ప్రిసిల్లా హెన్రీ: హాలీవుడ్ సినిమాను తలపించే ఓ 'సెక్స్' సామ్రాజ్యాధినేత్రి కథ

ఫొటో సోర్స్, COURTESY CASSANDRA FAY
- రచయిత, జువాన్ ఫ్రాన్సిస్కో అలొన్సో
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
ప్రిసిల్లా హెన్రీ, ఈ పేరు చెబితే అమెరికాలోని చాలా ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారికి పెద్దగా తెలియదు.
హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని, 19వ శతాబ్దానికి చెందిన ఓ అమెరికన్-ఆఫ్రికన్ కథ ఇది.
పుట్టిన తర్వాత, తన జీవితంలో ఎక్కువ భాగం బానిసగానే జీవించారు హెన్రీ. బానిసత్వం నుంచి విముక్తి లభించిన తర్వాత వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మలచుకుని తాను పుట్టిన ఎస్టేట్‌నే కొనేశారామె. అప్పటి వరకూ తెల్లజాతీయుల ఆధిపత్యం కొనసాగిన వివాదాస్పద వ్యాపారానికి నాయకత్వం వహించారు. అదే వ్యభిచారం.
హెన్రీ జీవితం గురించి తెలుసుకునేందుకు బీబీసీ ముండో పలువురు నిపుణులను, డాక్యుమెంట్లను పరిశోధించింది. ఆమెను జాతి ఐక్యతకు దోహదం చేసిన వ్యక్తిగానే కాకుండా, వ్యాపారంలో మార్గదర్శకురాలిగా, లైంగిక స్వేచ్ఛను కాపాడే వ్యక్తిగానూ భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
దూరప్రయాణం
ప్రిసిల్లా హెన్రీ అలబామా రాష్ట్రంలోని ఫ్లోరెన్స్ పట్టణంలో ఉన్న ఓ తోట(ఎస్టేట్)లో పుట్టారని అమెరికాలోని విస్కన్సిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యాష్లే బి.కండిఫ్ అమెరికాలోని వ్యభిచార గృహాల సంస్కృతికి అంకితం చేసిన తన డాక్టోరల్ థీసిస్‌లో రాశారు.
ఆరుగురు సంతానంలో పెద్దదైన ఆమె, 1865 వరకూ దక్షిణ అమెరికాకు చెందిన భూస్వామి జేమ్స్ జాక్సన్ జూనియర్ తోటల్లోనే పనిచేశారు. ఎందుకంటే, తన ఆధీనంలో ఉన్న హెన్రీతో పాటు ఇతరులను బానిసత్వం నుంచి విముక్తులను చేసేందుకు జేమ్స్ జాక్సన్ అంగీకరించలేదు. అప్పటికి రెండేళ్ల కిందటే అబ్రహం లింకన్ ప్రభుత్వం విముక్తి ప్రకటనతో బానిసత్వాన్ని అధికారికంగా రద్దు చేసినప్పటికీ, భూస్వామి ఒప్పుకోలేదు.
బానిసత్వం నుంచి విముక్తి లభించిన వెంటనే ఆమె మౌండ్ సిటీకి వెళ్లారు. అప్పట్లో ఆ నగరాన్ని సెయింట్ లూయీ (మిస్సోరి)గా పిలిచేవారు. ఆమె పుట్టిన ఫ్లోరెన్స్ ప్రాంతానికి ఉత్తరంగా 615 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంటుంది. అక్కడ పనిమనిషిగా జీవితం ప్రారంభించారు.
