నితీష్‌ కుమార్ రెడ్డి: ఈ తెలుగు ‘హిట్‌మ్యాన్’కు టీమీండియాలో ఛాన్స్ వస్తుందా?

నితీష్‌ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నితీష్‌ కుమార్ రెడ్డి
    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

నితీష్ కుమార్ రెడ్డి. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవడానికి కారణం నితీష్ కుమార్ రెడ్డే. ఈ తెలుగు కుర్రాడు త్వరలో టీమీండియాలో చోటు దక్కించుకున్నా ఆశ్చర్యపోెనక్కరలేదు.

6 బంతులు.. 29 పరుగులు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలవడానికి పంజాబ్ కింగ్స్ సాధించాల్సిన సమీకరణం ఇది.

క్రీజులో ఇద్దరు యువ బ్యాటర్లు ఉండటంతో ఉత్కంఠభరిత విజయం సాధించగలమని పంజాబ్ భావించడం తప్పేమీ కాదు.

ఎందుకంటే కిందటి వారం శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ కలిసి గుజరాత్ టైటాన్స్‌ చేతిలో ఓడిపోతుందనుకున్న పంజాబ్ కింగ్స్‌ను అనూహ్యంగా గెలిపించారు.

ఆ మ్యాచ్‌లో శశాంక్ చివరి బంతికి సిక్స్ కొట్టి పంజాబ్ గెలవకపోయి ఉంటే, దాని టాప్ ఆర్డర్ బ్యాటర్లందరినీ తప్పుపట్టడం సరైన పనే అయ్యుండేది.

ఇదంతా పక్కన పెట్టేస్తే ఐపీఎల్ పవర్ ప్లే‌లో 6 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసిన జట్టేదో తెలుసా? పంజాబ్ కింగ్స్.

తాజా ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో చాలా చెత్త స్కోరు సాధించింది.

మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు అనేక విషయాలలో సమంగానే నిలిచాయి.

హైదరాబాద్ తన మొదటి మూడు వికెట్లను 39 పరుగులకే పడేసుకుంటే, ఛేదనలో పంజాబ్ 20 పరుగులకే మూడు వికెట్లను పోగొట్టుకుంది.

మ్యాచ్ 10 ఓవర్ చేరుకునే సరికి హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేయగా, పంజాబ్ కూడా 10 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.

కానీ, 10 ఓవర్ల తరువాతే నిర్ణయాత్మకమైన ఆట మొదలైంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ‌బ్యాటర్ 20 ఏళ్ళ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 64 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి, హైదరాబాద్‌ను గెలిపించాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, ANI

ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి?

చాలామంది క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తెలియకపోవచ్చు.

విరాట్ కోహ్లీని అభిమానించే నితీష్ కుమార్‌కు తానో విలువైన ఆటగాడిగా నిరూపించుకునే ప్రతిభ ఉంది.

ప్రస్తుతం హర్దిక్ పాండ్యాలా ఫాస్ట్ బౌలింగ్ కోటాలో ఆల్‌రౌండర్‌గా పరిగణించాల్సిన కొద్ది మంది ఆటగాళ్లలో నితీష్‌ కుమార్ రెడ్డి కూడా ఒకరు.

నిరుడు క్రికెట్ దిగ్గజాలు బ్రయాన్ లారా, డేల్ స్టెయిన్‌తో నితీష్ కుమార్ ఎక్కువ సమయం గడిపాడు.

మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారి మాట్లాడుతూ నితీష్ కుమార్ ఓ అరుదైన ఆటగాడని, అతనిపై భారత క్రికెట్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాటి మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి తాను ఎదుర్కొన్న మొదటి 18 బంతులలో ఒక్క ఫోర్‌తో 14 పరుగులు మాత్రమే చేశాడు. కానీ చివరి 19 బంతులలో మూడు ఫోర్లు, ఐదు సిక్సులు బాది 50 పరుగుల చేశాడు. మొత్తంగా 64 పరుగులు చేశాడు.

నితీష్‌కు తోడుగా అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 25 పరుగులు), షెహబాజ్ అహ్మద్ ( 7 బంతులు, 14 పరుగులు ) తమ వంతు పాత్ర పోషించడంతో హైదరాబాద్ 182 పరుగులు చేయగలిగింది.

తరువాత కెప్టెన్ పాట్ కమిన్స్ పొదుపైన బౌలింగ్‌తో పంజాబ్‌పై ఒత్తిడి పెంచారు. కమిన్స్ తెలివిగా బౌలర్లను వాడిన విధానం పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టేసింది.

కమిన్స్ 4 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చి కీలకమైన బెయిర్‌స్టో వికెట్ తీశాడు.

భువనేశ్వర్ కుమార్ కూడా తన అనుభవాన్నంతా చూపుతూ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

19 ఓవర్‌లో టి. నటరాజన్ బౌలింగ్ చేశాకా మ్యాచ్ ఫలితం ఎలా ఉండనుందో అర్థమైపోయింది.

చివరి రెండు ఓవర్లలో పంజాబ్‌కు 39 పరుగులు అవసరం ఉండగా 19వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన నటరాజన్ కేవలం 10 పరుగులే ఇచ్చాడు.

దీంతో పంజాబ్ చివరి 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

టీమీండియాలో ఛాన్స్?

ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. ఇందులో అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ వికెట్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ముంబయికి చెందిన అజిత్ అగార్కర్‌కు నితీష్ కుమార్ ప్రతిభ ఆరోజే తెలిసి ఉంటుంది.

ఇటీవల తన అభిమాన క్రికెటర్ కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకున్న నితీష్ కుమార్ ఏదో ఒకరోజు భారత్ తరపున కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)