కెనడా ఎన్నికల్లో భారత్, చైనా జోక్యం చేసుకున్నాయా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, నదీన్ యూసుఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''చైనా విద్యార్థుల్లో చాలా మంది లిబరల్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో చైనా వేల డాలర్లు ఖర్చు చేసింది, అయితే ఎంతమొత్తం ఖర్చు చేసిందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కెనడాలో భారత్ మద్దతు కలిగిన రాజకీయ నాయకులకు భారత ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్(మధ్యవర్తి) చట్టవిరుద్ధంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.''
కెనడా ఎన్నికల్లో విదేశాల జోక్యం చేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై నిర్వహించిన బహిరంగ విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలాలతో ఇలాంటి ఆరోపణలు అనేకం వెలుగులోకి వచ్చాయి. కెనడాలో గత రెండు వారాలుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
కెనడియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ఆరోపణలకు సంబంధించి కొన్ని పత్రాలను విచారణ కమిటీకి సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని విచారణాధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
ఈ నివేదికలో ధ్రువీకరించని సమాచారం కూడా ఉండొచ్చని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్(సీఎస్ఐఎస్) హెచ్చరించింది. ఇది ఒకే సోర్స్ నుంచి వచ్చినదై ఉండొచ్చు, లేదా అసంపూర్ణంగా ఉండొచ్చు, లేదా సమగ్రంగా దర్యాప్తు చేయనిది కూడా అయ్యి ఉండొచ్చని సీఎస్‌ఐఎస్ పేర్కొంది.
చైనా, భారత్ కూడా కెనడా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఇటీవల వచ్చాయి. అవి నిరాధారమంటూ భారత్ తోసిపుచ్చింది.
అయితే, ఈ జోక్యం తమ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు కెనడా రాజకీయ నాయకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విచారణ కమిటీ నివేదిక ఎప్పుడు?
విచారణ సందర్భంగా, కెనడాలో నివసిస్తున్న వివిధ కమ్యూనిటీల సభ్యుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు తాము తమ దేశాల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.
విచారణలో 40 కమ్యూనిటీలకు చెందిన సభ్యులు, రాజకీయ నాయకులు, ఎన్నికల అధికారుల నుంచి విచారణను పర్యవేక్షిస్తున్న క్యూబెక్ జడ్జి మేరీ - జోసీ హోగ్, 40 కమ్యూనిటీలకు చెందిన సభ్యులతో పాటు, రాజకీయ నాయకులు, ఎన్నికల అధికారుల వాంగ్మూలాలను విన్నారు.
ఈ విచారణ కమిటీ వచ్చే నెలలో తన నివేదికను సమర్పించనుంది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం విచారణ కమిటీ ఎదుట హాజరయ్యారు.
అయితే, విదేశీ జోక్యం వల్ల ప్రభావితమైన వ్యక్తులు కెనడా అధికారులు, సీఎస్‌ఐఎస్ అధికారులపై ఆరోపణలు చేశారు. వాటిని ఎదుర్కోవడానికి అధికారులు చేయవలసినంత చేయలేదని, లేదా వాటిని రహస్యంగా ఉంచారని వారు ఆరోపించారు.
ఈ సమస్యను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి మరింత శ్రద్ధ అవసరమని, తన ఇతర 'ఫైవ్ ఐస్' మిత్రదేశాల కంటే వెనకబడి ఉన్నామని కెనడా సొంత గూఢచార సంస్థ కూడా పేర్కొంది.
ఫైవ్ ఐస్ అంటే, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఇంటెలిజెన్స్ కూటమి. ఇంటెలిజెన్స్ విషయాల్లో ఒకరితో మరొకరు సమాచారాన్ని పంచుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
విచారణలో ఎవరేం చెప్పారు?
ఇప్పటి వరకూ సేకరించిన వాంగ్మూలాలు, కొన్ని రహస్య పత్రాల్లోని సమాచారం ప్రకారం, చైనా సహా కొన్ని విదేశీ ప్రభుత్వాలు 2019, 2022లో కెనడాలో జరిగిన ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆ దేశం గుర్తించింది.
అయితే, విదేశీ జోక్యం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందనేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదు.
2019, 2022 ఎన్నికల్లో చైనా ప్రభుత్వం 'రహస్యంగా, మోసపూరిత' మార్గాల్లో జోక్యం చేసుకుందని సీఎస్ఐఎస్ ఆరోపించింది.
చైనా ''తమ దేశ ప్రజాప్రయోజనాల దృష్ట్యా తమ దేశానికి అనుకూల, తటస్థ వైఖరి ఉన్నవారికి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నించింది'' అని మీడియా సమావేశంలో ఏజెన్సీ పేర్కొంది.
''చైనా సంతతి కెనడియన్లు కన్జర్వేటివ్ పార్టీ మాజీ నాయకుడు ఎరిన్ ఓ'టూల్‌కు మద్దతు ఇవ్వొద్దని కోరినట్లు ఆన్‌లైన్‌లో, మీడియాలో మేం గుర్తించాం'' అని కూడా ఏజెన్సీ తెలిపింది.
గత వారం ఎరిన్ ఓటూల్ విచారణ కమిటీ ఎదుట హాజరయ్యారు. తప్పుడు సమాచారం తన ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపిందని, దీని కారణంగా 2021 ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు తొమ్మిది సీట్లు కోల్పోయిందని ఆయన ఆరోపించారు.
ఇది తుది ఫలితాలపై ప్రభావం చూపలేదని, కానీ ఈ కారణంగానే తాను పార్టీ నాయకుడి పదవిని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన అంగీకరించారు.
ఈ ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడోకి చెందిన లిబరల్ పార్టీకి మెజారిటీ లభించింది.

