భవిష్యత్తు భూగర్భానిదే.. అక్కడే ఇళ్లు, షాపింగ్ మాల్స్, వ్యవసాయం.. ఇదంతా సాధ్యమేనా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
నగరాల్లో జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచంలోని 800 కోట్ల జనాభాలో సగం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో, అంటే 2050 నాటికల్లా ప్రతి 10 మందిలో ఏడుగురు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉన్న ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఈ పరిణామం చాలా వేగంగా ఉంటుంది.
పట్టణ ప్రాంతాల్లో జనాభా కిక్కిరిసిపోవడంతో అక్కడ ఖర్చులు పెరగడమే కాక, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి చేరుతాయి.
ఈ వేడిని తట్టుకోవడానికి నిరంతరం ఏసీలు వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాక, కర్బన ఉద్గారాలు అధికంగా వెలువడతాయి.
ఈ సమస్యలకు పరిష్కారం భూగర్భంలో ఇళ్ళు కట్టుకోవడమేనని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అండర్ వరల్డ్
సెంట్రల్ టర్కీలో 5,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఓ అందమైన ప్రాంతమది. దూరం నుంచే ఆ ప్రాంతంలోని శంఖాకారపు రాతి నిర్మాణాల్లాంటివి కనిపిస్తుంటాయి.
అగ్నిపర్వతాల విస్ఫోటనం కారణంగా విడుదలైన బూడిదతో ఇవి ఏర్పడ్డాయి.
వాటినోసారి పరిశీలనగా చూస్తే ఈ సహజ నిర్మాణాలకు తలుపులు కూడా కనిపిస్తాయి.
ఆ తలుపు తీసుకుని లోపలకు వెళితే, విశాలమైన గదులు, నడవాలు, సొరంగాలు దర్శనమిస్తాయి.
ఇలాంటి భూగర్భ సముదాయమే డెరెంకుయు నగరం. ఈ నగరంలో భూమికి 85 మీటర్ల దిగువన అతిపెద్ద గదులు, కారిడార్స్, సొరంగాల సముదాయం కనిపిస్తుంది.
శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు వీటిని శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సబ్ టెర్రానియా బ్రిటానికా అనే సంస్థకు ధర్మకర్తగా ఉన్న మార్టిన్ డిక్సన్‌తో బీబీసీ మాట్లాడింది.
ఈ సంస్థ భూగర్భ గృహాలపై పరిశోధనలు చేస్తుంటుంది.
ప్రపంచంలో అనేక ప్రదేశాలలో తాను ఇలాంటి పరిశోధనలు చేసినట్టు మార్టిన్ డిక్సన్ చెప్పారు. డెరెంకుయు సొరంగాలను గుండ్రంగా ఉండే భారీ రాతిగుండులతో మూసివేసేవారని, దీనివల్ల బయటినుంచి శత్రువులు వీటిల్లోకి ప్రవేశించడం సాధ్యమయ్యేది కాదని వివరించారు.
‘‘ ఈ గుండ్రటి రాతిగుండ్లను సొరంగం లోపల నుంచి ప్రవేశద్వారం వద్దకు తోసేవారు. ఈ రాతిగుండును బయటి నుంచి తొలగించడం అసాధ్యం. ఈటెలు తదితర ఆయుధాలతో దాడులు చేసే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఈ సొరంగాల చుట్టూ రాతి గుండ్లను అడ్డుగా పెట్టేవారు’ అని తెలిపారు.
భూమిపైన యుద్దాలు జరిగిన సమయంలో ప్రజలు ఇలాంటి భూగృహాలలో తలదాచుకుని ఉంటారని మార్టిన్ డిక్సన్ విశ్వసిస్తున్నారు. ఇవి శాశ్వత నివాసాలు కానప్పటికీ భూమిపైన యుద్ధాలు, ఘర్షణలు ముగిసేవరకూ దీర్ఘకాలంపాటు ప్రజలు ఇక్కడ నివసించేవారని ఆయన నమ్ముతున్నారు.
ఈ భూగర్భ సముదాయాలలో బావులు, దీపాలు, పశువుల పాకలు తదితర సదుపాయాలతోపాటు ప్రజలు సురక్షితంగా నివసించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.
శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, అడవి జంతువుల దాడులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఈ భూగృహాలను ఉపయోగించుకునేవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భూగర్భమే ఎందుకు?
