బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పల్లభ్ ఘోష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోనే అత్యంత విలువైన మెటల్స్ బంగారం, ప్లాటినం వంటివి భూమిలోకి ఎలా వచ్చాయి?
ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చింది ఏంటంటే...సూపర్ నోవా వంటి నిర్దిష్ట నక్షత్రాలు పేలినప్పుడు విశ్వంలో బంగారం, ప్లాటినం వంటి ఖనిజాలు కూడా ఉత్పత్తి అయి ఉంటాయని.
అయితే, ఇది నిజమేనా ? దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే...
2022లో కనిపించిన ఓ భారీ కాంతి మీద పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు, ఆ కాంతి మధ్యలో ఒక నక్షత్ర విస్ఫోటనం కూడా జరిగిందని గుర్తించారు.
కానీ, ఈ పేలుడు నుంచి ఈ విలువైన మెటల్స్ ఉత్పత్తి అయ్యాయన్న దానిపై శాస్త్రవేత్తల బృందానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
ఈ పరిశోధన ఫలితాలు సైన్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని స్కాట్లాండ్‌కు చెందిన ఆస్ట్రోనోమర్ రాయల్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బ్రా ప్రొఫెసర్ కేథరీన్ హైమాన్స్ అన్నారు.
‘‘విశ్వం చాలా అద్భుతమైనది. ఆశ్చర్యకరమైన ప్రాంతం. ఇది మనల్ని తికమక పెట్టే విధానం నాకు నచ్చుతుంది. మేం వెతికే దాని గురించి ఆధారాలు దొరక్కపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే, మళ్లీ దాని కోసం మేం ప్రయత్నించగలం. మరిన్ని ఆధునిక సిద్ధాంతాలను మేం అభివృద్ధి చేయగలం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANTHONY BRADSHAW
మరి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది?
బంగారం, ప్లాటినం, యురేనియం వంటి భారీ లోహాలు సూపర్ నోవా సమయంలో ఏర్పడిన తీవ్ర పరిణామాల క్రమంలో ఉత్పత్తి అయి ఉండొచ్చన్నది ఒక సిద్ధాంతం.
ఇవి విశ్వమంతా వ్యాపించి, గ్రహాల పుట్టుకలో కూడా భాగమయ్యిందని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇలా బంగారం అనే లోహం భూమి అనే గ్రహం మీదకు వచ్చి ఉంటుందని ఆ సిద్ధాంతం చెబుతోంది.
వాస్తవానికి న్యూట్రాన్ స్టార్లుగా పిలిచే డెడ్ స్టార్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు బంగారం వంటి భారీ లోహాలు ఏర్పడినట్లు కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ, ఈ విధానంలో చిన్నమొత్తంలోనే బంగారం ఉత్పత్తి అయింది.
ఇతర సూపర్ నోవాకు చెందిన అవశేషాల్లో భారీ లోహాల కోసం శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది. సూపర్ నోవాల పేలుళ్ల సమయంలో ఈ మెటల్స్ ఉత్పత్తి అయ్యాయా? అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
కానీ, నక్షత్రాలు పేలిన సమయంలో ఈ భారీ లోహాలు ఏర్పడ్డాయన్న దానికి ఆధారాలను శాస్త్రవేత్తల బృందం కనుగొనలేదు.
అంటే, ఈ సిద్ధాంతం తప్పేనా? బంగారం వంటి భారీ లోహాలు మరో విధంగా పుట్టుకొచ్చాయా?
దీనికి జవాబు కనుగొనేందుకు ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు మరోసారి పరిశీలించాల్సి ఉందని ఈ అధ్యయన సహ రచయిత పీటర్ బ్లాంచార్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, Aaron M. Geller
చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన పేలుడు
2022 అక్టోబర్‌లో టెలిస్కోప్‌ల ద్వారా ఒక భారీ కాంతిని గుర్తించారు. ఇది సూపర్ నోవా వల్ల ఏర్పడిన కాంతి. సుమారు 240 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సుదూర గెలాక్సీ నుంచి ఈ కాంతి వచ్చింది. ఇప్పటి వరకు రికార్డు అయినదానికంటే పదింతలు ఎక్కువ ప్రకాశవంతంగా ఈ పేలుడు సంభవించిందని తర్వాత జరిగిన పరిశోధనలు పేర్కొన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి ‘‘ది బ్రైటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (బీఓఏటీ) అని పేరు పెట్టారు.
‘‘సాధారణంగా గామా కిరణాలు సూపర్ నోవా పేలుళ్లతో అనుసంధానమై ఉంటాయి. కానీ, ఈ పేలుడు చాలా ప్రకాశవంతంగా ఉంది. దీన్ని అంత తేలికగా వివరించలేం. ప్రస్తుత సిద్ధాంతం ప్రకారం ఒకవేళ ఇది సూపర్ నోవా అయితే, ఇది కచ్చితంగా అతిపెద్ద పెద్దది’’ అని శాస్త్రవేత్తలు అన్నారు.
ఇలాంటి శక్తిమంతమైన పేలుళ్లు ప్రతి 10వేల ఏళ్లకు ఒకసారి సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
- కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన సీబీఐ, దిల్లీ మద్యం పాలసీ కేసు ఎలా మొదలైంది?
- గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















