ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలావాటిని కూల్చేశామన్న ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, రఫీ బర్గ్
- హోదా, బీబీసీ న్యూస్
ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ పెద్ద ఎత్తున దాడికి దిగింది. సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడి చేసినట్లుగా చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌లోని ‘‘నిర్ధిష్ట లక్ష్యాలే’’ కేంద్రంగా తాజా దాడులు చేసినట్లుగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) చెప్పింది.
వంద కంటే ఎక్కువ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. సీబీఎస్ న్యూస్ చెప్పినదాని ప్రకారం, అమెరికా కొన్ని డ్రోన్లను పేల్చేసింది.
ఇజ్రాయెల్‌తో పాటు మిత్రపక్షాలు కలిసి క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్ గగనతలం వెలుపలే కూల్చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చెప్పింది.
ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, క్యాబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు.
ఈ రెండు ప్రధాన శత్రు దేశాల మధ్య ఏళ్లుగా పరోక్ష యుద్ధం జరుగుతోంది. కానీ, ముఖాముఖిగా తలపడటం ఇదే మొదటిసారి.
‘‘అవసరమైన చోట ప్రత్యర్థి బెదిరింపులను నిలువరిస్తున్నాం’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది.
ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో సైరన్‌ల మోతలు వినిపిస్తున్నాయి. జెరూసలెంలో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా డ్రోన్లను పేల్చేయడంతో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.

ఫొటో సోర్స్, REUTERS
ఇజ్రాయెల్‌లో డ్రోన్లు ఎక్కడ పడ్డాయి?
మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి ఇజ్రాయెల్‌ను, దాని ప్రజలను రక్షించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు.
ఇజ్రాయెల్‌లో కొన్ని క్షిపణులు పడ్డాయని, వాటి వల్ల ఒక సైనిక స్థావరానికి స్వల్ప నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణ అరద్ క్షేత్రంలో ఒక పదేళ్ల బాలిక గాయపడిందని ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ పేర్కొంది.
ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ 1800 కి.మీ దూరంలో ఉంటుంది. డ్రోన్లను ఎక్కడ కూల్చేసిందో అమెరికా కూడా వెల్లడించలేదు.
ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాక్‌లు తమ గగనతలాలను మూసేశాయి. సిరియా, జోర్డాన్‌లు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి.
ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడి జరిగిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ స్పందించింది. ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన దాడిలో ఒక టాప్ కమాండర్ సహా ఏడుగురు సైనికాధికారులు చనిపోయారు.
ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది. అయితే, ఇజ్రాయెల్ ఈ దాడిని ధ్రువీకరించలేదు, ఖండించలేదు.

ఇజ్రాయెల్ సైన్యం ఏం చెప్పింది?
ఇరాన్ తమ సొంతగడ్డ నుంచి ఇజ్రాయెల్ పైకి దాడులను మొదలుపెట్టిందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు.
‘‘ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన కిల్లర్ డ్రోన్లను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇవి ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. గగనతలంలో పొంచి ఉన్న ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేలా ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన విమానాలు సిద్ధంగా ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
ఇరాన్ డ్రోన్లను ప్రయోగించిన తర్వాత, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగిందని అన్నారు.
‘‘ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అది రక్షణాత్మకమైనా సరే, లేదా ప్రమాదకర పరిస్థితి అయినా సరే. మేం సిద్ధమయ్యాం. ఇజ్రాయెల్ చాలా శక్తిమంతమైనది. ఐడీఎఫ్ పటిష్టమైనది. ఇక్కడి ప్రజలు కూడా. అమెరికాతో పాటు మాకు మద్దతుగా నిలిచిన బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాలకు ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, REUTERS
ఒకవేళ ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి దిగితే, ఇరాన్ లోపల తాము ప్రతీకార దాడులు చేస్తామని ఈ వారం మొదట్లో ఇజ్రాయెల్ రక్షణ, విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి.
ఇరాన్ దాడి గురించి వార్తలు వెలువడిన తర్వాత, అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియాన్ వాట్సన్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ రక్షణకు అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని అన్నారు.
‘‘అమెరికా, ఇజ్రాయెల్ ప్రజల పక్షానే నిలబడుతుంది. ఇరాన్ బెదిరింపుల నుంచి వారిని కాపాడుతుంది. ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నామని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు’’ అని వాట్సన్ వెల్లడించారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఖండించారు. ఇజ్రాయెల్‌తో పాటు తమ ప్రాంతీయ భాగస్వాములందరి భధ్రతకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడి సహా ఇజ్రాయెల్ పదేపదే చేస్తోన్న నేరాలన్నింటికీ ప్రతీకారంగా తాజా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీలో అత్యంత శక్తిమంతమైన ఐఆర్‌జీసీ విభాగం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














