. ఉదాహరణకు, దేశద్రోహాన్ని పూర్తిగా తొలగించడానికి బదులుగా భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా ఉండే కార్యకలాపాలను దీనికిందకే తెచ్చారు. అయితే, ఈ చట్టాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.
మూకదాడులు వంటి కొన్ని ఇతర నేరాలను ఈ చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి, వాటికి జీవిత ఖైదును శిక్షగా ఖరారు చేశారు.
పోలీసు కస్టడీని పెంచడం అతిపెద్ద మార్పుల్లో ఒకటి. ప్రస్తుతం 15 రోజులుగా ఉన్న కస్టడీ వ్యవధిని నేరం తీవ్రతను బట్టి 60 నుంచి 90 రోజులకు పెంచుకునే వీలు కల్పించారు.
ప్రభుత్వం తెచ్చిన కొన్ని కొత్త చట్టాల్లో కొన్ని ప్రయోజకరంగా ఉండేవి కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అన్ని రకాల నేరాలకు తప్పనిసరిగా ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల సేకరణ, విచారణ అన్ని దశల్లో సమాచార సాంకేతికతను మెరుగ్గా ఉపయోగించుకోవడం, విచారణ-తీర్పు వెలువరించడానికి తప్పనిసరిగా సమయ పరిమితులు పెట్టుకోవడం వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయని వారు అంటున్నారు.
అయితే, కొత్త క్రిమినల్ చట్టాల బిల్లులను ఆమోదించిన తీరుపై విమర్శలు ఉన్నాయి. ఈ బిల్లులను ఆమోదించే సమయంలో దాదాపు 150 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్‌లో ఒకే సెషన్‌లో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి. దీనర్థం ఈ బిల్లులపై ప్రతిపక్షాల శాసనసభ్యులకు పెద్దగా చర్చించే అవకాశం రాలేదు.

ఫొటో సోర్స్, SHAILENDRA SHARMA
2. ఆహార ఎంపికలపై నిబంధనలు
అయిదుకు పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశువుల వధ-రవాణా నిషేధంపై కొత్త చట్టాలను అమలు చేయడమో లేదా ఇప్పటికే ఉన్న ఆవుల సంరక్షణ చట్టాలను మరింత కఠినంగా మార్చడమో చేశారు.
ఉదాహరణకు, కర్ణాటక ప్రభుత్వం 1964 నాటి చట్టం స్థానంలో 2020లో ఒక పశువుల వధ చట్టాన్ని ఆమోదించింది. గతంలో కూడా గోవధపై నిషేధం ఉండేది. దీనితో పాటు 13 ఏళ్ల కన్నా తక్కువ వయస్సున్న ఎద్దులు (బుల్స్), గేదెల వధను కూడా నిషేధించింది.
ఈ కేసుల్లో శిక్షను 6 నెలల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు పెంచారు.
చట్టంలో పేర్కొనక పోయినప్పటికీ ఇది బీఫ్ వినియోగంపై డీఫాల్ట్ నిషేధం వంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. పశువుల వాణిజ్యం, రవాణా వంటి వ్యాపారాలపై కూడా ఈ చట్టం ప్రభావం చూపించిందని వారు అంటున్నారు.
హరియాణా, గుజరాత్, అస్సాం, మహారాష్ట్రలలో కూడా ఇలాంటి మార్పులే చేశారు. గుజరాత్‌లో గోవధ కేసుల్లో విధించే శిక్షను ఏడేళ్ల నుంచి జీవితఖైదుగా మార్చారు.
బీఫ్‌ను తీసుకెళ్తున్నారనే అనుమానంతో దాడులు చేయడం కూడా బీఫ్ తినేవారిలో భయాన్ని పెంచింది.
భారత్‌లోని అతిపెద్ద రాష్ట్రం, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫైడ్ ఆహార ఉత్పత్తుల మీద నిషేధం ఉంది.
