మర్మాంగాల వద్ద దురద, మంట ఎందుకు వస్తాయి? చికిత్స ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జియూలియా గ్రాంచి
- హోదా, బీబీసీ న్యూస్
కొంత మందికి మర్మాంగాల పరిసరాల్లో దురద, మంట వస్తుంటాయి. క్యాండిడా ఆల్బికన్స్‌గా పిలిచే ఫంగస్ వల్ల ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది.
దీనిని క్యాండిడయాసిస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
సాధారణంగా, క్యాండిడా ఆల్బికన్స్ ఫంగస్ మనుషుల్లోని సూక్ష్మజీవులతో కలిసి జీవిస్తుంది. మన శరీరంలో కనిపించే ఆరోగ్యకర సూక్ష్మజీవుల్లో ఇవి కూడా ఒకటి.
ఈ ఫంగస్‌ను అవకాశవాద సూక్ష్మజీవిగా భావిస్తారు. అంటే సమయం అనుకూలంగా ఉండేటప్పుడు ఇవి తమ సంఖ్యను వృద్ధి చేసుకుని ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
ఈ సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు, శరీరంలో సమతౌల్యం దెబ్బతింటుంది. అప్పుడే క్యాండిడయాసిస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల్లో ఈ ఫంగస్ విపరీతంగా పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
రుతుచక్రం, గర్భధారణ సమయాల్లో హార్మోన్లు అసమతౌల్యం కావడం, హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ వాడటం, హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీలు యోనిలోని పీహెచ్ స్థాయులను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఫంగస్‌లు వృద్ధి చెందేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి.
యోనిలోని భాగాలు కూడా తడిగా, వెచ్చగా ఉండటం వల్ల కూడా క్యాండిడా ఫంగస్ వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడతాయి.
అదే పురుషుల విషయానికి వస్తే, చెమటతోపాటు తడి బట్టలు ఎక్కువగా వేసుకోవడం, డైపర్లతో పురుషాంగంపై చెమ్మ ఏర్పడుతుందని, దీని వల్ల క్యాండిడా ఫంగస్ వృద్ధి చెందే ముప్పు పెరుగుతుందని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ యూరాలజీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్‌ఫ్లమేషన్స్ సభ్యురాలు బియాంకా మాసెడో చెప్పారు.
పురుషుల్లో మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. అవేమిటంటే..
- మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం
- మర్మాంగం చివరి భాగాన్ని చర్మం ఎక్కువగా కప్పి ఉంచడం
స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ముప్పు పెంచేవి ఇవీ..
- మధుమేహం (రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయులతో ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతుంది)
- తరచూ యాంటీబయాటిక్స్ వినియోగం (వీటి వల్ల మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతాయి)
- రోగ నిరోధక శక్తిని తగ్గించే వ్యాధులు, సమస్యలు (పోషకాహార లోపం, కీమోథెరపీ, డ్రగ్స్ వినియోగం లాంటివి)

ఫొటో సోర్స్, Getty Images
లక్షణాలు ఏమిటి?
మహిళల్లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల తెల్లని ద్రవం యోని నుంచి రావచ్చు. దీనికి తోడు మర్మాంగాల్లో మంటలు, మూత్రం పోసేటప్పుడు అసౌకర్యం, సెక్స్ సమయంలో నొప్పి కనిపిస్తాయి.
‘‘మగవారిలో అయితే, పురుషాంగంపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. చుక్కల మాదిరిగా పుండ్లు కూడా అవుతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ విపరీతంగా దురద కనిపిస్తుంది’’ అని బియాంకా చెప్పారు.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. క్యాండిడయాసిస్ ఒక లైంగిక వ్యాధి కాదు. అయినప్పటికీ ‘‘సెక్స్ సమయంలో ఇన్ఫెక్షన్ సోకిన చర్మాన్ని తరచూ తాకడంతో ఇది వచ్చే అవకాశం ఉంటుంది’’ అని బియాంకా వివరించారు.
ఎలా గుర్తించాలి? చికిత్స ఏమిటి?
టెస్టుల అవసరం లేకుండానే ఇన్ఫెక్షన్‌కు గురైన భాగాలను పరిశీలించి ఈ ఇన్ఫెక్షన్ సోకిందో లేదో వైద్యులు చెప్పగలరు.
అయితే, కొన్నిసార్లు సందేహం వచ్చినప్పుడు ‘జెర్మ్ ఐసోలేషన్’ లేద ‘బయోప్సీ’ లాంటి టెస్టులను సూచించొచ్చు.