ఫొటో సోర్స్, REUTERS/CHRIS WATTIE
చైనాపై వచ్చిన ఆరోపణలేంటి?
సీఎస్‌ఐఏ నివేదిక ప్రకారం, 2019 ఎన్నికల్లో సుమారుగా 2,50,000 కెనడియన్ డాలర్లు (అంటే, సుమారు 184,000 అమెరికన్ డాలర్లు - కోటి 53 లక్షల రూపాయలు) పేరు తెలియని ఒక అభ్యర్థి సహాయకుడికి చైనా అందజేసింది. కొంతమంది ఇతరులకు కూడా నిధులు సమకూర్చి ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసింది.
2019లో ఒక చార్టర్డ్ బస్సు కోసం కూడా చైనా నిధులు వెచ్చించినట్లు ఏజెన్సీ చెబుతోంది. ఈ బస్సులో లిబరల్ పార్టీ అభ్యర్థి హాన్ డాంగ్‌కు సాయంగా చైనాకు చెందిన ప్రైవేట్ హైస్కూల్ విద్యార్థులను తరలించారు. తద్వారా అతను పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోగలిగారు.
హాన్ డాంగ్‌కు మద్దతుగా నిలవకపోతే, ''స్టూడెంట్ వీసాలు ప్రమాదంలో పడడంతో పాటు చైనాలోని వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని వారిని భయపెట్టినట్లు సీఎస్ఐఎస్ పేర్కొంది.
హాన్ డాంగ్ ఇప్పుడు ఇండిపెండెంట్. తాను చైనాకు చెందిన విద్యార్థులను కలిశానని, ఎన్నికల ప్రచారంలో భాగంగా లిబరల్ పార్టీలో సభ్యులుగా చేరేలా వారిని ప్రోత్సహించానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో ఎలాంటి కుట్రా లేదని ఆయన స్పష్టం చేశారు.
కెనడాలో చదువుకుంటున్న విద్యార్ధులు ఆ నియోజకవర్గంలో నివసిస్తున్నట్లు నిరూపించగలిగితే, లిబరల్ పార్టీ అభ్యర్థి ఎంపికకు ఓటు వేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, REUTERS/ALTAF HUSSAIN
భారత్, పాకిస్తాన్‌లపై ఆరోపణలు
కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు భారత్, పాకిస్తాన్‌లు కూడా ప్రయత్నించాయని సీఎస్ఐఎస్ తన నివేదికలో పేర్కొంది.
భారత ప్రభుత్వానికి చెందిన ప్రాక్సీ ఏజెంట్ ఈ చర్యలకు పాల్పడ్డారని ఏజెన్సీ తెలిపింది. ఆ ఏజెంట్ ''కొన్ని నియోజకవర్గాల్లో'' భారత్ అనుకూల అభ్యర్థులకు మద్దతిచ్చారు.
''భారత సంతతికి చెందిన కెనడియన్ ఓటర్లు ఖలిస్తానీ ఉద్యమం వైపు, పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారు'' అని భారత ప్రభుత్వంతో సంబంధమున్న ఈ ప్రాక్సీ ఏజెంట్ భావిస్తున్నారని ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది.
భారత సంతతికి చెందిన కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో ఆరోపణలు చేశారు. 2023 జూన్‌లో ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు నిజ్జార్ కెనడాలో హత్యకు గురయ్యారు. అయితే, ట్రూడో ఆరోపణలు నిరాధారమంటూ భారత్ తోసిపుచ్చింది.
పాకిస్తాన్ జోక్యం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ‘‘ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని తగ్గించడం కోసం''అని, అయితే అవి చాలా పరిమితమని కూడా సీఎస్‌ఐఎస్ నివేదికలో పేర్కొంది.
విచారణ కమిటీ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం....ఈ ఆరోపణల గురించి సీఎస్ఐఎస్‌తో పాటు ఇతర అధికారులకు తెలిసినప్పటికీ, సాధారణ ప్రజలకు వెల్లడించలేదు, వాటి వల్ల ప్రభావితమయ్యే నేతలను కూడా హెచ్చరించలేదు.
ఈ జోక్యం గురించి 2021 ఎన్నికల వేళ ఆందోళన వ్యక్తం చేశానని, అయినా ఆ సమయంలో దానిని సీరియస్‌గా తీసుకోలేదని ఎరిన్ ఓటూల్ చెప్పారు.
ఎన్నికల్లో జోక్యం ఆరోపణలను సమీక్షిస్తున్న ఉన్నతాధికారుల ప్యానెల్‌లో ట్రూడో జాతీయ భద్రతా సలహాదారు నటాలీ డ్రోయిన్ కూడా ఉన్నారు.
చైనా చర్యలు కన్జర్వేటివ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆరోపణలకు సంబంధించి అప్పట్లో తగిన ఆధారాలు లేవని ఆమె అంటున్నారు.
''అందులో ప్యానెల్ ద్వారా జోక్యం చేసుకుంటే మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశంతో పాటు గందరగోళం మరింత పెరిగే ప్రమాదం ఉంది'' అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- హవానా సిండ్రోమ్: ఈ అంతుచిక్కని ఆరోగ్య సమస్యకూ రష్యా నిఘా వ్యవస్థకూ సంబంధం ఉందా?
- ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాంల 'గీతగోవిందం' మ్యాజిక్ రిపీటయిందా?
- రష్యా: సెక్స్ థీమ్ పార్టీలపై పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారు... అక్కడ అసలేం జరుగుతోంది?
- బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు కొనడం మంచిదా, అమ్మడం మంచిదా?
- సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














