తెలంగాణ: ఫోన్ ట్యాపింగ్ కేసులో 5 కీలక ప్రశ్నలు, సమాధానాలు...

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర పోలీసులు విచారిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

సాధారణంగా తీవ్రవాద కార్యకలాపాల వంటి వాటిని పసిగట్టడానికి వాడే ట్యాపింగ్ వ్యవస్థను రాజకీయాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యాపారులను బెదిరించి డబ్బు గుంజడం కోసం ఉపయోగించారన్న ఆరోపణలు, కుటుంబ సభ్యుల సంభాషణలను కూడా విన్నారన్న వార్తలు ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చనీయాంశం అయ్యాయి.

అప్పట్లో దేశంలో పెద్ద చర్చకు కారణమైన పెగాసస్ కంటే పెద్ద రచ్చ ఇక్కడ తెలంగాణలో అవుతోంది.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

1. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు?

తెలంగాణ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలంగాణ పోలీసు శాఖ వెల్లడించింది. ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకర రావు ఆధ్వర్యంలో సాగిన ఈ తతంగంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ట్యాపింగ్ కేసులో నిందితుల వివరాలు ఇవి.

  • ఏ1 ప్రభాకర రావు, రిటైర్డ్ ఐపీఎస్, (ఓఎస్డీగా కొనసాగారు) (ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు)
  • ప్రణీత్ రావు, సర్వీసులో ఉన్న డీఎస్పీ (అరెస్ట్ అయ్యారు)
  • ఏ3 రాధాకిషన్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ (ఓఎస్డీగా కొనసాగారు) (అరెస్ట్ అయ్యారు)
  • ఏ4 భుజంగ రావు, అదనపు ఎస్పీ (ఓఎస్డీగా కొనసాగారు) (అరెస్ట్ అయ్యారు)
  • ఏ5 తిరుపతన్న, అదనపు ఎస్పీ, (ఓఎస్డీగా కొనసాగారు) (అరెస్ట్ అయ్యారు)

రిటైర్డ్ అదనపు డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల రావులు అరెస్ట్ అయ్యారు. గట్టుమల్లు భూపతి అనే సీఐ కూడా అరెస్ట్ అయ్యారు.

2016లో ప్రభాకర రావు ఇంటెలిజెన్స్ డీఐజీ అయ్యారు. ఈ నిందితులంతా కలిసి పని చేయడం కోసం ఆయనే, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కింద స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అని ఒక దానిని ఏర్పాటు చేశారని, ఈయనే ప్రణీత్ రావును ఎంపిక చేసి, ఆయనకు బాధ్యతలు అప్పగించారని పోలీసులు తెలిపారు.

''వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి (అప్పటి ప్రతిపక్ష నాయకుడు) రేవంత్ రెడ్డి, సినిమా, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ మొత్తం వ్యవస్థకు సుప్రీంగా ప్రభాకర రావు, కీలకంగా ప్రణీత్ రావు వ్యవహరించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్ర స్థాయిలో రాధాకిషన్ రావు పనిచేశారు. ఈ విషయంలో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఉన్నతాధికారి ప్రభాకర రావు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయాలను నిందితులు తమ కన్ఫెషన్ స్టేట్‌మెంట్(వాంగ్మూలం)లో ఒప్పుకున్నారు'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు బీబీసీతో చెప్పారు.

ప్రణీత్ రావు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రణీత్ రావు

2. ఎలా బయటపడింది?

విదేశాల నుంచి తెప్పించిన పరికరాలు వాడి చట్టవిరుద్ధంగా ఈ పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. సాధారణంగా చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. అది ఎక్కువగా తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి వాడతారు. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కానీ, చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో, సొంత ప్రయోజనాల కోసం, ట్యాపింగ్ చేసినట్టు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో పోలీసులు ఆరోపించారు.

వీరంతా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచడానికి ప్రయత్నాలు చేశారనేది ఆరోపణ.

2023 శాసన సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడంతో తమ అక్రమాలు బయట పడకుండా ఉండటానికి ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించి ప్రణీత్ రావు దొరికిపోయారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే డిసెంబరు 4వ తేదీన ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఈ ట్యాపింగ్ యంత్రాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు ప్రణీత్. ఆయన అక్కడి నుంచి హార్డ్ డిస్కులను తీసుకెళ్లడంతో విషయం బయటకు వచ్చింది. దానిపై కేసు నమోదై దర్యాప్తు మొదలైంది.

అప్పటికి ఆయన సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు. తానే స్వయంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆపివేసి, అక్కడి వార్ రూమ్‌లోని దాదాపు 50 హార్డు డిస్కులను ధ్వంసం చేశారు. దీనిపై మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.

మార్చి 12న ప్రణీత్ రావును అరెస్టు చేశారు. ఆ తరువాత ఒక్కో అధికారినీ అరెస్టు చేసుకుంటూ వచ్చారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

3. విచారణలో ఏం బయటపడింది?

ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు చెప్పిన విషయాలే ఇప్పడు ఈ కేసు సంచలనంగా మారడానికి కారణం అయ్యాయి.

