ఇజ్రాయెల్-గాజా యుద్ధం: ఆరు నెలల విధ్వంసాన్ని ఆపేదెవరు... శాంతి స్థాపనకు అడుగడుగునా అడ్డంకులు ఎందుకు?

ఇజ్రాయెల్ - గాజా యుద్ధం

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి ఆరు నెలలు గడిచిపోయింది. ప్రతిగా ఇజ్రాయెల్ దాడులతో గాజా కుదేలవుతోంది. ఈ ఆరు నెలల యుద్ధం కారణంగా రోగాలు, పస్తులు, చావులతో గాజాలోని పాలస్తీనియన్ల జీవితం ధ్వంసమైంది.

ఇజ్రాయెల్‌లో కూడా ఈ విషయంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

గాజాపై సంపూర్ణ విజయం అనే మాటకు కట్టుబడి ఉండేందుకు ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కష్టపడాల్సి వస్తోంది.

ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు దాని మిత్రదేశం అమెరికా కూడా ఎదురుతిరిగేలా చేస్తోంది.

ఇటీవల సిరియాలో ఇరాన్ జనరల్ హత్యకు గురవడానికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఓ పక్క ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన పూనుతుంటే మరోపక్క ఇరాన్‌ సంపూర్ణ మద్దతు గల హిజ్బోల్లాతో ఇజ్రాయెల్ నెలల తరబడి పోరు సలుపుతూనే ఉంది.

ఇరాన్ జనరల్ హత్య తరువాత మధ్య ప్రాచ్యంలో యుద్ధం అనివార్యమనే ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.

హమాస్ ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 33వేల మంది మరణించారు.

వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే.

చిన్నారుల హక్కుల కోసం పనిచేసే ‘సేవ్ ది చిల్ట్రన్’ సంస్థ గాజాలో 13వేల 800మంది పాలస్తీనా చిన్నారులు మరణించారని, 12,009 మంది పిల్లలు గాయపడ్డారని తెలిపింది.

యూనిసెఫ్ రిపోర్ట్స్ ప్రకారం కనీసం వెయ్యిమంది చిన్నారులు ఒకటి లేదా పూర్తిగా రెండు కాళ్ళను పోగొట్టుకున్నారు.

అక్టోబర్ 7న హమాస్ దాడిలో 1200 మంది మరణించారు. 253 మందిని బందీలుగా గాజాకు పట్టుకుపోయారు.

ఇప్పటికీ గాజాలో 130 మంది బందీలుగా ఉన్నారని, 34 మంది చనిపోయారని ఇజ్రాయెల్ చెబుతోంది.

బందీలపై అత్యాచారాలు, లైంగిక హింస, అమానవీయంగా ప్రవర్తించడానికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని ఐక్యరాజ్య సమితి బృందం నివేదించింది.

బందీలపై ఈ హింస నిరంతరం కొనసాగుతోందని చెప్పడానికి తమ వద్ద తగిన ప్రాతిపదిక ఉన్నట్టు పేర్కొంది.

ఇజ్రాయెల్ - గాజా యుద్ధం

ఫొటో సోర్స్, Oren Rosenfeld

ఫొటో క్యాప్షన్, దగ్థమైన ఓ ఇంటిలో వేలాడుతున్న స్కూల్ బ్యాగ్, పిల్లల జాకెట్స్

ఇంకా అదే భయం

గాజాతో ఇజ్రాయెల్ సరిహద్దులోని కిబుట్జ్‌ నిర్‌ ఓజ్ ఇంకా అక్టోబరు 7 నాటి భయానక పరిస్థితులను దాటి బయటకు రాలేకపోతోంది.

ఆ రోజు ఉదయం సరిహద్దు కంచెను తొలగించి హమాస్ ఫైటర్లు చొచ్చుకొచ్చారు.

ఇజ్రాయెలీ సైనికులు మధ్యాహ్న సమయానికి ఈ ప్రాంతానికి చేరుకునేలోపే హమాస్ ఫైటర్లు అక్కడ నివసిస్తున్న కనీసం 400 మంది ఇజ్రాయెలీలను చంపడమో లేదంటే బందీలుగా తీసుకుపోవడమో చేశారు.

నిర్‌ ఓజ్‌లో పెరిగిన 50 ఏళ్ళ రాన్ బహత్ ఆ పరిసరాలన్నింటినీ చూపించారు.

