ఎన్నికల్లో సిరాజుద్దౌలా, ప్లాసీ యుద్ధంపై చర్చ ఎందుకు జరుగుతోంది?

అమృతా రాయ్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అమృతా రాయ్ పోటీ చేస్తున్నారు.
    • రచయిత, అమితాభ్ భట్టాసాలీ
    • హోదా, బీబీసీ న్యూస్

పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో సిరాజుద్దౌలా, ప్లాసీ యుద్ధంపై కూడా చర్చ జరుగుతోంది.

ప్లాసీ యుద్ధానికి ముందుగా బెంగాల్ చివరి నవాబు సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా అప్పట్లో జరిగిన కుట్రపై చాలా మంది చరిత్రకారులు చాలా కథనాలు రాశారు. అయితే, నాటి కుట్ర వెనుక పరిణామాలపై ప్రశ్నలను సంధిస్తూ తాజాగా బీజేపీ అభ్యర్థి ఒకరు కొత్త వివాదానికి తెరతీశారు.

ఆ అభ్యర్థి పేరు అమృతా రాయ్. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆమె పోటీచేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా కూడా ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

అమృతా రాయ్ కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆమె కృష్ణానగర్ మాజీ రాజ కుటుంబానికి కోడలు. అందుకే ఆమెను ‘‘రాణీ మా (రాజమాత)’’ అని కూడా పిలుస్తుంటారు.

ఆ రాజ కుటుంబ ప్రముఖుల్లో కృష్ణచంద్ర రాయ్ ఒకరు. సిరాజుద్దౌలాను గద్దె దించేందుకు మీర్ జాఫర్, జగత్ సేఠ్‌‌ పన్నిన కుట్రలో కృష్ణచంద్ర రాయ్ పాత్రపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

అయితే, సనాతన ధర్మాన్ని కాపాడేందుకే కృష్ణచంద్ర రాయ్ బ్రిటిష్ పాలకులతో చేతులు కలిపారని ఎన్నికల్లో అడుగుపెట్టిన వెంటనే అమృతా రాయ్ చెప్పారు.

అమృతను రాజమాతగా పిలవడంపై నదియా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నలు సంధించారు. ఈ దేశంలో రాజులే లేనప్పుడు రాజమాతలు ఎక్కడి నుంచి వచ్చారని ఆమె ప్రశ్నించారు.

ప్లాసీ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

కృష్ణచంద్ర రాయ్ ఎవరు?

1728లో నదియా సంస్థానానికి కృష్ణచంద్ర రాయ్ రాజుగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 18 ఏళ్లు మాత్రమే. రాజుగా అందరూ ఆయనను పిలిచేటప్పటికీ, బెంగాల్‌లోని అలీవర్దీ ఖాన్ హయాంలో ఆయన భూస్వామి మాత్రమే. కృష్ణచంద్ర కింద 84 పరగణాల భూమి ఉండేది.

నాటి పరిణామాలను తన పుస్తకం ‘‘రామతను లాహిరీ ఓ తుక్తాలీన్ బంగసమాజ్’’లో శివనాథ్ శాస్త్రి వివరించారు.

‘‘నాడు కృష్ణచంద్రను తన వారసుడిగా ప్రకటించేందుకు ఆయన తండ్రి నిరాకరించారు. తన రాజ్యానికి వారసుడిగా తన సోదరుడు రామ్ గోపాల్‌ను ఆయన ఎంపిక చేశారు. దీనికి నవాబుల అనుమతి కూడా రామ్ గోపాల్ పొందారు. అయితే, అప్పుడే ఎత్తులకు పైఎత్తులు వేసి సంస్థానాన్ని కృష్ణచంద్ర కైవసం చేసుకున్నారు’’ అని ఆ పుస్తకంలో రాశారు.

బెంగాల్‌లో నాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టిన రచనగా శివానాథ్ శాస్త్రి పుస్తకాన్ని చరిత్రకారులు చూస్తుంటారు.

‘‘శక్తిమంతమైన రాజుగా కొనసాగినప్పటికీ మతం, సామాజిక సంస్కరణల విషయంలో కృష్ణచంద్ర ఛాందసవాదిలా ఉండేవారు. రాజ్యాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని సామాజిక భూతాలకు కూడా ఆయన మద్దతు పలికేవారు’’ అని శివనాథ్ రాసుకొచ్చారు.

నాటి హిందూ మత ఛాందసవాదులకు నాయకుడిగా కృష్ణచంద్రను చాలా మంది చరిత్రకారులు చూసేవారు.

ఐసీఎస్ అధికారి జేహెచ్ఈ గైరెట్ రాసిన ‘‘బంగాల్ డిస్ట్రిక్ట్ గెజెటర్స్-నదియా’’ పుస్తకంలో కృష్ణచంద్ర కుటుంబాన్ని బెంగాల్‌లోని అత్యంత ఛాందసవాద కుటుంబంగా చెప్పారు.

