రజాకార్: హిందుత్వ సినిమాలు ఓటర్లను ప్రభావితం చేయగలవా?

ఫొటో సోర్స్, X/ SAMARVEER CREATIONS
- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ న్యూస్
గత కొన్ని సంవత్సరాలుగా హిందుత్వ పార్టీల సిద్ధాంతాలే కేంద్రంగా వస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి, ఈ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేయగలవా?
2019 పార్లమెంటు ఎన్నికలకు ముందుగా ఇలాంటి సినిమాలు రెండు విడుదలయ్యాయి. అప్పట్లో వీటిపై చాలా చర్చ జరిగింది. వాటిలో ఎన్నికలకు మూడు నెలల ముందు విజయ్ గుట్టె దర్శకత్వంలో వచ్చిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మొదటిది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మీడియా అడ్వైజర్ సంజయ్ భారూ రాసిన పుస్తకం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. అందులో మన్మోహన్ సింగ్‌పై కాంగ్రెస్ అధినాయకత్వం ఆధిపత్యం చెలాయించినట్లుగా చూపించారు.
ఆ తర్వాత ఎన్నికలకు సమీపంలో ‘ద తాష్కెంట్ ఫైల్స్- హు కిల్డ్ శాస్త్రి’ సినిమా విడుదలైంది. అందులో మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ప్రశ్నలు సంధించారు. అయితే, అది సమీక్షకుల మన్ననలు పొందలేకపోయింది.
ఆ రెండు సినిమాలనూ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.

ఫొటో సోర్స్, ADAH SHARMA/TWITTER

ఫొటో సోర్స్, X/PEN MOVIES
గత ఏడాది మూడు సినిమాలు
ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో మళ్లీ అదే తరహా సినిమాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా ఇలాంటి సినిమాలు మూడు విడుదలయ్యాయి.
వీటిలో ‘ద కేరళ స్టోరీ’ మొదటిది. దీనిలో నర్సు కావాలనుకునే ఓ యువతికి మతమార్పిడి చేసి ఐఎస్ఐఎస్‌లో చేర్పిస్తారు. చివరగా ఆమె అఫ్గానిస్తాన్ జైలులో చిక్కుకుంటారు. ఈ సినిమాపై చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 మే నెలలో విడుదలైంది. దీనికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గట్టి మద్దతు ప్రకటించింది.
ఆ తర్వాత విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’.. 1990లలో కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టినప్పటి పరిణామాల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా బీజేపీ గట్టి మద్దతు ప్రకటించింది. ఈ సినిమా ఆనాటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందని బీజేపీ చెప్పింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపులు కూడా ఇచ్చారు.
ఇక మూడో సినిమా ‘ద వ్యాక్సీన్ వార్’. ఈ సినిమాకు కూడా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. కోవిడ్-19 మహమ్మారి చెలరేగుతున్న సమయంలో భారత్‌లో వ్యాక్సీన్ తయారీ ప్రక్రియల వెనుక పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా కేంద్ర ప్రభుత్వ ప్రచార చిత్రంలా ఉందని సమీక్షకులు విమర్శలు చేశారు. మొత్తానికి గత ఏడాది అక్టోబరు 23న ఈ సినిమా విడుదలైంది.
ఈ మూడు సినిమాల్లో ‘ద కేరళ స్టోరీ’, ‘ద కశ్మీర్ ఫైల్స్’పై మీడియాలో చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ద కేరళ స్టోరీలో ఆ రాష్ట్రాన్ని నెగటివ్‌గా చూపించారని చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, X/RANDEEP HOODA
హిందుత్వ సినిమాలు..
2024లోనూ జనవరి నుంచి అదే కోవకు చెందిన కొన్ని హిందుత్వ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్నింటి గురించి ప్రస్తుతం చర్చించుకుందాం.