హమాస్ ఫైటర్లు ఆయన ఇంటిలోకి చొరబడినప్పుడు, ఆయన కుటుంబమంతా సురక్షిత గదిలో దాక్కుని బతికి బయటపడ్డారు.

మేము అక్కడ వరుసగా ఉన్న చిన్న చిన్న ఇళ్ళ ముందు నుంచి నడుస్తున్నాం.

ఆ ఇళ్ళ ముందు తోటలన్నీ బాగా పెరిగిపోయాయి.

చాలా ఇళ్ళు బుల్లెట్లు చేసిన రంధ్రాలతోనో లేదంటే దగ్ధమయ్యో కనిస్తున్నాయి.

ఆ ఇళ్ళ నుంచి శవాలను వెలికి తీశాకా వాటిని అలాగే వదిలేశారు.

రాన్ బహత్ తన స్నేహితుల, ఇరుగు పొరుగువారి ఇళ్ళను చూపించారు.

ఆ ఇళ్ళలోని వారిని చంపేయడమో, లేదంటే బందీలుగా తీసుకుపోయారని ఆయన తెలిపారు.

ఘోరంగా దెబ్బతిన్న ఓ ఇంట్లో ఇస్త్రీ చేసిన పిల్లల బట్టలు మంటల నుంచి బయటపడినట్టుగా కనిపిస్తున్నాయి.

విషాదం ఏమిటంటే.. పాలస్తీనియన్లతో శాంతికి సంప్రదాయంగా మద్దతు పలికే వామపక్ష ఉద్యమంలో నిర్‌ ఓజ్ ఓ భాగం.

హమాస్ ఈ ప్రాంతంలోకి చొరబడిన ఆరు నెలల తరువాత గాజాకు ఏ విధమైన మినహాయింపులు ఇవ్వడానికి రాన్ సిద్ధంగా లేరు.

‘‘ మేమిక్కడ శాంతి, సుస్థిరతను తీసుకొచ్చే నాయకుడి కోసం చూస్తున్నాం. కానీ హమాస్‌కు మద్దతు ఇచ్చేవారెవరైనా శత్రువులే. ఎప్పుడైతే హమాస్ ఆయుధాలను వదిలేస్తుందో అప్పుడే యుద్ధం ముగిసిపోతుంది. కానీ ఇజ్రాయెలీలు ఆయుధాలను వదిలేస్తే మేం మరణించడం ఖాయం, అసలు తేడా ఇదే’’ అంటారు రాన్.

ఇజ్రాయెల్ - గాజా యుద్ధం
ఫొటో క్యాప్షన్, తమ ఇంటిని చూసుకోవడానికి వచ్చిన యమిట్ అవిటాల్

తిరిగి వచ్చేదెపుడో తెలియదు

నిర్‌ ఓజ్‌లో ఇప్పటికీ పగిలిన అద్దాలు కాళ్ళ కింద నలుగుతున్నాయి.

ఇళ్ళ నుంచి చెక్కలు, ప్లాస్టిక్ కాలిన వాసన వస్తోంది.

వాటిని శుభ్రం చేయడానికి అక్కడ ఎవరూ లేరు.

ఇక్కడ నుంచి బతికి బయటడిన నివాసితులు అప్పడప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోతున్నారు.

చాలా మంది ఈ ప్రాంతానికి దూరంగా హోటళ్లలోనూ, సెంట్రల్ ఇజ్రాయెల్‌లోనూ ఉంటున్నారు.

కొన్నిగంటల కిందటే ఇక్కడకు వచ్చిన యమిట్ అవిటాల్ తన స్నేహితుడితో కనిపించారు.

అక్టోబర్‌లో హమాస్ దాడి జరిగిన సమయంలో ఆమె టెలిఅవీవ్‌లో ఉన్నారు.

ఆమె భర్త, పిల్లలతోపాటుగా నిర్‌ఓజ్‌ నుంచి తప్పించుకున్నారు.

అక్కడికి సమీపంలోనే నివస్తున్న ఆమె సోదరుడు ఈ దాడుల్లో చనిపోయారు.

నిర్‌ ఓజ్‌లో తిరిగి నివసించడానికి వస్తారా అని అడిగినప్పుడు ఆమె చేతులు కొద్దిగా వణికాయి.

