కచ్చతీవుకు బదులుగా భారత్‌ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ రిపోర్టర్

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారని బీజేపీ విమర్శిస్తోంది. అందుకు బదులుగా కీలకమైన వాడ్జ్‌ బ్యాంక్ ప్రాంతాన్ని పొందామని కాంగ్రెస్ బదులిస్తోంది.

1974లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాక్ జలసంధి ప్రాంతంలో భారత్ - శ్రీలంక మధ్య సరిహద్దును గుర్తించే సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిందని బీజేపీ చెబుతోంది. గత ఆదివారం నుంచి చాలా మంది బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

భారత్, శ్రీలంక మధ్య మారిటైమ్ బౌండరీ (సముద్ర ప్రాంతంలో సరిహద్దు) ఒప్పంద సమయంలో విలువైన 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతాన్ని పొందినట్లు కాంగ్రెస్ వాదిస్తోంది.

అసలీ వాడ్జ్‌ బ్యాంక్ ఎక్కడుంది? అది భారత్‌కు ఎలా వచ్చింది? దాని ప్రాముఖ్యమేంటి?

వాడ్జ్ బ్యాంక్‌పై భారత సార్వభౌమాధికారం

మారిటైమ్ బౌండరీని గుర్తిస్తూ భారత్, శ్రీలంక మధ్య రెండు ఒప్పందాలు జరిగాయి. మొదటి ఒప్పందంపై 1974లో ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, పాక్ జలసంధి ప్రాంతంలో ఇరుదేశాల సరిహద్దును గుర్తించారు. దీని ప్రకారం కచ్చతీవు శ్రీలంకకు చెందుతుందని తేల్చారు.

1976 మార్చి 23న రెండో ఒప్పందం జరిగింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో భారత్, శ్రీలంక మారిటైమ్ బౌండరీని ఈ ఒప్పందం గుర్తిస్తుంది. ఈ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కెవల్ సింగ్, శ్రీలంక విదేశాంగ కార్యదర్శి డబ్ల్యూడి జయసింఘె సంతకాలు చేశారు.

ఒప్పందం తర్వాత కెవల్ సింగ్ డబ్ల్యూడి జయసింఘెకి లేఖ రాశారు. ఆ లేఖలో వాడ్జ్ బ్యాంక్ గురించి స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో చేపల వేటకు సంబంధించి ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.

1. కన్యాకుమారి సమీపంలోని వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం భారత స్పెషల్ ఎకనమిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి) పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతం, అక్కడి వనరులపై భారత్‌కు పూర్తి సార్వభౌమాధికారం ఉంది.

2. శ్రీలంకకు చెందిన ఫిషింగ్ బోట్లు కానీ, మత్స్యకారులు కానీ వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో చేపల వేట చేయడానికి వీల్లేదు. కానీ ఇరుదేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సూచనగా, భారత్ నుంచి అనుమతులు పొందిన ఫిషింగ్ బోట్లు మూడేళ్ల వరకూ ఆ ప్రాంతంలో చేపలు పట్టుకోవచ్చు. నిర్ణీత కాలపరిమితి దాటిన తర్వాత శ్రీలంక ఫిషింగ్ బోట్లు వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలోకి ప్రవేశించకూడదు.

3.ఈ మూడేళ్ల పరిమితి కోసం శ్రీలంక ఫిషింగ్ బోట్లు భారత్ నిర్దేశించిన రేట్లు చెల్లించడంతో పాటు షరతులను అంగీకరించాలి.

4.వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో పెట్రోలియం లేదా ఇతర ఖనిజ నిక్షేపాలను అన్వేషించాలని భారత్ భావిస్తే ఆ విషయం శ్రీలంకకి సమాచారం అందిస్తారు. భారత్ చెప్పిన తేదీన బోట్లు ఇటువైపు రాకుండా శ్రీలంక నిలిపేయాలి.

5. వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో చేపల వేటకు శ్రీలంక బోట్లను నిషేధించినందున, కొత్త ఫిషింగ్ జోన్ల ఏర్పాటులో శ్రీలంకకు భారత్ సహకారం అందిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

దీనికి సమాధానంగా జయసింఘె కూడా లేఖ రాశారు. ఈ ఒప్పందం ప్రకారం వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం భారత్‌కు వచ్చింది.

భారత్
భారత్
భారత్

వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం ఎక్కడుంది?

కన్యాకుమారికి దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో ఈ వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం ఉంటుంది. ఇది పూర్తిగా జలమయం, ఇక్కడ భూభాగం ఉండదు. మరింత కచ్చితంగా చెప్పాలంటే, కన్యాకుమారికి దక్షిణాన భారత ఉపఖండానికి చివరికొన ఇది. భారత ప్రాదేశిక జలాలకు అవతల ఉన్నప్పటికీ, భారత్ ఇంకా శ్రీలంక ఈ ప్రాంతంపై యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేశాయి. ఇక్కడ సముద్రం లోతు సుమారు 200 మీటర్లు.

వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం దాదాపు 10,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలో మత్స్యసంపద కూడా పెద్దసంఖ్యలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు మధ్యస్తంగా ఉన్నప్పటికీ సముద్రపు నీరు మరింత ఉప్పగా ఉంటుంది. చేపల పెంపకానికి అనువైన ప్రాంతంగా పరిగణిస్తారు. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య చేపల వేటకు అనుకూల సమయంగా చెబుతారు.

ఈ ప్రాంతంలో చేపలు పట్టేందుకు కన్యాకుమారి జిల్లాలోని కులాచల్, చిన్నముత్తం రేవుల నుంచి ఫిషింగ్ బోట్లు వస్తుంటాయి. కేరళలోని విల్లించం నుంచి కూడా బోట్లు వస్తాయి.

ఇక్కడ దాదాపు 425 రకాల చేపలు కనిపిస్తాయి. ఏడాదికి 65,000 మెట్రిక్ టన్నుల చేపలు లభ్యమవుతాయి.

భారత్ - శ్రీలంక

ఫొటో సోర్స్, SRILANKA FISHERIES MAGAZINE 1976

వాడ్జ్ బ్యాంకులో పెట్రోలియం నిక్షేపాలున్నాయా?

వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం జీవవైవిధ్యానికి, మత్స్య సంపదకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఈ ప్రాంతంలో పెట్రోలియం నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని భారత్ భావిస్తోంది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ గత జనవరిలో ఒక ప్రకటన జారీ చేసింది. వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో గుర్తించిన మూడు ప్రదేశాల్లో, పెట్రోలియం నిక్షేపాలను అన్వేషించేందుకు ఆసక్తి కలిగిన కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొంది.

అయితే, కన్యాకుమారి, కేరళకు చెందిన మత్స్యకారులు ప్రభుత్వ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. పర్యావరణవేత్తలు కూడా ఖండించారు. ఇక్కడ పెట్రోలియం నిక్షేపాల కోసం తవ్వకాలు జరపకూడదని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం కేంద్ర మత్య్సశాఖకు లేఖ కూడా రాశారు.

కానీ ఈ ప్రాంతంలో పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాల కోసం తవ్వకాలు జరపాలని భారత్ చాలా కాలంగా ఆసక్తి చూపుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)