‘స్వతంత్ర వీర్ సావర్కర్’ వీటిలో మొదటిది. వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా పోషించారు. ఈ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే. మార్చి 22న ఈ సినిమా విడుదలైంది. అయితే, హిందూ కోణంలో చూపించేందుకు కొన్ని వాస్తవాలను దీనిలో తారుమారు చేశారని దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత ‘జేఎన్‌యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ’ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకు వినయ్ శర్మ దర్శకత్వం వహించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పరిణామాలే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో ఊర్వశీ రౌతెలా, సిద్ధార్థ్ భోట్కే, విజయ్ రాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
అయితే, తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచీ ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాలి. కానీ, దీన్ని ఏప్రిల్ 22కు వాయిదా వేశారు.
‘ఆర్టిల్ 370’ సినిమా గురించి తర్వాత చెప్పుకోవాలి. ఆదిత్య సుహాస్ జంబాలే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీనిలో యామీ గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవిల్ తదితరులు నటించారు.
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 23న ఈ సినిమా విడుదలైంది.
‘మే అ టల్ హూ’ సినిమాను రవీ జాదవ్ తెరకెక్కించారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. దీనిలో అటల్ పాత్రను పంకజ్ త్రిపాఠీ పోషించారు.
ఈ సినిమా జనవరి 19న విడుదలైంది. రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.8.5 కోట్లను మాత్రమే వసూలు చేసింది.
‘రజాకార్’.. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. దీనిలో బాబీ సింహా, తేజ్ సబ్రు, వేదిక తదితరులు నటించారు. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
మార్చి 15న ఈ సినిమా విడుదలైంది. అయితే, కేవలం హిందూ కోణంలోనే దీన్ని చూపించారని సమీక్షకులు విమర్శించారు.
‘యాక్సిడెంట్ ఆర్ కాన్‌స్పిరసీ: గోధ్రా’.. ఈ సినిమా 2002లో గుజరాత్‌లోని గోధ్రా అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కింది. దీనికి ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహించారు. గోధ్రా అల్లర్లపై నానావతీ కమిషన్ రిపోర్ట్ ఈ సినిమాకు ఆధారం. మార్చి నెలలలో ఈ సినిమా విడుదలైంది.

ఫొటో సోర్స్, X/PINARAYI VIJAYAN
కేరళ స్టోరీతో మళ్లీ వివాదం
ఈ తరహా సినిమాలు ఒకవైపు వస్తుంటే.. ఏప్రిల్ 5న వివాదాస్పద ‘ద కేరళ స్టోరీ’ సినిమాను భారత ప్రభుత్వ టీవీ చానెల్ ‘దూరదర్శన్’లో ప్రసారం చేశారు.
దీనిపై ప్రకటన వెలువడినప్పుడే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు.
‘‘జాతీయ టీవీ చానెల్.. బీజేపీ ప్రచార అస్త్రంలా మారకూడదు. ఇలాంటి సినిమాలను ప్రసారం చేయడం ద్వారా ఎన్నికల ముందు మత ఘర్షణలు చెలరేగే అవకాశముంది’’ అని పినరయి విజయన్ అన్నారు.

ఫొటో సోర్స్, ALEPH BOOK COMPANY
సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయా?
సినిమాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించడం అనేది చాలా దేశాల్లో కనిపిస్తుంది. ద్రావిడ ఉద్యమం కూడా సినిమాను విజయవంతంగా తమ ప్రచార అస్త్రంలా ఉపయోగించుకుంది.
అయితే, ఎన్నికలను ఈ సినిమాలు ఎంతవరకు ప్రభావితం చేయగలవనేదే అసలైన ప్రశ్న. తమిళ్ సినిమాలను ఏళ్ల నుంచీ అధ్యయనం చేస్తున్న, ‘ద ఐ ఆఫ్ ద సర్పెంట్’ పుస్తక రచయిత థియోడర్ భాస్కరన్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.
ఎన్నికలపై వెంటనే సినిమాలు ప్రభావం చూపిస్తాయో లేదో చెప్పడానికి మన దగ్గర ఎలాంటి గీటురాయీ లేదని ఆయన అన్నారు.
