రువాండ: ‘లక్షల మందిని బలిగొన్న నరమేధం తర్వాత 30 ఏళ్లకు సొంతింటికి వెళ్లా.. నా అనుభవాలు ఇవీ’

ఫొటో సోర్స్, VICTORIA UWONKUNDA
- రచయిత, విక్టోరియా యువోంకుండా
- హోదా, బీబీసీ న్యూస్
హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు 30 ఏళ్ల క్రితం నా ఇంటిని, పుట్టిన ఊరును వదిలిపెట్టాల్సి వచ్చింది. 1994లో రువాండాలో భయంకరమైన మారణహోమం జరిగిన సయమంలో నా కుటుంబంతో కలిసి సొంతూరు నుంచి బయటికి వచ్చేశాం.
కెన్యా, నార్వేల్లో పెరిగిన తర్వాత, చివరికి లండన్‌లో స్థిరపడ్డాం. రువాండాలో ప్రజలు ఆ నరమేధం నుంచి కోలుకున్నారో లేదో చూసేందుకు తిరిగి సొంతూరుకు వెళ్లాలని చాలాసార్లు ఆలోచించేదాన్ని.
అదే అంశంపై డాక్యుమెంటరీ తీసేందుకు అక్కడికి వెళ్లేందుకు నాకు అవకాశం దక్కినప్పుడు, చాలా సంతోషంగా భావించాను. దీంతో పాటు, అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతోంది, అక్కడ పరిస్థితులను చూసి నేనెలా స్పందిస్తానో అనే భయం కూడా వేసింది.
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్‌డీ)గా పరిగణించే నాటి అనుభవాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి.

దేశాన్ని విడిచిపెట్టడం ఎంత బాధాకరమో..
రువాండాలో ఇతరుల మాదిరిగానే, నేను కూడా చాలా మంది కుటుంబ సభ్యులను కోల్పోయాను. కేవలం 100 రోజుల్లో దాదాపు 8,00,000 మంది ప్రజలను ఊచకోత కోశారు హుటు అతివాదులు.
మైనారిటీలైన టుట్సీ జాతి ప్రజలతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థులందరినీ లక్ష్యంగా చేసుకుని ఈ మారణకాండ సాగించారు.
ఈ మారణ కాండ తర్వాత, టుట్సీ దళాలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ప్రతీకారంగా రువాండాలో వేల మంది హుటు ప్రజలను చంపేశాయి.
రాజధాని కిగాలీని చేరుకున్న తర్వాత, నాకు ఎక్కడలేని దుఃఖం వచ్చింది.
నా సొంత భాష కిన్యరువాండాను వింటున్నప్పుడు ఎంతో సంతోషమేసింది. నా చుట్టుపక్కలందరూ అదే భాష మాట్లాడుతున్నారు.
చివరిసారి నేను ఈ నగరంలో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నాను. ఆ సమయంలో ఉన్న మారణహోమం పరిస్థితులు నా కళ్ల ముందు మెదిలాయి. ప్రాణాలను కాపాడుకోవడానికి లక్షల మంది ప్రజలు పరిగెత్తిన క్షణాలు గుర్తుకు వచ్చాయి.
స్వల్ప కాలం పాటు సాగే ఈ ప్రయాణంలో కిగాలీలోని నా ప్రైమరీ స్కూల్‌ను, మా ఇంటిని చూడాలనుకున్నాను. 1994 ఏప్రిల్ 6న నా బంధువులతో పాటు డిన్నర్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు ఆ ఘటనలు ఎదురయ్యాయి.
ఆ సమయంలో, అధ్యక్షుని విమానాన్ని కూల్చివేసినట్లు మేం విన్నాం. ఆ రాత్రి వచ్చిన ఫోన్ కాల్ మా జీవితాలను పూర్తిగా మార్చివేసింది.

