ఈ ఊరిలో అడుగుపెడితే ఎలా ఉంటుందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమాండ రగ్గెరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పర్యావరణ హితంగా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న గ్రామాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించి జాబితా విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO).
ప్రపంచాన్నిచుట్టేయాలనుకునే పర్యటకుల్లో ఉత్సాహాన్నినింపే పర్యాటక ప్రాంతాల జాబితా బయటకొచ్చింది.
స్థానిక సంప్రదాయాలను, సహజ ప్రకృతి అందాలను, గ్రామీణ విలువలను, ఆహార వ్యవహారాలను పరిరక్షిస్తూ గ్రామీణ జీవనానికి ప్రాణం పోస్తున్న 54 గ్రామాలను ప్రపంచవ్యాప్తంగా UNWTO గుర్తించింది. ఈ సంస్థ గడిచిన మూడేళ్ల కాలంలో ఈ గ్రామాలను గుర్తించి 2023 జాబితాను విడుదల చేసింది.
ఈ 54 గ్రామాలను తొమ్మిది అంశాల ప్రాతిపదికన ఎంపిక చేశారు. సహజ పర్యావరణాన్ని ఏవిధంగా ఈ గ్రామాలు రక్షిస్తున్నాయి? సుస్థిరాభివృద్ధి సాగించగల పర్యావరణహిత ఆర్థిక విధానాల రూపకల్పనలో ఈ గ్రామాలకున్న నిబద్ధత, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 5 అత్యంత ఆసక్తికర, సుందర గ్రామీణ ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Norikazu Satomi/Alamy
హకూబా, జపాన్
20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన టోనీ ఆండర్సన్ స్నోబోర్డ్ కోసం హకూబా ప్రాంతానికి వచ్చారు. జపాన్ ఆల్ప్స్ పర్వతాల మధ్య నగానోకి 45 కిలోమీటర్ల పశ్చిమాన ఈ ప్రాంతం ఉంటుంది. ఆండర్సన్, మరో ఏడాది తర్వాత ఆ గ్రామానికి తిరిగి వచ్చి ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసి అక్కడే స్థిరపడ్డారు.
స్వయంగా హోటల్ యజమాని అయిన ఆండర్సన్, హకూబా సంస్కృతి, ఆతిథ్య మర్యాదలతో సందర్శకులకు స్వాగతం పలుకుతుందని చెబుతున్నారు. పర్యటకునిగా ఇక్కడికి వచ్చినపుడు హోటళ్లలో ఆయనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
హోటళ్లన్నీ పూర్తిగా నిండిపోయినా కూడా ఆయన్ను వెనక్కు పంపడం ఇష్టంలేక హోటల్ హాల్ మధ్యలో పరుపు కింద వేసుకుని పడుకునేందుకు ఆహ్వానించేవారని ఆండర్సన్ చెబుతున్నారు. వచ్చిన అతిథులెవ్వరినీ తిరిగి వెనక్కు పంపకూడదనే వాళ్ల విధానమే దానికి కారణమని, ఈ ప్రాంతం అందరికీ సాదర స్వాగతం పలుకుతుందని అంటున్నారు.
హకూబా ప్రాంతం స్కీయింగ్‌కు బాగా పాపులర్. మంచు విపరీతంగా కురిసే కొన్ని రోజుల్లో రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. హోటళ్లలో ఉండే పర్యటకులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఆతిథ్యం చాలా బావుండాలి అనే అవగాహనతో స్థానికులు పర్యటకులను బాగా చూసుకుంటారు. హకూబాలో దాదాపుగా పది స్కీ రిసార్టులున్నాయి. అనేక స్కీయింగ్ ఈవెంట్లు ఇక్కడ జరిగాయి. 1998 నగానో వింటర్ ఒలింపిక్స్ కూడా ఇక్కడ నిర్వహించారు.
శీతాకాలంలో పాపులర్ డెస్టినేషన్ అయిన హకూబా, సంవత్సరంలో ఎప్పుడు వెళ్లినా అంతే ఆకర్షణీయంగా ఉంటుందని ఆండర్సన్ వివరిస్తున్నారు. వేసవిలో పర్వతాలపైకి వెళ్లి ఉండేందుకు ఆయన ఇష్టపడతారు. ఇక్కడ పర్యటకులకు మరో అట్రాక్షన్ హాట్ స్ప్రింగ్స్.

ఫొటో సోర్స్, Joana Kruse/Alamy
లెరిసీ, ఇటలీ
ఇక్కడొక అందమైన ప్రాంతం సింక్యూ టెర్రే. సుందరమైన సముద్ర తీరాలు పర్యటకులను ఆకర్షిస్తాయి. స్వచ్ఛమైన బీచ్‌లు, రంగురంగుల ఇళ్లతో సింక్యు టెర్రే ఉండే లింగూరియా ప్రాంతం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
వాయువ్య ఇటలీ తీర ప్రాంతంలో జినోవాకు దక్షిణం వైపున వంద కిలోమీటర్ల దూరంలో ఉండే పాపులర్ ట్రావెల్ డెస్టినేషన్ లెరీసీ. ఇక్కడికి వెళ్లేందుకు రైలు మార్గం కూడా లేదు. పర్యాటకం స్థాయికి మించి పెరగకుండా ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తున్నారు.
