భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, Getty Images

ఉల్లిగడ్డల ఎగుమతిని భారత ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) లాంటి కొన్ని దేశాలకు భారత ప్రభుత్వ ప్రత్యేక అనుమతిపై వీటిని పంపిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే, ఇతర దేశాలకు భారత్ చౌకధరకే వీటిని విక్రయించడంపై రైతులు, వ్యాపారులు ఆగ్రహంతో ఉన్నారు.

ప్రస్తుతం ఒక కేజీ ఉల్లిగడ్డకు రైతులకు రూ.12 నుంచి రూ.15 చెల్లిస్తున్నారని, అయితే, యూఏఈ చేరేటప్పటికి వీటి ధర రూ.120కు పెరుగుతుందని ఎగమతిదారులు చెబుతున్నారు.

అయితే, ఉల్లి ఎగుమతులపై నిషేధం అమలులో ఉన్నప్పుడు, కొన్ని దేశాలకు మాత్రమే భారత ప్రభుత్వం వీటిని ఎందుకు విక్రయిస్తోంది? దౌత్యం కోసం భారత ప్రభుత్వం ఉల్లిగడ్డలను ఉపయోగించుకుంటోందా?

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించినప్పటి నుంచీ, రైతులు దీనిపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత మహారాష్ట్రలో రైతులు ఆందోళన కూడా చేపట్టారు.

నాసిక్‌లోని లాసల్‌గావ్, నందగావ్, పింపల్‌గావ్ తదితర ప్రాంతాల్లో ఈ నిరసనలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోని ఈ ప్రాంతాలు ఉల్లిపాయల ఉత్పత్తికి కేంద్రాలు.

ఉల్లిగడ్డ రాజకీయంగా సున్నితమైన పంట. ఎప్పటికప్పుడు ఎన్నికల్లోనూ ఈ అంశం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది.

1998లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఉల్లిగడ్డలు ప్రత్యక్షంగా ప్రభావం చూపించాయి. నాడు బీజేపీ ఓటమికి విపరీతంగా పెరిగిన ఉల్లిపాయలు కూడా ఒక కారణమని రాజకీయ అంశాల నిపుణులు విశ్లేషించారు.

ప్రస్తుతం దేశంలో ఉల్లి కొరత పరిస్థితులు నెలకొనడంతో నిరుడు డిసెంబరులోనే ఉల్లిపాయల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

మళ్లీ ఆదేశాలు జారీచేసేవరకూ ఉల్లిగడ్డలపై నిషేధం అమలులో ఉంటుందని గత నెలలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఇతర దేశాలు ఉల్లిపాయల కోసం పెట్టుకున్న అభ్యర్థనలను దౌత్య మార్గాల్లో భారత్ స్వీకరిస్తోంది.

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, ANI

యూఏఈకి ఉల్లిగడ్డల ఎగుమతి

ద హిందూ వార్తా పత్రిక కథనం ప్రకారం, 14 వేల మెట్రిక్ టన్నులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎగుమతి చేసేందుకు మార్చి 1న కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. అయితే, ఒక త్రైమాసికంలో మొత్తంగా ఎగుమతి 3600 మెట్రిక్ టన్నులకు మించకూడదని షరతు కూడా విధించింది.

గత నెలలో 3,000 టన్నుల ఎగుమతికి ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. దీనికి అదనంగా గత వారంలో 10,000 టన్నుల ఉల్లిగడ్డల ఎగుమతికి కేంద్ర వాణిజ్య శాఖ విడిగా అనుమతులు జారీచేసింది.

ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, యూఏఈతోపాటు చాలా దేశాలకు భారత్ అనుమతులు జారీచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్‌కు 50,000 టన్నులు, భూటాన్‌కు 550 టన్నులు, బహ్రెయిన్‌కు 3,000 టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నుల ఎగుమతికి కూడా భారత్ అనుమతులు జారీచేసిందని హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ ఉల్లిగడ్డల ధర రూ.30 నుంచి రూ.35 మధ్య పలుకుతుంది. ప్రస్తుతం యూఏఈ లాంటి ప్రధాన మార్కెట్లలో ధర కేజీ రూ.150 వరకు పెరిగింది.