''హెన్రీ సెయింట్ లూయీకి వెళ్లారు. ఎందుకంటే, దోబీ పనిచేసేవారికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో కంటే అక్కడ ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది'' అని సదరన్ సిటీ పబ్లిక్ రేడియో నెట్వర్క్ ఎస్‌టీఎల్‌పీఆర్ ఇంటర్వ్యూలో అమెరికన్ జర్నలిస్ట్ జూలియస్ హంటర్ చెప్పారు. ఆయన ''ప్రిసిల్లా అండ్ బేబ్: ఫ్రమ్ ది షాకిల్స్ ఆఫ్ స్లేవరీ టు మిలియనీర్ మేడమ్స్ ఇన్ విక్టోరియన్ సెయింట్ లూయీ'' పుస్తక రచయిత కూడా.
హెన్రీతో పాటు మరో మేడమ్ సారా 'బేబ్' కానర్ గురించి తెలుసుకునేందుకు అనేక లైబ్రరీలు, పబ్లిక్ రికార్డులు, చర్చి రికార్డులు, స్థానిక వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాలపై ఆయన ఆరేళ్లపాటు పరిశోధన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వేశ్యాగృహాల వ్యాపారంలోకి...
బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఆమె బట్టలు ఉతకడం, హోటల్ గదులు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూ కొద్దికాలం గడిపారు. ఆ తర్వాత ఆమె మరింత లాభదాయకమైన వ్యాపారాన్ని గుర్తించారు: అదే శృంగారం (సెక్స్).
మిస్సిస్సిప్పీ, మిస్సోరీ నదులకు ఆనుకుని ఉన్న ఇతర నగరాల్లో మాదిరిగానే సెయింట్ లూయీలోనూ అప్పట్లో బాగా వృద్ధి చెందుతున్న వ్యాపారమది.
''19వ శతాబ్దంలో సెయింట్ లూయీలో 5000 మంది వేశ్యలు ఉన్నారు. అప్పటికి ఆ నగర జనాభా కేవలం 3,50,000 మాత్రమే'' అని హంటర్ వివరించారు.
అంతర్యుద్ధం తర్వాత నిరుత్సాహంలో కూరుకుపోయిన వారు, బానిసత్వం నుంచి బయటపడినవారు, సాహసికులు, వేటగాళ్లను ఈ నగరం ఆకర్షించింది. దానితో పాటే సెక్స్ వ్యాపారం కూడా పెరిగింది. ఈ వ్యాపారం లాభదాయకంగా మారింది. 1870లో స్థానిక అధికారులు సెక్స్ వర్క్‌ను తాత్కాలికంగా చట్టబద్దం చేశారు. వ్యభిచార గృహాలు, రిజిస్టర్ అయిన వేశ్యలపై పన్నులు విధించడం ప్రారంభించారు.
ఈ రంగంలోకి హెన్రీ ప్రవేశం ఉద్దేశపూర్వకంగా జరగలేదు. కానీ, ఒక విషాదం ఆమెను ఇందులోకి వచ్చేలా చేసింది. ఆమె పనిచేస్తున్న హోటల్ అగ్రిప్రమాదానికి గురైంది. అలా ఆమె ఒళ్లు అమ్ముకునే వేశ్యాగృహానికి చేరింది.
ఆమెలో చెప్పుకోదగ్గ శారీరక లక్షణాలు లేకపోయినప్పటికీ, దృఢమైన వ్యక్తిగా ఆమె గురించి కొన్ని వర్ణనలున్నాయి. ఆమె ప్రియుడు, కాన్ఫెడరేట్ ఆర్మీ సైనికుడు అయిన థామస్ హోవార్డ్‌తో పరిచయం పెయిడ్ సెక్స్ (వ్యభిచార) ప్రపంచానికి ద్వారాలు తెరిచింది.
అయితే, ఈ ప్రేమ, వ్యాపార సంబంధాలు ఇబ్బందికరంగా ముగిశాయి. హెన్రీ ఎస్టేట్ నిర్వహించేందుకు వచ్చిన హోవార్డ్ ఆమెను మోసం చేశారు. ఆమెను చంపేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. మాజీ సైనికుడు వంటమనిషి ఫ్లోరెన్స్ విలియమ్స్‌తో కలిసి హెన్రీకి విషమిచ్చినట్లు ఆమె మేనకోడలు పేర్కొన్నారని ప్రొఫెసర్ కండిఫ్ తన పరిశోధనలో రాశారు.
