రాందేవ్ బాబా 'పతంజలి' వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టుకు కోపం ఎందుకు వచ్చింది?

పతంజలి రామ్‌దేవ్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్, దిల్లీ

తప్పుదోవ పట్టించే ఔషధాల ప్రకటనల విషయంలో పతంజలి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, అలాంటి ప్రకటనలపై చర్యలు తీసుకునే సంబంధిత సెక్షన్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటుంది.

అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి సంస్థపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోలేదు.

అందుకు బదులుగా కేవలం నోటీసులు పంపడంతోనే సరిపెట్టింది.

పతంజలి కేసులో ఫిర్యాదుదారు, కేంద్రప్రభుత్వానికి మధ్య జరిగిన సంప్రదింపులు, ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాధానాలు, ఇతర డాక్యుమెంట్ల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 170, అందుకు సంబంధించిన నిబంధనల్ని తొలగించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల విభాగాలకు ఆగస్టు 2023న పంపిన లేఖలో పేర్కొంది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, ANI

పరిశ్రమ ఒత్తిడి

చట్టాన్ని నోటిఫై చేసేందుకు సమయం పడుతుందని, అంతవరకు రాష్ట్రాలు ఆ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆ లేఖలో ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్‌లోని 170 సెక్షన్ ఏదైనా ఔషధ ప్రయోజనాలను అతిశయోక్తి కలిగించే రీతిలో ప్రకటనలు చేయడం నిషిద్ధం.

ఈ సెక్షన్‌ను 2018లో చట్టంలోకి పొందుపరిచారు. ఇప్పుడు ఈ సెక్షన్‌ను తొలగించే ప్రయత్నంలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

ఇది పరిశ్రమ ఒత్తిడే ప్రభావం అని కంటి వైద్య నిపుణులు డా. కేవీ బాబు అన్నారు.

ఆయుర్వేదిక్ సంస్థల బృందం ఈ సెక్షన్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లారు.

కూనూర్‌కు చెందిన డా.కేవీ బాబు గత ఐదేళ్లుగా పతంజలితోపాటు మరికొన్ని సంస్థల ప్రకటనలపై పరిశోధనలు చేస్తున్నారు.

ఆర్టీఐ నుంచి, సంస్థలకు చెందిన డాక్యుమెంట్ల నుంచి ఆయన సేకరించిన సమాచారం ఈ కేసులో ఎంతో ఉపయోగపడింది.

ఐఎంఏ

ఫొటో సోర్స్, ANI

లైసెన్సింగ్ అథారిటీ..

ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు దేశవ్యాప్తంగా సభ్యులు ఉన్నారు.

పతంజలి కేసులో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఐఎంఏపై అందరి దృష్టి మళ్లింది.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ 1954 చట్టం ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన పతంజలి సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎంఏ కోర్టుకు వెళ్లింది.

అదేసమయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 170 ప్రకారం పతంజలి సంస్థకు నోటీసులు పంపింది.

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఉల్లంఘనలకు పాల్పడిన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఉత్తరాఖండ్‌‌లోని లైసెన్సింగ్ అథారిటీ మాత్రం ఈ చట్టాలను పాటించలేదు.

ఏళ్లుగా పతంజలి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, ఆలస్యంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం.

ఫిబ్రవరి 2023లో ఈ విషయంపై తన స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. నోటీసులు అందుకున్న దివ్య ఫార్మసీ, తాము ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొన్ని రోజులపాటు ఈ ప్రకటనలు ఆగిపోయినప్పటికీ, మళ్లీ ప్రారంభమయ్యాయి.

డాక్టర్ కేవీ బాబు
ఫొటో క్యాప్షన్, కూనూర్‌కు చెందిన డా.కేవీ బాబు గత ఐదేళ్లుగా పతంజలితోపాటు మరికొన్ని సంస్థల ప్రకటనలపై పరిశోధనలు చేస్తున్నారు.

తప్పుదోవ పట్టించే ప్రకటనలు...

పతంజలికి చెందిన దివ్య యోగా మందిర్ ట్రస్ట్‌కు సంబంధించిన యూనిట్ దివ్య ఫార్మసీ.

తప్పుదోవ పట్టించే పతంజలి సంస్థ ప్రకటనల కేసు విచారణ సమయంలో సంస్థపై సరైన రీతిలో చర్యలు తీసుకోకపోవడంపై కేంద్రం, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ కొన్ని నెలల కిందట ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఏప్రిల్ 2న జరిగిన విచారణలో ఆ కంపెనీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతంలోనే, ఆ ప్రకటనలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నుంచి తొలగించాలని ఫిబ్రవరి 27న ఆదేశించింది.

అయినప్పటికీ, అలాంటి ప్రకటనలు మళ్లీ ప్రసారం చేయడం తమ దృష్టికి వచ్చిందన్న న్యాయస్థానం, కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కంపెనీలోని మీడియా సిబ్బందికి సుప్రీంకోర్టు ఆదేశాలు తెలియకపోవడంతో అలా జరిగిందని బాలకృష్ణ తన అఫిడవిట్‌లో చెప్పారు. అయితే, రామ్‌దేవ్ బాబా అఫిడవిట్ దాఖలు చేయలేదు.

