పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 160 కిలోల మహిళ, ఊబకాయం ఉన్న గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బిడ్డతో సిమోరా డీ. సౌజా, వైద్యురాలు

ఫొటో సోర్స్, SIMORA DESOUZA

ఫొటో క్యాప్షన్, బిడ్డతో సిమోరా డీ. సౌజా, వైద్యురాలు
    • రచయిత, ఓంకార్ కరంబేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఊబకాయం, థైరాయిడ్, పీసీఓడీ, రుతుక్రమం సరిగ్గా లేకపోవడం, రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు కొన్నేళ్లుగా బాగా పెరుగుతున్నాయి.

పని విధానంలో, జీవనశైలిలో మార్పులు, అత్యధిక కెలొరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామాలు చేయకపోవడం, జన్యుపరమైన లోపాలు, ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటివి చాలా మందిపై ప్రభావం చూపుతున్నాయి.

అమ్మాయిలు చిన్నతనం నుంచే బరువు బాగా పెరిగిపోవడం చూస్తుంటాం. ఊబకాయం పెరగడం, త్వరగా రుతుక్రమం ప్రారంభం కావడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటివి మహిళలకు ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయంలో పలు ఇబ్బందులను కలగజేస్తున్నాయి.

కానీ, ఇటీవల ముంబయి శివారు ప్రాంతం మీరా రోడ్డులో నివసిస్తున్న 160 కిలోల మహిళ ఈ ఇబ్బందులన్నింటిన్ని అధిగమించారు.

ఆమె పేరు సిమోరా డీ సౌజా. పెళ్లయిన 14 ఏళ్ల తర్వాత 33 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. సిజేరియన్ పద్ధతిలో ఆమెకు ప్రసవం చేశారు.

సిమోరా ఒక బీపీఓ కంపెనీలో పనిచేస్తున్నారు.

చిన్నప్పటి నుంచే ఊబకాయం, హైపోథైరాయిడిజం

సిమోరా డీ సౌజా చిన్నతనం నుంచే ఊబకాయం, హైపోథైరాయిడిజంతో బాధ పడుతున్నారు.

కొన్నేళ్ల క్రితం ఆమె 185 కేజీల బరువు పెరిగారు. బరువు తగ్గించుకునేందుకు ఆమె బేరియాట్రిక్ శస్త్రచికిత్స కూడా తీసుకున్నారు. ఈ చికిత్స తర్వాత ఆమె బరువు 130 కేజీలకు తగ్గింది. ఆ తర్వాత ఆమె గర్భవతి అయ్యారు.

గర్భిణీగా ఉన్న సమయంలో సిమోరా మళ్లీ 30 కేజీల బరువు పెరిగారు. దీంతో, డెలివరీ సమయంలో ఆమె బరువు 160 కేజీలు.

సిమోరా తాము సూచించిన అన్ని పద్దతులను క్రమం తప్పకుండా పాటించడంతో జెస్టేషనల్ డయాబెటీస్ రాలేదని ఆమెను పర్యవేక్షించిన వైద్యులు చెప్పారు.

అంతేకాక, బిడ్డ కూడా 3.2 కేజీల బరువుతో పుట్టినట్లు తెలిపారు. జెస్టేషనల్ డయాబెటీస్ అనేది సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వస్తూ ఉంటుంది.

బిడ్డ పుట్టిన తర్వాత అన్ని రకాల పరీక్షలు చేశారు. అన్ని సాధారణమని వచ్చాయి.

డెలివరీ అయిన తర్వాత తల్లిలో పాలు ఉత్పత్తి అవ్వడానికి కొంత సమయం పడుతుంది. తల్లికి, బిడ్డకు మధ్యలో ఈ అనుబంధం ఏర్పాటయ్యేందుకు కాస్త సమయం పడుతుంది.

కానీ, సిమోరా విషయంలో ఇది వెనువెంటనే జరిగిందని ఆమెను పర్యవేక్షించిన వైద్యులు చెప్పారు.

ఇతర మహిళల మాదిరిగా సిమోరాను రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

ఆశ్చర్యకరంగా ఈ సమయంలో సిమోరా బరువు 160 కేజీల నుంచి 152 కేజీలకు తగ్గారు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ రాలేదని వైద్యులు చెప్పారు.

బిడ్డతో సిమోరా డీ. సౌజా

ఫొటో సోర్స్, SIMORA DESOUZA

ఫొటో క్యాప్షన్, బిడ్డతో సిమోరా డీ. సౌజా, వైద్యురాలు

గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డను కనేటప్పుడు వచ్చే ఇబ్బందులేంటి?

ఊబకాయం, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలున్న మహిళలకు బిడ్డను కనేటప్పుడు కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది. నిపుణులైన, అనుభవమున్న వైద్యులు, అలాగే నిపుణులైన అనెస్థీషియా వైద్యులు కావాలి.

సిమోరాకు డెలివరీ చేసిన మీరా రోడ్డులోని వోకార్డ్ట్‌ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మంగళ పాటిల్ దీని గురించి బీబీసీకి వివరించారు.