‘‘ఇన్ఫెక్షన్‌కు గురైన ప్రాంతాల నుంచి కణజాలం లేదా ద్రవాలను వేరుచేసి పరీక్షలకు పంపించడం ద్వారా ఏ రకం క్యాండిడా సోకిందో తెలుసుకోవచ్చు. అయితే, చాలా కేసుల్లో ఈ పరీక్ష అవసరం లేకుండానే చికిత్స మొదలుపెడతారు’’ అని బ్రెజిల్‌లోని శాంటా పౌలా హాస్పిటల్ యూరాలజిస్టు అలెక్స్ మిల్లర్ చెప్పారు.
‘‘రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ ఫంగస్ మరింత వేగంగా విస్తరిస్తుంది. అయితే, చాలా కేసుల్లో ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోతుంది’’ అని ఆయన వివరించారు.
పురుషులు కొన్ని రకాల ఆయింట్‌మెంట్లు రాసుకోవడం, యాంటీఫంగల్ పిల్స్ వేసుకోవడంతో పరిస్థితి కాస్త మెరుగవుతుంది.
సాధారణంగా పురుషులకు మూడు నుంచి ఐదు రోజులపాటు యాంటీఫంగల్ క్రీమ్స్ రాసుకోవాలని సూచిస్తారు. కొన్ని కేసుల్లో మాత్రలు కూడా వేసుకోవాలని చెబుతారు.
అయితే, ఈ ఇన్ఫెక్షన్‌తో తీవ్ర దుష్ప్రభావాలు రావడం అరుదని మిల్లర్ చెప్పారు. అయితే, అతికొద్ది కేసుల్లో మాత్రమే సెకండరీ ఫిమోసిస్ రావచ్చని వివరించారు. తాత్కాలికంగా మర్మాంగం ముందుభాగంపై చర్మం సాగే గుణం కోల్పోవడాన్నే ఫిమోసిస్ అంటారు.
క్యాండిడయాసిస్‌లో ఇతర రకాలు
ఫంగస్ పెరిగేందుకు అనువైన ప్రాంతాలు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాల్లో క్యాండిడయాసిస్ సోకే అవకాశం ఉంటుంది.
శిశువులు, చిన్నారుల్లో ఎక్కువగా ఓరల్ క్యాండిడయాసిస్ వస్తుంది. దీన్నే థ్రష్ అని కూడా అంటారు. పెదవులు, నోటి, గొంతు లోపల దీని వల్ల పుండ్లు వస్తుంటాయి.
నాలుకపై దీని వల్ల తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఏదైనా ఆహారం మింగేటప్పుడు కూడా ఇబ్బంది, మంట వస్తుంటాయి.
చంకలు, రొమ్ముల కింద లాంటి చెమ్మ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ క్యాండిడయాసిస్ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
ఆ ప్రాంతాల్లోని చర్మంపై ఎర్రని మచ్చలు కనిపిస్తాయి. తీవ్రమైన దురద రావడం, చర్మం పొరలుగా ఊడిపోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి.
పేగులపైనా క్యాండిడయాసిస్ ప్రభావం చూపించగలదు. రోగ నిరోధక శక్తిని తగ్గించే రుగ్మతలు, యాంటీబయోటిక్స్‌తో పేగుల్లో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
పేగుల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకితే కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, డయేరియా, మలబద్ధకం, మలంలో తెల్లని ద్రవాలు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ ఇన్ఫెక్షన్‌లలో అత్యంత తీవ్రమైనది సిస్టమిక్ క్యాండిడయాసిస్. ఈ కేసుల్లో రక్తం ద్వారా శరీరం మొత్తం ఈ ఫంగస్ వ్యాపిస్తుంది.
సాధారణంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ లాంటి ఇన్ఫెక్షన్‌లు సోకినవారిలో, అవయవాల మార్పిడి సమయంలో, రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు వేసుకున్నప్పుడు ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది.
అలాంటి కేసుల్లో జ్వరం, ఒళ్లంతా మంటలు, కండరాలు, కీళ్ల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏ రకమైన క్యాండిడయాసిస్ సోకినప్పటికీ వైద్యులు యాంటీఫంగల్ క్రీములు, మాత్రలు సూచిస్తారు. ఇన్ఫెక్షన్ తీవ్రమైనప్పుడు ఎప్పటికప్పుడు వైద్యుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