‘‘బందీలు తిరిగొచ్చిన తరువాత ఇక్కడకు మళ్ళీ వచ్చే విషయం ఆలోచిస్తాం. ఇప్పుడే దీని గురించి చెప్పలేం. గాజాలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు’’ అని తెలిపారు.

ఇజ్రాయెల్, గాజా యుద్ధం

ఫొటో సోర్స్, BBC SPORT

‘నరమేధం’పై విచారణ

నిర్‌ ఓజ్‌లో పరిస్థితులను రాన్ బహాత్ చూపించినట్టుగా ఖాన్ యూనిస్‌లో గానీ లేదంటే గాజా నగరంలోని శిథిలాలను కానీ, రఫాలో నిరాశ్రయులై గుడారాల్లో జీవిస్తున్న 14 లక్షల మంది పౌరుల గురించి చెప్పేవారెవరూ లేరు.

గాజా సరిహద్దుల నియంత్రణ ఇజ్రాయెల్, ఈజిప్ట్ చేతుల్లో ఉండటం వల్ల గాజాలోకి ప్రవేశించేందుకు జర్నలిస్టులకు అనుమతి లభించడం లేదు.

మీడియాకు ఆహ్వానం ఉన్నప్పుడు మాత్రమే జర్నలిస్టులు అక్కడకు వెళ్ళగలుగుతున్నారు. అది కూడా ఇజ్రాయెలీ రక్షణ దళాల పర్యవేక్షణలో ఉంటుంది.

నవంబర్‌ మొదటివారంలో ఉత్తర గాజాలో ఉన్నవారిలో నేను కూడా ఒకరిని.

యుద్ధం మొదలైన ఒక నెలకే ఇజ్రాయెలీ అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతాన్ని బీడు భూమిగా మార్చింది.

హమాస్, ఇజ్రాయెల్ రెండూ కూడా యుద్ధ నేరాలకు పాల్పడ్డాయనే ఆధారాలు సమకూరుతున్నాయి.

ఇజ్రాయెల్‌ పాలస్తీనాలో నరమేధానికి పాల్పడిందనే దక్షిణాఫ్రికా ఫిర్యాదుపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయ స్థానం విచారణ జరుపుతోంది.

హమాస్‌ను అమెరికా, యూకే సహా అనేక దేశాలు తీవ్రవాద సంస్థగా గుర్తించడం వల్ల ఐసీజే హమాస్‌పై విచారణ జరపలేదు.

అయితే నరమేధం ఆరోపణలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది.

నాజీల నరమేధంలో 60 లక్షలమంది యూదులు మరణించిన తరువాత ఏర్పడిన ఇజ్రాయెల్‌పై అటువంటి ఆరోపణలు చేయడం ఆ దేశ పౌరులకు, మద్దతుదారులకు చాలా వికృతంగా అనిపిస్తోంది.

‘‘ ఇజ్రాయెల్, పాలస్తీనాలో పౌరుల నరకయాతనకు కారణం హమాస్ వ్యూహాల ఫలితమే’’ అని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్ న్యాయవాది టాల్ బెకర్ చెప్పారు.

ఏళ్ళ తరబడి ఇజ్రాయెల్ సైనికుల ఆక్రమణల వల్ల పాలస్తీనియన్లన్లు ఈ అభియోగాలను భిన్న దృక్పథంతో చూస్తున్నారు.

కనీస ప్రాథమిక హక్కులను నిరాకరించే వివక్షాపూరిత దేశాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే సృష్టించిందని అనేకమంది పాలస్తీనియన్లను నమ్ముతున్నారు.

‘‘పిల్లలను చంపడమమంటే పిల్లలను చంపడమే అవుతుంది. చనిపోయిన పిల్లలు ఎవరన్నది ప్రశ్నే కాదు. ఎవరి పేరుతో చంపినా అది న్యాయమెలా అవుతుంది’’ అని ప్రసిద్ధ పాలస్తీనా క్రిస్టియన్ రాజకీయ కార్యకర్త దిమిత్రి దిలియానీ జెరుసలెంలో ఈస్టర్ పండుగ వేళ నాతో అన్నారు.

‘‘ నాజీల నరమేధం నిజమని నేను నమ్ముతాను. అంటే దానర్థం ఇతరులను చంపడానికి ఇజ్రాయెల్‌కు పచ్చజెండా ఊపడం కాదు’’ అని ఆయన వివరించారు.