‘‘కాబట్టి సినిమాల ద్వారా ప్రజలను ఒక రాజకీయ పార్టీ ప్రభావితం చేస్తుందని కచ్చితంగా చెప్పలేం’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, UGC
తమిళ్ సినిమాలు ఇలా..
1940, 1950లలో ద్రావిడ ఉద్యమాన్ని ప్రోత్సహించేలా చాలా తమిళ సినిమాలు వచ్చాయి. ద్రావిడ ఉద్యమ సీనియర్ నాయకుడు సీఎన్ అన్నాదురై కూడా ‘నల్లతంబి’ లాంటి సినిమాల్లో సామాజిక సంస్కరణలను ప్రోత్సహిస్తూ స్క్రీన్‌ప్లేలను రాశారు.
ఆ తర్వాత ఎం కరుణానిధి కూడా విజయవంతమైన సినీ రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కూడా తొలినాళ్లలో ద్రావిడ ఉద్యమాన్ని ప్రోత్సహించేలా సినిమాలకు మాటలు రాశారు.
‘మంద్రికుమారి’, ‘పొన్ముడి’ లాంటి సినిమాల్లో ద్రావిడ సిద్ధాంతాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి. 1952 నాటి ‘పరాశక్తి’ సినిమా ఈ తరహా సిద్ధాంతాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది.
మలైకళ్లన్, పనమ్, మనోకర లాంటి సినిమాల విడుదల తర్వాత, 1957లో డీఎంకే ఎన్నికలకు వెళ్లింది. అసెంబ్లీలో 15 సీట్లు, లోక్‌సభలో రెండు సీట్లు గెలుచుకుంది.
డీఎంకే సినిమాల కంటే సినిమా తారలనే ఎక్కువగా ప్రచారానికి ఉపయోగించుకునేదని భాస్కరన్ అన్నారు.
‘‘ద్రావిడ సినిమాల్లో కొన్ని విప్లవాత్మక మాటలు, సిద్ధాంతాలు కనిపించేవి. అందుకే ఇవి ప్రజల్లోకి బాగా వెళ్లేవి. అయితే, ఆ పార్టీకి ప్రజాదరణ వచ్చింది మాత్రం సినిమా తారల వల్లే. ఒక సమయంలో సినిమా తారలను ప్రజలు దేవుళ్లతో పోల్చడం మొదలుపెట్టారు’’ అని భాస్కరన్ అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SUBAGUNARAJAN VMS
‘‘బ్రాహ్మణులను శత్రువులుగా చూపించలేదు’’
హిందుత్వ, ద్రావిడ సినిమాల్లో ముఖ్యమైన తేడా ఒకటి ఉందని సినీ విశ్లేషకుడు, ‘ద్రావిడ సినిమా’ పుస్తక రచయిత శుభగుణ రాజన్ అన్నారు.
‘‘ద్రావిడ ఉద్యమ సిద్ధాంతంలో బ్రహ్మణ వ్యతిరేకవాదం ముఖ్యమైనది. అయితే, ద్రావిడ సినిమాల్లో దాదాపుగా బ్రాహ్మణులు కనిపించేవారు కాదు. బ్రాహ్మణ సిద్ధాంతాలను ప్రశ్నించేటప్పుడు మాత్రమే వారిని చూపించేవారు. పైగా మూఢన్మకాలను మాత్రమే ప్రశ్నించేవారు. వాటిలో బ్రాహ్మణులను శత్రువులుగా చూపించేవారు కాదు. ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఒక వర్గానికి వ్యతిరేకంగా సినిమాలు తీసేవారు కాదు’’ అని శుభగుణ రాజన్ చెప్పారు.
అయితే, హిందుత్వ సినిమాల్లో కొన్ని మతాలను, వర్గాలను భారత్ వ్యతిరేకులుగా చూపిస్తున్నారని ఆయన అన్నారు.
