జకాత్: ముస్లింల దగ్గర ఉండే డబ్బు, బంగారంలో ఎంత దానం చేయాలని ఇస్లాం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లాంలోని ఐదు మూల స్తంభాల్లో జకాత్ కూడా ఒకటి. క్రీ.శ. 622లో మహమ్మద్ ప్రవక్త మదీనాను సందర్శించినప్పుడు అక్కడ జకాత్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు.
అయితే, అసలు ఎంత మొత్తాన్ని జకాత్‌గా దానం చేయాలనే అంశంపై చాలా ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి.
ఈ విషయంపై ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌లో మార్గదర్శనం చేశారని ఇస్లామిక్ మత బోధకులు చెబుతున్నారు.
జకాత్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఫౌండేషన్‌కు చెందిన ముఫ్తీ మహమ్మద్ అబ్దుల్లా చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
52.5 తులాల వెండి లేదా ఏడున్నర తులాల బంగారం (ఒక తులం అంటే 11.66 గ్రాములు) లేదా దానికి సమాన మొత్తంలో నగదు లేదా ఇతర బాండ్లు, స్టాక్‌లను ఏడాది కాలంగా కలిగి ఉన్న వ్యక్తి జకాత్‌ను చెల్లించాలని ఇస్లామిక్ చట్టాలు చెబుతున్నాయి. మొత్తం తన దగ్గరున్న సంపదలో 2.5 శాతాన్ని జకాత్‌గా చెల్లించాలని సూచిస్తున్నాయి.
అయితే, ఎప్పుడు, ఎవరికి జకాత్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు? జకాత్‌ను ఎవరు తీసుకుంటారు? దాన్ని ఎలా పంచుతారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
1. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే జకాత్ చెల్లించాలా?
‘‘మీరు ఒక బ్యాంకు నుంచి పర్సనల్ లోను తీసుకున్నారని అనుకోండి. వచ్చే ఏడాదికి వడ్డీని మొదటగా ఆ మొత్తం నుంచి వేరు చేయాలి. ఆ మిగిలిన మొత్తానికి జకాత్ వర్తిస్తుంది’’ అని ముఫ్తీ మహమ్మద్ అబ్దుల్లా చెప్పారు.
అయితే, రుణం ఎక్కువగా ఉన్నప్పుడు, దాన్ని చెల్లించిన తర్వాత జకాత్ ఇచ్చేందుకు సరిపడ సంపద లేకపోతే, ఆ వ్యక్తి జకాత్ చెల్లించడం తప్పనిసరి కాదు.

ఫొటో సోర్స్, EPA/ARSHAD ARBAB
2. ఎలాంటి ఆస్తులపై జకాత్ వర్తిస్తుంది?
వాణిజ్యపరంగా ఉపయోగించే భూములు, ఇళ్లు, పంట పొలాలపై కూడా జకాత్ చెల్లించాల్సి ఉంటుందని మహమ్మద్ అబ్దుల్లా చెప్పారు. అయితే, ఇల్లు కట్టుకోవడానికి ఉంచుకున్న భూమిపై జకాత్ చెల్లించాల్సిన అవసరంలేదన్నారు.
తన పిల్లల కోసం నిర్మించిన లేదా ఉంచిన ఇంటిపై జకాత్ వర్తించదు. ఏదైనా దుకాణం ఉన్నట్లయితే, లోపల ఉంచిన వస్తువులపై జకాత్ చెల్లించాలి. కానీ, అయితే, ఆ దుకాణం లేదా భవనంపై జకాత్ చెల్లించాల్సిన అవసరం లేదు.
చాలా మంది తమ దగ్గర లేదా తమ కుటుంబం దగ్గర బంగారం, వెండి, విలువైన ఆభరణాలు ఉంటేనే జకాత్ చెల్లించాలని భావిస్తారు. అయితే, ఇంకా చాలా అంశాలపై జకాత్ వర్తిస్తుందని ఇస్లామిక్ ఫౌండేషన్‌లోని జకాత్ ఫండ్ డైరెక్టర్ మహమ్మద్ రునూర్ రషీద్ చెప్పారు.
