తెలంగాణ: ఖమ్మం పార్లమెంటు సీటు మీదే ఈ మూడు కుటుంబాల గురి... అసలు కథేంటి?

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
విలక్షణ రాజకీయాలకు పేరున్న ఖమ్మం జిల్లాలో లోక్ సభ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో హైడ్రామా నడుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు పేర్లను ఆ పార్టీలు ఖరారు చేశాయి.
కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ముగ్గురు బలమైన నాయకుల మధ్య టికెట్ పంచాయతీ తెగడం లేదు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. తన భార్య నందినికి టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలలో ఉన్నారు. మూడు రోజులపాటు దిల్లీలో ఉండి పార్టీ పెద్దలను కలిసి వచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ వారసుడిగా కుమారుడు యుగేందర్‌కు ఇవ్వాలని అడుగుతున్నారనేది పార్టీ నుంచి అందుతున్న సమాచారం.
మొత్తంగా ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ తరఫున నిలిచే అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది.

ఫొటో సోర్స్, Bhatti vikramarka/Twitter
అధిష్టానం దగ్గర...
మంత్రులు పొంగులేటి, తుమ్మల.. ఇద్దరూ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా దన్నుగా ఉన్నారనే పార్టీ వర్గాలు చెబుతున్న మాట.
అప్పట్లోనే పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్‌కు కూడా హామీ ఇచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
మరో మంత్రి తుమ్మల కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలో కమ్మ సామాజిక వర్గం బలంగానే ఉంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చారు.
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో చాలా మంది పార్టీ మారినా, ఆయన పార్టీలోనే కొనసాగారు. తన విధేయత కారణంగా ఎంపీ టికెట్ ఇవ్వాలనేది ఆయన చేస్తున్న డిమాండ్.
‘‘ఖమ్మంలో వారు ముగ్గురూ కీలక నేతలే. పార్టీకి దన్నుగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో చూస్తే.. ఖమ్మం లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 2.70లక్షల ఓట్ల మెజార్టీ ఉంది. అందుకే కచ్చితంగా గెలిచే సీటుగా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీనివల్లే ముగ్గురూ కూడా ఎవరికివారే పట్టుదలతో ఉన్నారు.’’ అని బీబీసీతో అన్నారు ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు బి.ప్రసేన్.

ఫొటో సోర్స్, @REVANTH_ANUMULA
సోనియా,రాహుల్ వద్దని చెప్పడంతో…
ఖమ్మం లోక్ సభ నుంచి సోనియాగాంధీ లేదా రాహుల్ గాంధీతో పోటీ చేయించాలని టీపీసీసీ తరఫున తీర్మానం చేసి పంపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో పోటీ చేయించాలనే ఆలోచన చేశారు.
దీనిపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పార్టీ పెద్దలను కలిసి వచ్చారు.
రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంతో ఖమ్మం సీటు విషయంలో పీట ముడి పడింది.
గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన రేణుకాచౌదరి కూడా రాజ్యసభ సీటు ఇవ్వడంతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారు.
ఇప్పుడు ఖమ్మం లోక్ సభ సీటు మూడు సీనియర్ నేతల కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారింది.
‘‘ఖమ్మం లోక్‌సభ పరిధిలో ముగ్గురు మంత్రులకు సమానంగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే జిల్లాపై పూర్తి పట్టు సాధిస్తారని మిగిలిన నేతలు భావిస్తున్నారు.అందుకే, తమ కుటుంబాలకు ఇవ్వకపోయినా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన (వీవీసీ రాజేంద్రప్రసాద్, కుసుమ కుమార్ వంటి) వారి పేర్లను తెరపైకి తీసుకువస్తున్నారు’’ అని చెప్పారు ఖమ్మంలో ఉండే మరో సీనియర్ జర్నలిస్టు.