కేరళ, మేఘాలయ, నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇంకా గోవధను అనుమతిస్తున్నాయి.
అయితే, కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ నిషేధ చట్టాలు ఇంకా చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
మహారాష్ట్ర బయట వధించిన బీఫ్ మాంసాన్ని కలిగి ఉన్నవారికి శిక్ష విధించడం, నిందితులను దోషులుగా పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని 2016లో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
3. ఇంటర్నెట్, సోషల్ మీడియాపై నిషేధం
2021లో కేంద్ర ప్రభుత్వం ‘‘2021 ఇంటర్మీడియరీ రూల్స్’’ను ఆమోదించింది. ఇది సోషల్ మీడియాలో ఏ రకమైన సమాచారం ఉంచవచ్చో అనే అంశాన్ని తీవ్రంగా నియంత్రిస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా నియంత్రిస్తుంది.
వార్తా సంస్థల వెబ్‌సైట్లు, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా కంటెంట్ విషయంలో కఠిన నియంత్రణను నిర్దేశిస్తుంది. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ చర్యలు అంటూ పలు హైకోర్టుల్లో కేసులు వేశారు.
ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తున్నందున ఈ నిబంధనల్లోని కొన్ని భాగాలపై రెండు హైకోర్టులు స్టే విధించాయి.
కంటెంట్‌ను తొలగించాలనే ఆదేశాలు కూడా పెరిగాయి. ఉదాహరణకు భారత్‌లో 2022లో ట్విటర్‌కు చెందిన 3,417 యూఆర్‌ఎల్‌లను నిషేధించారు. 2014లో ఇలా నిషేధించిన యూఆర్‌ఎల్‌ల సంఖ్య 8 మాత్రమే.
ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో సగానిపైగా వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. నిరసనలు ఆపేందుకు, పరీక్షల్లో చీటింగ్‌ను అరికట్టేందుకు కూడా ఇంటర్నెట్ షట్‌డౌన్ విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇంటర్నెట్ షట్‌డౌన్లను ట్రాక్ చేసే ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ అనే పరిశోధక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, 2014లో 6 సార్లు, 2023లో 80 సార్లు షట్‌డౌన్ విధించారు.

4. గోప్యతకు రక్షణ
దాదాపు దశాబ్ద కాలం పాటు చర్చల తర్వాత 2023లో ప్రభుత్వం ఒక డేటా రక్షణ చట్టాన్ని ఆమోదించింది. కానీ, ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ చట్టంపై వచ్చిన అతిపెద్ద విమర్శ ఏంటంటే, ఈచట్టాన్ని ఆచరణాత్మకంగా ఉల్లంఘించేలా ప్రభుత్వం అనేక మినహాయింపులు చేసుకుందని పలువురు పేర్కొన్నారు. ఉదాహరణకు, ఏదైనా వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తున్నప్పుడు భారతదేశ సమగ్రత, శాంతిభద్రతల నిర్వహణ వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వానికి, దాని విభాగాలకు, ఏజెన్సీలకు ఈ చట్టం వర్తించదు.
అంతేకాకుండా, ఈ చట్టం కింద నమోదయ్యే ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకోవడం, జరిమానాలు విధించడం వంటివి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక బోర్డు ద్వారా జరగాలి.
ఈ చట్టం ప్రభుత్వానికి ఒక వ్యక్తికి సంబంధించిన ప్రొఫైల్‌ను తయారు చేయడానికి సహకరిస్తుందని, ఇది వ్యక్తుల గోప్యతకు ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
5. వివాహం, విడాకులు
ఏడుకు పైగా బీజేపీ పాలిత రాష్ట్రాలు 2017 నుంచి మత మార్పిడి నిరోధక చట్టాలను బలోపేతం చేయడమో లేదా వివాహాన్ని నియంత్రించే కొత్త చట్టాలను ఆమోదించడమో చేశాయి.