గల్ఫ్ ఆఫ్ పోయెట్స్ అనే పేరుతో ప్రఖ్యాతి పొందిన ఈ ప్రాంతంలో అనేక సాంస్కృతిక కళాత్మక వేడుకలు జరుగుతూ ఉంటాయి. వాటిలో లెరిసీ మ్యూజిక్ ఫెస్టివల్, ప్రీమియో లెరీసీ పీయే గోల్ఫో డే పోయిటీ అనే సాహిత్య పోటీలు, తరచుగా జరిగే ఎగ్జిబిషన్స్ ప్రపంచ పర్యటకులను బాగా ఆకర్షిస్తాయి.
ఇటలీలోని ఇతర అనేక తీరప్రాంత గ్రామాల్లా కాకుండా లెరీసీ ప్రాంత ప్రజలు తమ సంప్రదాయ మత్స్యకార రంగాన్ని బతికించుకున్నారు.
పర్యావరణ హిత విధానాలతో దీర్ఘకాలం మనుగడ సాగించే విధంగా లెరీసీ పట్టణంలో స్మార్ట్ బే పైలట్ ప్రాజెక్టుని మొదలుపెట్టారు. అంటే ఇక్కడ శాస్త్రసాంకేతిక పరిశోధనలు, తీరప్రాంత పర్యవేక్షణ, జీవావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ సోలార్ ప్యానెల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌పైన నిషేధం, సిగరెట్ల నిషేధం అమల్లో ఉన్నాయి.
లెరీసీ కేవలం ప్రకృతి అందాలతో ఆకర్షించడమే కాదు పర్యావరణహిత విధానాల్లో విజేతగా నిలవాలనేదే ఈ ప్రాంత అంతిమ లక్ష్యమని యూఎన్‌డబ్ల్యుటీవో చెబుతోంది.

ఫొటో సోర్స్, Ariadne Van Zandbergen/Alamy
లెఫీస్, ఇథియోపియా
ప్రకృతి అందాలకు, వైల్డ్‌లైఫ్‌కు నెలవైన లెఫీస్, ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాకు 160 కిలోమీటర్ల దూరంలోని లెఫిస్ అటవీ ప్రాంతంలో ఉంటుంది.
పర్యటకులు ఇక్కడ గుర్రాలపై ట్రెక్కింగ్ చేస్తూ లోయలూ, కొండలు, లెఫిస్ జలపాతాన్ని దాటుకుంటూ వెళ్తారు. దారి పొడవునా వణ్యప్రాణులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కోలోబస్ కోతులు, చిరుతలు, పర్వత నైయాలాలు ఉంటాయి. పక్షి ప్రేమికులకు ఆబీస్సియన్ ఓరియోల్, తెల్ల బుగ్గల టురాకో వంటి అందమైన పక్షులు కనిపిస్తాయి.
లెఫీస్ అడవి రెండు వేల ఇళ్లకు నెలవు. ఈ గ్రామస్తుల జీవినోపాధికి లెఫిస్ ఎకో టూరిజం సాయపడుతోంది. పర్యాటకానికి ఊతమిస్తూ ప్రాంతీయ వారసత్వాన్ని కాపాడుతూ స్థానిక ప్రజల జీవనం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు.
స్థానిక మిషికే హస్తకళల సంఘం, హస్తకళలు, పూసల నగలు, చెక్క పరికరాలు, వెదురుతో చేసిన వస్తువులను చేసి పర్యటకులను ఆకర్షిస్తున్నారు. ఈ సంఘంలో 17 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Lensleb/Alamy
డూమా, లెబనాన్
లెబనాన్‌లో బాట్రూన్ పర్వతశ్రేణుల మధ్య ఉండే ఈ గ్రామంలో రాతి కట్టడాలతో నిర్మించిన ఇళ్లు అందరినీ ఆకర్షిస్తాయి. ఇళ్లపైన ఎర్రటి పెంకులతో కనిపించే పైకప్పులు చాలా అందంగా ఉంటాయి. శతాబ్దాల నాటి చర్చీలు ప్రత్యేక ఆకర్షణ. కొద్దికాలం క్రితం పునరుద్ధరించిన డూమా గ్రామం, ఈశాన్య బేరూత్ ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ గ్రామ సంప్రదాయ నిర్మాణశైలిని, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడంలో డూమా చూపించిన నిబద్దతే యూఎన్‌డబ్లూటీవో జాబితాలో చోటు దక్కడానికి ప్రధాన కారణంగా మారింది. నగర విస్తరణకు దూరంగా ఈ ప్రాంతం రద్దీగా మారిపోకుండా తగిన జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటున్నారు.
