బుమ్రా, సూర్యకుమార్ యాదవ్: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ మాంత్రికుల మాయాజాలం ఎలా సాగిందంటే?

బుమ్రా, సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్
    • రచయిత, విధాన్షు కుమార్
    • హోదా, బీబీసీ కోసం

ముంబయి ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌ను ఓటములతో మొదలుపెట్టి నెమ్మదిగా గెలుపు బాట పడుతుందనే సంగతి క్రికెట్‌ చూసే వారందరికీ తెలుసు. క్లిష్టసమయాల్లో తిరిగి ఎలా పుంజుకోవాలో కూడా ఈ జట్టుకు బాగా తెలుసు.

గురువారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై గెలుపొందిన ముంబయి ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. అయితే, ఈ జట్టు ఆర్‌సీబీని ఓడించిన తీరు ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.

ఆర్‌సీబీ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 16వ ఓవర్లోనే ఛేదించింది. 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటింగ్ ఎలా సాగిందంటే, ఒకవేళ 250 పరుగుల లక్ష్యం ఉన్నా ఛేదించేలా బ్యాట్స్‌మెన్ చెలరేగారు.

ముంబయి ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు, 18 ఫోర్లు ఉన్నాయి. అంటే కేవలం 33 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల ద్వారా ఆ జట్టు 162 పరుగులు రాబట్టింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రాణించిన విధానాన్ని బట్టి చూస్తే ముంబయి ఇండియన్స్ జట్టుకు ఇది ఒక అద్భుతమైన విజయం.

బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడగా, సూర్యకుమార్ యాదవ్ ఆట వీరందరినీ మరిపించేలా సాగింది. ఐపీఎల్‌లో తన వేగవంతమైన అర్ధసెంచరీ (17 బంతుల్లో)ని సూర్యకుమార్ రికార్డు చేశాడు.

మొత్తంగా 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్ 52 పరుగులు చేశాడు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే, జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా చెప్పుకోదగిన ఆటతీరు కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోరు చేస్తుందని అనిపించినప్పుడల్లా బుమ్రా వికెట్ పడగొట్టి ఆర్‌సీబీని కట్టడి చేశాడు. 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

ఫాఫ్, దినేశ్ కార్తీక్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, డుప్లెసిస్, దినేశ్ కార్తీక్

ఫాఫ్, పాటీదార్, దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీలు

మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు భారీ స్కోరు చేయాలని అనుకుంది. ఎందుకంటే, వాంఖెడేలోని ఇదే పిచ్ మీద కొన్ని రోజుల క్రితం ముంబయి ఇండియన్స్ జట్టు 230 కంటే ఎక్కువ స్కోరు చేసింది.

బెంగళూరు తరఫున గత మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ పరుగులు చేస్తుండగా, మరో ఎండ్ నుంచి కోహ్లీకి మద్దతు దొరకలేదు. గురువారం నాటి మ్యాచ్‌లో బెంగళూరు ఇన్నింగ్స్ ఇందుకు భిన్నంగా సాగింది.

ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విరాట్ కోహ్లి ఆరంభం నుంచే తడబడ్డాడు. 9 బంతుల్లో మూడు పరుగులు చేసి మూడో ఓవర్లో అవుటయ్యడు.

ముంబయితో మ్యాచ్‌లో బెంగళూరు నాలుగు మార్పులు చేసింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న విల్ జాక్స్‌ను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపడం అందులో ఒకటి. అయితే, విల్ జాక్స్ (8) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రజత్ పటీదార్‌తో కలిసి కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ రాణించడంతో పవర్‌ప్లేలో ఆర్‌సీబీ మరో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌లో 50 పరుగులు దాటింది.

పదో ఓవర్ ముగిసే సమయానికి ఆర్‌సీబీ 2 వికెట్లకు 89 పరుగులు చేసింది.

తర్వాత కాసేపటికే వరుసగా రెండు సిక్సర్లు బాది రజత్ పటీదార్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. మరుసటి బంతికే ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

డుప్లెసిస్, పటీదార్ కలిసి మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.

డుప్లెసిస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, డుప్లెసిస్

డుప్లెసిస్ నిలకడ

మరోఎండ్‌లో డుప్లెసిస్ నిలకడ ఆడుతూ ఐపీఎల్‌లో తన 34వ అర్ధసెంచరీని పూర్తి చేశాడు.

చివరి ఓవర్లలో రన్‌రేట్ పెంచేందుకు డుప్లెసిస్ ప్రయత్నించాడు. కానీ, 17 ఓవర్లలో అవుటయ్యాడు. అతను 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు సాధించాడు.

ఫాప్, పటీదార్‌లు అర్ధసెంచరీలు చేసినప్పటికీ వాంఖెడే పిచ్ మీద ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ నుంచి మరింత మెరుగైన రన్‌రేట్‌ను ఆశించారు.

మ్యాచ్ చివర్లో ఈ స్లో రన్‌రేట్ బెంగళూరుకు ఇబ్బందిగా మారింది. ఈ పిచ్‌మీద ఎలా బ్యాటింగ్ చేయాలో ముంబయి బ్యాట్స్‌మెన్ చేసి చూపించారు.

అయితే, 38 ఏళ్ల దినేశ్ కార్తీక్ తన శక్తిమేరకు వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు.

కార్తీక్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో అతనికి ఇది 21వ అర్ధసెంచరీ. 230 స్ట్రయిక్‌రేట్‌తో సాగిన కార్తీక్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అజేయంగా 53 పరుగులు చేశాడు.

