హీట్ వేవ్ అంటే ఏంటి... దీనికీ ఎన్నికలకూ ఏమిటి సంబంధం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రిషి బెనర్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశ 18వ లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశంలో ఏడు దశల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే వేసవిలో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.
ఏప్రిల్ 19న మొదటి దశ ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, అంతకుముందే ఏప్రిల్ ప్రారంభం నుంచే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలోనే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతంతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్నిరాష్ట్రాల్లో ప్రతిఏటా వడగాల్పులు కనిపిస్తాయి. వేసవి కాలం మధ్యలో, అంటే ఏప్రిల్ నెల చివరి నుంచి మే నెల వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరతాయి.
ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఉంటాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో ఫలితాలు వెలువడతాయి.
వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతల వంటి వాతావరణ పరిస్థితులు ఎన్నికల ప్రక్రియకు సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి సగటు కంటే ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కూడా అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎండీ హెచ్చరికలేంటి?
2024లో కూడా ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్యలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంతో పాటు తూర్పు, వాయువ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది.
ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ఉంటుంది.
సాధారణంగా వేసవి కాలంలోని మూడు నెలల వ్యవధిలో వడగాల్పులు సగటున నాలుగైదు రోజులు కనిపిస్తాయి. అయితే, ఈ ఏడాది పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజుల వరకూ వేడిగాలులు వీచే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రాంతాలు, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోనూ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
2023 తర్వాత, 2024 వేసవిలోనూ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం ఉండబోతోంది. సాధారణంగా, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
అయితే, 2023లో ప్రతి నెలలోనూ సగటుకి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలా జరగడం ఇదే మొదటిసారి.
మహాపాత్ర ప్రకారం, 'ఎల్ నినో 2023 జూన్‌లో ప్రారంభమైంది. దాని ప్రభావం డిసెంబర్ నెలలో తగ్గింది. అయితే, ఈ ఎల్ నినో భూగోళం ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమైంది. అయితే, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కేవలం ఎల్ నినో వల్లనే అని చెప్పలేం. కాకపోతే ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో వేడిగాలులు, వాటి తీవ్రత పెరుగుతుంది.'
ఎల్ నినో అనేది వాతావరణ మార్పుల్లో ఒక భాగం. భారత్‌కు వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎల్ నినో ప్రభావం భారత్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతానికి కారణమవుతుంది.
భారత వాతావరణ విభాగ శాస్త్రవేత్త సోమ్‌సేన్ రాయ్ బీబీసీ గుజరాతీతో మాట్లాడుతూ, 'సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఈరోజుల్లో కొత్త విషయమేమీ కాదు. అయితే, కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూ ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది వడగాల్పుల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఎక్కువ కాలం వేడిగాలుల ప్రభావం ఉంటుంది' అన్నారు.

ఫొటో సోర్స్, @ECISVEEP
ఎన్నికలపై ఎలా ప్రభావం పడుతుంది?
మొదటి రెండు దశల ఎన్నికలు ఏప్రిల్‌లో జరుగుతాయి. ఈ దశల్లో మొత్తం 191 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఏడు దశలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో నాలుగు దశలకు మే నెలలోనే 7, 13, 20, 25 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. అప్పటికి ఆరు దశలు పూర్తవుతాయి. ఏడో దశ ఎన్నికలు జూన్ 1న జరుగుతాయి. సీట్ల వారీగా చూస్తే, మే నెలలో 296 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
జూన్ ఒకటిన జరిగే చివరి దశలో 57 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఒకటో తేదీన అయినప్పటికీ ఆ ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలన్నీ మే నెలలోనే జరుగుతాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలోనే మొత్తం 353 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మే 7న మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మే 13న నాలుగో దశలో 12 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మే 20న ఐదో దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మే 25న ఆరో దశలో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
జూన్ 1న ఏడో దశలో 3 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మరీముఖ్యంగా, మే నెలలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు రాజకీయంగానూ, సీట్ల సంఖ్యాపరంగానూ చాలా కీలకం. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని చాలా లోక్‌సభ స్థానాలకు మే నెలలో, పలు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, గోవా, దిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో మే నెలలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ రాష్ట్రాల్లో మే, జూన్ నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో మే నెలలో సగటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకూ, కొన్నిసార్లు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరుకుంటాయి.
గుజరాత్, గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ దిలీప్ మావ్లంకర్ మాట్లాడుతూ, 'మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దాని ప్రభావం ఎన్నికలపై కూడా ఉంటుంది. అంతకుముందులా ర్యాలీలు, సభలకు జనం కూడా పెద్దగా రావడం లేదు. అందువల్ల ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభల వంటివి చాలా వరకూ సాయంత్రం పూట జరగొచ్చు' అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
ఏయే రాష్ట్రాల్లో ఎన్ని దశల్లో పోలింగ్
మూడు దశలు - ఛత్తీస్‌గఢ్, అస్సాం
నాలుగు దశలు - ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్
ఐదు దశలు - మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్
ఏడు దశలు - ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్
ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తుండటం గమనించాల్సిన విషయం. బెంగళూరు నగరంలో అత్యధికంగా 37.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం. హైదరాబాద్‌లో మార్చి నెలలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ భారతదేశంలో 'తీవ్రమైన వేడిగాలులు' ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
వడగాల్పుల కారణంగా గతేడాది జూన్‌లోపు 14 రాష్ట్రాల్లో 264 మంది చనిపోయినట్లు 2023లో లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
నిరుడు ఉత్తర భారతమంతటా మార్చి నుంచే వేడిగాలులు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, దిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏడాదిలో 49 రోజులు తీవ్రమైన వేడిగాలులను ప్రజలు ఎదుర్కొన్నారు.