ఇంటిని ఎలా గుర్తుపట్టానంటే..
మా పాత ఇంటిని కనుక్కోలేకపోయాను. నాలుగు సార్లు ప్రయత్నించిన తర్వాత, ఇక నేను వెతకలేనని అనుకున్నాను. నార్వేలో ఉన్న మా అమ్మకు ఫోన్ చేశాను. అప్పుడు ఆమె నన్ను గైడ్ చేసింది.
చివరికి మూసివేసి ఉన్న నా ఇంటి గేటు ముందు నిల్చోగలిగాను. అప్పటి మిట్టమధ్యాహ్నాలు, టెర్రస్‌పై కూర్చుని మేం మాట్లాడుకోవడాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి.
ఆ మారణ హోమ సమయంలో కిగాలీలో సురక్షితమైన ప్రాంతమంటూ ఏదీ లేదని మేం గుర్తించాం. ఆ తర్వాత మేం కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేశాం. కిగాలీ మొత్తం వేల మంది ప్రజలు కాలినడకన, బైకులపై, కార్లలో, ట్రక్కులలో వెళ్తున్నట్లు అనిపించింది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో ఉన్న సరిహద్దుకు సమీపంలో ఉన్న గిసెనీ ప్రాంతంలో మా ఫ్యామిలీ హోమ్‌కు వెళ్లాం. ప్రస్తుతం దీన్ని రుబావు జిల్లాగా పిలుస్తున్నారు.
ప్రస్తుతం నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్కడా బుల్లెట్ మోతలు, రోడ్లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న జనాలు కనిపించలేదు. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా, ప్రకాశవంతంగా, అందంగా ఉంది.
నరమేధ సమయంలో మూడు నెలల పాటు 40 మందికి ఆశ్రయం కల్పించిన మూడు బెడ్‌రూమ్‌ల ఇంటిని నేను గుర్తించాను.
1994 జులైలో మేం అక్కడి నుంచి బయటికి వచ్చేసినప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

ఫొటో సోర్స్, VICTORIA UWONKUNDA
నాడు బయటపడిన బంధువులను కలుసుకున్నాను
ఆ మారణ హోమం నుంచి ప్రాణాలతో బయట పడిన నా బంధువులను కలవడం నా అదృష్టం.
వారిలో నా కజిన్ అగస్టిన్ కూడా ఉన్నారు. నేను చివరిసారి అగస్టిన్‌ను చూసినప్పుడు తనకు పదేళ్లు. అగస్టిన్‌ను హత్తుకోవడం అదొక కల. ఇప్పుడు అతడు నలుగురు పిల్లల తండ్రి.
‘‘తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా పారిపోయాను. గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణించా. నా తల్లిదండ్రులు గిసెని పట్టణం వెంబడి గోమా(డీఆర్ కాంగోకు సరిహద్దున ఉన్న నగరం)కు వెళ్లారు’’ అని అగస్టిన్ చెప్పాడు.
కిబుంబా శరణార్థి శిబిరంగా మారిన ప్రదేశంలో ఒంటరిగా తల్లిదండ్రులు లేకుండా ఒక చిన్న పిల్లాడు ఉండటం ఎలా ఉంటుందో కనీసం నేను ఊహించలేకపోయా. నేను పారిపోయినప్పుడు నాతోపాటు మా కుటుంబం ఉంది.
‘‘తొలి రోజుల్లో జీవితం అధ్వానంగా ఉండేది. కలరా వ్యాప్తి చెందింది. ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. ఈ వ్యాధితో వేల మంది మరణించారు. ఎందుకంటే, అక్కడ పరిశుభ్రమైన ప్రదేశం, మంచి ఆహారం దొరకకపోయేవి’’ అని అగస్టిన్ గుర్తు చేసుకున్నాడు.
అగస్టిన్ చెబుతున్నవి నాటి మా పరిస్థితులను ప్రతిబింబించాయి.
కెన్యాలో నా కుటుంబం శాశ్వత ఆశ్రయం పొందడానికి ముందు, గోమాలో శరణార్థులుగా గడిపిన తొలి వారాలు గుర్తుకు వచ్చాయి. అక్కడ కూడా నగర వీధుల్లో శవాలు అలానే పడి ఉండేవి.