‘‘తమ దగ్గరుండే నగదు, షేర్ల సర్టిఫికెట్లు, గిఫ్ట్ బాండ్లు, బంగారం, వెండి, విలువైన లోహాలు, వాణిజ్య ఆస్తులు, వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయం, పంటలు, పశు సంపద, 40 కంటే ఎక్కువ గొర్రెలు లేదా మేకలు, 30 కంటే ఎక్కువ ఆవులు, గేదెలు లాంటి వాటిపై జకాత్ వర్తిస్తుంది’’ అని ఆయన తెలిపారు.
అయితే, ఇక్కడ అన్నీ సంపద ఎంత మొత్తంలో ఉందనే దానిపైనే ఆధారపడి ఉంటాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
3. నేరుగా పేదలకు ఇవ్వడమే మేలా?
‘‘జకాత్‌ను తీసుకునేవారినే ఆ సంపదకు యజమానిగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు తమకు అవసరమున్నట్లుగా ఆ సంపదను ఖర్చుపెట్టుకోగలుతారు’’ అని ముఫ్తీ మహమ్మద్ అబ్దుల్లా చెప్పారు.
‘‘మీరు ఏదైనా సంస్థకు జకాత్ ఇచ్చినట్లు అయితే, ఆ సంపదపై పేదలు లేదా అవసరమైనవారికి హక్కులు ఉండవు. ఆ సంపద యజమాని కూడా పేదవారు కారు. అందుకే జకాత్‌ను నేరుగా పేదలకే ఇవ్వడం మేలు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA/REHAN KHAN
4. భార్య బంగారు ఆభరణాలపై జకాత్ ఎవరు చెల్లించాలి?
భార్య లేదా కుమార్తె ఆస్తులపై లేదా ఆభరణాలపై జకాత్ చెల్లించే బాధ్యత భర్తపై లేదా తండ్రిపై ఉంటుంది.
‘‘ఇక్కడ ఆభరణాలు అంటే బంగారంతోపాటు వెండివి కూడా ఉంటాయి. మరోవైపు వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాల క్రయవిక్రయాలపై కూడా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది’’ అని ముఫ్తీ అబ్దుల్లా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
5. వస్త్రాల రూపంలోనూ జకాత్ చెల్లించాలా?
‘‘అలా కూడా ఇవ్వొచ్చు. కానీ, అది మంచిది కాదు’’ అని ముఫ్తీ అబ్దుల్లా చెప్పారు. దీనికి కారణాన్ని వివరిస్తూ ఎవరైనా అవసరంలో ఉన్నవారికి జకాత్ ఇస్తే మేలని వివరించారు.
‘‘ఆహారంతో పోలిస్తే బట్టలు అంత అవసరం కాకపోవచ్చు. ఆహారం లేదా డబ్బు చాలా అవసరం. అందుకే అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జకాత్ ఇస్తే మంచిది’’ అని ఆయన తెలిపారు.

6. నిసాబ్ అంటే ఏమిటి?
నిసాబ్ అనేది ఇస్లామిక్ పదం. రోజువారీ అవసరాలకు సరిపడ నగదును పక్కన పెట్టేసిన తర్వాత, ఒక వ్యక్తి దగ్గర 52.5 తులాల వెండి లేదా 7.5 తులాల బంగారం లేదా వీటి మొత్తానికి సరిపడ నగదును నిసాబ్‌గా పిలుస్తారు.
నిసాబ్ ఏడాది కంటే ఎక్కువ రోజులు తమ దగ్గరే ఉంటే జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర 7.5 తులాల కంటే ఎక్కువ బంగారం ఉంది అనుకోండి. మార్కెట్‌లో దీని విలువ రూ.4 లక్షలు ఉంటే, ఈ మొత్తాన్ని నిసాబ్ అంటారు. దీనిపై 2.5 శాతం అంటే రూ.10 వేలను జకాత్‌గా చెల్లించాలి.
7. జకాత్ ఎవరు తీసుకోవచ్చు?
జకాత్ కేవలం ముస్లింలకు మాత్రమే ఇవ్వాలి. దీన్ని ఎవరెవరు తీసుకోవచ్చంటే..
- పేద ముస్లింలు
- అప్పుల్లో కూరుకుపోయినవారు
- యాత్రలకు వెళ్లేవారు
- అనాథలు
- ఇస్లాంను స్వీకరించినవారు
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