అమృతా రాయ్, మహువా మొయిత్ర

ఫొటో సోర్స్, PRANAB DEVNATH/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తలపడుతున్న అమృతా రాయ్, మహువా మొయిత్రా

తన పుస్తకం ‘‘ఎ స్టాటిస్టికల్ అకౌంట్ ఆఫ్ బెంగాల్’’లో డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కూడా ‘‘హిందూ మతంలోని కులం, జాతికి సంబంధించిన అన్ని ప్రశ్నలు, వివాదాల్లోనూ కృష్ణచంద్ర నిర్ణయమే అంతిమంగా ప్రజలు భావించేవారు’’ అని రాసుకొచ్చారు.

వితంతువులకు వివాహాలు నిర్వహించే సంప్రదాయాన్ని అడ్డుకునేందుకు కృష్ణచంద్ర చాలా అవరోధాలు సృష్టించారు.

అయితే, అప్పట్లో దుర్గా పూజను ఘనంగా నిర్వహించే సంప్రదాయాన్ని కూడా మొదలుపెట్టిన ఘనత కృష్ణచంద్రకే దక్కుతుందని చరిత్రకారుడు రజత్ కాంత్ రాయ్ రాసుకొచ్చారు. అదే సమయంలో కొన్ని మత ఛాందస విధానాలను కూడా ఆయన ప్రవేశపెట్టారని తెలిపారు.

‘‘సమాజాన్ని రక్షించే నాయకుడిగా కృష్ణచంద్రను స్తుతిస్తూ శాంతిపుర్, భాట్‌పారా, కుమార్‌హట్టా, నదియాల విద్వాంసులు రచనలు చేశారు. తన ఆస్థాన విద్వాంసుడు భారతచంద్ర కూడా తన రచన ‘అన్నదామంగల్’లో మతాన్ని కాపాడేందుకు కృష్ణచంద్ర చాలా సేవ చేశారని రాసుకొచ్చారు. ఒక నాయకుడిగా ఆయన అసమాన ప్రతిభ చూపేవారని రాశారు’’ అని ప్రొఫెసర్ రజత్ కాంత్ రాయ్ తన పుస్తకంలో రాశారు.

రాజు విక్రమాదిత్య, అక్బర్‌ల తరహాలో దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన పండితులకు తన ఆస్థానంలో కృష్ణచంద్ర చోటు కల్పించారు.

నాటి ప్రముఖ హాస్యకారుడు గోపాల్ భాండ్ కూడా కృష్ణచంద్ర ఆస్థానంలో ఉండేవారని చెబుతుంటారు. గోపాల్ చతుర్లు ఇప్పటికీ బెంగాల్‌ ప్రజలు గుర్తుచేసుకుంటారు. అయితే, నిజంగా గోపాల్ ఆయన ఆస్థానంలో ఉండేవారా అనే ప్రశ్నలు కూడా కొందరు చరిత్రకారులు వేస్తుంటారు.

సిరాజుద్దౌలా

ఫొటో సోర్స్, Getty Images

ప్లాసీ యుద్ధంలో కృష్ణచంద్ర పాత్ర

‘‘రామతను ఓ తత్కాలీన్ బంగసమాజ్’’ పుస్తకంలో శివనాథ్ శాస్త్రి ఈ విషయంపై స్పందిస్తూ- ‘‘రాజా మహేంద్ర, రాజా రామ్ నారాయణ్, రాజా రాజ్‌వల్లభ్, రాజా కృష్ణదాస్, మీర్ జాఫర్‌ కలిసి సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా చర్చలు జరిపేవారు. వీరి ఆహ్వానంపై ఆ తర్వాత కృష్ణచంద్ర రాయ్ వచ్చారు. కృష్ణచంద్ర సలహా మేరకే బ్రిటిష్ పాలకుల సాయం తీసుకోవాలని నిర్ణయించారని కూడా చెబుతుంటారు’’ అని రాశారు.

అయితే, ఈ విషయంపై కొంత మంది చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కూడా శివశాస్త్రి చెప్పారు.

‘‘ప్లాసీ కా షడయంత్ర్ ఓ సెకాలెర్ సమాజ్ (ద కాన్స్పిరసీ ఆఫ్ ప్లాసీ అండ్ కాంటెంపరరీ సొసైటీ) పుస్తక రచయిత రజత్ కాంత్ రాయ్ బీబీసీతో మాట్లాడుతూ- ‘‘బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో నదియా రాజు కృష్ణచంద్ర కచ్చితంగా చేతులు కలిపారు. ఆ కుట్రలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే, ఆయన చాలా తెలివైనవారని కూడా మనం చెప్పుకోవాలి’’ అని అన్నారు.

