అధిక బరువు వేధిస్తోందా? డబ్ల్యూహెచ్‌వో సలహాలు ఇవీ

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమోజెన్ ఫౌల్క్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. జనాభాలో ప్రతి 8 మందిలో ఒకరు అధిక బరువుతో ఉన్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రపంచం బరువెక్కుతోంది. 1990 నుంచి ఊబకాయం సమస్య అనూహ్యమైన వేగంతో పెరగిందంటూ పరిశోధకులు చెబుతున్నారు.

అధిక బరువు గుండె జబ్బులు, మధుమేహం లాంటి సమస్యలతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీస్తుందంటూ, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నారు.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

అధిక బరువు ఉన్నామని ఎలా తెలుస్తుంది?

అధిక బరువును బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) ద్వారా అంచనా వేయవచ్చు. మనిషి ఎత్తు, బరువును బట్టి బీఎమ్ఐ ఎంతో తెలుస్తుంది. దీంతో మీకు ఇప్పటికే ఊబకాయం ఉందా? లేదా దానికి చేరువలో ఉన్నారా అనే విషయాలు తెలుస్తాయి.

కానీ, బీఎంఐ ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు గురించి తెలుసుకోలేం.

బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉండాలి?

ఆరోగ్యకరమైన బరువు: బీఎంఐ 18.5 - 24.9

అధిక బరువు: బీఎంఐ 25.0 - 29.9

ఊబకాయం క్లాస్ 01: బీఎంఐ 30 - 34.9

ఊబకాయం క్లాస్ 02: బీఎంఐ 35 - 39.9

ఊబకాయం క్లాస్ 03: బీఎంఐ 40 కంటే ఎక్కువ

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరీర బరువును నియంత్రణలో పెట్టుకోవాలంటే సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి.

బాలలు, యుక్తవయసు వారిలో భారీ పెరుగుదల

ప్రపంచవ్యాప్తంగా బాల్యంలో, యుక్తవయసులో ఊబకాయంతో బాధపడేవారు 1990లో 3 కోట్ల 10 లక్షల మంది ఉండగా, 2022లో వారి సంఖ్య 16 కోట్లకు చేరింది. అంటే ఇది నాలుగు రెట్లయ్యిందని ఈ డేటా చెబుతోంది.

వయోజనుల్లో 2022లో దాదాపు 88 కోట్ల మంది ఊబకాయులున్నారు. 1990 నాటి సంఖ్యకు ఇది నాలుగున్నర రెట్లు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ఊబకాయంతో ఉన్నారని అంచనా.

ఆసియా, కరేబియన్‌ దేశాల్లో ఊబకాయం చాలా వేగంగా పెరుగుతోంది. యూరప్, ఉత్తర అమెరికాలలో ఊబకాయం చాలా కాలంగా ఉన్న సమస్యే. అక్కడ ఒబేసిటీ కేసులు అంత వేగంగా పెరగనప్పటికీ తగ్గుదల కూడా కనిపించడం లేదు.

"మనం ఏదో ఒకటి చేయాలి. లేదంటే పిల్లలు, యువకులలో చాలా మంది అధిక బరువుతో జీవించాల్సి వస్తుంది. జీవితంలో ఎక్కువ భాగం ఊబకాయంతో గడిపితే కలిగే దుష్ఫలితాలేంటో మనకు తెలుసు. ఊబకాయం ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదు’’ అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మజీద్ ఇజ్జాటి అన్నారు.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

ఎలా తగ్గించుకోవచ్చు?

ఆహార అలవాట్లను మార్చుకోవడం, ఇంట్లో వండిన కొవ్వు , పిండి పదార్ధాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, జీవన శైలిని మార్చుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఊబకాయానికి కొంత వరకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం నుంచి మనల్ని రక్షించుకునే దారులూ ఉన్నాయి.

  • ధూమపానానికి దూరంగా ఉండటం
  • ప్యాక్డ్ ఫుడ్స్, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం
  • ప్లాస్టిక్, సౌందర్య సాధనాలు, లోషన్ల వాడకాన్ని తగ్గించడం
  • పురుగుమందులతో తయారైన ఆహారం తినడం తగ్గించడం
  • వీలైనంత వరకు అన్నింటినీ రీసైకిల్ చేసి ఉపయోగించడం

ముఖ్యంగా వైద్యారోగ్య అధికారులు ఈ పదార్థాల వినియోగాన్ని తగ్గించడానికి విధానపరమైన చర్యలు తీసుకోవాలి.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది?

ఆరోగ్యకర ఆహార పదార్థాల ధరలు చౌకగా ఉండేలా చూడాలని ఆయా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

కొవ్వు, పంచదార, ఉప్పు ఉండే ఆహార పదార్థాల ప్రకటనలపై పరిమితులు విధించాలని చెబుతోంది. పాఠశాలల్లో పిల్లలతో ఆటలు ఆడించాలి. పోషకాహారం తీసుకోవడాన్ని ప్రోత్సహించాలి.

ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా బరువును తగ్గించే మందుల వాడకం మంచిదే కావచ్చు కానీ అది పెరుగుతున్న ఊబకాయం సమస్యకు పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)