సంపాదన కోసం చైనా మహిళల కొత్త ఉపాయాలు..

చైనా, డబ్బు, పొదుపు, ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిల్వియా చాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న కొద్దీ డబ్బుని పొదుపు చేసేందుకు ఆ దేశ మహిళలు కొత్త మార్గాలను వెదుకుతున్నారు.

“కొన్నేళ్ల నుంచి ఎప్పుడూ మా దగ్గర డబ్బులు ఉండటం లేదు. నాకు భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని షియావో జుయో అనే మహిళ చెప్పారు.

చైనాలోని షియామెన్ నగరంలో ఆమె ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో షియావో భర్త జీతంలో 50 శాతం కోత పెట్టారు. ఇది ఆమె కుటుంబానికి పెద్ద ఎదురు దెబ్బ. దీనికి తోడు క్యాన్సర్ సోకిన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే పడింది.

తమలాంటి ఆలోచనలు, ఆశలు ఉన్న వ్యక్తుల కోసం ఇంటర్నెట్‌లో వెదకడం, అలాంటి వారిని కలుసుకోవడం చైనా యువతలో ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. అలాంటి వారిలోనూ ప్రయాణాలు చెయ్యడం, లేదా ఇద్దరూ కలిసి ఉండటం లాంటివి కాకుండా డబ్బులు పొదుపు చేసే వ్యక్తుల గురించి షియావో వెదుకుతున్నారు.

చైనా, కోవిడ్, ఆర్థిక మందగమనం
ఫొటో క్యాప్షన్, ఆర్థిక మందగమనంతో డబ్బును పొదుపు చేయాలని భావిస్తున్న షియావో

2023 ఫిబ్రవరిలో చైనీస్ భాషలో “పొదుపు చేసే పార్ట్‌నర్” అనే హ్యాష్‌ట్యాగ్ మొదట చైనాలో ఇన్‌స్టాగ్రామ్ తరహా సామాజిక మాధ్యమం షియోంగ్షులో కనిపించింది.

దీనికి ఇప్పటి వరకు 17లక్షల వ్యూస్ వచ్చాయని డేటా విశ్లేషణ సంస్థ న్యూస్ ర్యాంక్ తెలిపింది. పొదుపు చేసే పార్ట్‌నర్ అనే అంశానికి సంబంధించి సోషల్ మీడియా సైట్ వీబోలో లక్షల సార్లు చూశారు. ఎంత మంది చూశారో స్పష్టంగా చెప్పడం కష్టం.

అయితే ఆన్‌లైన్‌ గ్రూపుల్లో కొన్ని వేల మంది “పొదుపు పార్ట్‌నర్‌ను” కనుక్కున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన పరిశోధనలో తేలింది.

ఇలాంటి పార్ట్‌నర్‌ను ఎంచుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారే. అందులో ఎక్కువమంది తల్లులు.

వీరిలో కొంత మంది తమ పిల్లలకు చదువు చెప్పించేందుకు డబ్బులు పొదుపు చేయాలని తెలిపారు. చైనాలో చదువులు ఆర్థికంగా భారంగా మారాయి.

కొంతమంది మాత్రం స్టాక్ మార్కెట్లు, రియల్ ‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడానికి డబ్బుని పొదుపు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోవడంతో రానున్న రోజుల్లో ఉద్యోగం పోవడం, జీతం తగ్గించడం లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు డబ్బుని చేతిలో ఉంచుకోవాలని అనుకుంటున్నామన్నారు.

ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా డబ్బులు పొదుపు చేసే దేశాల్లో చైనా ఒకటి.

అయితే తాజాగా పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతున్న తీరు “ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడం వల్లేనని” నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో పబ్లిక్ పాలసీని బోధించే అధ్యాపకుడు ప్రొఫెసర్ లుషి చెప్పారు.

మహిళలు, బ్యాంకులు, నగదు లావాదేవీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో ఇంట్లో రోజువారీ ఖర్చుల నిర్వహణలో మహిళలదే కీలకపాత్ర

గతేడాది చివరి నాటికి చైనా ప్రజలు 138 ట్రిలియన్ యువాన్లను బ్యాంకుల్లో డిపాజిట్లుగా పొదుపు చేసి ఉండవచ్చని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 14శాతం ఎక్కువ.

చైనాలో జీరో కోవిడ్ పాలసీతో కోవిడ్ తర్వాత మొదలైన ఆర్థిక పునరుత్తేజం ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే దివాలా తీయడంతో మొదలైన ఆర్థిక పతనం కొనసాగుతోంది.

ప్రతి ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోళ్లు తగ్గిపోయాయి. విదేశీ పెట్టుబడుల రాక మందగించింది. దీంతో స్థానిక ప్రభుత్వాల అప్పులు పెరుగుతున్నాయి.