ప్రపంచంలో 60కు పైగా దేశాలలో అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్ళు నడుస్తున్నాయి. ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్లలోనే అనేక కార్యాలయాలు కూడా ఉంటున్నాయి. చాలామంది రైలు దిగగానే అక్కడే ఉండే తమ ఆఫీసుకు నేరుగా వెళ్ళిపోతుంటారు. అక్కడే పుడ్ స్టాల్స్ కూడా ఉంటాయనేది మెట్రో రైళ్ళలో తిరిగేవారందరికీ తెలిసిన విషయమే. దీంతో ప్రత్యేకించి ఆహారాన్ని కొనుగోలు చేయడానికి లిఫ్ట్‌లో బయటకు రావాల్సిన అవసరం ఉండదు.
ప్రతికూల వాతావరణం కూడా భూగర్భ సముదాయ నిర్మాణాలకు కారణమవుతోంది. ఉదాహరణకు తూర్పు కెనడాలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీలకు పడిపోతుంటాయి.
ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లాన్ జాక్వెస్ బెస్నర్‌తో బీబీసీ మాట్లాడింది. యన అసోసియేటెడ్ సెంటర్ ఫర్ అర్బన్ గ్రౌండ్ స్పేసెస్ కు సహ వ్యవస్థాపకుడిగానూ ఉన్నారు. మాంట్రియల్ నగరంలో 1980లో అండర్‌గ్రౌండ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం జాక్వెస్ బెస్నర్ పనిచేశారు.
మాంట్రెల్‌లోని భూగర్భ నగరం 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇందులో వందలాది కార్యాలయాలు, దుకాణాలు, మ్యూజియంలు, ఉన్నాయి. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుంటూ ఉంటారు.
ఈ నగర నిర్మాణ సమయంలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.
‘‘ఇలాంటి నిర్మాణాలలో నడక మార్గాలను విశాలంగా నిర్మించడమే కాకుండా, గోడలపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు, ఎటువంటి ఇబ్బందులు పడకుండా సులువుగా రాకపోకలు సాగించ గలుగుతారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నేలపై భవనాలకు నష్టమా?
ఆధునిక టెక్నాలజీ, భవన నిర్మాణ సామాగ్రి కారణంగా షాపింగ్ మాల్స్ లాంటి పెద్ద పెద్ద భవనాలను కూడా, నేలపైన ఉండే భవనాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, భూగర్భంలో కట్టేయచ్చు.
వందేళ్ళ కిందట లండన్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినప్పుడు, భవంతులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో సొరంగాలను చాలా లోతుగా తవ్వారు.
మధ్యయుగాల నుంచి ప్రచ్ఛన్న యుద్దం వరకూ అలాంటి భూగర్భ గృహాలను ఎన్నో నిర్మించి ఉంటారని జాక్వెస్ బెస్నెర్ నమ్ముతున్నారు.
‘‘యుద్ధ సమయాలలో బాంబుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు భూగర్భ సముదాయాలను నిర్మించేవారు’’ అని చెప్పారు.
చారిత్రక ప్రాంతాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి కనుక వాటిని ఇప్పుడు పర్యాటక ప్రాంతాలుగా మార్చారు. అయితే ఈ ప్రాంతాలను ఆధునిక అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్ది, ఇక్కడ రెస్టారెంట్లు, షాపులు తెరవొచ్చు. ఈ రోజులలో ఇదో ఫ్యాషన్ అని తెలిపారు.
ప్రస్తుతం అండర్ గ్రౌండ్ స్థలాలను ప్రజలు చాలా కొద్దిసేపు మాత్రమే వినియోగించుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో వాతావరణ ప్రతికూల ప్రభావాన్నుంచి తప్పించుకోవడానికి భూగర్భంలో నివసించే దీర్ఘకాలిక ఏర్పాటు గురించి ఆలోచించగలమా?
వాతావరణ మార్పులు వరదలు, అగ్నిప్రమాదాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతోభూగర్భం లాంటి చల్లటి ప్రదేశాలలో జీవించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
‘‘వేడి, ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ నిర్మాణాలు ఓ మంచి పరిష్కారమతాయి’’

ఫొటో సోర్స్, GETTY IMAGES
వేసవి ఎండలకు విరుగుడు
వంద సంవత్సరాల కిందట దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పేడీ ప్రాంతంలో ఒపెల్ రంగురాళ్ల కోసం గనుల తవ్వకం మొదలుపెట్టారు. కానీ అక్కడ వేడివాతావరణాన్ని తట్టుకోలేక ఏకంగా భూగర్భంలో ఓ ప్రపంచాన్నే నిర్మించేశారు.