పోలీసు అధికారులు బీబీసీకి చెప్పిన సమాచారం ప్రకారం, విచారణ సందర్భంగా, దాదాపు అందరూ తమ నేరాన్ని అంగీకరించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్టు వారు చెప్పారు. ఆ ఉన్నతాధికారే ప్రభాకర రావు, రిటైర్డ్ ఐపీఎస్.

ఇప్పుడాయన అమెరికాలో కేన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన త్వరలోనే హైదరాబాద్ వస్తారని వార్తలు వచ్చాయి కానీ, ఆయన వస్తున్నారా రావడం లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను గుర్తించి కట్టడి చేయడమే వ్యూహంగా ఈ ట్యాపింగ్ సాగింది. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఏర్పాటు చేశారు.

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచికి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాలు కొనడంలో సహకరించినట్టు తెలుస్తోంది. ‘సాఫ్ట్‌వేర్’ కంపెనీ పేరుతో వీటిని దిగుమతి చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర్లో ఉంటూ ఆయన ఇంటి నుంచి గతంలో వెళ్లే ప్రతికాల్ విన్నారని కూడా సమాచారం.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

సంచలనం సృష్టించిన మూడు అంశాలు:

1.ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టి, ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బును సీజ్ చేయించడం.

A) 2018 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి చెందినవిగా చెబుతోన్న 70 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

B)2020 దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన రావుకు పరిచయస్తులపై నిఘా ద్వారా సిద్ధిపేటలో ఒక చిట్‌ఫండ్ కంపెనీ యజమాని నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

C)2022 మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిచయస్తులపై నిఘా పెట్టి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

2.ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో తరలించడం.

3.వ్యాపారులు, నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి, దాని ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బు వసూళ్లు చేయడం.

4.సినిమా ప్రముఖులు, పలువురు నాయకుల కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కూడా విన్నారన్న ఆరోపణలు వచ్చాయి.

5. గత ఏడాది 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

కులం కోణం:

అరెస్ట్ అయిన పోలీసు అధికారుల్లో ఎక్కువ మంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కులమైన వెలమ కులానికే చెందిన వారు. రాధాకిషన్ రావు, ప్రభాకర రావు, భుజంగరావు, ప్రణీత్ రావులు వెలమలు.

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సొంత కులం వాళ్లనే కీలకమైన ఇంటెలిజెన్స్ అధికారులుగా నియమించుకునే అలవాటు ఉంది. అది ఇక్కడా కొనసాగింది.

చంద్రబాబు హయాంలో కమ్మ, జగన్ హయాంలో రెడ్డి కులాల వారిని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులుగా వేసుకున్నారు. వీరిలో చాలా మంది అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా ఓఎస్డీలుగా తీసుకుని విధుల్లో కొనసాగించారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

4.చట్టం ఏం చెబుతోంది? సాక్ష్యాలు ఉన్నాయా?

టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. అయితే, ఇప్పటి వరకూ భారతదేశంలో ఎవరూ టెలిగ్రాఫ్ చట్టం కింద ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయలేదు. ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారి, ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని కూడా జోడించేందుకు హైదరాబాద్ పోలీసులు, కోర్టులో పిటిషన్ వేశారు.

ఫోన్ ట్యాపింగ్ ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 2007, సెక్షన్ 419 ఏ కింద, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కు కింద నేరం.

1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ట్యాపింగ్ గురించే రాజీనామా చేయాల్సి వచ్చింది.

సాధారణంగా ఫోన్ ట్యాపింగ్‌ను తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు, ఇస్లామిక్ తీవ్రవాదుల విషయంలో ఎక్కువగా వాడేవారు. తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బాగా వాడారు.

ఇక ఇజ్రాయెల్ నుంచి వచ్చిన పెగాసస్ సంగతి తెలిసిందే. కావాల్సిన వ్యక్తి ఇంటి దగ్గర్లో ఈ యంత్రాలు ఉన్న బండిని పార్క్ చేసి, కాల్స్ వినేలా ఏర్పాటు చేశారు. అలాంటి వాహనాలు దాదాపు 20 వరకూ తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్నట్టు సమాచారం.

అయితే, ఈ కేసు చట్టపరంగా నిలబడడానికి సాక్ష్యాలు కీలకం. కానీ, ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాలను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. హార్డ్ డిస్కులను కట్ చేసి మూసీ నదిలో పారవేసినట్టు ఆయన పోలీసుల ముందు అంగీకరించారు. కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశారు. దీంతో సాక్ష్యాలు సేకరించడం కష్టం అయినప్పటికీ తెలంగాణ పోలీసులు తమ ప్రయత్నం చేస్తున్నారు.

ధ్వంసం చేసిన హార్డు డిస్కులను మూసీ నదిలో పారేశారు ప్రణీత్ రావు. లాగర్ రూమ్‌లో ఉండే ఆధారాలు ధ్వంసం చేశారు. అక్కడే కంప్యూటర్ హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం వల్ల అక్కడ కింద పడ్డ రజను స్వాధీనం చేసుకున్నారు.

