బెంగళూరులో నీటికి కటకట... మరి హైదరాబాద్‌ పరిస్థితి ఏంటి?

హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ భారత దేశంలో చాలా విషయాల్లో పోటీ పడే, పోలిక వచ్చే నగరాలు బెంగళూరు – హైదరాబాద్. ఐటీ రంగంలో ఈ నగరాల మధ్య పోటీ, పోలిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే, కొంతకాలంగా బెంగళూరు నీటి కొరత గురించి వార్తలు వస్తున్నప్పటికీ హైదరాబాద్‌లో ఆ పరిస్థితి అంత తీవ్రంగా కనిపించకపోవడానికి కారణం ఏంటి?

హైదరాబాద్ – బెంగళూరు జనాభా దాదాపు ఒకే స్థితిలో ఉన్నప్పటికీ నీటి కొరతలో హైదరాబాద్ ఎందుకు కాస్త ప్రశాంతంగా ఉంది?

ప్రస్తుతానికి ఢోకా లేదు

హైదరాబాద్‌‌ నగరానికి ఈ వేసవి వరకూ ఎలాంటి సమస్యా లేదని అధికారులు పక్కాగా చెబుతున్నారు. కానీ, బెంగళూరు పరిస్థితి మాత్రం దినదినగండంగానే ఉంది. ‘‘ఈ రెండు నగరాల వాటర్ బోర్డులూ సుమారు చెరో కోటీ 30 లక్షల ఇళ్లకు నీరు అందిస్తాయి. కానీ, హైదరాబాద్‌కి బయట నుంచి 2600 పైగా మిలియన్ లీటర్ల నీరు రోజూ వచ్చే ఏర్పాటు ఉండగా, బెంగళూరుకు మాత్రం 1400 పైగా మిలియన్ లీటర్ల నీరు మాత్రమే రోజూ కావేరి నుంచి వచ్చే ఏర్పాటు ఉన్నట్టు’’ హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

బోర్లు, చెరువుల మీద ఆధారపడితే హైదరాబాద్ నగర పరిస్థితి బెంగళూరు కంటే దారుణంగా ఉండాలి. అయితే, హైదరాబాద్ నగరానికి నీట కష్టాలు ఎక్కువ లేకపోవడానికి కారణం కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకోవడమే.

నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి ఈ విషయంలో ఎంతో వివాదాలు కూడా ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఉన్న హైదరాబాద్‌కు గోదావరి నీరు తరలించడం నుంచి మొదలు, ఒకప్పుడు నల్గొండ ప్రజలు ఫ్లోరోసిస్‌తో కాళ్లు వంకర్లు పోతున్నా వారికి నీరు ఇవ్వకుండా, అదే నల్గొండ మీద నుంచి హైదరాబాద్‌కి పైపు లైన్లు వేయడం వంటి వివాదాలు చాలా ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే, బెంగళూరు నీటి కష్టాలకు కారణం విపరీతంగా పెరిగిన కాంక్రీటు అరణ్యం. చెరువుల ఆక్రమణ ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. ఇవే సమస్యలు హైదరాబాద్‌కు కూడా వర్తిస్తాయి. అయితే, కృష్ణా, గోదావరి పైపులైన్లు ప్రస్తుతానికి సమస్య లేకుండా చేస్తున్నాయి.

హైదరాబాద్‌కి ప్రధానంగా సింగూరు నుంచి 75 మిలియన్ గాలన్ పర్ డే (ఎంజీడీ), మంజీరా నుంచి 45 ఎంజీడీ, అక్కంపల్లి నుంచి కృష్ణా నీరు 270 ఎంజీడీ, యల్లంపల్లి నుంచి గోదావరి నీరు 86 ఎంజీడీ నీరు అందుబాటులో ఉంది.

ఇవికాక జంట జలాశయాలుగా పిలిచే ఉస్మాన్ సాగర్ నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్ సాగర్ నుంచి 15 ఎంజీడీల నీరు అందుబాటులో ఉంది. రోజూవారీ తాగునీటి అవసరాలు, లభ్యత ఆధారంగా వీటి నుంచి కావల్సిన నీరు తీసుకుంటారు.

