ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ: ఈ రెండు దేశాల మధ్య వైరానికి మూలం ఎక్కడుంది?

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, MANU BRABO/GETTY

ఫొటో క్యాప్షన్, మధ్య ప్రాచ్యంలోని అస్థిరత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరానికి ఆజ్యం పోస్తోంది
    • రచయిత, గుల్లెర్మో డి. ఓల్మో
    • హోదా, బీబీసీ న్యూస్

మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ శనివారం రాత్రి పెద్ద ఎత్తున దాడికి దిగింది.

ఇజ్రాయెల్‌లోని ‘‘నిర్ధిష్ట లక్ష్యాలే’’ కేంద్రంగా తాజా దాడులు చేసినట్లుగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) చెప్పింది.

ఈ దాడిని అడ్డుకునేందుకు ఆ దేశ రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది.

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్‌కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్లు మరణించారు. దీనికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నిందిస్తోంది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడి చేసినట్లుగా చెబుతున్నారు.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరానికి అనేక సంవత్సరాల చరిత్ర ఉంది. మధ్య ప్రాచ్యంలో అస్థిరతకు ఈ వైరం ఒక కారణంగా మారింది.

ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఆర్థిక సహకారం అందిస్తోందని, యూదులపై ఉన్న వ్యతిరేకతతో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దాడులకు దిగుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

ఇజ్రాయెల్‌కు అసలు ఈ భూమిపై ఉండే హక్కే లేదంటోంది ఇరాన్. మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు మిత్రదేశంగా, ఒక దుష్టశక్తిగా ఇరాన్ పాలకులు దీన్ని భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఈ రెండూ కనుమరుగు కావాలని ఇరాన్ కోరుకుంటోంది.

ఈ రెండు దేశాల మధ్యలో శత్రుత్వం ఇప్పటికే చాలామంది ప్రాణాలను బలిగొంది. అయితే, ఈ దాడులకు మాత్రం ఇరు దేశాల ప్రభుత్వాలు బాధ్యత వహించడం లేదు.

తాజాగా గాజాలో యుద్ధం కూడా ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మార్చింది.

మధ్య ప్రాచ్యం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషన్ 1979లో సాధించిన విజయంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌లో వ్యతిరేకత మొదలైంది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం ఎలా మొదలైంది?

నిజానికి ఇజ్రాయెల్, ఇరాన్ సంబంధాలు 1979 వరకూ బాగానే ఉన్నాయి. అప్పట్లో టెహ్రాన్‌లో అధికారం అయితుల్లా వర్గానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషన్ సంస్థ గుప్పెట్లో ఉండేది.

పాలస్తీనా విభజనను ఇరాన్ వ్యతిరేకించినా, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత ఆ దేశాన్ని ఈజిప్ట్ తరువాత గుర్తించిన రెండో దేశంగా నిలిచింది.

ఆ సమయంలో ఇరాన్ రాచరిక పాలనలో ఉండేది. పహ్లావి రాజవంశానికి చెందిన ‘షా’లు పరిపాలిస్తుండేవారు.

మధ్య ప్రాచ్యంలో వీరు అమెరికా మిత్రులుగా ఉండేవారు. ఈ కారణంగానే ఇజ్రాయెల్ నిర్మాతలు, ఆ దేశ మొదటి ప్రభుత్వాధినేత డేవిడ్ బెన్ గురియన్ ఇరాన్ స్నేహాన్ని కాంక్షించారు.

దీనివల్ల పొరుగున ఉండే అరబ్ దేశాలు కొత్తగా ఏర్పడిన యూదుల దేశాన్ని వ్యతిరేకించకుండా చూడవచ్చనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇరాన్‌కు స్నేహహస్తం చాచింది.

కానీ, 1979లో ఇరాన్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ విప్లవ నాయకుడు రుహోల్లా ఖొమైనీ ఇరాన్ రాజు ‘షా’ను గద్దె దింపి, ఇరాన్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించారు.

అమెరికా, దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

ఖొమైనీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది.

టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎ‌ల్ఓ)కు అప్పగించింది.