ప్రస్తుతం కూబర్ పేడీకి చెందిన 1500 మంది భూగర్భంలో నివపిస్తున్నారు. అక్కడ షాపింగ్ చేయడానికి దుకాణాలు కూడా ఉన్నాయి. ప్రార్థనల కోసం ఓ చర్చి ఉంది. స్థానికులు ఈ ప్రాంతాన్ని కందకంగా వ్యవహరిస్తుంటారు.
‘‘కూబర్ పేడీలో 40 డిగ్రీల దాకా ఉండే ఎండను తట్టుకునేందుకు ప్రజలు భూగర్భంలో కట్టిన ఇళ్లలో నివపిస్తుంటారు. భూగర్భంలో ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు మాత్రమే ఉండటం వల్ల దాదాపు 67 శాతం ప్రజలు ఏడాదంతా భూగర్భంలోనే నివసిస్తుంటారు.
‘‘నా అభిప్రాయం ప్రకారం భూగర్భంలో వారి జీవితం ఎంతో అందమైనది. ఈ రాతి నిర్మాణాలు నారింజ రంగు మచ్చలను కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణంగా వారి లివింగ్ రూమ్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. లోపలి గదులను స్టోర్ రూమ్‌గానూ, లేదంటే పడకగదిగానూ వినియోగిస్తారు. బయటి ఎంత వేడి ఉన్నా, లోపల గదుల్లోకి వేడి రాదు. అందుకే ఇక్కడి వాతావరణం సౌకర్యవంతంగా ఉంటుంది’’ అని మార్టిన్ డిక్సన్ తెలిపారు.
వేడి నుంచి తప్పించుకునేందుకు భూగర్భ గృహాలు ఓ మంచి పరిష్కారమని కూబర్ పేడీ స్థానికులు చెబుతున్నారు. భూమిపైన ఇళ్ళుకట్టుకుని తమ దైనందిన పనులను భూగృహాలలో జరుపుకునే ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భూగర్భంలోనే పంటలు కూడా పండించొచ్చు
మాంట్రియల్ భూగర్భ నగరాన్ని 60 ఏళ్ళ కిందట కట్టారు. భవిష్యత్తులో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని 21వ శతాబ్దపు ఆర్కిటెక్ట్స్ కొత్త తరహా భూగర్భ గృహ సముదాయాల నిర్మాణానికి ప్రణాళిక రచిస్తున్నారు.
దక్షిణ కొరియాలో భూగర్భ నిర్మాణ రంగంలో ఓ విభిన్నమైన ప్రణాళికను అమలు చేశారు. రాజధాని సియోల్ లోని గంగమ్ ప్రాంతంలో ఓ అరకిలోమీటర మేర లైట్ వాక్ పార్కును నిర్మించనున్నారు. దానిపైన ఓ గ్లాస్ రూఫ్ వేస్తారు. దీని ద్వారా వెలుతురు పార్క్ పైనా, అక్కడి నిర్మాణాలపైనా పడేలా ప్రణాళిక రచించారు.
సియెల్ లైట్‌వాక్ ప్రాజెక్ట్ గురించి అంటోనియో కొర్నారో బీబీసీకి వివరించారు. ఆయన స్విజ్జర్లాండ్‌లోని అంబెర్గ్ ఇంజనీరింగ్ కంపెనీకి ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ కు చెందిన అండర్‌గ్రౌండ్ స్పేస్ కమిటీ సహ వ్యవస్థపాకుడిగానూ ఉన్నారు.
‘‘అక్కడ రెండు అధునాతన పార్కులు నిర్మిస్తాం. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్, లండన్‌లోని హైడ్ పార్కు తరహాలో వీటి నిర్మాణం ఉంటుంది. సియోల్‌లో లైట్‌వాక్ పార్క్ నిర్మిస్తాం. ఇది మెట్రోరైల్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ ప్రజలకు అనేకరకాల వినోదం లభిస్తుంది. భూమిపైన ఎక్కువ ఉక్కపోత, వేడి వాతావరణం ఉంటే ప్రజలు ఏసీల ముందు కూర్చోకుండా హాయిగా ఈ పార్కులో సేదతీరవచ్చు’’ అని వివరించారు.
సూర్యకాంతి లేకపోవడం భూగర్భ నిర్మాణాలకు ఓ పెద్ద కొరత. కానీ పై కప్పుగా గ్లాసును ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అధునాతన ఆర్కిటెక్చర్‌లో రిఫ్లెక్షన్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను వినియోగించి అండర్‌గ్రౌండ్ కాంప్లెక్స్‌లలో సౌరకాంతిని వినియోగించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భూగర్భాన్ని తవ్వడం ఖర్చుతో ముడిపడినది కావడం మరో సమస్య. న్యూయార్క్‌లో 2019లో ఓ లోలైన్ పార్కు నిర్మాణం మొదలుపెట్టి ఏడాది తరువాత నిధుల కొరత కారణంగా ఆపేశారు. అయితే త్వరలో దీని పనులు మొదలు కానున్నాయి.