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ కేసు ఏళ్ళతరబడి సాగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌పై ఆరోపణలు చేసినవారు ఇజ్రాయెల్ నరమేథానికి పాల్పడిందనే ఆరోపణలను నిరూపించాల్సి ఉంటుంది.

ఇందులో యుద్ధం, పౌరుల మరణాలను సొంతంగా నరమేధం కింద జోడించడానికి వీల్లేదు.

అయితే దక్షిణాఫ్రికా న్యాయవాద బృందం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యెవ్ గల్లాంట్ అక్టోబర్9న నరమేథం ఉద్దేశాన్ని ప్రదర్శించారని వాదిస్తున్నారు.

‘‘గాజాస్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేయమని ఆదేశించాను. అక్కడ విద్యుత్, ఆహారం, ఇంధనం, అన్నింటిని మూసేయమని చెప్పాను’ అని ఆయన బీర్‌షెబాలోని ఇజ్రాయెల్ రక్షణ దళ దక్షిణ కమాండ్‌ను సందర్శించాకా చెప్పారు.

‘‘మేం మానవ మృగాలతో పోరాడుతున్నాం. అందుకే దానికి తగినట్టుగా నడుచుకుంటున్నాం’’ అని యెవ్ గల్లాంట్ చెప్పారు.

అయితే మంత్రి చెప్పిన గాజా అష్టదిగ్బంధనం అంతర్జాతీయ సమాజంతోపాటు అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇజ్రాయెల్ సడలించుకోవాల్సి వచ్చింది.

గాజా

ఫొటో సోర్స్, Reuters

సాయానికి గాయం

గాజాకు ఇప్పటికీ పరిమిత సాయమే అందుతోంది.

గాజాలోని ఆహార అత్యవసర స్థితి గురించిన సమాచారాన్ని ఐక్యరాజస్య సమితి సంస్థలు, సహాయక ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి.

అహార అత్యవసర పరిస్థితులను విశ్లేషించే ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యురిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) ప్రకారం యుద్ధం మొదలైన ఆరునెలల తరువాత గాజా తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూస్తోందని, ఆహార అత్యవసర సమాచారాన్ని అందించే ఐక్యరాజ్య సమితి , ఇతర సహాయక బృందాలు చెబుతున్నాయి.

జనవరి నుంచి ఉత్తర గాజాలో చిక్కుకుపోయిన 30వేలమంది ప్రజలు సగటున కేవలం 245 కేలరీల ఆహారంతో జీవిస్తున్నారని ఆక్స్‌ఫామ్ నివేదిక చెబుతోంది.

ఇది ఓ డబ్బా చిక్కుడు గింజల ఆహారంతో సమానం.

గాజాలోని ఈ మానవీయ విపత్తు గురించి అక్కడి స్థానిక జర్నలిస్టులు, పౌరులు సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తున్నారు.

ఆ ప్రాంతంలో సహాయక కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతి ఉన్న అంతర్జాతీయ సంస్థలకు చెందిన సిబ్బంది కూడా అక్కడి పరిస్థితులను తెలుపుతున్నారు.

లక్షలాదిమంది ఆహారాన్ని అందిస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్ (డబ్ల్యుసీకే)కు చెందిన ఏడుగురు సిబ్బందిని ఏప్రిల్ 1వ తేదీ ఇజ్రాయెలీ సైన్యం హతమార్చింది.

వీరి మరణం ఇజ్రాయెల్‌కు దృఢమైన మిత్రులుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా, ఇతర పశ్చిమదేశాల నాయకులకు ఆగ్రహం తెప్పించింది.

దీని కారణంగా ఇజ్రాయెల్ మరింత ఏకాకిగా మారింది.

ప్రపంచం నుంచి ఇజ్రాయెల్ ఎక్కువగా సానుభూతినేమీ ఊహించడం లేదు.

శక్తిమంతమైన పశ్చిమ మిత్రదేశాల నుంచి అది మద్దతును కోరుకుంటోంది.

కానీ సహాయక సామాగ్రి తరలింపునకు తాము ఆటంకం కలిగించబోమనే ఇజ్రాయెల్ ప్రకటనను పశ్చిమ మిత్రదేశాలు తోసిపుచ్చుతున్నాయి.

గాజాలో అమెరికన్ ఆయుధాలను వినియోగించడంపై నిషేధం విధిస్తామని బైడెన్ హెచ్చరించారు.