ప్లాసీ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన కుట్రదారు కృష్ణచంద్రనేనా?

ప్లాసీ యుద్ధానికి దాదాపు 50 ఏళ్ల తర్వాత, కృష్ణచంద్ర జీవిత చరిత్రను ‘మహారాజా కృష్ణచంద్ర రాయస్య చరిత్రమ్’ పేరుతో రాజీవ్ లోచన్ బందోపాధ్యాయ్ రాశారు. దీనిలో ప్లాసీ కుట్ర గురించి కూడా ప్రస్తావించారు.

‘‘నవాజ్ సంస్థానంలోని తనలా ఆలోచించే వారితో కృష్ణచంద్ర రాయ్ ఒక రహస్య సమావేశం నిర్వహించారు. బ్రిటిష్ పాలకుల సహాయం తీసుకోవడం తప్పితే తమకు ప్రత్యామ్నాం లేదని ఆయన చెప్పారు’’ అని ఆ పుస్తకంలో రాశారు.

‘‘నవాబ్ సంస్థానంలోని మిగతావారు కూడా అంగీకరించిన తర్వాత కలకత్తాలోని కాళీఘాట్‌కు పూజకు వెళ్తున్నానని చెప్పి కృష్ణచంద్ర బయల్దేరారు. కానీ, అక్కడ ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులను కలిసి, తన కుట్ర గురించి వివరించారు’’ అని ఆ పుస్తకంలో వివరించారు.

సిరాజ్‌ను ఓడించిన తర్వాత, జాఫర్ అలీ ఖాన్ అలియాస్ మీర్ జాఫర్‌ను గద్దె ఎక్కించాలని బ్రిటిష్ పాలకులతో కృష్ణచంద్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా ఆ పుస్తకంలో ఉంది.

చరిత్రకారుడు రాజీవ్ లోచన్ ఈ అంశంపై స్పందిస్తూ- సిరాజుద్దౌలాను వ్యతిరేకించేవారికి, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒక వారధిలా కృష్ణచంద్ర పనిచేశారని చెప్పారు.

కృష్ణానగర్ రాజభవనం

ఫొటో సోర్స్, PRANAB DEBNATH

అమృతా రాయ్ ఇంకా ఏమన్నారు?

సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో ప్రధానమైనవారు ఎవరు? ఈ కుట్రలో అమృతా రాయ్ పూర్వీకుడైన కృష్ణచంద్ర పాత్ర ఏమిటి? ఆయన మీర్ జాఫర్‌తో చేతులు కలిపారా? ఇలాంటి ప్రశ్నలపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

దీనిపై కృష్ణనగర్ రాజ కుటుంబ కోడలు అమృతారాయ్ స్పందిస్తూ- ‘‘సిరాజుద్దౌలా అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బ్రిటిష్ పాలకులతో చేతులు కలపడం నాడు తప్పనిసరైంది. కృష్ణచంద్ర ఆ పనే చేయకపోయుంటే సతానత ధర్మం కథ ముగిసిపోయుండేది’’ అన్నారు.

‘‘నాడు భూస్వాములతోపాటు ఇతర మతాల వారు కూడా అరాచకాలకు పాల్పడేవారు. వీరి నుంచి ప్రజలను రక్షించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరైంది. సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా మహారాజా ఒక్కరే కాదు, జగత్ సేఠ్, ఇతర రాజులు కూడా చేతులు కలిపారు. వీరందరి లక్ష్యం సమాజాన్ని రక్షించడమే’’ అని ఆమె చెప్పారు.

‘‘నేడు సిరాజుద్దౌలా బతికుంటే, మన మనుగడే ప్రశ్నార్థకమయ్యేది’’ అని ఆమె అన్నారు.

ఈ అంశంపై చరిత్రకారుడు రజత్ కాంత్ స్పందిస్తూ- ‘‘బ్రిటిష్ పాలన కంటే ముస్లిం పాలకుల హయాంలోనే హిందువులు సురక్షితంగా ఉన్నారు’’ అని అభిప్రాయపడ్డారు.

కృష్ణానగర్ రాజభవనం

ఫొటో సోర్స్, PRANAB DEBNATH

ఫిరంగులను బహుమతిగా ఇచ్చిన రాబర్ట్ క్లైవ్

కృష్ణానగర్ రాజ కుటుంబ చరిత్ర ‘‘ఖీతిస్వామసావలీ చరిత్’లో నాటి పరిణామాల గురించి వివరిస్తూ- ‘‘ప్లాసీ యుద్ధం తర్వాత, తను చేసిన సహాయానికి కృష్ణచంద్రకు రాబర్ట్ క్లైవ్ బహుమానం అందించారు. క్లైవ్ ఇచ్చిన ఐదు ఫిరంగులు ఇప్పటికీ కృష్ణానగర్ రాజభవనంలో మనం చూడొచ్చు’’ అని పేర్కొన్నారు.