భూగర్భంలోని ఈ పార్కులో అనేక మొక్కల పెంపకాన్ని కూడా పరీక్షించినట్టు అంటోనియో కొర్నారో చెప్పారు. ఇదో అందమైన పబ్లిక్ పార్క్ అవుతుంది. ప్రజలు పగలైనా, రాత్రైనా ఈ పార్కును సందర్శించవచ్చు. ఆప్టిక్ కేబుల్స్ ద్వారా సూర్యరశ్మిని అక్కడ పడేలా చేయడం వల్ల అక్కడ చెట్లు కూడా మనుగడ సాగించగలవు.
‘లోలైన్ పార్క్స్’లో మొక్కలు పెరిగితే, ఖాళీగా ఉండే భూగర్భ ప్రాంతాలలో వృక్ష సంపదను పెంచడానికి వ్యసాయం చేయడంపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రతికూల పరిస్థితులో ఆహారభద్రతకు లోటు ఉండదు. అలాంటి వ్యవసాయ క్షేత్రాలను రెండింటిని అంటోనియో కొర్నారో సందర్శించారు.
‘లండన్‌లో ‘నిరుపయోగంగా పడి ఉన్న అండర్‌గ్రౌండ్ బంకర్లలో ఇద్దరు యువకులు వ్యవసాయం మొదలుపెట్టడాన్ని నేను చూశాను. ఈ విధానం ఎంతగానో విజయవంతమైంది. ఎల్‌ఈడీ లైట్ల కాంతితో ఇక్కడ వెలుతురు సృష్టిస్తున్నారు. స్విజ్జర్లాండ్‌లో కూడా ఇదే తరహా ప్రాజెక్ట్ అమల్లో ఉంది. లండన్ విధానాలే ఇక్కడా అమలు చేస్తున్నారు. అనేక భూగర్భ ప్రాంతాలలో పుట్టగొడుగులు పెరుగుతున్నాయి. సియోల్‌లో అండర్‌గ్రౌండ్ లో ఆకుకూరలను పెంచి సబ్ వే స్టేషన్స్‌లో ప్రయాణికులకు అమ్ముతున్నారు’’ అని కొర్నారో చెప్పారు.
ఫ్పాన్స్‌లోనూ ఇదే పథకాన్ని అమలు చేస్తున్నారు. యూకేలో మూసివేసిన బొగ్గు గనుల్లో వ్యవసాయం చేయాలని అనేకమంది సూచిస్తున్నారు.
భూగర్భంలో వ్యవసాయం చేయడం వల్ల పంటలకు నష్టం కలిగించే కీటకాలు, పక్షుల బెడద ఉండదు. అదే సమయంలో పొలాల నుంచి నగరాలకు ఆహారధాన్యాల రవాణాలో వెలువడే కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు.
నేలపైన వ్యవసాయం చేయడానికి కావాల్సిన స్థలం, నీటితో పోల్చుకుంటే భూగర్భంలో పంటలకు పెద్దగా నీటి అవసరం, స్థలం సమస్యా ఉండదు.
భూగర్భ సముదాయాలలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి కాబట్టి ఏసీలు వాడాల్సిన పని ఉండదని, పైగా వాటి నిర్వహణ కూడా చౌక అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
విస్మరించలేని సమస్య
ప్రస్తుతం నగరాలలో ఎక్కువ మంది జనాభా నివసిస్తున్నారని, ఆ పరిస్థితులలో భూగర్భ సముదాయాలను నిర్మించడం మంచి ఆలోచన అని, స్థలం కొరతను తీర్చేందుకు ఓ సాహసోపేతమైన ప్రత్యామ్నాయం అని ప్రొఫెసర్ క్లారా ఇర్జాబెల్ చెప్పారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లో అర్బన్ ప్లానింగ్ స్టడీస్ ప్రోగ్రామ్ డైరక్టర్‌గా క్లారా ఇర్జాబెల్ వ్యవహరిస్తున్నారు.
‘‘భూగర్భంలో నిర్మాణాలు ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఈ ప్రక్రియ సమస్యాత్మకం కూడా. నిర్మాణాలలో స్థిరత్వం, వాటర్ ప్రూఫింగ్, వెలుతురు వచ్చేలా చేయడం, వాటి మరమ్మతులు సవాళ్ళతో కూడుకున్నవి... వీటన్నింటినీకి ఆధునిక సాంకేతికత వాడాల్సి ఉంటుంది’’ అని క్లారా చెప్పారు.