స్థానిక జనాభా లెక్కల రికార్డుల ప్రకారం, 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు నల్లజాతి మహిళలతో హెన్రీ వేశ్యాగృహం నిర్వహించారని, ''అది తెల్లజాతీయులు, నల్లజాతీయులైన నావికులు, సాహసికులు కలుసుకునే అడ్డాగా మారింది'' అని 1895లో ఆమె మరణించిన సందర్భంగా వార్తాపత్రిక 'సెయింట్ లూయీ పోస్ట్ డిస్పాచ్' ప్రచురించింది.
"అప్పటికి నగరంలో ఎలిజా హేక్రాఫ్ట్ అనే మేడమ్ ఉండేవారు. వేశ్యాగృహాలకు రాణి అయిన ఆమె 1871లో మరణించారు. దానిని హెన్రీ, ఆమె మద్దతుదారులు నల్లజాతి మహిళలు ఈ రంగంలోకి ప్రవేశించడానికి మంచి అవకాశంగా భావించారు. మరణించే నాటికి హేక్రాఫ్ట్ వద్ద 30 మిలియన్ డాలర్ల విలువైన డబ్బు, ఆస్తులు ఉన్నాయి'' అని హంటర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాపార సామ్రాజ్యం
వ్యభిచారం విషయంలో సెయింట్ లూయీ అధికారుల సంప్రదాయ వైఖరి ఉదారంగా ఉన్నప్పటికీ, జాతుల విషయంలో మాత్రం విరుద్ధంగా ఉండేది. అంతర్యుద్ధం తర్వాత, ఇతర జాతీయులను(చర్మం రంగుని బట్టి) పెళ్లి చేసుకోవాలనుకునేవారికి, ఇతర జాతుల వ్యక్తులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నవారికి జైలు శిక్షలను కఠినతరం చేసే చట్టాలను ఆమోదించారు.
అధికారులతో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వేర్వేరుగా వేశ్యాగృహాలను నిర్వహించారు హెన్రీ. కొన్ని తెల్లజాతీయులకు, మరికొన్ని నల్లజాతీయులకు. అయితే, తెల్లజాతీయులు రెండు రకాల వేశ్యాగృహాలను సందర్శించే వీలుంది. కానీ, నల్లజాతి పురుషులకు ఆ అవకాశం లేదు.
''ఆమె తన వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా తెల్లజాతి పురుషులకు సేవలు అందించారు, కానీ వర్ణవ్యతిరేక చట్టాలను ఆమె గౌరవించేవారు'' అని కండిఫ్ చెప్పారు.
''ఈ చట్టాలు నల్లజాతి పురుషులు, తెల్లజాతి మహిళలతో మాట్లాడకుండా నిరోధిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె భావించేవారు. కానీ తెల్లజాతి మగవారికి అలాంటివేవీ ఉండేవి కావు'' అన్నారాయన.
''జాతుల వారీగా వేశ్యాగృహాలను నిర్వహించేందుకు హెన్రీ పోలీసులతో సుదీర్ఘ కాలం సంబంధాలను కొనసాగించారు. అందువల్ల ఆమె వ్యాపారం సజావుగా సాగేది'' అని పరిశోధకుడు కండిఫ్ తన పరిశోధనలో పేర్కొన్నారు.
అది తన వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడింది. కాలక్రమేణా ఆమె నగరంలో పలు ఇళ్లను కొనుగోలు చేశారు. ఆమె వాటిని వేశ్యా గృహాలుగా మార్చారు. లేకపోతే వేశ్యా గృహాలు నడుపుకునే తన సహచరులకు అద్దెకు ఇచ్చేవారు.