బహుశా వరల్డ్ కిచెన్ సెంటర్ సిబ్బందిని హతమార్చడం వల్ల బైడెన్ సహనం నశించినట్టుగా కనిపిస్తోంది.

బైడెన్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇజ్రాయెల్‌కు కు మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు.

ఇజ్రాయెల్‌కు మద్దతు పలకడానికి ఇప్పటీకీ ఆయన కట్టుబడి ఉన్నారు.

కానీ తమ మద్దతు నెతన్యాహుకు, ఆయన తీవ్రవాద సంకీర్ణ బాగస్వాములకు రక్షణ వలయం కాకూడదని అమెరికా భావిస్తోంది.

ఇజ్రాయెల్ - గాజా యుద్ధం

ఫొటో సోర్స్, Oren Rosenfeld

పాలస్తీనా ప్రశ్నలకు జవాబులేవీ?

వేలాదిమంది గాజాన్లు చనిపోయిన తరువాత ఆరుగురు పాశ్చాత్యులు సహా ఏడుగురు సహాయక సిబ్బంది చనిపోవడంపై అంతపెద్ద ఆగ్రహం, అసహనం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని పాలస్తీనా అడుగుతోంది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి సమయం పట్టి ఉండొచ్చుకానీ, యుద్దంలో అదో కీలక మలుపునకు కారణమవుతుంది.

దీనిని తెలుసుకోవడానికి ఉన్న మార్గమేంటంటే వచ్చే నెలలోనో, ఆపైనో ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరులను హతమార్చడం తగ్గించిందా లేదా అని చూడటం, అలాగే పెరిగిన ఆహార, వైద్య సహాయం గాజాను కరువు కోరలనుంచి బయటపడేసిందా లేదా అని లెక్కించడం.

మరోక మార్గం నెతన్యాహు అమెరికా వ్యతిరేకతను పట్టించుకోకుండా, హమాస్ సంస్థలు ఇంకా మిగిలి ఉన్నాయని చెబుతున్న రఫాపై దాడి చేసి, వాటిని పూర్తిగా నిర్మూలించడం.

అయితే రఫాలో ఆశ్రయం పొందుతున్న 15 లక్షలమంది పాలస్తీనీయుల జీవితాలకు భద్రత కల్పించేవరకూ ఇజ్రాయెల్ ఆ పని చేయకూడదని అమెరికా చెబుతోంది.

అక్టోబర్ 7న ఇజ్రాయెలీలకు చెప్పిన ‘శక్తిమంతమైన ప్రతీకారాన్ని’ బెంజిమెన్ నెతన్యాహు తీర్చారు.

కానీ సంపూర్ణ విజయం, హమాస్‌ను ధ్వంసం చేయడం, బందీలను విడిపించడమనే ఇతర ప్రతిజ్ఞలను ఇంకా నెరవేర్చలేకపోయారు.

ఇంతలో ఇజ్రాయెల్‌లో నెత్యన్యాహుపై రాజకీయ ఒత్తిడి పెరిగిపోతోంది.

ఒపినియన్ పోల్స్‌లో ఆయన పరపతి దిగజారిపోతోంది.

ఇజ్రాయెల్, గాజా యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో ఉచిత ఆహారాన్ని తీసుకునేందుకు గుమిగూడిన ప్రజలు

నెతన్యాహుపై వ్యతిరేకత

గడిచిన కొన్నివారాలుగా జెరుసలెంలో వేలాదిమంది నిరసనకారులు ఇజ్రాయెలీ జెండాలను పట్టుకుని, పార్లమెంటు చుట్టూ ఉన్న వీధులలోకి వచ్చి నెతన్యాహు రాజీనామా చేయాలని, కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

‘‘నెతన్యాహు ఈ యుద్ధాన్ని ఎంతకాలం వీలైతే అంత కాలం సాగదీయాలనుకుంటున్నారు. యుద్ధాన్ని చూపి ఇది ఎన్నికలకు సరైన సమయం కాదని చెప్పొచ్చు’’ అని నెతన్యాహు వ్యతిరేక ఉద్యమ నేతలలో ఒకరైన నవా రోసాలియో చెప్పారు.

ఆమె గ్రూపు పేరు హిబ్రూలో బుషా. బుషాను తర్జుమా చేస్తే సిగ్గు అనే అర్థం వస్తుంది.

