ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: పెట్రోల్, డీజిల్ రేట్లు దేశంలో ఎక్కడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?

పెట్రోల్, డీజిల్ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అతిత్వరలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ ఈ మాటలు అన్నారు.

ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే వీటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏపీలో అత్యధిక రేటు ఉండగా.. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది.

ఇంతకీ, దేశంలో ఎక్కడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

పెట్రోలు ధరలు

కేంద్ర ప్రభుత్వ వాటా ఎంతంటే...

మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అనేవి ఏ రోజుకారోజుగా నిర్ణయిస్తారు.

ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను రోజూ నిర్ణయిస్తుంటాయి. దీనికి అనుగుణంగా మార్కెట్ ధరలు నిర్ణయం అవుతాయి.

మొత్తం మనకు పెట్రోల్ బంకుల్లో కనిపించే ‌‍‌‍ధరలో 42శాతం ధరకు పెట్రోల్, 49శాతం ధరకు డీజిల్ డీలర్లకు వస్తాయి.

ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పన్నులు విధిస్తోంది.

కస్టమ్స్ డ్యూటీ (ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ ఉంటాయి), సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ (ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ సెస్, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ సెస్ ఉంటాయి) కలిపి 31శాతం పన్నులు విధిస్తోంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.32.90.. డీజిల్ పై రూ.31.80 తీసుకుంటోంది.

ఇది కాకుండా డీలర్ కమిషన్ కింద పెట్రోల్‌పై నాలుగు శాతం, డీజిల్‌పై 3శాతం ప్రతి లీటర్‌పై డీలర్లకు వెళుతుంది.

పెట్రోలు ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఏపీ, తెలంగాణలో ఎక్కువ పన్నులు

ఇంతవరకు మనం లెక్కగట్టిన శాతాలు కేవలం కేంద్రం, డీలర్ల కమీషన్లు మాత్రమే.

ఇవి కాకుండా రాష్ట్రాలు విధించే పన్నులు ఉన్నాయి.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం.. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పన్నులు కింద వి‌ధంగా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్‌పై 31వాతం వ్యాట్(వాల్యూ యాడెడ్ ట్యాక్స్) రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది.

ఇది కాకుండా అదనపు వ్యాట్ పేరుతో రూ.4 వసూలు చేస్తోంది. రోడ్ డెవలప్ మెంట్ సెస్ కింద రూపాయి తీసుకుంటోంది.

అదే డీజిల్ విషయానికి వస్తే, 22.25శాతం వ్యాట్, రూ.4 అదనపు వ్యాట్, రూపాయి రోడ్ డెవలప్ మెంట్ సెస్ కింద తీసుకుంటోంది.

తెలంగాణలో లీటరు పెట్రోల్‌పై 35.20శాతం వ్యాట్, లీటరు డీజిల్ పై 27శాతం వ్యాట్ వసూలు చేస్తోంది.

పెట్రోలు ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఏపీ, తెలంగాణలో వసూలు చేస్తున్న వ్యాట్, సెస్‌లు ఇతర అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర పన్నులు, సెస్‌లు కలుపుకొంటే, పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న పరిస్థితి చూడవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తర్వాత అధికంగా కేరళలో లీటరు పెట్రోల్‌పై 30.08 శాతం వ్యాట్, రూపాయి అదనపు సేల్స్ ట్యాక్స్, ఒక శాతం సెస్, రూ.2 సోషల్ సెక్యురిటీ సెస్ వసూలు చేస్తున్నారు. డీజిల్‌పైనా లీటరకు 22.76 శాతం సేల్స్ ట్యాక్సు సహా మిగిలిన ట్యాక్సులు, సెస్‌లు వసూలు చేస్తున్నారు. అందుకే అక్కడ కూడా ఎక్కువగా రేట్లు ఉన్నాయి.

‘‘వాస్తవంగా లీటరు పెట్రోల్ రూ.70 వరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్, రోడ్ సెస్ తీసుకుంటోంది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కారణంగా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. సెస్‌లు, ట్యాక్స్‌లు ఎత్తివేస్తే ఇది రూ.70కే ల‌భించే వీలుంది’’ అని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

పెట్రోల్ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

అక్కడ ఒక్క శాతమే వ్యాట్

అదే కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్‌కు వచ్చేసరికి కేంద్ర పన్నులతోపాటు కేవలం ఒక శాతం సెల్స్ ట్యాక్సును లీటరు పెట్రల్/డీజిల్‌పై వసూలు చేస్తున్నారు.

దీనివల్ల పన్నుల ‌‍భారం లేకపోవడంతో అతి తక్కువకే పెట్రోల్, డీజిల్ లభిస్తోంది.

ఇలా రాష్ట్రాల్లో బేసిక్ క్రూడ్ ఆయిల్‌పై 55-60శాతం మేర ట్యాక్సులు ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ట్యాక్సులు ఎక్కువ కావడంతోనే రేట్లు దేశంలోకెల్లా ఎక్కువగా ఉంటున్నాయి.

వ్యాట్ తగ్గింపుతో కలిగే ప్రభావంపై అమరేందర్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు..

