పాకిస్తాన్ క్రికెట్‌లో కొత్త 'డ్రామా', అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?

అమీర్ పాకిస్తాన్ క్రికెటర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సంజయ్ కిశోర్
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, బీబీసీ హిందీ

పాకిస్తాన్ క్రికెట్‌లో వివాదాలు కొత్తేమీ కాదు. తాజాగా పెద్ద టోర్నీకి ముందు పాకిస్తాన్ క్రికెట్‌ కుదుపులకు లోనైంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ రీఎంట్రీ చర్చనీయాంశమైంది. రెండు వారాల కిందట అమీర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు, రిటైర్మెంట్ నుంచి తిరిగి వస్తున్నట్లు ప్రకటించాడు.

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యుల జట్టులో అమీర్ చోటు దక్కించుకున్నాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ప్రదర్శన ఆధారంగా మహ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్‌లతో పాటు కొంతమంది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను పీసీబీ జాతీయ జట్టులోకి రీకాల్ చేసింది.

ఏప్రిల్ 18 నుంచి కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

పాకిస్తాన్ క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

మూడోసారి ఎంట్రీ..

మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరఫున మూడోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 2009లో క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. స్పాట్ ఫిక్సింగ్ నిషేధం అనంతరం రీఎంట్రీ ఇచ్చాడు. ఇపుడు మూడోసారి జట్టులోకి రానున్నాడు.

32 ఏళ్ల అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై మూడేళ్లు దాటింది. అమీర్ చివరిసారిగా పాకిస్తాన్ తరఫున 2019 జనవరిలో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు, 2019 అక్టోబర్‌లో శ్రీలంకతో వన్డే, 2020 ఆగస్టులో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌ ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, టీ20 లీగ్‌పై దృష్టి పెడతానని అమీర్ చెప్పాడు. అయితే, మూడేళ్ల ఎనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ పాకిస్తాన్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.

మాజీ ఆటగాళ్ల విమర్శలు

అమీర్ పాక్ జట్టులోకి తిరిగి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పీసీబీ నిర్ణయాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తప్పుబట్టారు.

దేశవాళీ క్రికెట్‌లో కష్టపడి పనిచేసిన ఆటగాళ్లకు బోర్డు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఈ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అసంతృప్తి వ్యక్తంచేస్తూ, సోషల్ మీడియాలో ‘‘#RIP Pakistan domestic cricket’’ అని పోస్టు పెట్టాడు.

కొందరు అభిమానులు హఫీజ్‌తో ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు.

అమీర్

ఫొటో సోర్స్, Getty Images

సెలక్షన్ కమిటీ ఏమని బదులిచ్చింది?

పాకిస్తాన్ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడు వహాబ్ రియాజ్ మాట్లాడుతూ "జట్టులోకి ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్‌లను చేర్చాలనే నిర్ణయం తీసుకున్నాం. జట్టుకు ఇరువురూ అందుబాటులో ఉంటామనడం, మరోవైపు హరీస్ రవూఫ్ గాయం, మహ్మద్ నవాజ్ ప్రస్తుత ఫామ్‌ ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. అమీర్, ఇమాద్ ఇద్దరికీ మ్యాచ్‌లను గెలిపించగల సామర్థ్యం ఉంది. జట్టు తన లక్ష్యాలను సాధించడానికి ఇరువురు ఉత్తమ ప్రదర్శనలు అందిస్తారని మేం నమ్ముతున్నాం" అని అన్నారు.

"ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతని (అమీర్) సామర్థ్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే, దీనికి నిరంతరం అంకితభావం, కృషి అవసరం" అని సెలక్షన్ కమిటీ సభ్యుడు, బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్ అన్నారు.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్‌ కల

ఏడాది క్రితమే అమీర్ బ్రిటీష్‌ పాస్‌పోర్ట్‌ తీసుకుని, ఐపీఎల్‌లో ఆడతాడంటూ వార్తలొచ్చాయి. అమీర్ భార్య ఇంగ్లీష్ పౌరురాలు కాబట్టి, అతనికి కూడా బ్రిటిష్ పాస్‌పోర్టు వచ్చింది.

అమీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహమూద్ చెప్పినట్లు వార్తలూ వచ్చాయి.

అజహర్ గతంలో ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడాడు. అయితే ఏడాది తర్వాత మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు.

పీసీబీ మేనేజ్‌మెంట్‌ మానసికంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తూ 2020లో అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

అయితే, పాకిస్తాన్‌లో 'క్రికెట్‌ డ్రామా' కొత్తేమీ కాదు. బోర్డు మారితే జట్టు కూర్పు కూడా మారుతుంటుంది. 2024 మార్చి 24న అమీర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టాడు.

"నేను ఇప్పటికీ పాకిస్తాన్ కోసం ఆడాలని కలలు కంటున్నా. జీవితం కొన్నిసార్లు మన నిర్ణయాలను పునరాలోచించుకోవాల్సిన స్థితికి తీసుకువస్తుంది. నాకు, పీసీబీకి మధ్య కొన్ని సానుకూల చర్చలు జరిగాయి. నా అవసరముందని వారు చెప్పారు. కుటుంబం, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత, రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాను. నా వ్యక్తిగత అభిరుచుల కంటే దేశం కోసం ఈ పని చేయాలనుకున్నా" అని తెలిపాడు.

అమీర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదకరమైన బౌలర్

అమీర్ ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్‌నైనా బ్రేక్ చేసే సత్తా ఉన్న బౌలర్. 2009లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల వయసులో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన అమీర్, ఆ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు.

అదే ఏడాది పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2010 జరిగిన టీ20 ప్రపంచ కప్‌లోనూ అమీర్ రాణించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో 20వ ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను భారత క్రికెట్ జట్టు ఎప్పటికీ మరిచిపోదు. తన తొలి స్పెల్‌లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌ల వికెట్లను అమీర్ పడగొట్టాడు.

పాకిస్థాన్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు 158 పరుగులకే ఆలౌటై, పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

మహ్మద్ అమీర్ 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి తన జట్టును ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.

అమీర్

ఫొటో సోర్స్, Getty Images

స్పాట్ ఫిక్సింగ్‌తో కుదేలు..

2010లో అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ బట్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్‌లతో కలిసి 18 ఏళ్ల అమీర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు.

అతడిపై ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించారు. నిషేధానికి ముందు మంచి ఫామ్‌లో ఉన్న అమీర్ 14 టెస్టుల్లో 51 వికెట్లు, 15 వన్డేల్లో 25 వికెట్లు, 18 టీ20ల్లో 23 వికెట్లు తీశాడు.

అమీర్ నిలకడగా గంటకు 140 కి.మీ వేగంతో బంతులేసి, ఏడాది వ్యవధిలోనే 99 వికెట్లు పడగొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చినప్పటి తర్వాత అమీర్ 22 టెస్టులు, 46 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 68, 56, 36 వికెట్లు తీశాడు.

అయితే, రిటైరయ్యాక అదే స్పీడ్‌తో, షార్ప్‌నెస్‌తో అమీర్ బౌలింగ్ చేయగలడా అనే సందేహం నెలకొంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్ తరఫున ఆడుతున్న అమీర్, ఈ ఏడాది 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు.

బ్యాట్స్‌మెన్‌కి ప్రమాదకరమైన ఇన్-స్వింగ్‌తో పాటు యార్కర్, బౌన్సర్ వేయడంలో నేర్పరి అమీర్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అతనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)