హమాస్ దాడులు చేసే సమయానికి ఇజ్రాయెల్ ప్రభుత్వ మితవాద విధానాల మీద ఇజ్రాయెల్‌లో పెద్దఎత్తున చీలిక వచ్చింది.

ఆ సమయంలో జరుగుతున్న నిరసనలలో భాగంగా తమ సైనిక సేవలను నిలిపివేసిన రిజర్వ్ దళాలు హమాస్ దాడుల తరువాత తిరిగి యూనిఫామ్‌లోకి వచ్చాయి.

జాతీయ ప్రయోజనాల రీత్యా నిరసనలకు కూడా విరామం ప్రకటించారు.

ఆరునెలల తరువాత ప్రభుత్వ వైఫల్యంపైన పోరాడటం, బందీలను విడిపించి, యుద్ధానికి ముగింపు పలకమని చెప్పడానికి నిరసన వ్యక్తం చేయడం దేశభక్తి లేకపోవడం కాదనే పరిస్థితి ఏర్పడింది.

ఇజ్రాయెల్‌లోని విభేదాలు మరోసారి విస్తృతమయ్యాయి.

నెతన్యాహు తన రాజకీయ అస్తిత్వానికే ప్రాధాన్యమిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆయన అధికారంలో కొనసాగడానికి అతివాద యూదు పార్టీల మద్దతుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సి వస్తోంది.

కాల్పుల విరమణ జరగకుండా, ఇజ్రాయెలీ బందీలను విడుదల కోసం పాలస్తీనా భద్రతా ఖైదీలను సామూహికంగా విడుదల చేయడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.

అంతేకాదు నెతన్యాహు అతివాద మిత్రులలో ఆర్థిక మంత్రి బెజాలెట్ స్మోట్రిచ్, జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ విర్ మరో అడుగు ముందుకు వేసి, పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టి పోతే, యూదులకు అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.

రాజకీయ కళలో నిష్ణాతుడైన ప్రధాని నెతన్యాహు ఓ పక్క తన అతివాద మిత్రపక్షాలను సంతోషరుస్తూనే మరోపక్క వారి అభిప్రాయాలు ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబం కావని కొట్టిపారేస్తున్నారు.

అక్టోబర్ 7నాటి హమాస్ దాడుల సూత్రధారి యహ్యా సిన్వర్‌ను పట్టుకోవడమో, మట్టుపెట్టడమో జరిగితే విజయం సాధించామని చెప్పుకోవడానికి ఇజ్రాయెల్‌కు ఒక అవకాశం చిక్కుతుంది.

కానీ యహ్యా సిన్వర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.

కాల్పుల విరమణ చర్చల ప్రతిపాదనలపై ఆయన సమాధానాలు పంపుతూనే ఉన్నారు. ఆయన హమాస్ సొరంగాలలో ఎక్కడో దాక్కుని ఉన్నారని, చుట్టూ అంగరక్షకులు ఉన్నారని, ఇజ్రాయెలీ బందీలను కవచంగా వాడుకుంటున్నారని తెలుస్తోంది.

గాజాకు వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరుసలెంలోని పాలస్తీనీయన్లు మద్దతు పలకకపోవడంపై యహ్యా కచ్చితంగా నిరాశకు గురై ఉంటారు.

గాజా సహా విస్తృత మధ్యప్రాచ్యంలో పరిణామాలు ఎలా మారుతాయోననే సుదీర్ఘ దృక్పథం గురించి కొందరు మాట్లాడుతున్నారు.

పాలస్తీనీయన్లను ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి అవకాశం లేకపోవడంతో కొందరు తమ కుటుంబాలు పోషించుకోలేక అవస్థపడుతున్నారు.

మరి కొందరు భయం నీడన బతుకున్నారు.

వెస్ట్‌బ్యాంక్‌లోని సాయుధ బృందాలపై ఇజ్రాయెల్ అనేక భీకర దాడులు చేసింది.

ఈ దాడులలో అనేకమంది అమాయకులను చంపింది.

వేలాదిమందిని ఎటువంటి విచారణ లేకుండానే నిర్బంధించింది.

అతివాద యూదు సెటిలర్లు హింసించడం, తీవ్రంగా బెదిరించడంతో పాలస్తీనా రైతులు తమ భూములను వదిలి పారిపోవాల్సి వచ్చింది.