‘‘ఎ స్టాటిస్టికల్ అకౌంట్ ఆఫ్ బెంగాల్’’ పుస్తకంలో డబ్ల్యూ డబ్ల్యూ హంటర్ స్పందిస్తూ.. ‘‘సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలు, హింసా కాలానికి ప్లాసీ యుద్ధం ముగింపు పలికింది. ఈ కుట్రలో కృష్ణచంద్ర పాత్ర ఆయన ముందుచూపుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన సహాయానికి గుర్తింపుగా క్లైవ్ ఆయనకు రాయ్ బహదూర్ బిరుదు ఇచ్చారు. ప్లాసీ యుద్ధంలో ఉపయోగించిన ఫిరంగుల్లో కొన్నింటిని కూడా కృష్ణచంద్రకు బహూకరించారు’’ అని చెప్పారు.

ప్లాసీ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

తర్వాత ఏం జరిగింది?

కుట్రదారుల సాయంతో సిరాజుద్దౌలాను రాబర్ట్ క్లైవ్ ఓడించారు. ఆ తర్వాత ఏడాదిలో బ్రిటిష్ పాలకులకు రాజా కృష్ణచంద్ర ఇవ్వాల్సిన రుణం క్రమంగా రూ.9 లక్షలకు పెరిగింది.

1758లో బ్రిటిష్ ప్రభుత్వం ముందు రుణ ఎగవేతదారుగా రాజా కృష్ణచంద్ర మారిపోయారని ‘‘ఎ స్టాటిస్టికల్ అకౌంట్ ఆఫ్ బెంగాల్’’ పుస్తకంలో డబ్ల్యూడబ్ల్యూ హంటర్ రాసుకొచ్చారు. ‘‘ఆ పరిణామాల తర్వాత, కృష్ణచంద్ర నుంచి ఒక్కొక్కటిగా అన్ని అధికారాలనూ వెనక్కి తీసుకున్నారు. అన్నీ తీసుకున్న తర్వాత, చివరగా భరణం కింద రూ.10,000 మాత్రమే ఇచ్చేవారు’’ అని వివరించారు.

‘‘1759 ఆగస్టు 20 నాటి ప్రభుత్వ పత్రాలను పరిశీలిస్తే, నదియా పరగణా నుంచి రెవెన్యూ లేదా టాక్సుల రూపంలో తొమ్మిది లక్షల రూపాయాలు వసూలు చేయాల్సి ఉంది. వీటిలో రూ.64 వేలను ఈస్టిండియా కంపెనీ అధీనంలోని భూమిలో వసూలు చేయాల్సి ఉండటంతో, ఆ మొత్తాన్ని మాఫీ చేశారు. ఆ మిగతా మొత్తాన్ని కృష్ణచంద్ర నెలకు ఇంత చొప్పున ఈస్టిండియా కంపెనీకి చెల్లించాలని రాసివుంది’’ అని చెప్పారు.

మీర్ కాసిం నుంచి కృష్ణచంద్రను కాపాడిన బ్రిటిష్ పాలకులు

సిరాజుద్దౌలా మరణానంతరం ఈస్టిండియా కంపెనీ మద్దతుతో మీర్ జాఫర్ అధికారంలోకి వచ్చారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు మీరన్ గద్దెనెక్కారు.

1763లో పిడుగుపాటుతో మీరన్ మరణించారు. దీంతో మీర్ జాఫర్ అల్లుడు మీర్ కాసిం అధికారంలోకి వచ్చారు.

నాటి పరిణామాలపై శివనాథ్ శాస్త్రి తన పుస్తకంలో స్పందిస్తూ.. ‘‘బ్రిటిష్ పాలకులతో విభేదాల అనంతరం బ్రిటిష్ రాజధానికి దూరంగా ముంగేర్‌లో మీర్ కాసిం కొత్త రాజధానిని ఏర్పాటుచేశారు. అనంతరం బ్రిటిష్ పాలకులకు సాయంచేసేవారిని నిర్బంధించారు, మరణ శిక్షలు విధించారు’’ అని వివరించారు.

‘‘కృష్ణచంద్రతోపాటు ఆయన పెద్ద కుమారుడు శివచంద్రను కూడా ముంగేర్‌లో కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచారు. అయితే, బ్రిటిష్ పాలకులు సమయానికి చేరుకోవడంతో వీరిద్దరి ప్రాణాలను కాపాడగలిగారు’’ అని ఆయన పేర్కొన్నారు.

చివరగా 1782లో కృష్ణచంద్ర రాయ్ మరణించారు.

వీడియో క్యాప్షన్, కాళి: ఈ వివాదం ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)