చదువు లేకపోవడమనేది మహిళ సంపదను కూడబెట్టుకోకుండా అడ్డుకోలేదు. 1895లో ఆమె మరణించే సమయానికి ఆమె ఆస్తి విలువ 100,000 అమెరికన్ డాలర్లు. అంటే, ఇప్పుడు దాదాపు 3,700,000 అమెరికన్ డాలర్లు. అంటే, దాదాపు 30 కోట్ల రూపాయలుగా అంచనా.
''అందరితో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా ఆమె వ్యాపారం సాగేది. తన వ్యాపార జీవితంలో ఎక్కువ భాగం సెక్స్‌పై నిషేధం ఉన్న రోజులు ఎక్కువ. అందువల్ల దాని గురించి ఎక్కడా రాయకుండా చూసుకునేవారు'' అని అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో సెంటర్ ఫర్ ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్ ప్రొఫెసర్ మాలి కాలిన్స్ బీబీసీ ముండోతో చెప్పారు.
''హెన్రీకి మార్కెట్ డిమాండ్ గురించి కూడా తెలుసు. మిస్సిస్సిప్పి నదికి దిగువ ప్రాంతంలో సెయింట్ లూయీ నగరం ఉండేది. వర్తకం కోసం వ్యాపారులు, నావికులు ఈ నగరానికి వచ్చేవారు. దీంతో అభివృద్ధి చెందుతున్న ''రెడ్ లైట్ డిస్ట్రిక్ట్''లో సెక్స్ వ్యాపారంపై ఆమె గుత్తాధిపత్యం సాధించారు. అనేక వేశ్యాగృహాలు ఆమె యాజమాన్యంలో ఉండేవి'' అని కాలిన్స్ తెలిపారు.

ఫొటో సోర్స్, COURTESY ST. LOUIS POST DISPATCH
చివరి దశలో హెన్రీ తన స్వస్థలం అలబామాకు తిరిగొచ్చేశారు. కానీ సేవకురాలిగా కాదు, యజమానిగా.
తాను, తన తోబుట్టువులు పుట్టిన, జీవితంలో ముఖ్యమైన కాలం బానిసగా జీవించిన ఆ తోట(ఎస్టేట్)ను అసాధారణ రీతిలో ఆమె కొనుగోలు చేశారు.
''రానున్న శతాబ్దానికి ముందు నల్లజాతి పురుషులు, మహిళల ఎదుగుదలలో దీనిని ఒక మలుపుగా జాతీయ, స్థానిక మీడియా పేర్కొన్నాయి'' అని కాలిన్స్ చెప్పారు.
అయితే, ఆమెపై, ఆమె వ్యాపార దక్షతపై ఆనాటి మీడియా దృష్టి పెట్టలేదు.
''ఎవిల్ అండ్ నొటోరియస్ ఓల్డ్ ప్రిసిల్లా హెన్రీ డైడ్ - దుష్టురాలు ప్రిసిల్లా హెన్రీ మరణించారు'' అని స్థానిక వార్తాపత్రిక హెడింగ్ పెట్టింది. ఆమె ఆలోచనలు చెడ్డవిగా వర్ణించారు.
కాలం గడిచేకొద్దీ హెన్రీ జ్ఞాపకాలు కనుమరుగయ్యాయి. కానీ, ఆమె చనిపోయిన సమయంలో అది చిన్నవిషయం కాదు. ఆమె మరణవార్త న్యూయార్క్ వార్తాపత్రికలో రిపోర్ట్ అయింది. ఆమె శవపేటికకు వీడ్కోలు చెప్పేందుకు సెయింట్ లూయీ వీధుల్లో వందలాది మంది ప్రజలు బారులుదీరినట్లు ''పయనీర్స్, రూల్ బ్రేకర్స్ అండ్ రెబెల్స్: 50 అన్‌స్టాపబుల్ విమెన్ ఆఫ్ సెయింట్ లూయీ'' పుస్తకంలో సెయింట్ లూయూ హిస్టారికల్ ప్రెస్ అసోసియేషన్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














