ఇరాన్ ఎలా క్షిపణులను వదిలింది, ఇజ్రాయెల్ ఎలా అడ్డుకుంది?

ఫొటో సోర్స్, REUTERS/AMIR COHEN
- రచయిత, టామ్ స్పెండర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాన్ తన ప్రత్యర్థి అయిన ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయడం ఇదే తొలిసారి.
శనివారం అర్థరాత్రి దాటాక ఇజ్రాయెల్‌లో ఇరాన్ వైమానిక దాడుల గురించి హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని ప్రభుత్వం కోరింది.
మరోవైపు ఇజ్రాయెల్ దగ్గరున్న క్షిపణి రక్షణ వ్యవస్థ కారణంగా ఆ దేశపు గగనతలంలో పేలుళ్ల శబ్ధాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి.
ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను, డ్రోన్లలను ఇజ్రాయెల్ మధ్యలోనే అడ్డుకోవడంతో ఆకాశంలో తరచూ మెరుపులు కనిపించాయి.
ఈ ఘర్షణలో కనీసం 9 దేశాలు పాలుపంచుకుంటున్నాయి. ఇరాక్, సిరియా, యెమెన్ దేశాల నుంచి ఇరాన్ రాకెట్లను ప్రయోగిస్తుండగా, అమెరికా, బ్రిటన్, జోర్డాన్, ఫ్రాన్స్‌లతో కలిసి ఇజ్రాయెల్ ఈ మిసైళ్లను అడ్డుకుంది.
అయితే, గత ఏడాది అక్టోబర్7న హమాస్ దాడిపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ వ్యవహారంలో ఏం చేస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
దీనిపై తమ స్పందన తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే సంకేతాలు పంపింది. ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుందని, ప్రతిదాడులకు దిగేముందు అన్నిరకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ మాత్రం తాము దెబ్బకు దెబ్బ తీశామని, ఇంతటితో కథ ముగిపోయిందని, ఇకపై తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, REUTERS
డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మూడు వందలకు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం నాడు ప్రకటించింది.
ఇరాన్ నుండి ఇజ్రాయెల్‌కు అతి తక్కువ దూరం నుంచి చేరుకోవాలంటే ఇరాక్, సిరియా, జోర్డాన్ మీదుగా రావాలి. ఇది సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలలో చాలావరకు ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించలేకపోయాయని, 170 డ్రోన్లు, 30 క్రూయిజ్ క్షిపణులు ఇందులో ఉన్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఒక టెలివిజన్ ప్రకటనలో తెలిపారు.
110 బాలిస్టిక్ క్షిపణులు కూడా ఇరాన్ ప్రయోగించగా, వాటిలో కొన్ని మాత్రమే ఇజ్రాయెల్ భూభాగానికి చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సంఖ్యను బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు.
‘‘డజన్ల సంఖ్యలో ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులతో దాడి చేసినట్లు రిపోర్టులు అందాయి. వీటిలో చాలా వాటిని ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించడానికి ముందే అడ్డుకున్నాం.’’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తాము డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు శనివారం రాత్రి ప్రకటించింది.
తమ దేశం మీదుగా కూడా కొన్ని క్షిపణులు ఎగురుతూ కనిపించాయని, అవి ఇజ్రాయెల్ వైపు వెళ్లాయని ఇరాక్ భద్రతా వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి.
మొదట నెమ్మదిగా కదులుతున్న డ్రోన్లను ప్రయోగించగా, గంట తర్వాత బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ప్రారంభమైందని, దీనివల్ల అవన్నీ ఒకే సమయంలో ఇజ్రాయెల్‌కు చేరుకున్నాయని ఐఆర్‌జీసీ తెలిపింది.
అయితే, ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్‌ల మీదుగా ప్రయోగించిన డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను తమ దళాలు అడ్డుకున్నాయని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బొల్లా గ్రూప్ కూడా గోలన్ హైట్స్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై రాకెట్లను ప్రయోగించినట్లు ప్రకటించుకుంది. సిరియా నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న పీఠభూమి పేరు గోలన్ హైట్స్. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లేదు.
ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలు చాలా డ్రోన్లను, క్షిపణులను అడ్డగించాయని, ఇజ్రాయెల్ వైపు వస్తున్న 99 శాతం డ్రోన్లు, క్షిపణులను తమ గగనతలం వెలుపల, లోపల కూడా అడ్డగించామని రియర్ అడ్మిరల్ హగారి చెప్పారు.