మధ్య ప్రాచ్యం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ వ్యతిరేకతే పాలస్తీనియన్ల పట్ల ఖొమైనీ తదితర నాయకుల సానుభూతికి కారణం.

ఇజ్రాయెల్ వ్యతిరేకత ఓ మూలస్తంభం

ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూపులో ఇరాన్ ప్రోగ్రామ్ డైరక్టర్‌గా ఉన్న అలీవాజ్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఇరాన్ కొత్త పాలనలో ఇజ్రాయెల్ వ్యతిరేకత అనేది ఓ మూలస్తంభం లాంటిది. లెబనాన్‌లాంటి ప్రదేశాలలో పాలస్తీనీయన్లతో కలిసి చాలామంది ఇరాన్ నేతలు గెరిల్లా యుద్ధ విద్యలలో శిక్షణ పొందారు. వారికి పాలస్తీనియన్ల పట్ల గొప్ప సానుభూతి కూడా ఉంది’’ అని చెప్పారు.

‘‘ఇస్లామిక్ పవర్‌గా ఎదగాలని ఇరాన్ భావిస్తోంది. అందుకే ముస్లిం దేశాలు అన్ని వదిలేసిన పాలస్తీనా వివాదాన్ని అది లేవనెత్తుతోంది’’ అని వివరించారు.

అందుకే, పాలస్తీనా సమస్య తమ సొంత సమస్య అని ఖొమైనీ ప్రకటిస్తున్నారు.

టెహ్రాన్‌లో అధికారిక మద్దతుతో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు జరిగేలా చూస్తున్నారు.

‘‘1990 దాకా ఇజ్రాయెల్‌కు ఇరాన్ పట్ల శత్రుత్వం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికి సద్దాం హుస్సేన్‌ నేత్వంలోని ఇరాక్ ఓ పెద్ద ప్రాంతీయ ముప్పుగా కనిపిస్తుండేది’’ అని వాజ్ వివరించారు.

పైగా 1980 – 1988 మధ్యన ఇరాన్ ,ఇరాక్‌ పోరులో అమెరికా ఇరాన్ కాంట్రా’ పేరుతో ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు అందించింది. ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఓ మధ్యవర్తిగా వ్యవహరించింది.

కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా భావించడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్.

దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్‌కు మరో ప్రాంతీయ శక్తి అయిన సౌదీ అరేబియాతోనూ విరోధం ఉంది.

ఇరాన్‌లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్బు దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది.

దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తనపై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ ఓ వ్యూహానికి పదును పెట్టిందని వాజ్ వివరించారు.

ఈ వ్యూహం మేరకు టెహ్రాన్ ప్రయోజనాలకు అనుగుణంగా సాయుధ చర్యలకు దిగే హిజ్బొల్లా పుట్టుకొచ్చింది.

ఈ సంస్థను అమెరికా, యూరోపియన్ యూనియన్ తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతం ఈ సంస్థ లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్‌లలో విస్తరించింది.

ఇరాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్యలో షాడో వార్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు.

1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్యను ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ తహతహలాడుతూ ఉండేది.

అయితుల్లాల దగ్గర అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మడం లేదు.

ఈ నేపథ్యంలో 2000 దశాబ్దం మొదట్లో స్టక్స్‌నెట్ అనే కంప్యూటర్ వైరస్ ద్వారా ఇరాన్ అణు సదుపాయాలకు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ తీవ్ర నష్టం కలిగించిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది.

న్యూక్లియర్ కార్యక్రమంలో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది.

వీటిల్లో చెప్పుకోదగినది 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదే హత్యకు గురవడం.

ఈ హత్యకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ పేర్కొంది. కానీ, ఇరాన్ శాస్త్రవేత్తల మరణాల విషయంలో ఇజ్రాయెల్ ఏనాడూ తన పాత్రను అంగీకరించలేదు.

