కరోనా బోరియాలిస్: ఈ ఖగోళ వ్యవస్థలో జరగబోయే పెను విస్ఫోటం మనకు ఎప్పుడు, ఎలా కనిపిస్తుంది?

కరోనా బోరియాలిస్
    • రచయిత, మియా టేలర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏప్రిల్ 8న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రపంచమంతా చూసింది. అయితే, ఖగోళంలో జరిగే మరో ఘోర విస్ఫోటనాన్ని కూడా చూసే అవకాశం త్వరలోనే రాబోతోంది.

టీ కరోనా బోరియాలిస్ అనే నక్షత్ర మండలంలో ఈ విస్ఫోటనం జరగబోతోంది.

భూమికి సుమారు 3,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కరోనా బోరియాలిస్ అనే ఈ నక్షత్ర మండలంలో టీ కరోనా బోరియాలిస్ లేదా టీసీఆర్‌బీ అనే తెలుపు రంగు మరగుజ్జు నక్షత్రం ఉంటుంది. అది త్వరలో పేలబోతోంది.

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా చెప్పినదాని ప్రకారం అనేక దశాబ్దాలకు ఒకసారి జరిగే ఈ పేలుడుకు(నోవా బ్లాస్ట్)కు సమయం దగ్గరపడింది.

ఈ అరుదైన ఘటన ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఏ క్షణంలోనైనా జరగొచ్చు.

ఈ పేలుడును మనుషులు తమ కళ్లతో నేరుగా చూసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి ఖరీదైన టెలీస్కోప్‌‌లు అవసరం లేదని నాసా తెలిపింది.

టీసీఆర్‌బీ పేలుడు దాదాపు 80 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. 1946లో చివరిసారిగా జరిగింది.

‘‘దీనికోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇది చూడటానికి హేలీ తోకచుక్కలా ఉంటుంది. ప్రతి 75 నుంచి 80 సంవత్సరాలకు ఒకసారి జరగుతుంది. కానీ, మీడియాలో హేలీ తోకచుక్కకున్నంత పేరు ఈ విస్ఫోటనానికి ఉండదు’’ అని విలియం జె.కుక్ అన్నారు. ఆయన నాసాలో మెటోరైట్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.

తోకచుక్కలకు మీడియాలో ఎప్పుడూ క్రేజ్ ఉంటుందని ఆయన అన్నారు.

కరోనా బోరియాలిస్

ఈ పేలుళ్లు ఎప్పుడు జరుగుతాయో శాస్త్రవేత్తలకు ఎలా తెలుసు?

చాలా సందర్భాలలో ఈ పేలుళ్ల సంగతి నాసాలోని నిపుణులకు కూడా తెలియదని కుక్ అన్నారు. ఇలాంటి పేలుళ్లు దాదాపు 10 వరకు జరుగుతాయని, వీటిని ‘రికరింగ్ నోవా’ అని అంటారని కుక్ చెప్పారు.

అయితే, మరికొద్ది నెలల్లోనే టీసీఆర్‌బీ‌లో విస్ఫోటనం జరగబోతోందని నాసా శాస్త్రవేత్తలు అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?

వీటికి గణాంకాలు, అంచనాలే ఆధారం. ఉదాహరణకు టీసీఆర్‌లో చివరిసారిగా 78 ఏళ్ల కిందట పేలుడు సంభవించింది.

టీసీఆర్‌బీ పేలడానికి సిద్ధమవుతోందని మరో సంకేతం కూడా ఉందని కుక్ చెప్పారు.

‘‘పేలుడు జరగడానికి ముందు ఇది దాదాపు ఒక సంవత్సరంపాటు మసకబారుతుందని నాసా దగ్గర ఆధారాలున్నాయి. టీకరోనా బోరియాలిస్ గత ఏడాది అంటే 2023 మార్చి నుంచి మసకబారడం ప్రారంభించింది. కాబట్టి ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఇది పేలవచ్చని మేం భావిస్తున్నాం.’’ అని కుక్ అన్నారు.

టీసీఆర్‌బీలో క్రమానుగతంగా జరిగే పేలుళ్ల కారణంగా మిగతా నక్షత్రాల నుంచి దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

‘‘పేలుళ్లు చాలా జరుగుతుంటాయి. కానీ, వాటిలో పునరావృతం అయ్యేవి చాలా అరుదు. ఒకవేళ పేలినా ఎప్పుడు పేలతాయో మనకు తెలియదు.’’ మెరిడిత్ మెక్ గ్రెగర్ అన్నారు. ఆయన జాన్స్ హాప్‌కిన్స్‌లోని విలియం హెచ్.మిల్లర్ 3 డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. నక్షత్రాల కదలికలపై నిపుణుడు.

మరోవైపు విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రిచర్డ్ టౌన్‌సెండ్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.

‘‘పేలుళ్లు తిరిగి సంభవించే కాలం ఒక సంవత్సరం నుండి మిలియన్ల సంవత్సరాల మధ్య ఎప్పుడైనా కావచ్చు.’’ అని ఆయన అన్నారు.

కరోనా బోరియాలిస్

ఈ పేలుడుకు కారణమేమిటి?