ఇజ్రాయెల్ గాజా యుద్ధం

ఫొటో సోర్స్, Muath Khati

ఫొటో క్యాప్షన్, గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా వెస్ట్‌బ్యాంక్‌లో నినాదాలు చేస్తున్న ప్రదర్శనకారులు

పరస్పర అపనమ్మకం

అక్టోబరు7నాటి హమాస్ దాడులకు పాలస్తీనీయన్ల బలమైన మద్దతు ఉన్నట్టు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.

హమాస్ అకృత్యాలకు పాల్పడిందనే ఆధారాలను చాలామంది ఖండించారు.

వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఓ నిరసన ప్రదర్శనలో పాలస్తీనా కార్యకర్త జోహరా బేకర్ ను, హమాస్ దాడులు ఇజ్రాయెల్ పాలననుంచి పాలస్తీనీయన్లను స్వతంత్రం దిశగా దగ్గర చేశాయా అని అడిగే ఇప్పడది పాయింట్ కాదని ఆమె చెప్పారు.

‘‘అక్టోబర్ 7న జరిగిన ఘటన సుదీర్ఘకాలం పాటు కొనసాగిన అణచివేతకు ఓ సంకేతం. మేం స్వేచ్ఛ పొందేవరకూ మా పోరాటం కొనసాగుతుంది. ఇది ఆక్రమణ, అణచివేత, వలసవాదుల కింద ఉన్నవారెవరైనా చేసే పని ఇదే’’ అని చెప్పారు.

హమాస్‌ను ఇష్టపడనివారు కూడా , దాని దాడుల కారణంగా స్వతంత్ర పాలస్తీనా కాంక్షను మద్యప్రాచ్యం మ్యాప్‌లోకి తీసుకువచ్చేలా చేసిందని నమ్ముతున్నారు.

ఇందుకోసం యుద్ధం ఓ సరికొత్త మార్గాన్ని సిద్ధం చేసిందని ప్రసిద్ధ పాలస్తీనియన్ విశ్లేషకుడు ఖలీల్ షికాకీ చెప్పారు.

రెండు దేశాల పరిష్కారంపై యువ పాలస్తీనియన్లకు నమ్మకం లేదని వీరి తాజా సర్వే చెబుతోంది.

మధ్యధరా సముద్రం, జోర్డాన్ నది మధ్యనున్న ప్రాంతం స్వతంత్ర రాజ్యం కావాలని

30 ఏళ్ళలోపు ఉన్న యువకులు నమ్ముతున్నారని ఖలీల్ చెప్పారు.

తమ పోరాటాన్ని దక్షిణాఫ్రికాలో జరిగిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాటంతో పోల్చుకుంటున్నారు.

తమ కోసం ఇజ్రాయెలీ జైలులో ఓ పాలస్తీనా నెల్సన్ మండలే ఎదురుచూస్తున్నారని వారు నమ్ముతున్నారు. ఆయనే మార్వన్ బర్ఘౌటీ.

2002 నుంచి ఆయన జైలులో ఉన్నారు.

హత్యా నేరం కింద ఐదు జీవిత ఖైదులను అనుభవిస్తున్నారు.

ఆయన అధ్యక్ష పీఠానికి పోటీపడితే తేలికగా గెలుస్తారు.

ఆయన పాలస్తీనా ఫ్యాక్షన్ వర్గానికి వ్యతిరేకమైనప్పటికీ ఫతా, హమాస్ బందీల మార్పిడి జాబితాలో మార్వాన్ బార్ఘౌటీ పేరును అగ్రభాగాన ఉంచాయి.

అయితే ఇజ్రాయెల్ యూదులు తమ దేశం యూదు స్వభావాన్ని కోల్పోవడానికి ఎప్పటికీ ఇష్టపడరు.

కానీ పాలస్తీనా అది సాధ్యపడే విషయంగానే చూడటంతో వీరి మధ్య దూరం పెరగడానికి మరో కారణంగా నిలుస్తోంది.