‘‘కర్ణాటకలో వ్యాట్ తగ్గించడంతో ప్రజలపై భారం తగ్గింది. కర్ణాటక చుట్టుపక్కల కేరళ, గోవా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. అక్కడ వ్యాట్ తగ్గించడంతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి గూడ్స్ వాహనాలు అక్కడే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నాయి. ఆ ప్రభావం పక్క రాష్ట్రాలపై పడుతోంది’’ అని ఆయన చెప్పారు.

వ్యాట్ కారణంగా రాష్ర్టాలకు ఆదాయం వస్తోంది కనుక ఆయా రాష్ట్రాలు తగ్గించేందుకు ముందుకు రావడం లేదని అభిప్రాయపడ్డారు.

పెట్రోలు ధరలు

ఫొటో సోర్స్, Getty Images

జనవరిలో రూ.2 తగ్గుదల

జనవరిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. దాని ప్రభావంతో అప్పటివరకు చాలా రాష్ట్రాల్లో వంద దాటి ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఒక్కసారిగా రూ.100 దిగువకు వచ్చాయి.

అదే సమయంలో ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం వందపైనే రేట్లు ఉండిపోయాయి. అంతకుముందు రూ.111 లీటరు పెట్రోల్ ధర ఉండగా.. తర్వాత అది రూ.109కు చేరుకుంది.

ఇందుకు కారణం.. కేంద్ర ప్రభుత్వం విధించే ట్యాక్సులకు అదనంగా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ట్యాక్స్‌లు, సెస్‌లను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వసూలు చేస్తోంది.

పెట్రోల్ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ మార్కెట్‌కు తగ్గట్టుగా..

2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ డాటా ప్రకారం దేశంలో 1,99,519 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు వినియోగం జరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకోవడం.. ధరలు తగ్గినప్పుడు తగ్గించుకునేలా 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ధరలపై నియంత్రణ ఎత్తివేసింది.

అప్పట్నుంచి అంతర్జాతీయ మార్కెట్లోని క్రూడ్ ఆయిల్ ధరలకు తగ్గట్టుగా ఇండియాలో ధరలు నిర్ణయిస్తున్నారు.

అయితే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు.. ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గించుకుండా వాహనదారులపై భారం కొనసాగిస్తున్నాయి.

పీఆర్ఎస్ ఇండియా గతంలో చెప్పిన వివరాల ప్రకారం.. జూన్ 2014 నుంచి జనవరి 2016 మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి.

ఆ తర్వాత 2016 ఫిబ్రవరి నుంచి 2018 అక్టోబరు మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి.

కానీ, నాలుగేళ్లపాటు రిటైల్ అమ్మకం ధర మాత్రం ఒకే విధంగా కొనసాగిందని పీఆర్ఎస్ ఇండియా పేర్కొంది.

క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచగా.. పెరిగినప్పుడు మాత్రం తగ్గించింది.

2020 జనవరి-ఏప్రిల్ మధ్య ప్రపంచ వ్యాప్తంగా 69శాతం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది.

దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. దేశంలో వాహనదారులపై ప్రభావం కనిపించడం లేదు.

కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2020లో ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో 2019-20లో రూ.2.38లక్షల కోట్లు వసూలు కాగా, మరుసటి ఏడాది 2020-21లో రూ.3.84లక్షల కోట్లు వసూలు అయ్యింది.

వీడియో క్యాప్షన్, Fiber cylinder: కొత్తగా ఫైబర్‌తో తయారైన వంట గ్యాస్ సిలిండర్లు... ఇవి ఎంత సురక్షితం?

జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేవడం లేదు?

దేశంలో చాలావరకు ఉత్పత్తులపై జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

పెట్రోల్, డీజిల్, నేచరల్ గ్యాస్‌పై జీఎస్టీ వర్తించదు. వీటిపై జీఎస్టీ విధించడంపై ఇంకా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు.

పెట్రోల్, డీజిల్ కారణంగా రాష్ర్ట ప్రభుత్వాలకు నేరుగా ఆదాయం వస్తోంది. అదే జీఎస్టీ అమల్లోకి వస్తే కేంద్రానికి ఆదాయం వెళుతుంది. అక్కడి నుంచి రాష్ర్టాలకు పంచాల్సి ఉంటుంది.

పెట్రోల్, డీజిల్‌పై అధిక ఆదాయం వస్తుండటంతో.. జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయాన్ని రాష్ర్టాలు ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నాయి.

సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్‌పై జీఎస్టీ వర్తిస్తుందని చట్టంలో ఉంది.

రాష్ర్టాలు అంగీకరించకపోవడంతోనోటిఫై చేసేందుకు కేంద్రం ముందడుగు వేయడం లేదు. గతంలో 28శాతం పన్ను విధించి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భావించినా.. ప్రతిపాదన ముందుకు కదల్లేదు.

పెట్రోలు
ఫొటో క్యాప్షన్, రాష్ట్రాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లు(ఏప్రిల్ 15,2024 నాటి ధరలు)
వీడియో క్యాప్షన్, శ్రీలంక: ‘పెట్రోల్ దొరక్క సైకిల్ కొందామంటే.. సైకిల్ ధర రూ. 70,000 అయింది’

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)