వీటన్నింటిలో అతిపెద్ద మార్పు ఏంటంటే, పెళ్లి కోసం లేదా పెళ్లి కారణంగా మతమార్పిడిలను వారు నిషేధించారు. ముస్లిం పురుషులు హిందు మహిళలను వివాహం చేసుకొని వారిని ఇస్లాంలోకి మార్చుతున్నారంటూ హిందుత్వవాదుల నుంచి వచ్చిన భారీ ఆరోపణల తర్వాత ఈ మార్పును తీసుకొచ్చారు.
ఇప్పుడు ఈ చట్టాల కారణంగా మతాంతర వివాహం చేసుకోవాలనుకునే జంటలు జిల్లా మెజిస్ట్రేట్ వంటి అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు నెల నుంచి రెండు నెలల వరకు సమయం ఇవ్వాలి.
మతాంతర జంటలకు ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పురుషుడిని లక్ష్యంగా చేసుకునేందుకు ఈ చట్టాలను తరచుగా వాడుతున్నారని పలు నివేదికలు తెలుపుతున్నాయి.
ఈ చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆమోదం, ముందస్తు నోటీసు వంటివి ఇష్టపడే వ్యక్తిని వివాహం చేసుకునే ప్రాథమిక హక్కును ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంటూ ఆయా రాష్ట్రాల్లోని రెండు హైకోర్టులు మతమార్పిడి నిరోధక చట్టంలోని పలు నిబంధనలపై స్టే విధించాయి.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అనేది బీజేపీ ఎంతోకాలంగా ప్రజలకు ఇస్తున్న వాగ్దానం. ఉత్తరాఖండ్‌లో బీజేపీ పాలిత ప్రభుత్వం, యూసీసీని ఆమోదించడం మరో పెద్ద మార్పు.
ఈ చట్టంలో చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే, కలిసి జీవిస్తోన్న (లివింగ్ టుగేదర్) జంటలు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాకుండా, రెండో పెళ్లి (బైగమీ) చట్టవిరుద్ధం.
యూసీసీ అనేది ఎక్కువగా హిందూ చట్టాల ఆధారంగా తీసుకొచ్చారనేది మరోపెద్ద విమర్శ.

ఫొటో సోర్స్, Getty Images
6. ప్రభుత్వ సమాచారాన్ని పొందడం సులభమా?
అన్ని స్థాయిల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన కీలక చట్టం సమాచార హక్కు చట్టం. గత కొన్నేళ్లలో ఈ చట్టంలో చాలా మార్పులు చేశారు.
కొత్తగా తీసుకొచ్చిన ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’’ అనేది ఇందులో వచ్చిన అతిపెద్ద మార్పు.
2023లో ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఆర్‌టీఐలో కొంత వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కోణం ఉన్నందున, ఇది ఒక వ్యక్తికి చెందిన వ్యక్తిగత సమాచారానికి సంబంధించినదని చెప్పి అధికారులు సమాచారం ఇవ్వడాన్ని ఎలా తిరస్కరించవచ్చో బీబీసీ నివేదించింది.
అంతకుముందు 2019లో కూడా ఆర్‌టీఐ చట్టాన్ని సవరించారు. ఈ సవరణ తర్వాత, సమాచార కమిషనర్ల నియామక నిబంధనలను నిర్ణయించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి దక్కింది.
ఇది కమిషనర్లకు జీతం, సర్వీస్ నిబంధనలను నిర్ణయించే అధికారాన్ని కూడా ఇస్తుంది. ఇది ఆర్‌టీఐ మీద ప్రభుత్వ నియంత్రణను పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
7. రిజర్వేషన్ అందుతోందా?
గత పదేళ్లలో జరిగిన మార్పుల్లో కీలకమైన అంశం జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం రిజర్వేషన్లు కేటాయించడం. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన కులాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యా సంస్థల్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓసీల్లో పేదల కోసం పదిశాతం రిజర్వేషన్లు కేటాయీంచారు.