డూమా గ్రామంలోని స్థానిక ఆహార సంప్రదాయాలను సజీవంగా బతికించుకున్నారు. బిస్కెట్లతో చేసే రాహా మిఠాయి ఇక్కడ అందరికీ ఫేవరైట్ అని తానిస్సా చెబుతున్నారు.
అలానే ఈ పట్టణంలో దొరికే జాతార్, ఆలివ్ ఆయిల్, చీజ్, జామ్స్ కూడా అందరూ బాగా ఇష్టపడతారు. చాలావరకూ సరుకులు స్థానిక తోటల నుంచి, వైన్‌యార్డుల నుంచీ వస్తాయి.
ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సహజ అందాలే కాకుండా స్థానికుల దయా గుణం చెప్పుకోదగ్గ విషయమని తానిస్సా గుర్తు చేసుకున్నారు. డూమా ప్రజలు ఇతరులకు ఎప్పుడూ సాయం చేసే తత్వం ఉన్నవారని, వాళ్ల ఆతిథ్యం బావుంటుందని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, UNWTO
జపటోకా, కొలంబియా
30 ఏళ్లుగా టీచర్‌గా పనిచిసిన గిల్లార్మో రింకన్ వెలాండియా, ఆరేళ్ల క్రితం తన సొంత పట్టణమైన జపటోకాకు వచ్చి ‘టూర్ కంపెనీ’ మొదలు పెట్టారు. అందుకు ఆయన చెబుతున్న కారణాలను చూస్తే యూఎన్‌డబ్ల్యూటీఓ జాబితాలో జపటోకా ఎందుకు చేరిందో అర్థమవుతుంది. ఉత్తర కొలంబియా ప్రాంతంలో ఉండే జపటోకా 2023లో ప్రపంచ పర్యటకులను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా మారింది.
త్రీ కాన్యన్స్ మధ్యలోని పీఠభూమిపై ఉండే ఈ ప్రాంతం, సముద్రమట్టానికి 1,700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సుందర ప్రకృతి చిత్రాలు, ప్రత్యేక భౌగోళిక వారసత్వం ఈ ప్రాంత సొంతమని వేలాండియా వివరిస్తున్నారు.
ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత పురాతన సముద్ర శిలాజాలున్నాయి. భిన్న భౌగోళిక అందాలు కనిపిస్తాయి. పురాతన అండర్‌గ్రౌండ్ గుహలున్నాయి. ఉష్ణమండల అడవులున్నాయి. స్థిరమైన వాతావరణ పరిస్థితులు పర్యటకులకు అనుకూలంగా మారతాయి. సంవత్సరం పొడవునా ఇక్కడ 20 డిగ్రీల సెల్సియస్ వాతావరణ నమోదవుతుంది. అందుకే దీనిని సిల్క్ లాంటి క్లైమేట్ అంటారు.
పట్టణ సాంస్కృతిక వారసత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పట్టణంలో 18వ శతాబ్దానికి చెందిన ఇళ్లు వైట్ వాష్ వేసి, టెర్రకోటా పైకప్పులతో అందంగా కనిపిస్తాయి. వలస పాలనా కాలం నాటి కట్టడాలు, మత సంప్రదాయాలను, చరిత్రను ప్రతిబింబించే కట్టడాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
అయితే సంగీత ప్రేమికులకు ఈ పట్టణం చాలా ప్రత్యేకంగా మారుతుంది. ఎందుకంటే ఏడాది మొత్తం ఇక్కడ మ్యూజిక్, డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. వాటిలో నేషనల్ డాన్స్ ఫెస్టివల్, గుస్తవో గోమెజ్ ఆర్డిలా ఇంటర్నేషన్ కాయిర్ ఫెస్టివర్, బెల్ ఫెస్టివల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కళలను సజీవంగా బతికించుకున్న ప్రాంతంగా కూడా జపటోకాను చెప్పుకోవాలని వెలాండియా అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- ఉత్తర్కాశి సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికుల్లో బయటికి తీసుకొస్తారనే నమ్మకం పోతోందా?
- రోహిత్ శర్మ: 275 రూపాయల స్కాలర్షిప్ నుంచి వరల్డ్ కప్ ఫైనల్ టీమ్ కెప్టెన్ దాకా...
- బ్లాక్ స్వాన్ - శ్రియ: కే-పాప్‌లో భారత యువతి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి?
- ఎంటర్ ది డ్రాగన్‌కు 50 ఏళ్లు: విడుదలకు ముందే బ్రూస్ లీ ఎలా మరణించారు, ఈ చిత్రం సినిమా చరిత్రను ఎలా మార్చింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ వయసు ఇప్పుడు 92 ఏళ్ళు- ఆ మహా విషాదం ఎలాంటిదో ఆయన మాటల్లోనే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