‘‘ఊబకాయం, కోమార్బిడిటీస్ వల్ల వీరి ప్రెగ్నెన్సీ కాస్త ప్రమాదకరంగా ఉంటుంది. ఊబకాయ మహిళలు ప్రెగ్నెన్సీలో ముందుస్తు డెలివరీ, కాన్పు పోవడం, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు, జెస్టేషనల్ డయాబెటీస్, అధిక రక్తపోటు, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని డాక్టర్ పాటిల్ తెలిపారు.

‘‘అత్యధిక రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ మహిళలకు సర్జరీ అవసరం పడే అవకాశం ఎక్కువ. సిజేరియన్ డెలివరీకే ఎక్కువ అవకాశం ఉంటుంది. డెలివరీ సమయంలో, ఆ తర్వాత ఎక్కువ రక్తస్రావమవుతుంది. వారికి రక్తాన్ని ఎక్కించడం, అలాగే ఇంటెన్షివ్ కేరింగ్ అవసరం పడుతుండొచ్చు’’ అని తెలిపారు.

‘‘ఊబకాయ మహిళలు సరైన ఆహార నియామవళి, జీవనశైలి మార్పులను పాటించడం ద్వారా ప్రెగ్నెన్సీకి ముందే బరువు తగ్గాలి. థైరాయిడ్ డిజార్డర్, అధిక రక్తపోటు, డయాబెటీస్, గుండె వ్యాధి ఉన్న వారు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. సరైన ఆహార నియామవళి, జీవన శైలి మార్పులు, వ్యాయామం ద్వారా బరువు తగ్గనప్పుడు, ఊబకాయ రోగులు బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స అందుబాటులో ఉంది. గర్భవతి కావాలనుకున్న ఈ మహిళ, బేరియాట్రిక్ శస్త్రచికిత్స తీసుకుని, ఆమె బరువు 185 కేజీల నుంచి 130 కేజీలకు తగ్గారు’’ అని సిమోరాను ఉద్దేశించి వైద్యురాలు చెప్పారు.

ఎక్కువ రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీలలో తరుచూ వైద్యున్ని సందర్శించడం, క్రమం తప్పకుండా అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోవడం అవసరం. దీంతో పాటు సరైన ఆహార పద్ధతులను, వ్యాయామాలను పాటించాలి. సాధారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు సగటున 11 కేజీల వరకు బరువు పెరుగుతారు. కానీ, సిమోరా 30 కేజీల వరకు బరువు పెరిగారని డాక్టర్ చెప్పారు.

‘‘ప్రసూతి వైద్య విభాగం, సర్జరీ విభాగం, అనెస్థీషియా, చిన్న పిల్లల విభాగం, ఎండోక్రినాలజిస్ట్ విభాగానికి చెందిన నిపుణులైన వైద్యులందరూ కలిసి ఈ సవాళ్లను అధిగమించారు. సురక్షితంగా కాన్పు చేసి, తల్లి బిడ్డను కాపాడారు’’ అని తెలిపారు.

ఈ కేసులను నిర్వహించేందుకు ఆసుపత్రులలో సరైన సదుపాయాలు కూడా కావాలని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

కౌన్సిలింగ్‌ది ముఖ్య పాత్ర

డెలివరీ ప్రారంభం నుంచి గర్భిణీతో తామందరం కలిసి మాట్లాడుతున్నట్లు డాక్టర్ మంగళ పాటిల్ చెప్పారు. ఆమె గర్భవతి అయినప్పుడు, సిమోరాకు కాస్త అనుమానంగా అనిపించింది.

ఆమె ఆరోగ్యంపై తాము నమ్మకాన్ని కలిగించామని, సిమోరా కూడా తన జీవన విధానంలో పలు మార్పులు చేసుకున్నారని చెప్పారు.

‘‘సరైన ఆహార పద్ధతులను పాటించారు. మేం చెప్పిన సూచనలన్నింటిన్నీ చాలా జాగ్రత్తగా, తప్పనిసరిగా పాటించడం వల్ల పండంటి బిడ్డకు సిమోరా జన్మనివ్వగలిగారు’’ అని తెలిపారు.

‘‘తేలిగ్గా డెలివరీ చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు. తల్లిని, బిడ్డను ఇద్దర్ని క్షేమంగా ఉండేలా చూడటం మా కర్తవ్యం. ఇలాంటి ప్రెగ్నెన్సీల్లో కౌన్సిలింగ్ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగికి భరోసా కల్పించి, వారిలో నమ్మకాన్ని పెంచడం అత్యంత కీలకం’’ అని సిమోరాను ఉద్దేశించి డాక్టర్ పాటిల్ చెప్పారు.

గర్భిణీ

ఫొటో సోర్స్, Getty Images

ఇది సరికొత్త జీవితం: సిమోరా

‘‘పెళ్లి తర్వాత బిడ్డ పుడుతుందని మేమెప్పుడూ అనుకోలేదు. కానీ, ఈ వయసులో కూడా నేను ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలిగాను. సరికొత్త జీవితాన్ని పొందినట్లు అనిపిస్తోంది’’ అని బీబీసీతో మాట్లాడుతూ సిమోరా చెప్పారు.