ఇజ్రాయెల్, గాజా యుద్ధం

ఫొటో సోర్స్, REUTERS

‘గ్రాండ్ బార్గెయిన్’కు నో

యుద్ధం మొదలై ఆరునెలలు గడుస్తున్నా దాని ముగింపుపై ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదు. యుద్ధం ముగిసిన తరువాత గాజాలో పరిపాలన ఇజ్రాయెల్ అధీనంలోనే ఉండాలని, మరోమాటలో చెప్పాలంటే దాని ఆక్రమణలో ఉండాలనే విషయం కాకుండా ఇతర అంశాలను బెంజిమిన్ నెతన్యాహు దాటవేస్తున్నారు.

వెస్ట్‌బ్యాంక్‌లో కొన్ని ప్రాంతాలను పాలిస్తున్న పాలస్తీనియన్ అథార్టీ దళాలు ఇజ్రాయెలీ దళాల స్థానాన్ని భర్తీ చేస్తాయనే అమెరికా ప్రతిపాదనను నెతన్యాహు తిరస్కరించారు.

గాజాను పరిపాలించడానికి పునరుజ్జీవం పొందిన పాలస్తీనా అథార్టీ కావాలని అమెరికా కోరుకుంటోంది. ఇందుకోసం దానికి కొత్త నాయకత్వం అవసరమవుతుంది.

ప్రస్తుత పాలస్తీనా అథార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ వృద్ధుడే కాక, పూర్తిగా అప్రతిష్ఠ పాలయ్యారు.

అవినీతిపై పోరాడటంలో ఆయన విఫలమయ్యారని పాలస్తీనియన్లను చెబుతున్నారు.

గాజా పట్ల సానుభూతి చూపడంలోనూ, యూదు సెటిలర్ల ఆగడాల నుంచి పాలస్తీనియన్లను రక్షించమని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పాలస్తీనియన్లకు ఆగ్రహంగా ఉంది.

మధ్యప్రాచ్యాన్ని మార్చివేసే జో బైడెన్ ‘గ్రాండ్ బార్గెయిన్’ ఆలోచనను కూడా బెంజిమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు.

పాలస్తీనాకు స్వతంత్రానికి ప్రతిఫలంగా సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను గుర్తిస్తుంది.

ఇందుకు ప్రతిఫలంగా సౌదీ అరేబియా నాటో తరహా రక్షణ ఒప్పందాన్ని అమెరికాతో చేసుకుంటుంది.

ఈ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని నెతన్యాహు అమెరికా ప్రతిపాదించిన పాలస్తీనా రాజ్యం అనే ప్రాణాంతక ప్రమాదం నుంచి రక్షించేది తాను ఒక్కడినే అని ఇజ్రాయెలీలకు చెబుతున్నారు.

సౌదీ అరేబియాతో ఒప్పదం కంటే వెస్ట్‌బ్యాంక్, జెరుసలెంను తమ అధీనంలోనే ఉండాలనే ప్రభుత్వంలోని అతివాదులకు నెతన్యాహు మాట వీనులవిందుగా ఉంది.

యుద్ధం శాంతి స్థాపనకు అనేక అడ్డంకులు సృష్టించింది.

1950 60ల మధ్య సాగిన హత్యలు, హైజాక్‌లు, యుద్ధం కారణంగా ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లను ఒకరినొకరు అనుమానించుకుంటూనే ఉన్నారు.

అక్టోబరు 7 నుంచి ఇరుపక్షాలలో అమానవీయత పెరిగిపోవడాన్ని ఖలీల్ షికాకీ గుర్తించారు.

‘‘అక్టోబరు 7న నాటి ఘటనల కారణంగా పాలస్తీనియన్లను శాంతిలో భాగస్వాములుగా చూడటం లేదు. వారిని సమానత్వం పొందాల్సినవారిగా గుర్తించడం లేదు. అందుకే ఇజ్రాయెలీలు వారి మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పడవే పరిస్థితులను గాజాలో చూస్తున్న పాలస్తీనియన్లను ఇజ్రాయెలీల మానవత్వం గురించి ప్రశ్నిస్తున్నారు’’

అని ఖలీల్ చెప్పారు.

‘‘పిల్లలను, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నవారు, ఉద్దేశపూర్వకంగా కుటుంబాన్నంతటిని మట్టబెట్టేవారు తమ పొరుగును పూర్తిగా ధ్వంసం చేసేవారు ఎంతమాత్రం మనుషులు కాలేరు. అందుకే మేం వారిని రాక్షసుల్లా చూస్తాం’’

‘‘ఈ అమానవీయత భవిష్యత్తుకు వినాశకరం’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)