హైదరాబాద్ వాటర్ బోర్డు సరఫరా చేసే నీటిలో 1080 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ)లు ప్రధాన నగరానికీ, 1049 ఎంఎల్డీలు శివారు ప్రాంతాలకీ, 277 ఎంఎల్డీలు ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మునిసిపాలిటీలకు సరఫరా చేస్తుంది.

బెంగళూరు

ఫొటో సోర్స్, Getty Images

బెంగళూరు కష్టాలకు కారణాలు

బెంగళూరు నగరానికి ప్రధానంగా నీరు కావేరి నది నుంచి రావాలి. బెంగళూరుకు 2100 మిలియన్ లీటర్ పర్ డే అవసరం ఉండగా 1450 కావేరీ నుంచే వస్తోంది. కావేరి నది నుంచి బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో నీరు తోడే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నగరానికి 60 శాతం నీరు ఈ నది నుంచే వస్తుంది.

అర్కావతి నది నుంచి కూడా కొంత నీరు ఉన్నప్పటికీ అది చాలా తక్కువ. దీంతో బెంగళూరు నగరం తన నీటి అవసరాలకు బోర్లపై ఎక్కువ ఆధారపడుతుంది. ఆ బోర్లు కనుక ఎండిపోతే ఇక అంతే సంగతులు. ఇప్పుడు బెంగళూరులో దాదాపు సగం బోర్లు ఎండిపోయాయి.

ఐఐఎస్సీ బెంగళూరు అధ్యయనం ప్రకారం, 1973లో బెంగళూరు బిల్టప్ ఏరియా 8 శాతం ఉంటే, 2023లో అది 93.3 శాతానికి వెళ్లింది. దీంతో నీరు ఉండే ప్రదేశాలు 79 శాతం తగ్గిపోయాయి. దీనివల్ల నగరంలో నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. దానికి తోడు వర్షాలు తక్కువ కురవడంతో ఉండే ఆ కాస్త నీరు ఇంకే అవకాశం కూడా పోయింది.

బెంగళూరు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కావేరీ జలాలు

ఇక చెరువుల చుట్టూ లేక్ వ్యూల పేరుతో కాంక్రీటు నిర్మాణాలు చేయడం వల్ల చుట్టుపక్కల కురిసిన వాన ఆ చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రధానంగా చెరువులు, వాటి ద్వారా రీచార్జ్ అయ్యే బోర్ల మీద ఆధారపడిన బెంగళూరు ఇప్పుడు భయంకరమైన నీటి కష్టాలను ఎదుర్కొంటోంది.

పూర్వం నుంచీ బెంగళూరుకు నీటి కష్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలోనూ ఇబ్బందులు వస్తే మైసూర్ సంస్థానం అప్పట్లో నీటి సరఫరా ఏర్పాట్లు చేసింది. 1800వ సంవత్సరం నాటికి నగరంలో 1452 నీటి వనరులు ఉండగా, ఇప్పుడు అవి 193కి పడిపోయాయి. అంటే, గ్రీన్ కవర్ 4 శాతానికి పడిపోయింది.

ఒకప్పుడు బెంగళూరులోనే కనిపించే అరుదైన నీటి పక్షులు కనిపించకుండా పోయాయి. 2021 నాటి కర్ణాటక ప్రభుత్వ నివేదిక ప్రకారం, బెంగళూరులో 837 సరస్సులు మాయమయ్యాయి. ఉన్న వాటిలో 80 శాతం దారుణంగా కలుషితమయ్యాయి.

నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్తులో హైదరాబాదూ అంతేనా...

నిజానికి హైదరాబాద్ కూడా అంతే వేగంగా పెరుగుతోంది. కాకపోతే హైదరాబాద్‌కి బయటి నుంచి నీరు వచ్చే అవకాశం ప్రస్తుతానికి ఎక్కువగా ఉండడం వల్ల ఆ తీవ్రత తెలియడం లేదు.

కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, 185 జల వనరుల్లో 150 బాగా కాలుష్యమయం అయ్యాయి లేదా ఆక్రమణకు గురయ్యాయి. మరో 20 పూర్తిగా ఎండిపోయాయి. కానీ, కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్నది చాలా చిన్న లెక్క. అంతకంటే ఎక్కువ సంఖ్యలో నీటి వనరులు బయట ఉన్నాయి. ఆ లెక్కలన్నీ తీస్తే కాంక్రీటు జంగిల్ విషయంలో హైదరాబాద్ పరిస్థితి బెంగళూరు కంటే గొప్పగా ఏమీ లేదని చెప్పవచ్చు.

‘‘ఇప్పటికైనా హైదరాబాద్‌లో చెరువుల చుట్టూ, ఇన్ని కిలోమీటర్ల లిమిట్ పెట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంక్రీటు కట్టడాలు లేకుండా చూడాలి. అలాగే ఇంకుడు గుంతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుంది.’’ అని బీబీసీకి చెప్పారు ప్రొఫెసర్ శ్రీనివాస్.

బోర్లు రీచార్జ్ అవ్వాలంటే మట్టిలోకి నీరు ఇంకాలి. హైదరాబాద్‌లాగే బెంగళూరుకు వేలాది చెరువులు ఉన్నాయి. అవన్నీ కబ్జా అయ్యాయి.

హిమాయత్ సాగర్
ఫొటో క్యాప్షన్, హిమాయత్ సాగర్

జంట జలాశయాలు అక్కర్లేదన్నారు.. ఇప్పుడు వాటి నుంచే నీరు..

హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా జలాలను తరలించే ప్రాజెక్టులు పూర్తి చేయడంతో ఇక, హైదరాబాద్‌కి దశాబ్దాలుగా నీరు అందిస్తోన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో పనిలేదని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. నది నీరు ఉండగా, ఈ చెరువులు దండగ అన్నది ఆయన భావన.

కానీ, ఈ వేసవిలో ఆ నది నీళ్లతో పాటు ఈ చెరువుల నీళ్లు కూడా హైదరాబాద్‌ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సుమారు 22 మిలియన్ గాలన్ల నీటిని వీటి నుంచి తోడుతున్నారు అధికారులు. వేసవి పెరిగే సరికి రెండింటి నుంచీ కలిపి దాదాపు 40 గాలన్ల నీటిని తోడే అవకాశం కనిపిస్తోంది.

కానీ, ఇప్పుడీ చెరువుల భవిష్యత్తు అయోమయంలో పడింది. 1996 నాటి 111 జీవో ప్రకారం ఈ చెరువుల పరీవాహక ప్రాంతంలో ఏ ఎత్తైన కట్టడాలు లేకుండా, ఈ ప్రాంతం కాంక్రీట్ జంగిల్ కాకుండా నిబంధనలు ఉన్నాయి.

గండిపేట చెరువు

కానీ, గత కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవో రద్దు చేస్తూ 2022లో నిర్ణయం తీసుకుంది. దానిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది.

‘‘కళ్ల ముందు బెంగళూరు ఉదాహరణ కనిపిస్తున్నా, ఈ 111 జీవో ఎత్తేయడం అంటే అచ్చంగా బెంగళూరులో జరిగిన తప్పు ఇక్కడ కూడా చేయడమే..’’ అన్నారు ప్రొఫెసర్ శ్రీనివాస్.

నిజానికి హైదరాబాద్‌కి కృష్ణా, గోదావరి నీరు వస్తున్నాయి అంటే అక్కడేదో బోలెడంత నీరు ఉన్నట్టు కూడా కాదు.

నిజానికి నాగార్జున సాగర్, యల్లంపల్లి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉన్నాయి. కాకపోతే, ఈ ఏడాది మాత్రం నీటికి ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో వర్షాలు సరిగా కురవకపోతే పరిస్థితి ఇంత తేలికగా ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలన్నది నిపుణుల సూచన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)