పతంజలి చాటింగ్ యాప్: యూజర్లందరికీ హ్యాకింగ్ ముప్పు

ఫొటో సోర్స్, Getty Images
యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని 'పతంజలి ప్రొడక్ట్స్' తెచ్చిన చాటింగ్ యాప్ 'కింభో'లో భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తడంతో దీనిని యాప్ స్టోర్ల నుంచి సంస్థ ఉపసంహరించుకుంది.
'స్వదేశీ తయారీ చాట్ యాప్'గా అభివర్ణిస్తూ, వాట్సాప్, ఇతర చాటింగ్ యాప్‌లకు పోటీగా 'పతంజలి' గురువారం దీనిని విడుదల చేసింది.
ఈ యాప్‌ను 'వాట్సప్ కిల్లర్' అని కూడా పిలిచారు. కానీ ఇది బయటకొచ్చిన కొన్ని గంటల్లోనే ఇందులో లోపాలపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. ఇది సురక్షితమైనది కాదని నిపుణులు చెప్పారు. యూజర్ డేటాను ఇతరులు చాలా తేలిగ్గా పొందొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ అంశంపై పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా బీబీసీతో మాట్లాడుతూ- తమ యాప్‌లో ఏ లోపాలూ లేవని చెప్పారు. జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకొనేందుకు కేవలం ఒక్క రోజు కోసమే దీనిని విడుదల చేశామని తెలిపింది. విశేష స్పందన వచ్చిందని చెప్పారు.

ఫొటో సోర్స్, KIMBHO
యాప్‌ను మళ్లీ విడుదల చేస్తాం: పతంజలి
అంతర్జాతీయ టెక్నాలజీల్లో భారత్ అందరికన్నా ముందంజలో నిలవగలదని కింభో నిరూపిస్తుందని పతంజలి అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
సమీప భవిష్యత్తులో యాప్‌ను పూర్తిస్థాయిలో మళ్లీ విడుదల చేస్తామని, అప్పుడు ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని ఆయన తెలిపారు.
టెక్నాలజీ రంగంలో 'పతంజలి' తీసుకొచ్చిన తొలి ప్రొడక్ట్ ఈ అప్లికేషనే.

ఫొటో సోర్స్, Getty Images
తృణధాన్యాలు మొదలుకొని ఇన్‌స్టంట్ నూడుల్స్ వరకు అనేక ఉత్పత్తులను విక్రయించే పతంజలి భారత్‌లో అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి.
యాప్‌ను తీసుకురావడంలో పతంజలి తొందరపడినట్లుందని ఎలియట్ ఆల్డర్సన్ అనే మారుపేరుతో ట్వీట్లు పెట్టే సైబర్ భద్రత పరిశోధకుడు ఒకరు ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. వాట్సాప్‌తో పోటీ పడే కంటే ముందు కింభోలో భద్రతా లోపాలను సరిచేసుకోవాలని సూచించారు.
కింభో యాప్ ఒక జోక్ అని ఆయన వ్యాఖ్యానించారు. దీని గురించి పత్రికా ప్రకటనలు ఇవ్వడాని కంటే ముందు సమర్థులైన యాప్ డెవలపర్లను నియమించుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని మే 31న సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
బోలో మెసెంజర్‌కు కాపీ?
టెక్నాలజీ అంశాల విశ్లేషకుడు ప్రశాంతో కె.రాయ్ బీబీసీతో మాట్లాడుతూ- బోలో మెసెంజర్ అనే చాట్ యాప్‌ను ఆధారంగా చేసుకొని కింభోను తయారు చేశారని చెప్పారు.
తేలిగ్గా చదవగలిగిన టెక్స్ట్ రూపంలో కింభో యాప్ డేటాను నిక్షిప్తం చేసుకొంటుందని, ఇది అత్యంత ఆందోళనకర అంశమని ఆయన తెలిపారు. యూజర్ ఐడెంటిటీని నిర్ధరించే ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, హ్యాకింగ్ ముప్పు ఎక్కువని చెప్పారు. పాస్‌వర్డ్‌తో కూడిన టెక్స్ట్ మెసేజ్ ఆధారంగా యూజర్ ఐడెంటిటీని ఈ యాప్ నిర్ధరిస్తుందని, కానీ ఇదే మెసేజ్ సాయంతో ఇతర యూజర్ల మెసేజ్‌లను హ్యాకర్లు చూడగలరని వివరించారు.
అమెరికాలోని ఒక స్టార్టప్ తయారుచేసిన 'బోలో మెసెంజర్' మెసేజింగ్ యాప్ పేరును పతంజలి 'కింభో'గా మార్చి స్వదేశీ యాప్ అంటూ వదిలిందని నకిలీ వార్తలను ఛేదించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే 'ఆల్ట్ న్యూస్' వెబ్‌సైట్ వెల్లడించింది.
ఈ విమర్శలను పతంజలి అధికార ప్రతినిధి తోసిపుచ్చారు. తమ సంస్థలోని ఇంజినీర్లు, డెవలపర్లు కలిసి దీనిని తయారుచేశారని, యాప్‌ను పూర్తిస్థాయిలో తీసుకొచ్చిన తర్వాత వారి సత్తా ఏమిటో అందరికీ తెలుస్తుందని చెప్పారు.
భారత్‌లో ప్రస్తుతం సుమారు 50 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని అంచనా. వాట్సాప్‌కున్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








