రెండు లక్షల 25 వేలు పలికిన ఆరు రూపాయల సాధారణ కోడి గుడ్డు, ఎందుకు?

దానిష్ హమీద్

ఫొటో సోర్స్, DANISH HAMID

ఫొటో క్యాప్షన్, గుడ్డు కోసం చివరి బిడ్ వేసిన దానిష్ హమీద్
    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది బంగారు గుడ్డు కాదు. ఆరు రూపాయలకు మార్కెట్‌లో కొన్న సాధారణ కోడి గుడ్డు. కానీ, వేలంలో రూ.2.25 లక్షలకు పైగా ధర పలికింది. అసలేం జరిగిందంటే..

కశ్మీర్‌లోని సోపోర్ పట్టణం పరిధిలోని మాల్ మపన్‌పురా ప్రాంతంలో కొన్ని నెలలుగా ఒక మసీదును నిర్మిస్తున్నారు.

ఈద్ సందర్భంగా, మసీదు నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి డబ్బులు, వస్తువులను విరాళాలుగా సేకరించాలని మసీదు కమిటీ నిర్ణయించింది.

చాలామంది నగదు, బియ్యం, ఇతర వస్తువులను విరాళాలుగా ఇచ్చారు.

‘‘మేం విరాళాలు సేకరిస్తున్నప్పుడు, ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్న మహిళ మెల్లగా తలవంచుకుని నా దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, గుడ్డు ఇచ్చారు. తన తరఫున మసీదు నిర్మాణం కోసం ఆ గుడ్డును విరాళంగా స్వీకరించాలని ఆమె కోరారు’’ అని మసీదు కమిటీ సభ్యులు నసీర్ అహ్మద్ చెప్పారు.

ఆమె చాలా పేద మహిళ అని, తన కొడుకుతో కలిసి శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారని నసీర్ తెలిపారు.

‘‘మిగతా వస్తువులను అమ్మకానికి పెట్టాం. కానీ, ఈ గుడ్డుతో ఏం చేయాలా? అని ఆలోచించాం’’ అని చెప్పారు.

‘‘ఇది కేవలం ఆరు రూపాయల సాధారణ గుడ్డు. కానీ, భగవంతుని కోసం ఆ పేద మహిళ ఈ గుడ్డును ఇవ్వడంతో, ఇది విలువైనదిగా మారింది’’ అని ఆయన అన్నారు.

ఈ గుడ్డును వేలం వేద్దామని తాను కమిటీలోని ఇతర సభ్యులకు చెప్పినట్లు నసీర్ తెలిపారు. ఆ మహిళ పేరును బయటికి వెల్లడించకుండా, ఈ గుడ్డును వేలం వేస్తున్నట్లు మసీదులో నసీర్ చెప్పారు.

తన జేబు నుంచి పది రూపాయలు తీసి ఈ గుడ్డు కోసం బిడ్ వేస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత తొలి ధరగా ఈ గుడ్డు పదివేలు పలికింది. ఇలా వేలంలో గుడ్డు ధర పెరుగుతూ రూ.2.25 లక్షలు దాటింది.

‘‘250 మంది ప్రజలున్న ఈ గ్రామంలో పెద్ద జామా మసీదు లేదు. మసీదు నిర్మాణ పనులు ప్రారంభించాం. రూఫ్ వరకు నిర్మించిన తర్వాత నిధులు లేక పనులు ఆగిపోయాయి’’ అని గ్రామ మాజీ సర్పంచ్ తరీఖ్ అహ్మద్ చెప్పారు.

కేవలం ఒక గుడ్డుకు రూ.2.25 లక్షలు వస్తాయని తాము అనుకోలేదని ఆయన అన్నారు.

దానిష్ హమీద్

ఫొటో సోర్స్, DANISH HAMID

చివరి రోజు వేలంలో ఏం జరిగింది?

ఈ గుడ్డు వేలం కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని మసీదు ఏర్పాటు కమిటీ నిర్ణయించింది.

రెండు రోజుల పాటు ప్రజలు 10, 20,30, 50 వేల రూపాయల వరకు బిడ్డింగ్ వేశారు.

చివరి రోజు సాయంత్రం ఏడు గంటలకు వేలం ముగుస్తుందని ప్రకటించారు. చివరి బిడ్డర్‌కు గుడ్డు ఇస్తామని తెలిపారు.

సోపోర్ పట్టణానికి చెందిన ఒక యువ వ్యాపారవేత్త దానిష్ హమీద్ చివరి రోజు వేలంలో పాల్గొన్నారు.

రెండుసార్లు రూ.54 వేల వేలం ప్రకటించినప్పుడు, దానిష్ చివర వరుసలో కూర్చుని, పెద్దగా రూ.70 వేలు అని పలికారు. ఆ తర్వాత గుడ్డును దక్కించుకోవడం కోసం పలువురు పోటీ పడ్డారు.

ఇలా ఈ గుడ్డు ధర వేలంలో రూ.2 లక్షల 26 వేల 350 వరకు చేరింది.

‘‘ఈ గుడ్డును ఎవరు విరాళంగా ఇచ్చారో మాకు చెప్పనప్పటికీ, ఒక పేద మహిళ భగవంతుని కోసం ఈ గుడ్డును ఇచ్చారని మా అందరికీ తెలుసు’’ అని దానిష్ బీబీసీతో అన్నారు.

సుహృదయంతో విరాళం అందించాలని ఈ పేద మహిళ సంపన్న వ్యక్తులకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.

గుడ్డు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇప్పుడు ఈ గుడ్డు ఎక్కడుంది?

ఇప్పుడా ఈ గుడ్డు సాధారణమైంది కాదు. ఇది భగవంతుని ప్రతీకాత్మక చిహ్నంగా మారింది.

‘‘నేను ఈ గుడ్డును సురక్షితంగా ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. దీని కోసం మంచి ప్రదేశాన్ని తయారు చేయిస్తున్నా. దీని దాంట్లో సురక్షితంగా ఉంచుతాను’’ అని నసీర్ చెప్పారు.

గుడ్డు విలువ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా దేవుడి కోసం ఆ మహిళ దీన్ని ఎలా ఇచ్చిందో చూసి, తనకు, తన కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలని నసీర్ ఆకాంక్షించారు.

‘‘నేను అర్థం చేసుకోగలను. నిజమైన భావనలకు విలువ కట్టలేం. అందుకే, ఈ గుడ్డు ఎల్లప్పుడూ మా ఇంట్లో సురక్షితంగా ఉంచుతాను’’ అని నసీర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)