‘రెండు దాడుల నుంచి బయటపడ్డాను’
రువాండాలో 13 ఏళ్ల వయసులో క్లాడెట్ ముకరుమంజి పలు దాడులను ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. ఆమెకు మునిమనుమరాలు, మనవళ్లు ఉన్నారు. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను నాతో పంచుకునేందుకు అంగీకరించారు. దీంతోపాటు తన గాయాలకు కారణమైన వ్యక్తుల గురించి చెప్పారు.
ఆమె వివరించిన దాడుల్లో ఒకటి మేం కలుసుకున్న ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగ్నేయ రువాండాలోని న్యామాటా పట్టణంలో జరిగింది.
ఇది కేథలిక్ చర్చి. ఇక్కడ వేల మంది ఆశ్రయం కోసం వచ్చారు. కానీ, వారు కత్తులతో వచ్చి ప్రజల్ని వేటాడి పట్టుకుని మరి చంపేశారని చెప్పారు.
‘‘నాపై దాడి చేసినప్పుడు అతను చర్చిలోపల ఉన్నాడు. అతను నన్ను పొడుస్తూ పాటలు పాడాడు. నా ముఖం కోశాడు. ముఖం నుంచి రక్తం ధారలై ప్రవహించింది. తట్టుకోలేని బాధను అనుభవించాను’’
‘‘వెనుకాలకు తిరిగి పడుకోమని నన్ను ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత వెనుకవైపు కూడా దాడి చేశాడు. ఇప్పటికీ ఆ గాట్లు ఉంటాయి’’ అని తెలిపారు.
‘‘బల్లెంతో గట్టిగా పొడిచాడు. బల్లెం నన్ను గుచ్చుకుని గ్రౌండ్‌కు తాకిందని అనుకుని నన్ను విడిచిపెట్టాడు’’ ఆమె నాతో చెప్పారు.
వీపులో గట్టిగా దిగిన బల్లెం తొలగించి, అక్కడి నుంచి పారిపోయి, తను సురక్షితమని భావించిన ప్రదేశానికి చేరుకున్నట్లు చెప్పారు.
కుటుంబ సభ్యుల మధ్య దాడులు
క్లినికల్ సైకాలజిస్ట్ అయిన అలెక్సాండ్రోస్ లార్డోస్ రువాండాలో పనిచేశారు. వ్యక్తిగతంగా ప్రజలకు బాధ నుంచి ఉపశమనం కల్పించడం ప్రారంభించాలంటే, తొలుత ‘కలెక్టివ్ హీలింగ్’ అవసరమన్నారు.
‘‘ఈ మారణకాండ విస్తృతంగా సాగింది. పక్కింటి వారు పొరిగింటోళ్లను, కుటుంబ సభ్యులు వారిలో వారే దాడి చేసుకున్నారు’’ అని ఆయన నాకు చెప్పారు. ఎవరు నమ్మదగిన వ్యక్తి అనే విషయంలో ప్రస్తుతం స్పష్టత లేదన్నారు.

ఫొటో సోర్స్, VICTORIA UWONKUNDA
సయోధ్య ప్రయత్నాలు
సయోధ్య కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. వాటిలో ఒకటే- క్రిస్టియన్లు నిర్వహించిన ప్రాజెక్ట్. రువాండ సమాజంలో అత్యంత ముఖ్యమైన పశువుపై బాధితులను, నేరస్థులను ఒక దగ్గరకు తీసుకొస్తారు.
వారు కలిసి ఆ పశువును సంరక్షించాల్సి ఉంటుంది. సయోధ్య, క్షమాగుణం ద్వారా, కలిసి మెరుగైన భవిష్యత్‌ను వారు నిర్మించుకుంటారు.
జాతి అనే బేధంతో విడిపోయిన దేశాన్ని తిరిగి కలిపేందుకు రువాండా పలు చర్యలు తీసుకుంటోంది. జాతి గురించి మాట్లాడటం ఇక్కడ చట్టవిరుద్ధం.
ఈ సయోధ్యను చేరుకునేందుకు రువాండా ప్రజలకు మూడు దశాబ్దాలు పట్టింది.
ఎప్పటికీ నా హృదయంలో ఒక భాగంగా మారిన రువాండా, నా సొంతిళ్లు మాదిరి అనిపించకపోవడం నాకు ‘షాకింగ్ రియలైజేషన్’గా అనిపించింది.
కానీ, ఈ ప్రయాణం నాలో శాంతిని కల్గించింది. నా గాయాలను నయం చేయడానికి ఇది ఉపయోగపడింది.
ఇవి కూడా చదవండి:
- హవానా సిండ్రోమ్: ఈ అంతుచిక్కని ఆరోగ్య సమస్యకూ రష్యా నిఘా వ్యవస్థకూ సంబంధం ఉందా?
- ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాంల 'గీతగోవిందం' మ్యాజిక్ రిపీటయిందా?
- రష్యా: సెక్స్ థీమ్ పార్టీలపై పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారు... అక్కడ అసలేం జరుగుతోంది?
- బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు కొనడం మంచిదా, అమ్మడం మంచిదా?
- సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