‘‘చిన్నతనం నుంచే నాకు ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. ఈ ప్రయాణం నాకు చాలా కష్టమైంది. కానీ, నా భర్త చాలా అండగా నిలిచారు. మా మావయ్యకు కూడా థైరాయిడ్ సమస్య ఉంది. అందుకే, వారికి ఈ ఇబ్బంది తెలుసు. మాకు 2010లో పెళ్లయింది. 30 ఏళ్ల వయసు అప్పుడు, నేను బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాను. ప్రస్తుతం 33 ఏళ్లు, బిడ్డను కనగలిగాను’’ అని చెప్పారు సిమోరా.

‘‘మీకు ఎన్నో సమస్యలు, వ్యాధులు ఉన్నప్పుడు సానుకూల ధోరణిలో ఉంటే మీ ఈ ప్రయాణం తేలిక అవుతుంది. ప్రపంచంపై, మీ పరిస్థితి విషయంలో సానుకూల వైఖరితో ఉంటే, ఇది చాలా తేలిక’’ అని తెలిపారు.

‘‘ఇప్పుడు నాకు ఈ కొత్త జీవితం లభించింది. నేనిప్పుడు మంచి తల్లిని కావాలనుకుంటున్నా. నా బిడ్డను సురక్షితంగా చూసుకోవాలనుకుంటున్నా’’ అని సిమోరా చెప్పారు.

ఏ మహిళలకు గర్భం దాల్చడం కష్టమవుతుంది?

అయితే, చాలా మంది మహిళలకు గర్భం దాల్చడానికి సరైన బరువుతో ఉన్నామా? బరువు ఎక్కువగా ఉండటం వల్ల గర్భం వస్తుందా? అనే అనుమానం ఉంటుంది.

బరువుపై కాకుండా బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)పై దృష్టిపెట్టాలని మంగళ పాటిల్ చెప్పారు. సాధారణ బరువు నియమాన్ని ప్రతి ఒక్కరిపై రుద్దడం కంటే, ప్రతి ఒక్క మహిళ తమ బీఎంఐపై దృష్టిపెట్టాలని అన్నారు.

‘‘ప్రస్తుత బరువులో 10 శాతం తగ్గినా, ఓవల్యూషన్ సమయంలో ఉన్న ఇబ్బందులను తగ్గిస్తుంది. మీ బీఎంఐ 18.5 నుంచి 24 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. 25కి పైన బీఎంఐ ఉంటే అధిక బరువుగా, 30కి పైన ఉంటే ఊబకాయం ఉన్నట్లు పరిగణిస్తారు’’ అని పాటిల్ తెలిపారు.

ఒకవేళ బీఎంఐ 24ని దాటితే, ఓవల్యూషన్ వంటి పలు శారీరక విధుల్లో ఇబ్బందులు ఎదురు కావొచ్చు. 30కి పైన బీఎంఐ ఉన్న మహిళలు, దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. 24 నుంచి 29 మధ్యనున్న మహిళలు కూడా దాన్ని కొంచెం తగ్గించుకుంటే మరిన్ని ప్రయోజనాలుంటాయి అని చెప్పారు.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఊబకాయాన్ని నిరోధించుకునేందుకు జీవనశైలిలో మార్పులు చాలా అవసరమంటున్న వైద్యులు

ఊబకాయాన్ని నిరోధించాలంటే ఎలా?

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ఇబ్బంది పడుతున్న మహిళలకు డాక్టర్ మంగళ పాటిల్ పలు సూచనలు చేస్తున్నారు.

‘‘ఆల్కాహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం అలవాట్లు ఉంటే, మొదట వాటిని ఆపేయాలి. చాలా మంది మహిళలు ఇటీవల ఉద్యోగాలు చేస్తున్నారు. వారి పని ఎక్కువగా ఒకే ప్రాంతంలో కూర్చుని చేసేదై ఉంటుంది. కానీ, వారు తమ కదలికలను పెంచుకోవాలి’’ అని డాక్టర్ పాటిల్ బీబీసీకి చెప్పారు.

‘‘జీవన శైలిలో పలు మార్పులు చేపట్టాలి. స్పైసీగా, ఆయిలీగా ఉన్న పదార్థాలను, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను తినడం ఆపేయాలి. మంచి బీఎంఐ పాటించేందుకు సరైన ఆహార పద్ధతులను, వ్యాయామాలు చేయాలి. అంతేకాక, మంచి నిద్ర చాలా ముఖ్యం’’ అని పాటిల్ తెలిపారు.

అలాంటి మహిళలకు విటమిన్ డీ, ఫోలిక్ యాసిడ్, మల్టివిటమిన్, థైరాయిడ్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుతం ఊబకాయం ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. 110 నుంచి 120 కేజీల మధ్య బరువుతో ప్రతి నెలా ఒక మహిళ ఆస్పత్రికి వస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం 143 కేజీలున్న మహిళకు కూడా పాటిల్ ఆపరేషన్ చేసి, బిడ్డను క్షేమంగా బయటికి తీశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)