చైనాలో ఇంట్లో దైనందిన ఖర్చులు, రోజువారీ అవసరాల నిర్వహణ బాధ్యతల్ని ఎక్కువగా మహిళలే చూస్తుంటారు.

మహిళలు పొదుపుకు అధిక ప్రాధాన్యమివ్వడం పెరుగుతున్న నిరుద్యోగానికి సూచిక. కేవలం యువతలోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ నిరుద్యోగం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో పెరుగుతూనే ఉందని డాక్టర్ లౌ తెలిపారు.

ప్రజలు ఖర్చులు తగ్గించుకుని డబ్బులు పొదుపు చెయ్యడం వల్ల ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

మౌలిక వసతుల రంగంలో భారీ పెట్టుబడులు, తక్కువ ధరకు శ్రమశక్తి లభించడం వంటి అంశాల వల్ల కోవిడ్‌కు ముందు చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా అభివృద్ధి సాధించింది.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజలు పొదుపు అలవాట్లను పక్కన పెట్టి ఖర్చు చెయ్యడం మొదలు పెట్టాలని, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని నిపుణులు అంటున్నారు.

ప్రజల పొదుపు మొత్తం పెరిగితే చైనాలో నగదు లావాదేవీలు తగ్గిపోతాయి. ఇది జపాన్‌లో 90ల నాటి పరిస్థితులకు దారి తీస్తుందని డాక్టరు లు షి చెప్పారు.

పొదుపు పథకాలు, బ్యాంకుల్లో డిపాజిట్లు మీద వడ్డీరేట్లు తగ్గించినా కూడా ప్రజలు డబ్బు ఖర్చు చెయ్యరు.

ఖర్చు చెయ్యకుండా, పెట్టుబడులు పెట్టకుండా డబ్బుని తమ వద్దే ఉంచుకుంటారు. దీని వల్ల వృద్ధి రేటు పడిపోతుంది.

ఇదంతా రాత్రికి రాత్రే జరక్కపోయినా, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్ధ మీద దీర్ఘకాలం ఉంటుంది.

యాప్, పోన్లు, డబ్బులు
ఫొటో క్యాప్షన్, డబ్బుని పొదుపు చేసేందుకు చైనీయులు ఉపయోగిస్తున్న యాప్

ఒకరికొకరు తోడు నీడగా..

షియావో జుయో తనను అదృష్టవంతురాలిగా భావిస్తున్నారు. ఆమె క్లీన్ ఎనర్జీ రంగంలో పని చేస్తున్నారు. గతేడాది చైనా సాధించిన ఆర్థికాభివృద్ధిలో ఈ రంగానిది 40 శాతం.

ఆమె కుటుంబ సభ్యుల్లో అనేక మంది, స్నేహితులు ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లలో ఉద్యోగం చేస్తున్నారు. వారిని ఏ క్షణంలోనే తొలగించే ప్రమాదం ఉంది.

షియావో ఫిబ్రవరిలో అనేక పొదుపు సంఘాలలో చేరారు. ఈ సంఘాలలో సభ్యులు ప్రతీ రోజూ తాము ఎంత దాచుకున్నాం, ఎంత ఖర్చు చేశాం అనేది రికార్డు చేస్తుంటారు.

సభ్యుల్లో ఒకరినొకరు సంప్రదించుకుని ఖర్చుల్న తగ్గించుకుంటున్నారు. ఉదాహరణకు ఒక మహిళ 5వేల యువాన్లు ఖర్చు పెట్టి ఒక బ్యాగు కొనాలని అనుకున్నప్పుడు .. మరో మహిళతో మాట్లాడి ఆమె నుంచి సలహా తీసుకున్న తర్వాత వెయ్యి యువాన్లకు సెకండ్ హ్యాండ్ బ్యాగ్ కొంటున్నారు. దీని వల్ల 4వేల యువాన్లను పొదుపు చేస్తున్నారు.

షియావో డబ్బును ఆదా చేసేందుకు కొన్ని విధానాలను నేర్చుకున్నారు. ఆమె మొబైల్ నుంచి హృదయం ఆకారంలో ఉండే ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇందులో 365 బాక్సులు ఉంటాయి. దీని ప్రకారం ప్రతీ రోజూ ఒకటి నుంచి 185 యువాన్లను పొదుపు చేయాలి. అలా చేయడం వల్ల సంవత్సరం తర్వాత 34వేల యువాన్లను పొదుపు చెయ్యవచ్చు.

ఈ యాప్‌ను చైనాలో లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దేశంలో తనలాగా పొదుపు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారని షియావో తెలుసుకున్నారు.