తన భూభాగంలో డ్రోన్లు, రాకెట్ల ద్వారా దాడులు, అనేక సైబర్ దాడులకు ఇరానే కారణమని ఇజ్రాయెల్ తన పశ్చిమ దేశాల మిత్ర దేశాలతో కలిసి ఆరోపిస్తోంది.

ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలుస్తోంది.

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దెదించాలని పోరాడుతున్న తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వ దళాలకు మద్దతుగా ఇరాన్ డబ్బు, ఆయుధాలను , శిక్షకులను పంపడం ఇజ్రాయెల్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

లెబనాన్‌లోని హిజ్బొల్లా సంస్థకు ఇరాన్ ఆయుధాలను పంపడానికి సిరియానే ప్రధాన మార్గంగా ఉంటోందని ఇజ్రాయెల్ నమ్ముతోంది.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.

మధ్య ప్రాచ్యం

ఫొటో సోర్స్, AMMAR GHALI/GETTY

ఫొటో క్యాప్షన్, డమాస్కస్‌లో జరిగిన దాడుల్లో తమ సైనికాధికారులు చనిపోవడం ఇరాన్‌కు ఆగ్రహం తెప్పించింది.

ఇప్పుడేం జరుగుతోంది?

హమాస్ 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడులు జరపడం, దీనికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున దాడులు చేయడం, ఈ ప్రాంతంలో వరుస ప్రతీకార చర్యలకు కారణమై, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష సంఘర్షణకు కారణమైందని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

లెబనాన్ సరిహద్దుల్లో ఇటీవల కాలంలో ఇజ్రాయెలీ దళాలకు, హిజ్బొల్లాతో అనుబంధం ఉన్న మిలీషియాల మధ్య ఘర్షణలు పెరిగాయి.

అలాగే వెస్ట్‌బ్యాంక్‌లోని ఆక్రమిత ప్రాంతాలలో పాలస్తీనా నిరసనకారులతో ఘర్షణలూ పెరిగాయి.

ఇప్పటిదాకా అయితే ఇరాన్, ఇజ్రాయెల్ కూడా తమ శత్రుత్వం పెద్ద ఎత్తున యుద్ధంగా మారకుండా తప్పించుకుంటున్నాయి.

‘‘ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోవడం లేదు. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగి ఆరునెలలకుపైగా అయింది. దీనివల్ల అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ చెడ్డపేరు మూటగట్టుకోవడమే కాక మునుపెన్నడూ లేనంతగా ఒంటరి అయింది. ఇంకా ఒక కొలిక్కి రాని ఈ సమస్య పరిష్కారానికి ఇజ్రాయెల్ హమాస్ కంటే ఎన్నో రెట్లు బలమైన ఇరాన్‌‌ ప్రభుత్వంతోనూ సంప్రందించాల్సి ఉంటుంది’’ అని వాజ్ వివరించారు.

‘ఇరాన్ విషయానికొస్తే దానికి అనేక ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. అంతర్గత చట్టాల కారణంగా అక్కడి ప్రభుత్వం కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మతపరమైన ఆంక్షల కారణంగా ఇరాన్ మహిళలు విసిగిపోయారు. ఇలాంటి పరిస్థితులలో బహిరంగ యుద్దమే వస్తే అమెరికా దన్ను ఉన్న ఇజ్రాయెలీ సైనిక శక్తిని ఎదుర్కోవడం ఇరాన్‌కు అంత తేలికైన విషయం కాదు’ అని చెప్పారు.

కానీ డమాస్కస్‌లోని తమ దౌత్య కార్యాలయంపై జరిగిన దాడిలో 13మంది చనిపోవడం, అందులో అత్యంత ముఖ్యమైన ఇరాన్ సీనియర్ అధికారులు కూడా ఉండటం టెహ్రాన్‌ను తీవ్రంగా కలిచి వేసింది.

ఈ ఘటనకు బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

తమ చర్య నిర్ణయాత్మకంగా ఉంటుందని సిరియాలోని ఇరాన్ రాయబారి హుస్సేనీ అక్బరీ ప్రకటించారు.

అప్పటి నుంచి ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయమై గూఢచర్య విశ్లేషకులు, విలేఖరులు, రాయబారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)