బుమ్రా

ఫొటో సోర్స్, ANI

ఆర్‌సీబీని కట్టడి చేసిన బుమ్రా

ఆర్‌సీబీ జట్టు 200 పరుగులు చేయలేకపోయిందంటే దానికి ప్రధాన కారణం జస్‌ప్రీత్ బుమ్రా.

అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీని, బ్యాటింగ్‌లో రాణిస్తోన్న కెప్టెన్ డుప్లెసిస్‌ను బుమ్రా అవుట్ చేశాడు.

బుమ్రా దెబ్బకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా డకౌట్ అయ్యాడు. తన చివరి ఓవర్‌లో సౌరవ్ చౌహాన్ (9), విజయ్ కుమార్ (0)లను పెవిలియన్ చేర్చాడు.

నిజానికి వాంఖెడే పిచ్ బ్యాట్స్‌మన్‌కు సహకరిస్తుంది. ఈ పిచ్ మీద వికెట్ తీయాలంటే బౌలర్లకు బంతి మీద మంచి నియంత్రణ, వైవిధ్యం ఉండాలి. బుమ్రా బౌలింగ్‌లో ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

మ్యాచ్ తర్వాత బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ, ‘‘రెండు జట్లలో ఉన్న ప్రధాన తేడా బుమ్రా. బంతి చేతికి వచ్చినప్పుడల్లా అతను వికెట్లు తీశాడు. టి20ల్లో అత్యుత్తమ బౌలర్ బుమ్రా. ముందు లసిత్ మలింగను టి20ల్లో అత్యుత్తమ బౌలర్‌గా పరిగణించేవారు. ఇప్పుడు బుమ్రా ఆ స్థానాన్ని పూరించాడు’’ అని అన్నారు.

‘‘నెట్స్‌లో నేనెప్పుడూ బుమ్రా బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయాలనుకోను. ఎందుకంటే అతను నా బ్యాట్‌ విరిగేలా బౌలింగ్ చేస్తాడు లేదా నా కాలు విరిగేలా బంతులేస్తాడు’’ అని ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ అన్నాడు.

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

సూర్యకుమార్ యాదవ్ పునరాగమనం

బెంగళూరు విధించిన కొండంత లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ అలవోకగా ఛేదించారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి ఎనిమిదో ఓవర్‌లోనే జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. ఇదే క్రమంలో ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడిగా వారిద్దరూ రికార్డు నెలకొల్పారు.

ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 69 పరుగులు, రోహిత్ శర్మ 24 బంతుల్లో 38 పరుగులు సాధించారు.

హార్దిక్ పాండ్యా తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్‌గా మలచడంతో పాటు 6 బంతుల్లోనే అజేయంగా 21 పరుగులు చేశాడు.

కానీ, సూర్యకుమార్ యాదవ్ ఆట గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

గాయం నుంచి కోలుకున్నాక ఐపీఎల్‌లో అతను ఆడిన రెండో మ్యాచ్ ఇది. బెంగళూరు బౌలర్లను తన బ్యాటింగ్‌తో ఆటాడుకున్నాడు. లో ఫుల్ టాస్ బంతిని స్క్వేర్ బౌండరీ మీదుగా ఓ సిక్సర్, ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఫైన్ లెగ్ దిశగా మరో సిక్సర్, ఇలా బంతి ఎక్కడ పడినా బౌండరీకి తరలిస్తూ బెంగళూరు బౌలర్లకు చెమటలు పట్టించాడు.

మ్యాచ్‌కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన రవిశాస్త్రి, బ్రియాన్ లారా, సంజయ్ మంజ్రేకర్‌లు సూర్యకుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

‘‘అతను బౌలర్లు, ఫీల్డర్లను చిన్నపిల్లల్ని చేసి ఆడుకుంటున్నాడు’’ అని రవిశాస్త్రి అన్నారు.

బ్రియాన్ లారా కూడా సూర్య ఆటను ప్రశంసిస్తూ, ‘‘అతను కొడుతున్న షాట్లు, ఆడుతున్న తీరు నమ్మలేని విధంగా ఉంది. ప్రతీ బంతికీ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే కామెంటరీ బాక్సులో ఉన్నవారికి కూడా విరామం దొరకట్లేదు’’ అని అన్నారు.

‘‘గాయం మాయమైంది, మాంత్రికుడు మళ్లీ వచ్చాడు. సూర్యకుమార్ ఈజ్ బ్యాక్’’ అంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

ముంబయి ఇండియన్స్

ఫొటో సోర్స్, ANI

ముంబయి బ్యాట్స్‌మెన్ ధాటి ఎలా ఉందంటే?

ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రేట్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

ఇషాన్ కిషన్ 202

రోహిత్ శర్మ 158

సూర్యకుమార్ యాదవ్ 273

హార్దిక్ పాండ్యా 350

తిలక్ వర్మ 160

ముంబయి లైనప్‌లో టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్‌లకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. గత మ్యాచ్‌లో వీరిద్దరూ దిల్లీని చిత్తు చేశారు.

ముంబయి గత రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 35.3 ఓవర్లలో మొత్తం 433 పరుగులు చేసింది. ఇప్పుడు వీరి బ్యాటింగ్ టోర్నీలో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది.

‘‘వారి బ్యాటింగ్ లోతు, ఆ జట్టు బ్యాటింగ్ చేస్తోన్న విధానం ప్రకారం చూస్తే మిగతా జట్లు జాగ్రత్త పడాల్సిందే’’ అని భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)