నాగోలు వద్ద హార్డు డిస్కులు పారేసిన చోట వెతికి మరీ వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 4 వ తేదీన ప్రణీత్ రావు వీటిని పారేశారు. ఆఫీసులో ఫైళ్లు తగలబెట్టిన సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించారు. మార్చి 22న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయానికి ప్రణీత్ రావును తీసుకెళ్లి ఆయన సమక్షంలో కొన్ని కంప్యూటర్లు, సామగ్రి, పత్రాలు, సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

నిందితులు తమలో తాము మాట్లాడుకోవాల్సి వచ్చేప్పుడు వాట్సప్, సిగ్నల్, స్నాప్ చాట్‌లు మాత్రమే వాడేవారు. ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా డేటా రిట్రైవ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

కదులుతున్న డొంక..

ఒక్కసారిగా ఇంతమంది అధికారుల పేర్లు బయటకు రావడంతో గతంలో ఆ అధికారుల వల్ల ఇబ్బంది పడ్డవారూ, తమ ఫోన్ కూడా ట్యాప్ అయింది అని అనుమానం పడుతున్న వారూ వరుసగా హైదరాబాద నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.

బీజేపీ నేత అయిన చీకోటి ప్రవీణ్ అనే గ్యాంబ్లింగ్ వ్యాపారి రాధాకిషన్ రావు మీద ఫిర్యాదు చేశారు. ‘‘తనపై తప్పుడు కేసులు పెడతానని రాధాకిషన్ రావు బెదిరించినట్టు, అలాగే తన అనుచరుల వద్ద ఆయుధాలు లేకపోయినా ఉన్నట్టు కేసు పెట్టారని’’ చీకోటి ప్రవీణ్ తన ఫిర్యాదులో రాశారు.

2015 నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తమకు అనుమానం ఉందని, గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేంద్ర అన్నారు. తాటికొండ రాజయ్య అనే డిప్యూటీ సీఎంను పదవి నుంచి తప్పించినప్పుడు తాము ఇదే అంశాన్ని కేసీఆర్ దగ్గర ప్రస్తావించగా, తన దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నట్టు కేసీఆర్ చెప్పారనీ.. ఆధారాలంటే ఫోన్ ట్యాపింగేనని అప్పుడు తమకు అర్థమైనట్టుగా ఆయన వివరించారు.

హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాప్ చేశారంటూ సిరిసిల్ల స్థానిక కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు.

తన ఫోన్ ట్యాప్ చేశారనీ, తన నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేశారని ఆరోపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు అనే ఆమె, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రాధాకిషన్ రావుపై ఫిర్యాదు చేశారు.

తన ఫోన్, తన బంధువుల ఫోన్ ట్యాప్ అయిందని బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రఘునందన రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. భార్యాభర్తల మాటలు కూడా విన్నారు అంటూ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపించారు.

రాధాకిషన్ రావు తనను నిర్బంధించి బలవంతంగా తన ఫ్లాట్ రాయించుకున్నారంటూ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు సుదర్శన కుమార్ అనే వ్యక్తి.

రేవంత్ రెడ్డి, కేటీఆర్, ఈటల రాజేందర్

5. రాజకీయంగా ఏం జరుగుతోంది?

ఈ కేసును లోతుగా విచారించాలని కాంగ్రెస్, బీజేపీలు రెండూ డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పటి ప్రభుత్వంతో పాటు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర రావు పేరును బహిరంగ సభల్లో ప్రస్తావించి మరీ హెచ్చరికలు చేసిన రేవంత్, తాము అధికారంలోకి వస్తే ప్రభాకర రావుపై చర్యలు తీసుకుంటామంటూ అప్పట్లో ప్రకటించారు.

‘‘ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా విన్నారు. ఎవరు దీనికి బాధ్యులో వారంతా చిప్పకూడు తినాల్సిందే’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్చరించారు. దానికితోడు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలువురు మంత్రి కేటీఆర్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.

త్వరలోనే ఈ కేసులో పోలీసులపైన ఉండే పొలిటికల్ బాసులపై కూడా కేసు పెట్టి విచారణకు పిలుస్తారన్న వార్తలు తెలంగాణలో వినిపిస్తున్నాయి. అదే జరిగితే, దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ వల్ల రాజకీయ నాయకులు అరెస్టయిన అరుదైన కేసుల్లో ఇది ఒకటి కాబోతోంది.

అయితే, ఈ వ్యవహారంతో తమకేం సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. ‘‘నేను ఏ హీరోయిన్‌నూ బెదిరించలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు క్షమాపణ చెప్పకపోతే వారిపై పరువు నష్టం కేసు పెడతాను. ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు. నాకు అంత కర్మ పట్టలేదు. నేను అంత దిగజారలేదు. దీనిపై ఆధారాలుంటే ఇవ్వండి. ఇప్పుడు కాదు అసలు 2004 నుంచీ ఫోన్ ట్యాపింగులపై విచారణ చేయండి. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు కదా, వారందరినీ విచారించండి’’ అన్నారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)