టీసీఆర్‌బీ వంటి కొన్ని నోవా(విస్పోటన) సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి అన్నదానితోపాటు, ఎందుకు జరుగుతాయో కూడా నాసాలోని నిపుణులకు తెలుసు.

ఉదాహరణకు, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వైట్ డ్వార్ఫ్ స్టార్ ( తెలుపు రంగు మరగుజ్జు నక్షత్రం ) టీసీఆర్‌బీ అనేది బైనరీ సిస్టమ్‌లో ఉంటుంది. అంటే కక్షలో ఉన్న రెండు నక్షత్రాలలో ఇది ఒకటి. రెండోది ఎరుపు రంగు నక్షత్రం.

వాస్తవానికి తెల్ల మరగుజ్జు నక్షత్రాలు సూర్యుడితో సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. అయితే, వాటి వ్యాసం మాత్రం సూర్యుడికన్నా 100 రెట్లు తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు భూమి సైజుకు సమానంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.

అధిక ద్రవ్యరాశి, చిన్నసైజులో ఉన్న ఈ తెల్ల మరగుజ్జు నక్షత్రానికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది.

టీసీఆర్‌బీ వ్యవస్థలోని రెండో నక్షత్రమైన రెడ్ స్టార్ నుంచి విడుదలైన పదార్ధాలను తెల్ల మరగుజ్జు నక్షత్రం ఆకర్షించడం మొదలు పెడుతుంది. అలా కొన్నేళ్లపాటు జరిగిన తర్వాత అది దాని పరిమితికి చేరుకుంటుంది.

‘‘అలా పేరుకుపోయిన తర్వాత ఆ నక్షత్రంపై ఒక రకమైన థర్మో న్యూక్లియర్ రియాక్షన్ ఏర్పడుతుంది. అది ఆ నక్షత్రం పేలిపోవడానికి కారణమవుతుంది.’’ అని కుక్ వెల్లడించారు.

టౌన్‌సెండ్ కూడా ఇదే విధమైన వివరణను ఇచ్చారు. ‘‘టీసీఆర్‌బీపై తగినంత మొత్తంలో పదార్థం నిక్షిప్తం అయ్యాక, దాని ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. దానివల్ల న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. తర్వాత అది ఒక్కసారిగా పేలుతుంది.’’ అని టౌన్‌సెండ్ చెప్పారు.

‘‘ఇవి సూర్యుడి మధ్య భాగంలో జరిగే రియాక్షన్‌లాంటివి.’’ అని టౌన్‌సెండ్ చెప్పారు.

‘‘వాస్తవానికి ఇలా ఒక నక్షత్రం మీద పదార్థాలు నిక్షిప్తం కావడానికి, అది పేలడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కానీ, టీ కరోనా బోరియాలిస్‌లో మాత్రం ఇది చాలా వేగంగా జరుగుతుంది.’’ అని మెక్ గ్రెగర్ వెల్లడించారు.

కరోనా బోరియాలిస్

టీసీఆర్‌బీలో విస్ఫోటనం జరిగినప్పుడు మనకు ఏం కనిపిస్తుంది?

నాసా చెప్పినదాని ప్రకారం టీసీఆర్‌బీ వ్యవస్థలో +10 మాగ్నిట్యూడ్ అంటే సాధారణ దృశ్యమానత పరిమాణం కలిగి ఉన్నట్లు అర్ధం.

కానీ, విస్ఫోటనం జరిగినప్పుడు దీని దృశ్యమానత గణనీయంగా పెరుగుతుంది. దీనిని +2 మాగ్నిట్యూడ్ అంటారు. అంటే ఇది +10 కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. +2 అనేది నార్త్ స్టార్, పోలారిస్‌కు సమానమైన ప్రకాశ స్థాయి అని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ విస్ఫోటనం కొనసాగినంతసేపు ఇది మన కంటికి కనిపిస్తుంది. ఈ పేలుడు ఒక కొత్త ప్రకాశవంతమైన నక్షత్రం మాదిరిగా కనిపిస్తుందని నాసా తెలిపింది.

"తెల్ల మరగుజ్జు నక్షత్రాలను మనం కంటితో చూడలేము. కానీ ఫ్యూజన్ రియాక్షన్ వల్ల మనం దానిని తాత్కాలికంగా చూడగలుగుతున్నాము. మీరు రాత్రిపూట రోడ్డుపైకి వెళ్లి చూడవచ్చు." అని మెక్ గ్రెగర్ అన్నారు.

ఈ విస్ఫోటనం కొన్ని రోజులపాటు కనిపిస్తుంది. ఇలా రెడ్ స్టార్ నుంచి వచ్చిన పదార్ధాలు ఈ తెలుపు రంగు మరగుజ్జు నక్షత్రం మీద మండిపోగానే, అది మళ్లీ అదృశ్యమవుతుంది. తిరిగి కొన్ని దశాబ్ధాల తర్వాత మాత్రమే దాన్ని తిరిగి చూడగలం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

వీడియో క్యాప్షన్, శాస్త్ర పరిశోధన రంగంలో ఇదో పెద్ద విజయం అంటున్న శాస్త్రజ్ఞులు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)