నాటో అంటే ఏమిటి? సభ్యదేశాలపై దాడికి రష్యాను ప్రోత్సహిస్తానని ట్రంప్ ఎందుకన్నారు?

స్వీడీష్ సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

యూరప్, ఉత్తర అమెరికా సైనిక కూటమి అయిన నాటోలో స్వీడన్ కూడా చేరింది. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తరువాత , స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు నాటో సభ్యత్వం లభించడంతోపాటు తూర్పు యూరప్‌లో అది తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది.

నార్త్ అట్లాంటిక్ ట్రీటీనే సంక్షిప్తంగా నాటో అంటారు. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో 1949 ఏప్రిల్ 4న ఇది ఏర్పాటైంది.

రష్యా సహా అనేక కమ్యూనిస్టు దేశాల సమాహారమైన సోవియట్ యూనియన్‌ విస్తరణను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా నాటోను ఏర్పాటు చేశారు.

నాటో సభ్య దేశాలలో, ఏ దేశంపై దాడి జరిగినా మిగిలిన సభ్యదేశాలు అండగా నిలవాలని సంకల్పించారు.

నాటోకు సొంతంగా సైన్యం లేదు. సంక్షోభ సమయంలో నాటోలోని సభ్యదేశాలన్నీ ఉమ్మడి సైనిక చర్య తీసుకుంటాయి.

ఈ దేశాలన్నీ మిలటరీ ప్రణాళికలపై సమన్వయం చేసుకొంటాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తాయి.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దండెత్తిన తరువాత, ‘‘ఈ దాడి తమ సభ్య దేశాల భద్రతకు ప్రత్యక్ష ముప్పులా కనిపిస్తోంది’’ అని నాటో వ్యాఖ్యానించింది.

నాటో దళాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

మొత్తం 32 దేశాలు

నాటోలో ప్రస్తుతం 32 సభ్యదేశాలు ఉన్నాయి.

1991లో సోవియట్ యూనియన్ పతనానంతరం తూర్పు ఐరోపాలోని అనేక దేశాలు నాటోలో చేరాయి.

అల్బేనియా, బల్గేరియా, హంగరీ, పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, రొమేనియా, లిథువేనియా, లాత్వివా, ఈస్టోనియా దేశాలు నాటో పంచన చేరాయి.

యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర తరువాత 2022 మేలో స్వీడన్, ఫిన్లాండ్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

దశాబ్దల తరబడి ఈ రెండు దేశాలు తటస్థంగా ఉన్నాయి.

రష్యాతో 1,340 కిలోమీటర్ల (832 మైళ్ళు) పొడవున సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ 2023 ఏప్రిల్లో నాటోలో చేరింది.

2024 మార్చిలో స్వీడన్ చేరింది.

స్వీడన్ చేరికను తొలుత టర్కీ, హంగరీ వ్యతిరేకించినా చివరకు అంగీకరించాయి.

స్వీడన్, ఫిన్లాండ్ చేరిక వల్ల 1990 తరువాత నాటో పెద్దయెత్తున విస్తరించినట్టు అయింది.

ఈ రెండు దేశాల నుంచి మిత్రరాజ్యాల సైన్యానికి మూడు లక్షల మంది సైన్యం జత కలిసినట్టయింది.

యుక్రెయిన్, బోస్నియా, హెర్జ్‌గోవ్నియా, జార్జియా కూడా త్వరలో నాటోలో చేరే అవకాశం ఉంది.

నాటో సభ్యదేశాలు
ఫొటో క్యాప్షన్, 1949 నుంచి యూరప్‌లో నాటో విస్తరణ ఇలా ఉంది.
నాటో కూటమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాటో బాస్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

యుక్రెయిన్ చేరిక ఎప్పుడు?

నాటోలో యుక్రెయిన్ చేరిక అనివార్యమని, కానీ రష్యాతో యుద్దం ముగిసేవరకు అది సాధ్యపడని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు.

యుక్రెయిన్‌ను వీలైనంత త్వరగా నాటోలో చేర్చుకోవాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

నాటో– యుక్రెయిన్ కౌన్సిల్, యుక్రెయిన్ తీసుకునే రక్షణాత్మక చర్యలను సమన్వయం చేస్తోంది.

నాటోలో యుక్రెయిన్ చేరికను రష్యా వ్యతిరేకిస్తూనే ఉంది.

యుక్రెయిన్ చేరిక వల్ల నాటో దళాలు తమ దేశ సరిహద్దు వరకు వచ్చేస్తాయని రష్యా భయపడుతోంది.