భూగర్భంలో భవనాలు నిర్మించేటప్పుడే అక్కడ జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. వరదలు, అగ్నిప్రమాదాల ముప్పు పొంచి ఉండే చోట నివసించడం అంత తేలికైన విషయం కాదు.
పైన ఆకాశం లేకుండా, సూర్యకాంతిని చూడకుండా ఇలా భూగర్భంలో నివసిస్తే తప్పకుండా మానసిక సమస్యలు వస్తాయని ,ఈ భూగర్భ నిర్మాణాలలో ఉన్న ఈ ప్రతికూలతను విస్మరించడానికి వీలులేదంటారు క్లారా.
అసలైన సవాల్ అదే

ఫొటో సోర్స్, KIM I MOTT
భూగర్భంలో నివసించడంలో ఉన్న మరో సమస్య దాని చుట్టూ ఉన్న నమ్మకాలే. ఆస్కార్ అవార్డు సాధించిన కొరియన్ సినిమా ‘పారసైట్’ బేస్‌మెంట్‌లో జీవించే ఓ పేద కుటుంబం అవస్థలను చిత్రీకరించింది. సియోల్‌లో దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఇలాంటి ‘బంజియా’ ఇళ్ళలో జీవిస్తున్నారు. వీరంతా వరదలు, కీటకాల భయంతో బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు.
ఈ సమస్యలన్నీ పరిష్కరించినా ఇలాంటి చోట్ల నివసించడంపై ఉన్న అపోహలను పోగొట్టడం అంత తేలికైన పని కాదు.
భూగర్భంలో నివసించడమనేది ఎప్పడూ పేదరికంతోనే ముడిపడి ఉంటుందని ప్రొఫెసర్ క్లారా విశ్లేషించారు. నేలపైన జీవించడానికి ఆస్కారం లేనివారే భూగర్భంలో బతుకుతుంటారనే నమ్మకం ఉంది.
‘‘దీనికితోడు మనుషులు నేలపైన జీవించడానికి అలవాటు పడ్డారు. వారు ఆచారాలు, సంప్రదాయాలతో జీవిస్తుంటారు. హఠాత్తుగా మన అలవాట్లు మార్చుకోవడం అంత తేలికైన పనికాదు. అయినా మనం ధైర్యాన్ని, సృజనాత్మకతను అలవాటు చేసుకోవాలి’’ అని క్లారా తెలిపారు.
అనేక నగరాలలో మాల్స్, కేసినోలు, రైళ్ళు అండర్‌గ్రౌండ్‌లోనే ఉంటున్నాయి. మనం వ్యవస్థలను మెరుగుపరుచుకుని బలోపేతం చేసుకోవడం ద్వారా అండర్‌గ్రౌండ్‌లో నివాసాలను నిర్మించుకోవచ్చు అని ప్రొఫెసర్ క్లారా తెలిపారు.
సరే, భూగర్భమే మన భవిష్యత్తు కానుందా అనే మన ప్రధాన ప్రశ్నకు తిరిగి వస్తే... నగరాలకు భారీ ఎత్తున వలసలు పెరుగుతున్నాయి. నగరాలలో స్థలాల కొరత తీవ్రంగా పెరుగుతోంది. అయితే భూగర్భంలో ఉష్ణోగ్రతలను నియంత్రించచడం తేలికే. టెక్నాలజీ సాయంతో అక్కడకు సహజ వెలుతురు ప్రసరించేలా చేయగలం, పైగా కాయగూరలు కూడా పెంచవచ్చు.
నిజానికి భూగర్భ నిర్మాణాలపైన మనకున్న దృక్పథాన్ని మార్చుకోవడమే అసలైన సవాల్.
కానీ వాతావరణ మార్పులు, విపరీతంగా పెరుగుతున్న జనాభా ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్ళడం తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి :
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- ప్రపంచమంతా ఇప్పుడు ఈ ఐస్‌బర్గ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
- సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో ఎప్పుడు వస్తుంది... ఎక్కడెక్కడ చూడవచ్చు?
- అంతరించిపోయిన ఈ నక్క ఒకప్పుడు మనిషికి బెస్ట్ ఫ్రెండా?
- లోక్‌సభ ఎన్నికలు: తెలంగాణలో సుప్రీంకోర్టు బెంచ్‌పై ఇప్పుడెందుకు చర్చ మొదలైంది, కాంగ్రెస్ ఏమన్నది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