దీంతో, పతంజలి చర్యలు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కిందకే వస్తాయంటూ జస్టిస్ కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలోగా మరో అఫిడవిట్ దాఖలు చేయడమే కాకుండా ఏప్రిల్ 10న బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

కేంద్ర ఆయుష్ శాఖను కూడా కోర్టు ప్రశ్నించింది. పతంజలి వ్యవహారంపై ఆ కంపెనీ ఆయుష్‌కు వివరణ ఇచ్చినా, అది కోర్టు వరకు ఎందుకు రాలేదని అడిగింది.

ఔషధాలకు బదులు తమ ఉత్పత్తులు వాడాలంటూ పతంజలి ప్రచారం చేస్తోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుని ఉందని కోర్టు ప్రశ్నించింది.

రాందేవ్

ఫొటో సోర్స్, ANI

సుప్రీంకోర్టు ప్రశ్నలు..

వార్తాసంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో సుప్ కోర్టు కేంద్రాన్ని కూడా ప్రశ్నించింది.

కోవిడ్‌కు అల్లోపతిలో చికిత్స లేదని పతంజలి ప్రచారం చేస్తుంటే కేంద్రం ఎందుకు కళ్లుమూసుకుని ఉంది? అని ప్రశ్నించింది.

కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ తీరును కూడా తప్పుబట్టింది.

బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలం అయ్యారు అని వ్యాఖ్యానించింది.

కేసులో తదుపరి విచారణకు హాజరుకావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పతంజలి సంస్థతో సంబంధమున్న దివ్య ఫార్మసీపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ ప్రకటనల్లో పతంజలి ఉత్పత్తులు బీపీ, థైరాయిడ్, కాలేయం, చర్మ సంబంధిత వ్యాధులను నయం చేశాయని పేర్కొన్నాయి. అక్కడితో ఆగకుండా, ఆధునిక వైద్య శాస్త్రాన్ని కూడా విమర్శించాయి.

రాందేవ్ బాబా పతంజలి కంపెనీ ఉత్పత్తులు

ఫొటో సోర్స్, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

రాందేవ్ కంపెనీ ఏం చెప్పింది?

బాబా రాందేవ్ చెందిన సంస్థ కరోనిల్‌కు సంబంధించి చాలా ప్రకటనలు చేసింది. కరోనిల్ మెడిసిన్ కరోనాకు చికిత్స అని, ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఈ మెడిసిన్‌కు అమోదం తెలిపిందని చెప్పుకుంది.

అలాంటి గుర్తింపు ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది.

కరోనిల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాందేవ్‌తోపాటు మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన హర్షవర్ధన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు కూడా వేదికపై ఉన్నారు. హర్షవర్ధన్ అక్కడికి వెళ్లడంపై కూడా ఐఎంఏ ప్రశ్నించింది.

2010-11లో అవినీతికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమంలో యోగా గురు రాందేవ్ చురుగ్గా పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను పలుమార్లు టార్గెట్ చేసింది.

ఐఎంఏ మాజీ సెక్రటరీ జనరల్ డా.జయేష్ లెలె ముంబయి నుంచి బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ, “తప్పుదోవ పట్టించే ప్రకటనల ట్రెండ్ చాలాకాలంగా కొనసాగుతోంది. అందుకే వేర్వేరు ప్రదేశాల నుంచి పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాం. చాలాచోట్ల ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేశారు. ఆగస్టు 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయించాం” అని చెప్పారు.

డా.జయేష్

ఫొటో సోర్స్, ANI

జైలు శిక్ష, జరిమానా

సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవడం పట్ల డా. జయేష్ సంతోషం వ్యక్తం చేశారు.

కశ్మీర్‌లో ఉంటున్న డాక్టర్ కేవీ బాబు ఫోన్‌లో మాట్లాడుతూ, పతంజలి రెగ్యులేటరీ అథారిటీల అదేశాలను ఖాతరు చేయలేదని, రికార్డులు చెబుతున్నాయని అన్నారు.

లైసెన్సింగ్ అథారిటీలు కొన్ని కారణాల వల్ల వారితో కఠినంగా వ్యవహరించడం లేదని, నోటీసులు జారీ చేయడంతోనే నిలిచిపోయారని అన్నారు.

2018లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రకటనను చూసిన, కేరళకు చెందిన ఆప్తమాలజిస్ట్ డా.కేవీ బాబు చట్టాన్ని ఆశ్రయించారు. ఐదేళ్లపాటు కొనసాగిన ఈ న్యాయప్రక్రియలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

రాజకీయ ప్రాబల్యం ఉండి, రూ.10 వేల కోట్ల సంస్థగా మారిన పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలు సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను న్యాయస్థానంలో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అంతేకాక శిక్షను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో మొదటిసారి తప్పు చేసినందుకు గాను ఆరునెలలు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. మళ్లీ అదే పని చేసినట్లు నిర్ధారణ అయితే, జైలు శిక్ష రెట్టింపు అవుతుంది. అంటే, ఏడాది జైలుతోపాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

పతంజలి కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులోనూ బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలు దోషులుగా తేలితే శిక్ష విధించొచ్చు.

వీడియో క్యాప్షన్, బాబా రాందేవ్ 'పతంజలి' సంస్థపై కేసు ఏంటి?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)