నాటో కూటమి

ఫొటో సోర్స్, ANADOLU VIA GETTY

ఫొటో క్యాప్షన్, నాటో యుద్ధ విమానాలు

నాటో దేశాల రక్షణ ఖర్చెంత?

జాతీయాదాయంలో కనీసం రెండు శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయాలని నాటో తన సభ్య దేశాలను కోరింది.

అమెరికా దాదాపు 3.5 శాతం ఖర్చు చేస్తుండగా, రష్యాతో సరిహద్దును పంచుకునే పోలండ్, బాల్టిక్ దేశాలు కూడా తమ సైనిక బలగాలపై రెండు శాతాన్ని మించి ఖర్చు చేస్తున్నాయి.

యూకే 2 శాతానికి కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తోంది.

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ 2023లో రెండు శాతం లక్ష్యం కన్నా తక్కువగా ఖర్చు చేశాయి.

రక్షణ రంగంపై తగినంత ఖర్చు చేయని నాటో సభ్య దేశాలపై దాడులు చేయాల్సిందిగా రష్యాను ప్రోత్సహిస్తానంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు.

2023లో నాటో సభ్య దేశాల రక్షణ వ్యయం అనూహ్యంగా పెరిగిందని, 2024లో 18 సభ్య దేశాలు 2 శాతం లక్ష్యాన్ని చేరుకోవడమో, లేదంటే అంతకుమించి ఖర్చు చేయడమో జరుగుతుందని నాటో నాయకత్వం భావిస్తోంది.

నాటో వ్యయం తీరు
ఫొటో క్యాప్షన్, రక్షణ రంగంపై నాటో సభ్యదేశాల వ్యయం తీరు
నాటో కూటమి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నాటో దేశాలు యుక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపలేదు

యుక్రెయిన్‌కు నాటో సాయమేంటి?

ఓ గ్రూపుగా నాటో, యుక్రెయిన్‌కు ఎలాంటి ఆయుధాలూ పంపలేదు.

కానీ అనేక సభ్యదేశాలు వ్యక్తిగత హోదాలో ఈ పని చేశాయి.

అమెరికా, యూకే, జర్మనీ, టర్కీ దేశాలు యాంటీ-టాంక్ ఆయుధాలను, క్షిపణి రక్షణ వ్యవస్థలను, ఫిరంగులను, టాంకులను, మిలటరీ డ్రోన్లను అందించాయి.

దీర్ఘకాలిక లక్ష్యాలను ఛేదించే క్షిపణులను కూడా అమెరికా, యూకే యుక్రెయిన్‌కు సమకూర్చాయి.

నాటో సభ్య దేశాలు యుక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అందించి, వాటిని ఎలా నడపాలో పైలట్లకు శిక్షణ ఇవ్వాలని అమెరికా కోరింది.

త్వరలోనే తాము పద్దెనిమిది ఎఫ్ -16 విమానాలను అందించనున్నట్టు నెదర్లాండ్స్ ప్రకటించింది.

అయితే నాటో దేశాలు యుక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపడం లేదు. అలాగే తమ ప్రాంతంలో ‘నో ఫ్లై జోన్’ ఆంక్షలు కూడా విధించడం లేదు. ఇలాంటి చర్యలు రష్యాతో నేరుగా ఘర్షణ పడేలా రెచ్చగొడతాయని వాటికి తెలుసు.

ఆర్కిటిక్, నార్త్ అట్లాంటిక్, మధ్య యూరప్, మధ్యధరా ప్రాంతాల్లో రష్యా దాడి చేసే అవకాశాలకు ప్రతిగా నాటో కమాండర్లు ఓప్రణాళికకు 2023లో ఆమోదం తెలిపారు.

తూర్పున రష్యా సరిహద్దు ప్రాంతాల్లో తన రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవడమే కాకుండా, యూరప్‌లో తమ బలగాలను 40 వేల నుంచి మూడు లక్షలకు పెంచాలనే ప్రణాళిక ఉన్నట్టు నాటో ప్రకటించింది.

మే చివరి నాటికి ‘డిఫెండర్‌ 2024’ పేరుతో నాటో తన అతిపెద్ద సైనిక విన్యాసాలను నిర్వహించనుంది.

ఇందులో స్వీడన్ సహా నాటో సభ్యదేశాల నుంచి 90 వేల మందికి పైగా సైనికులు పాలుపంచుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)