తన షాపింగ్ అలవాట్లను కూడా ఆమె మార్చుకున్నారు. గతంలో సూపర్ మార్కెట్‌కు వెళితే అవసరం ఉన్నా లేకున్నా కొన్ని వస్తువుల్ని కొనేవారామె. అయితే ఇప్పుడు అవసరమైన లిస్టు రాసుకుని వెళుతున్నారు.

పొదుపు విషయంలో మిగతా సహచరుల సూచనలు పాటించడంతో ఆమె నెల వారీ ఖర్చుల్లో 40శాతం ఆదా చేయగలిగారు.

ఇదిలాగే కొనసాగిస్తే సంవత్సరానికి లక్ష యువాన్లు ఆదా చెయ్యగలననే నమ్మకంతో ఉన్నారామె. గతంలో ఆమె సేవింగ్స్‌తో పోలిస్తే ఇది పది రెట్లు ఎక్కువ.

మిగతా మహిళలు కూడా డబ్బు పొదుపు చేసేందుకు ఈ యాప్ సాయం చేసిందని చెబుతున్నారు.

ఓ మహిళ ఇప్పుడు తన వంట తానే చేసుకుంటున్నానని షాపింగ్ పూర్తిగా మానేశానని చెప్పారు. గతంలో తాను ఆన్ లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడం ద్వారా చేసిన దుబారాను పూర్తిగా తగ్గించినట్లు తెలిపారు.

మరో మహిళ తాను ఆఫీసులో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఖర్చుల్ని తగ్గించుకున్నానని, డబ్బుతో పెద్దగా అవసరంలేని కొత్త అలవాట్లు చేసుకుంటున్నట్లు చెప్పారు.

చైనా, కుటుంబాలు, హునాన్ ప్రావిన్స్
ఫొటో క్యాప్షన్, తన కుటుంబం కోసం 5 మిలియన్ యువాన్లను పొదుపు చేయాలనేది చెన్ ఆలోచన

డబ్బే రారాజు

కొంతమంది మహిళలు డబ్బు పొదుపు చేసేందుకు సంప్రదాయ పద్దతుల్ని అనుసరిస్తున్నారు. అందులో భాగంగా నగదును ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. చైనాలో 70 శాతం ప్రజలు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు జరిపేవారు. దీని వల్ల వాళ్లు ఎక్కువగా నగదును దగ్గర ఉంచుకునేవారు కాదు.

“ఇంట్లో బ్యాంకు నోట్ల కట్టలు ఎక్కువగా కనిపిస్తే నాకు భద్రంగా ఉన్నానని అనిపిస్తుంది” అని 32 ఏళ్ల చెన్ చెప్పారు. ఆమె హెనాన్‌లో ఓ హెయిర్ సెలూన్ నడుపుతున్నారు.

ఆమె ప్రతీ నెలాఖరులో తన బ్యాంకు ఖాతా నుంచి తను సంపాదించిన సొమ్మునంతా విత్ డ్రా చేసి ఆ నగదును ఒక బాక్స్‌లో పెడుతున్నారు. అది 50వేల యువాన్లకు చేరిన తర్వాత ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని చెప్పారు.

ఆమె షాపింగ్ కోసం కూడా నగదునే ఉపయోగిస్తున్నారు. కష్టమైనప్పటికీ ఆ పద్దతినే పాటిస్తున్నారు. దీని వల్ల డబ్బును దుబారాగా ఖర్చు చెయ్యకుండా ఉండవచ్చని చెబుతున్నారు.

ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత చెన్ క్లైంట్లలో చాలామంది ఆమె సెలూన్‌కు రావడం మానేశారు. ఆమె కస్టమర్లలో అనేకమంది తాము ఖర్చుల్ని తగ్గించుకున్నట్లు చెప్పారు.

చెన్ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆమె, ఆమె భాగస్వామి భావిస్తున్నారు. పిల్లలిద్దరి కోసం చెరో మిలియన్ యువాన్లు దాచి పెట్టాలన్నది చెన్ ఆలోచన.

చైనాలో పురుషులు పెళ్లవగానే ఇల్లు కొనాలని భావిస్తారు. అందుకే పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వారికి ఇల్లు కొని పెడుతుంటారు.

చెన్ తన కుటుంబం కోసం కనీసం ఐదు మిలియన్ యువాన్లు కూడబెట్టాలని అంచనా వేశారు. అయితే ఆమె ప్రస్తుతం గర్భవతి కావడంతో అంత మొత్తం పొదుపు చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు.

“గతంలో నా దగ్గర ఎలాంటి పొదుపు పథకాలు లేకపోయినా.. ఎంతో కొంత సొమ్ము చేతిలో ఉండేది. ఇప్పుడు డబ్బులు పొదుపు చెయ్యడం చాలా కష్టంగా మారింది. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతోంది” అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)