‘‘ద్రావిడ సినిమాలో ఒక పాజిటివిటీ ఉండేది. దాన్ని చూసి ఎవరూ షాక్‌కు గురయ్యేవారు కాదు. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాలు అలా కాదు. దీనిలో కొందరిని శత్రువులుగా చూపిస్తున్నారు. సమాజాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ద కేరళ స్టోరీ లాంటి సినిమాలే దీనికి ఉదాహరణ’’ అని ఆయన అన్నారు.
‘‘ఎన్నికలపై తమిళ సినిమాలు ప్రభావం చూపలేదు’’
ద కశ్మీర్ ఫైల్స్, ద కేరళ స్టోరీ లాంటి సినిమాలను పక్కన పెడితే, మిగతా హిందుత్వ సినిమాలు జాతీయ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపించలేదు.
అయితే, ఈ సినిమాలు ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపవని సినీ విమర్శకుడు రామ్కీ అన్నారు.
‘‘హిందీలో మాత్రమే కాదు. తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ తరహా సినిమాలు చాలా వస్తున్నాయి. 1990ల్లో చాలా తమిళ్ సినిమాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించేవి. కానీ, దాని వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడలేదు. కానీ, ఉత్తర భారత దేశంలోని ప్రాంతాల్లో పాకిస్తాన్‌పై వ్యతిరేకత ఉండటంతో కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు వివాదాలను సృష్టించగలిగాయి’’ అని రామ్కీ అన్నారు.
సినీ విమర్శకుడు, డైరెక్టర్ అమ్షాన్ కుమార్ కూడా ఈ వాదనతో ఏకీభవించారు. ‘‘అప్పట్లో పరాశక్తి సినిమా విడుదలైనప్పుడు భారత్ మొత్తంగా ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. తమిళనాడులో మూఢనమ్మకాలకు ముగింపు పలుకుతూ, సెక్యులరిజం భావాలను వ్యాప్తి చేసేందుకు అది ప్రధాన పాత్ర పోషించింది. అయితే, ఆ సినిమా ఎన్నికలను ప్రభావితం చేసిందని చెప్పలేం’’ అని ఆయన చెప్పారు.
‘‘మంచి డైరెక్టర్లు రావాలి’’
కేవలం హింసాత్మక దృశ్యాలు ప్రోత్సహించడం, హింసను చూపించడంతో సినిమాలు ప్రజల్లోకి వెళ్లవని థియోడర్ బాస్కరన్ అన్నారు.
‘‘సినిమాను రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలంటే మొదట మంచి డైరెక్టర్ కావాలి. అలాంటి డైరెక్టర్లు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. మన ఆలోచనలను మెరుగ్గా ప్రజలకు చెప్పగలిగేలా సినిమా తీసినప్పుడే ప్రజల్లోకి అది వెళ్తుంది’’ అని ఆయన చెప్పారు.
‘అర్థ సత్య’, ‘సయ్యాథి నాథిర్’, ‘ఓరే ఒరు గ్రమాథిలే’ లాంటి సినిమాలను రాజకీయ సినిమాలుగా చెప్పుకోవచ్చు. అయితే, ప్రస్తుతం వస్తున్న సినిమాలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కచ్చితంగా చెప్పడం కాస్త కష్టం అవుతుందని థియోడర్ భాస్కరన్ అన్నారు.
సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు మాలన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘1996 ఎన్నికల్లో తమిళ్ స్టేట్ కాంగ్రెస్ పార్టీకి సైకిల్ గుర్తు కేటాయించారు. అప్పుడు దూరదర్శిన్‌లో కనీసం సైకిల్ కనిపించకుండా జాగ్రత్త వహించారు. కానీ, ఇప్పుడైతే రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ద కేరళ స్టోరీ లాంటి సినిమాలనూ దూరదర్శిన్‌లో ప్రసారం చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
హిందుత్వ సినిమాల్లో బాగా విజయవంతమైనది ద కశ్మీర్ ఫైల్స్. ద కేరళ స్టోరీపై కూడా మీడియాలో చాలా చర్చ జరిగింది. మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















