కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడని తల్లి మీద దాడి చేసి, అర్ధనగ్నంగా పరుగెత్తించారు... వీడియో తీసి వైరల్ చేశారు

పంజాబ్‌తో మహిళపై దారుణం
ఫొటో క్యాప్షన్, ‘‘వారి నుంచి తప్పించుకోవడానికి అర్ధనగ్నంగా వీధుల్లో పరిగెత్తాను’’ అని బాధితురాలు తెలిపారు
    • రచయిత, రవీందర్ సింగ్ రాబిన్
    • హోదా, బీబీసీ కోసం

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు.

ఒక మహిళ దుస్తులను లాగేసి, అర్ధనగ్నంగా మార్చి పొరుగువారు ఆమెపై దాడి చేసిన ఘటన పంజాబ్ రాష్ట్రం తార్న్ తారన్ జిల్లా వాల్టోహా గ్రామంలో జరిగింది.

అర్ధనగ్నంగా ఉన్న ఆ మహిళ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది.

తన కుమారుడు పొరుగు అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే తనపై ఈ దాడి జరిగిందని బాధితురాలు చెప్పారు. తన కుమారుడు ఊరు విడిచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, నిందితులు ఆమె ఒంటిపై దుస్తుల్ని లాగేయడమే కాకుండా, అర్ధనగ్నంగా ఆమె వీధుల్లో పరిగెడుతున్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో బాధితురాలు వీధిలోని దుకాణాల్లో దాక్కునేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది.

ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసినట్లు తార్న్ తారన్ పోలీస్ సీనియర్ అధికారి అశ్వనీ కపూర్ చెప్పారు.

ఏప్రిల్ 3న ఐపీసీ సెక్షన్లు 354, 354బి, 354డి, 323, 149 కింద అయిదుగురిపై కేసు నమోదైనట్లు అశ్వనీ కపూర్ తెలిపారు. ఇందులో నవవధువు తల్లి, సోదరునితో సహా నలుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు.

ఆ తర్వాత ఐటీ చట్టంలోని 67, 67ఎ సెక్షన్లను కూడా జోడించినట్లు చెప్పారు.

జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. వెంటనే నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ డీజీపీని ఆదేశించింది.

పంజాబ్‌లో మహిళపై దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలపై ఇలాంటి నేరాలకు సంబంధించిన చాలా నివేదికలు ఉన్నాయి

అసలు ఏం జరిగింది?

మార్చి 31న ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, తన కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్న యువతి తల్లి, సోదరునితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తనను కొట్టడంతో పాటు దుస్తులను లాగేసి అర్ధనగ్నంగా మార్చి వీడియో రికార్డ్ చేశారు.

‘‘వారి నుంచి తప్పించుకోవడానికి నేను వీధిలోని దుకాణాల వైపు పరిగెత్తాను. ఒక దుకాణంలో దాక్కున్నాను. అయిదుగురు నాపై దాడి చేశారు. వారు నేను చెప్పేదేమీ వినలేదు. నాతో చాలా దారుణంగా ప్రవర్తించారు. నా దుస్తుల్ని చించేశారు. వెంటనే వీధిలోకి పరిగెత్తి నా ప్రాణాల్ని కాపాడుకున్నా’’ అని బాధితురాలు చెప్పారు.

ఒక మహిళ సహా నలుగురు పురుషులు తనపై దాడి చేశారని, పోలీసులు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని ఆ మహిళ తెలిపారు.

పంజాబ్ మహిళా కమిషన్ జోక్యం

ఈ ఘటనను పరిగణలోకి తీసుకున్న పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్, వెంటనే కేసు నమోదు చేసి, తక్షణమే డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారితో విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున తార్న్ తారన్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ), డిప్యూటీ కమిషనర్లకు ఒక లేఖను పంపారు.

ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా ఈ కేసుకు సంబంధించిన నివేదికను తయారుచేసి తమకు పంపాలని అందులో రాష్ట్ర కమిషన్ పేర్కొంది.

పంజాబ్ పోలీస్ అధికారి

ఫొటో సోర్స్, BBC/ROUNDER ROBIN

ఫొటో క్యాప్షన్, వాల్టోహా పోలీస్ అధికారి సునీతా బవా

పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?

ఈ కేసు గురించి వాల్టోహా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) సునీతా బవా మాట్లాడారు.

‘‘బాధితురాలి కుమారుడు పొరుగునే నివసించే మహిళను ప్రేమ వివాహం చేసుకోవడమే ఈ ఘటన జరగడానికి కారణం.

ప్రేమ వివాహం జరగడంతో యువతి తల్లిదండ్రులు దీని గురించి మాట్లాడేందుకు యువకుడి ఇంటికి వెళ్లారు. అక్కడ బాధితురాలితో వాగ్వాదం జరిగింది.

ఈ వాగ్వాదం గొడవగా మారింది. వీడియో ఫుటేజీలో గొడవ జరుగుతున్నప్పుడు ఆ మహిళ నగ్నంగా ఉన్నట్లుగా కనబడుతోంది’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)