‘‘ఇరాన్ ప్రయోగించిన ‘దాదాపు అన్ని డ్రోన్‌లు, క్షిపణుల’ను కూల్చివేయడంలో మా బలగాలు ఇజ్రాయెల్‌కు సహాయం చేశాయి’’ అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు.
ఈ దాడికి ముందే అమెరికా తన విమానాలను, యుద్ధనౌకలను ఈ ప్రాంతానికి పంపడం ప్రారంభించిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
జోర్డాన్ సరిహద్దుకు సమీపంలో దక్షిణ సిరియా మీదుగా వస్తున్న ఇరాన్ డ్రోన్‌లను ఓ గుర్తు తెలియని ప్రాంతం నుంచి తమ భద్రతా దళాలు కూల్చివేశాయని అమెరికా సైనిక వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.
డ్రోన్‌లను కూల్చివేసేందుకు బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) టైఫూన్ ఫైటర్ జెట్ కూడా రంగంలోకి దిగిందని బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ధ్రువీకరించారు.
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన జోర్డాన్, పాలస్తీనాలో ఇజ్రాయెల్ చర్యలను బహిరంగంగా విమర్శిస్తూ వస్తోంది.
అయితే, తన పౌరుల భద్రత కోసం తన గగనతలంలో ప్రవేశించిన అనేక డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించుకుంది.
‘‘ఫ్రాన్స్ కూడా గస్తీలో మాకు సాయం చేసింది. అయితే అది ఏదైనా డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసిందా లేదా అన్నది మాకు స్పష్టంగా తెలియదు.’’ అని ఇజ్రాయెల్ వెల్లడించింది.

క్షిపణుల వల్ల నష్టం ఎంత?
జెరూసలేంలో సైరన్లు వినిపించాయని, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అనేక క్షిపణులను అడ్డుకుందని అక్కడ పని చేస్తున్న బీబీసీ కరస్పాండెంట్లు నిర్ధరించారు.
అయితే, కొన్ని బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని రియర్ అడ్మిరల్ హగారి అంగీకరించారు. వాటిలో ఒకటి దక్షిణ ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారి ప్రాంతంలోని నెవాటిన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను తాకిందని ఆయన వెల్లడించారు.
ఈ దాడితో ఇజ్రాయెల్ సైనిక స్థావరానికి భారీగా నష్టం జరిగిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా తెలింది.
ఈ దాడుల్లో ఇజ్రాయెల్ వ్యాప్తంగా దాదాపు 12 మంది గాయపడ్డారని రియల్ అడ్మిరల్ హగారి తెలిపారు.
అరబ్ బిడౌన్ కమ్యూనిటీకి చెందిన ఏడేళ్ల బాలిక గాయపడిందని, ఇరాన్ డ్రోన్‌ను పేల్చినప్పుడు దాని నుంచి కొన్ని వస్తువులు ఆ అమ్మాయి తలపై పడటంతో ఆమెకు గాయాలయ్యానని రియర్ అడ్మిరల్ హగారీ వెల్లడించారు. ఈ చిన్నారి ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతోంది.
తమ భూభాగంలో కొన్ని మిసైల్ శకలాలు పడిపోయాయని, అయితే వాటివల్ల తమ పౌరులెవరికీ ప్రమాదం జరగలేదని జోర్డాన్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, EPA
ఇక ముందు ఏం జరగబోతోంది?
ఈ దాడులకు తగిన సమాధానం చెబుతామని ఇజ్రాయెల్ అధికారి ఒకరు చెప్పినట్లు ఇజ్రాయెల్ చానెల్ 12టీవీ పేర్కొంది. ఇరాన్‌తో ఘర్షణ ఇంకా ముగియలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ అన్నారు.
మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ‘‘ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే, ఈసారి మా సైనిక చర్యల స్థాయి మరింత విస్తృతంగా ఉంటుంది." అని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరి హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా మద్ధతిస్తే దానిపై కూడా దాడి చేస్తామని ఆయన అన్నారు. ఇరాన్ ప్రయోజనాలకు, పౌరులకు ఇబ్బంది కలిగించేలా ఇజ్రాయెల్ దాడులకు దిగితే సహించబోమని ఐఆర్‌జీసీ కమాండర్ హుస్సేన్ సలామీ అన్నారు.
తాజా సంక్షోభానికి సంబంధించి ఇజ్రాయెల్ అభ్యర్థనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారంనాడు సమావేశం కానుంది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