ఓసీల్లో పేదలకు రిజర్వేషన్లు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3-2 మెజార్టీతో ఆమోదించింది.
అయితే, ఇందులో ఒక అంశం ఏంటంటే ఇది 1992లో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించిందా అని.
అయితే ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరు కోర్టు గతంలో పేర్కొన్న 50 శాతం రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వారి విషయంలో వర్తిస్తుందని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో బిల్లును ఆమోదించింది. గతంలో ఈ నిర్ణయాన్ని రిజర్వేషన్ కోటా 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు అడ్డుకుంది.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటింది. ఉదాహరణకు తమిళనాడులో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా 69 శాతంగా ఉంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
8. మనీ లాండరింగ్ చట్టానికి కఠిన నిబంధనలు
2019లో మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002ని ఎన్డీయే ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. దీంతో చట్టం పరిధి విస్తరించింది. మొదటి నుంచే ఈ చట్టం కఠినంగా ఉంది. అయినప్పటికీ దీన్ని మరింత కఠినంగా మార్చారనేది న్యాయ నిపుణులు, ప్రతిపక్షాల అభిప్రాయం.
చట్టానికి మార్పులు చేసిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మనీలాండరింగ్ కేసుల్లో ఎఫ్ ఐఆర్ లేకుండానే దర్యాప్తు చేసే అధికారం దఖలు పడింది.
ఇంకా ఈ చట్టాన్ని విస్తృతంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు నేరంలో విచారణ జరుగుతూ ఉండగానే ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు. నేరంలో పరోక్ష పాత్ర ఉన్నట్లు తేలినా సరే, శిక్షార్హమే.
మనీ లాండరింగ్ చట్టంలో బెయిల్ ఇచ్చేందుకు అంతకు ముందు ఉన్న కఠినమైన ఆంక్షల్ని 2017లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. “నిందితుడు అలాంటి నేరం చేసి ఉండకపోవచ్చని భావించడం, బెయిల్ మీద ఉన్నప్పుడు నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టులు భావిస్తే బెయిల్ ఇవ్వవచ్చు” అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే 2019లో చట్టానికి చేసిన మార్పుల్లో సుప్రీంకోర్టు రద్దు చేసిన ఆంక్షల్ని తిరిగి చట్టంలో చేర్చారు.
మనీ లాండరింగ్ చట్టంలో మార్పులను 2022లో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే ఈ తీర్పు న్యాయ నిపుణులతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ప్రస్తుతం ఆ తీర్పు మీద దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది.
ప్రస్తుతం ఈ చట్ట వినియోగం అనేక రెట్లు పెరిగింది. 2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 195 కేసులు నమోదు చేసింది.
2020లో 981 కేసులు మనీ లాండరింగ్ కింద నమోదయ్యాయి. 2004-2014 మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 5,436 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసింది. 104 చార్జ్‌షీట్లను దాఖలు చేసింది.
2014-2022 మధ్య ఈడీ అటాట్ చేసిన ఆస్తుల విలువ 99,356 కోట్ల రూపాయలు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో 888 చార్జ్ షీట్లను ఫైల్ చేసింది. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 45 మంది మాత్రమే దోషులుగా తేలినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెబ్‌సైట్ చెబుతోంది.
కొంతమంది ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, పోరాట కార్యకర్తలను కూడా ఈ చట్టం కింద జైలులో పెట్టారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, నవాబ్ మాలిక్ లాంటి నేతలు ఈ చట్టం కింద అరెస్ట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- గాజా: యుద్ధ భూమిలో పారాచూట్లతో వదులుతున్న ఆహారం ఏమవుతోంది?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
- ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?
- లద్దాఖ్: కేంద్రం ద్రోహం చేసిందంటూ గడ్డ కట్టే చలిలో వేల మంది రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