ఐఎండీ లెక్కల ప్రకారం, 2003 నుంచి 2022 వరకూ వడగాల్పుల కారణంగా 9675 మంది చనిపోయారు. గత రికార్డులను పరిశీలిస్తే ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. 2024లోనూ వేడిగాలుల ప్రభావం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల మీద ఎఫెక్ట్ పడుతుందా?
ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచార రథానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ప్రచార సమయంలో వాహనానికి అమర్చిన స్ప్రింక్లర్ల నుంచి నీటిని స్ప్రే చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
ఈ లోక్‌సభ ఎన్నికలు మంటపుట్టించే వేడి, వడగాల్పుల మధ్య జరగనున్నాయి. ఇది రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు, ఎన్నికల కమిషన్‌కి కూడా పరీక్షే. ప్రజలను బహిరంగ సభలు, ర్యాలీలు, పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
''సాధారణంగా ఈ కాలంలో ప్రజలు బయటికి వచ్చేందుకు ఇష్టపడరు, ఇది రాజకీయ కార్యక్రమాలపైనే కాకుండా పోలింగ్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అంచనా వేసిన దానికంటే తక్కువ మందే పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. పోలింగ్ సగటును అందుకునేందుకు ఎలక్షన్ కమిషన్‌తో పాటు రాజకీయ పార్టీలు కూడా శ్రమించాల్సి ఉంటుంది'' అన్నారు దిలీప్ మావ్లంకర్.
సాధారణంగా పోలింగ్ బూత్‌ల బయట కనిపించే బారులుదీరిన లైన్లు పగటిపూట అంతగా కనిపించవు. మధ్యాహ్నం ఓటింగ్ మందకొడిగా సాగుతుంది కాబట్టి, ఎన్నికల సంఘం కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
ఉదయం, సాయంత్రం వేళల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని, ఎండ ఎక్కువగా ఉండే సమయంలో తక్కువగా ఉంటుందని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్‌డీఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ సంజమ్ కుమార్ చెప్పారు.
''2014, 2019 లోక్‌సభ ఎన్నికలు కూడా ఎండాకాలంలోనే జరిగాయి. అయినా ఓటింగ్ శాతం బాగానే నమోదైంది. ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలు, పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లు కూడా చురుగ్గానే ఉంటారు. ర్యాలీలు, బహిరంగ సభల సమయంలో రాజకీయ పార్టీలు షెడ్లు, తాగునీరు వంటి ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఆ తర్వాత కొంత పెరిగే అవకాశం ఉంది'' అని కుమార్ అన్నారు.
విపరీతమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొనడం ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, @ECISVEEP
ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఏర్పాట్లేంటి?
లోక్‌సభ ఎన్నికల వేళ వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని ఎలక్షన్ కమిషన్ కూడా అంచనా వేసింది. ఐఎండీ, జాతీయ విపత్తు నిర్వహణ శాఖలతో కలిసి ఈసీ పనిచేస్తోంది.
ఏడు దశల్లో పోలింగ్ ప్రణాళికను ప్రకటించడంతో పాటు వేసవి నుంచి రక్షణ కోసం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సూచించింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి.
మార్గదర్శకాల్లోని ముఖ్యమైన అంశాలు:
- పోలింగ్ కేంద్రం కింది అంతస్తులోనే ఉండాలి.
- ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ర్యాంప్ ఉండాలి.
- పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, తగినన్ని కుర్చీలు, బల్లలు, లైట్లు, సూచిక బోర్డులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి.
- ఓటర్ల కోసం టెంట్ల ఏర్పాటు చేయాలి.
ఓటర్లకు ఎన్నికల సంఘం చేసిన సూచనలు
- తగినంత నీరు తాగాలి, వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి.
- ఓఆర్‌ఎస్ లేదా ఇంట్లో తయారుచేసుకున్న పానీయాలు సేవిస్తూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.
- తేలికగా, వదులుగా ఉండే దుస్తులు ధరించడం, గొడుగు లేదా టోపీ తీసుకెళ్లడం ఉత్తమం.
- కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటే మంచిది.
- పోలింగ్ కేంద్రానికి పిల్లలను తీసుకుకుండా ఉండడం ఉత్తమం.
- పార్క్ చేసిన వాహనంలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలేయకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
హీట్ వేవ్ అంటే ఏమిటి?
ఏదైనా ఒక ప్రాంతంలో, స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసిన ఉష్ణోగ్రతల కంటే ఉష్ణోగ్రత పెరిగి నిర్దిష్టంగా కొన్ని రోజుల పాటు కొనసాగితే, దానిని హీట్ వేవ్‌గా పరిగణిస్తారు.
భారత వాతావరణ శాఖ మార్గదర్శకాల ప్రకారం, హీట్ వేవ్‌ల సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండాలి, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. ఇలాంటి పరిస్థితి సాధారణంగా ఐదు రోజులు ఉంటుంది.
హీట్ వేవ్ మనుషులతో పాటు అనేక ప్రాణులను ప్రభావితం చేస్తుంది. హీట్ వేవ్ కారణంగా డీహైడ్రేషన్, అలసట, బలహీనత, కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి వంటివాటికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా గుండెజబ్బులున్న వారు స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురయ్యే ప్రమాదముంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
- వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ ఎవరు... ఆర్ఎస్ఎస్-బీజేపీ చరిత్ర ఉన్న ఈ నాయకుడినే కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది?
- గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పిన సున్నాను భారతీయులు ఎలా కనిపెట్టారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