ఫొటో సోర్స్, FB/lakarampark-tankband
కమ్మ ఓటు బ్యాంకుపై గురి
కమ్మ సామాజిక వర్గం ఖమ్మం లోక్‌సభ పరిధి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
దీనికితోడు, రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులే బరిలో నిలుస్తున్నారు.
2014లో పొత్తులో భాగంగా సీపీఐకు కేటాయించినా, కమ్మ సామాజికవర్గానికి చెందిన నారాయణ పోటీ చేశారు.
అదే సామాజికవర్గానికి చెందిన రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు ఇచ్చిన నేపథ్యంలో, సీటు కేటాయింపు ఆసక్తి రేపడానికి కారణంగా మారిందని చెప్పారు ఖమ్మం జిల్లాకు చెందిన న్యాయవాది అశోక్ కుమార్.
అయితే, ఈ విషయంపై ప్రసేన్ మాట్లాడుతూ, ‘‘కేవలం కమ్మ సామాజకవర్గం ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయని అనుకోవడానికి లేదు. తెలంగాణలో కమ్మ సామాజికవర్గానికి సీటు కేటాయించాలని ప్రతిపాదన వచ్చినప్పుడల్లా ఖమ్మం అనేది ఒక ఛాయిస్ గా మారింది.
రేణుకచౌదరికి రాజ్యసభ సీటు ఇచ్చినందున వేరొక సామాజికవర్గానికి కూడా సీటు ఇచ్చే అవకాశం ఉంది.’’ అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, SuhasiniNandamuri/Facebook
తెరపైకి నందమూరి కుటుంబం..
ఇటీవల నందమూరి సుహాసిని పేరును కాంగ్రెస్‌లోని ఒక వర్గం తెరపైకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం ఆమె తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ మధ్యనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు.
గతంలో..2018లో టీడీపీ-కాంగ్రెస్-టీజేఎస్ కూటమి అభ్యర్థిగా కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 70,563 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఖమ్మం జిల్లాలో బలంగా ఉంది. వామపక్షాలతో పోటీగా టీడీపీ బలమైన క్యాడర్‌ను ఏర్పరచుకుంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయంలో టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు.
గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.
‘‘ఖమ్మంలో టీడీపీకి ఇప్పటికీ ఉంటుందని అంచనా. అంతకంటే ఎక్కువే ఉండొచ్చు.
గత ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఇలా రెండుపార్టీలకు మళ్లాయి. ఇప్పుడు కాంగ్రెస్ కు పూర్తిగా పొందాలంటే టీడీపీ మూలాలున్న అభ్యర్థిని రంగంలోకి దింపొచ్చనే ఆలోచన కాంగ్రెస్ చేయవచ్చు.
అలాగే, కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కనుక ఆ దిశగానూ ఆలోచన చేయవచ్చు’’ అని ఖమ్మంకు చెందిన రాజకీయ విశ్లేషకులు వెంకట నారాయణ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, RenukaChowdary/Facebook
ముగ్గురు మినహా అందరూ నాన్ లోకల్
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం 1952లోనే ఏర్పడింది. అప్పటి నుంచి17 సార్లు ఎన్నికలు జరిగాయి.
వీటిల్లో ఎక్కువ సార్లు(10) కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఒకసారి మాత్రం(1980లో) కాంగ్రెస్(ఐ) అభ్యర్థి గెలిచారు.
ఖమ్మం లోక్ సభ స్థానం పరిధిలో 11.60లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావు పేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇక్కడ పోటీ చేసిన, గెలిచిన వారిలో స్థానికులే కాకుండా స్థానికేతరులు ఎక్కువగానే ఉన్నారు.
1962 నుంచి వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన టి.లక్ష్మీకాంతమ్మది మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్.
1991లో గెలిచిన పీవీ రంగయ్యనాయుడిది సొంతూరు తూర్పుగోదావరి ప్రాంతం.
1998లో గెలిచిన నాదెండ్ల భాస్కరరరావుది గుంటూరు జిల్లా.
1999, 2004లో గెలిచి, 2009, 2019లో పోటీ చేసి ఓడిపోయిన రేణుకాచౌదరి పుట్టిన ఊరు విశాఖపట్నం.
2009, 2019లో గెలిచిన నామా నాగేశ్వరరావుది మహబూబాబాద్ ప్రాంతం.
జలగం కొండలరావు, జలగం వెంగళరావు, తమ్మినేని వీరభద్రం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వీరు మినహా ఖమ్మంలో గెలిచిన మిగిలిన ఐదుగురు అభ్యర్థుల నాన్ లోకలే.
చరిత్ర ఒక్కసారి చూస్తే, ఖమ్మం లోక్ సభ స్థానంలో స్థానికేతరులే విజయం సాధిస్తున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ..
గత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలను చూస్తే, ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, లోక్ సభ ఫలితాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
2014, 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకే స్థానం వచ్చింది.
అదే సమయంలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు.
తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కొనసాగారు. ఇప్పుడు మళ్లీ 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గెలిచారు.
గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం(భద్రాచలం) దక్కింది.
సీపీఐ కొత్తగూడెంలో గెలుపొందగా.. మిగిలిన ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మూడు రోజుల కిందట జరిగిన ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్‌కు ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ఇదిలా ఉండగా, ఖమ్మం లోక్ సభ సీటు విషయానికి వస్తే, తుక్కుగూడలో జరిగే బహిరంగ సభ తర్వాత ఖమ్మం పార్లమెంట్ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకావం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