భారత్, పాకిస్తాన్, ఈజిప్టు లాంటి దేశాలు ఉల్లిగడ్డల ఎగుమతిపై నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇటీవల యూఏఈకి ఒక టన్నుకు 500 డాలర్ల (రూ.41,600) నుంచి 550 డాలర్లు (రూ.45,760) మధ్య ధరకు ఉల్లిపాయలు పంపించారని తమకు సమాచారం అందినట్లు ఎగుమతిదారులు చెప్పారని ద హిందూ ఒక కథనం ప్రచురించింది. అంటే ఒక కేజీ రూ.45 నుంచి రూ.50 మధ్య పలుకుతోంది.

భారత్‌ నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్న యూఏఈ దిగుమతిదారులు రూ.300 కోట్ల వరకు లాభాలు ఆర్జించినట్లు ద హిందూ తెలిపింది.

యూఏఈకి 10 వేల మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు వెళ్తే, దిగుమతిదారులకు మొత్తంగా రూ.1000 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశముంది.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది

దిగుమతి చేసుకునేవారికి లాభం

ఉల్లిగడ్డల ఎగుమతి.. నేషనల్ కోఆపరేటివ్స్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్) ద్వారా మాత్రమే సాగుతోంది. ఎన్‌సీఈఎల్ ఒక ప్రభుత్వ సంస్థ.

ప్రస్తుతం ప్రైవేటు ఎగుమతిదారులను ఉల్లిగడ్డల ఎగుమతికి అనుమతించడం లేదు. ఇక్కడ ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి ఎగుమతి చేస్తోంది.

ప్రస్తుతం ఉల్లిగడ్డల ఎగుమతికి సంబంధించిన ఈ-టెండరింగ్ ప్రక్రియలు అగ్రిబజార్ పోర్టల్‌లో జరుగుతున్నాయి.

అయితే, యూఏఈ తరపున కొందరు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా భారత్ నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై స్పందించేందుకు భారత ప్రభుత్వం నిరాకరిస్తోంది.

ఉల్లిగడ్డల ఎగుమతి విధానాలు, ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని హార్టికల్చర్ ప్రొడ్యూస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (హెచ్‌పీఈఏ) డిమాండ్ చేస్తోంది.

అంతర్జాతీయ ధరల కంటే తక్కువకే ఉల్లిగడ్డలను విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్)కు హెచ్‌పీఈఏ ఒక మెయిల్ కూడా పంపింది.

అయితే, ఉల్లిగడ్డల ఎగుమతి కోటా, ధరలకు సంబంధించిన నిర్ణయాలను మంత్రుల కమిటీ తీసుకుంటుందని, ఈ వ్యవహారంలో తమ ప్రమేయమేమీలేదని ఎన్‌సీఈఎల్ అధికారులు చెప్పినట్లు ద హిందూ పత్రిక కథనంలో తెలిపింది.

వీడియో క్యాప్షన్, ఒక్క సీజన్లో టమోటాలు అమ్మి రూ.2.81 కోట్లు సంపాదించిన రైతు

ఉల్లిగడ్డల చరిత్ర

4,000 ఏళ్ల నుంచీ ఉల్లిగడ్డలను భిన్నమైన వంటకాల్లో వాడుతున్నారు.

1985లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త ఒకరు ఉల్లిపాయలను మెసొపొటేమియా నాగరికతలోనూ ఉపయోగించినట్లు ఒక కథనం ప్రచురించారు.

నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఉల్లిగడ్డలను పండిస్తున్నారు.

చైనా, భారత్ కలిసి ప్రపంచ ఉత్పత్తి (70 మిలియన్ టన్నుల్లో)లో 45 శాతాన్ని పండిస్తున్నాయి.

అయితే, వినియోగం విషయంలో ఈ రెండు దేశాలు మొదటి రెండు స్థానాల్లో లేవు. 2011 యునైటెడ్ నేషన్స్ నిర్వహించిన అధ్యయనంలో లిబియాలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 33.6 కేజీల ఉల్లిగడ్డలను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నట్లు తేలింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల వంటల్లోనూ ఉల్లిగడ్డలు ఉపయోగిస్తుంటారు. దీనిలో పోషకాలు కూడా ఎక్కువే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)